ఇది అసమానతలు పెంచే బడ్జెట్‌

2 Feb, 2022 01:01 IST|Sakshi

ఒక సంపన్న దేశంగా మారాలనుకుంటున్నాం కానీ, ఒక సంక్షేమ దేశంగా మారాలనే స్వప్నాన్ని వదిలేశాం. ఈ నియో లిబరలిజం భావజాలమే మనకు ఈ బడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏ దేశంలోనైనా అభివృద్ధి సాధించాలంటే రెండు రంగాలు ప్రధానం. మొదటిది విద్య, రెండోది వైద్య రంగం. రెండేళ్ల క్రితం ‘జాతీయ విద్యా విధానా’న్ని ప్రకటించిన ప్రభుత్వమే ఇప్పుడు విద్యారంగానికి ఎక్కువ డబ్బులు కేటాయించకపోవడం అనేది మనమెలా అర్థం చేసుకోవాలి! ఇక రెండోదైన వైద్య రంగంలో మనం కేటాయించే బడ్జెట్‌ గత 70 ఏళ్లుగా చాలా తక్కువే. దాదాపు 30 ఏళ్లుగా వైద్య రంగాన్ని కూడా పూర్తిగా మార్కెట్‌కు అప్పజెప్పే దిశలోనే ముందుకెళ్లాం. 80వ దశకం నుంచి బడ్జెట్‌ దృష్టంతా సంపద పెంపు పైనే ఉంది కానీ సంక్షేమం అనేది పూర్తిగా వెనక్కు నెట్టబడింది. దీని ఫలితంగా భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంత అసమానతలు పెరిగిపోయాయి.

చాలా మంది బడ్జెట్‌ను ఆదాయాల, ఖర్చు పట్టికగా పరిగణిస్తారు. బడ్జెట్‌ అంటే కేవలం లెక్కలు చూపడమో, లేక ప్రభుత్వ కార్యక్రమాల మెనూ అనుకుంటారు. కానీ, భారతదేశం లాంటి దేశంలో బడ్జెట్‌ ఒక సామాజిక ప్రయోజనం, సామాజిక మార్పునకు సాధనంగా పరిగణించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో చాలా స్పష్టంగా అన్ని రకాల అసమానతలనూ తగ్గిస్తాం అని వాగ్దానం చేసింది. మనం ఈ అసమానతలను ఎలా తగ్గిస్తాం అనే ఒక సవాల్‌ను ఎదుర్కొంటే దేశ సంపదలను,  ఉత్పత్తి సాధనాలను కేంద్రీకృతం కాకుండా సర్వ ప్రయోజనానికి దారి తీయాలని కూడా రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. ఈ సంపద పంచడం కానీ, లేదా ఉత్పత్తి సాధనాలను కానీ సమష్టి సమాజం చేతిలో కాకుండా వ్యక్తుల చేతిలోనే ఉండిపోయాయి. ఇక, అసమానతలను తగ్గించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం బడ్జెట్‌. 

1950–60లలో మన దేశంలో సంపద పెరుగుతున్న కొద్దీ ప్రత్యక్ష పన్ను అదే నిష్పత్తిలో పెరుగుతూ వచ్చేది. అలా పెంచి, దాని ద్వారా వచ్చిన ఆదాయాలతో దేశంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించారు. అలాగే సంక్షేమానికి ఆ వనరులను ఉపయోగించారు. 1970వ దశకంలో దేశ వ్యాప్తంగా అసంతృప్తి పెరిగినప్పుడు పేదరిక నిర్మూలన అనే ఒక నినాదం రావడమే కాక, బ్యాంకుల జాతీయీకరణ చేసి మొత్తంగా రాజ్యం పేద ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. 1980వ దశకం వచ్చేవరకు దేశ సంపద పెరగాల్సిన అంత వేగంగా పెరగడం లేదనీ, సంపద సృష్టికి సంపన్నులు తమ ఆదాయాన్ని పెంచుకునే వసతి కల్పిస్తే తప్ప దేశ సంపదను పెంచలేమనే పెట్టుబడిదారీ భావజాలం మన విధాన నిర్ణయాల్లోకి ప్రవేశించింది. ఇక, 80వ దశకం నుంచి బడ్జెట్‌ దృష్టంతా సంపద పెంపు పైనే ఉంది కానీ సంక్షేమం అనేది పూర్తిగా వెనక్కు నెట్టబడింది. దీని ఫలితంగా భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంత అసమానతలు పెరిగిపోయాయి. 

దేశ జనాభాలో ఒక్క శాతం ఉండే సంపన్నుల దగ్గర 56 శాతం ఆదాయం, దాదాపు 40 శాతం మంది ఉండే కింది వర్గాల దగ్గర మాత్రం 20 శాతం ఆదాయమే చేరుతోంది. ఒకప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో దాదాపు 40 – 50 శాతం వాటా ఉంటే, ఈ రోజు అది 13 శాతానికి తగ్గింది. దీంతో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దయనీయ పరిస్థితుల్లోకి వ్యవసాయ రంగం నెట్టబడింది. నిజానికి, దేశ జనాభాలో 45 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. కానీ, విధాన లోపం వల్ల అసమానతలు తీవ్రంగా పెరగడమే కాకుండా పేదరికం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యమే రైతాంగ ఉద్యమాలకు దారితీసింది. గత ఏడాది కాలంలో వాళ్లు ఉద్యమం చేయడమే కాక, ఏకంగా 700 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఇలా ఉన్నా బడ్జెట్‌లో దీని ప్రభావం మనకేమీ కనిపించడం లేదు. ఒకే ఒక్క అంశం ఏమిటంటే... కనీస మద్దతు ధర కోసం రూ. 2 లక్షల కోట్లు కేటాయించినట్టు విత్తమంత్రి ప్రకటించడం. 

విద్య, వైద్యాలకు ఇంతేనా?
ఏ దేశంలోనైనా అభివృద్ధి సాధించాలంటే రెండు రంగాలు ప్రధానం. మొదటిది విద్య, రెండోది వైద్య రంగం. అమెరికా లాంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా కామన్‌స్కూల్‌ విద్యా విధానాన్ని అమలు చేసి, అక్కడి పిల్లలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. జపాన్, చైనా, దక్షిణకొరియా లాంటి దేశాలే కాక చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ విద్యకు గణనీయమైన వాటా కేటాయిస్తున్నారు. విద్యారంగంలో పెట్టిన వనరులు ఆ దేశాల అభివృద్ధికి దోహదపడ్డాయి. రెండేళ్ల క్రితం ‘జాతీయ విద్యా విధానా’న్ని ప్రకటించిన ప్రభుత్వమే ఇప్పుడు విద్యారంగానికి ఎక్కువ డబ్బులు కేటాయించకపోవడం అనేది మనమెలా అర్థం చేసుకోవాలి.

ఇంకా చెప్పాలంటే, ఈ బడ్జెట్‌లో విద్యకు కేటాయింపు కొంత తగ్గించారు. ఇక విశ్వవిద్యాలయాల పరిస్థితులు కానీ, మొత్తం విద్యారంగ పరిస్థితి కానీ భవిష్యత్తుపై ఎలాంటి విశ్వాసాన్నీ కలిగించడం లేదు. విద్యను మార్కెట్‌ శక్తులకు అప్పజెప్పి ప్రైవేటు విద్యా విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఈ దేశ సంక్షేమానికీ, భవిష్యత్తుకూ అపాయకరం. 

ఇక రెండోదైన వైద్య రంగంలో మనం కేటాయించే బడ్జెట్‌ గత 70 ఏళ్లుగా చాలా తక్కువే. దాదాపు 30 ఏళ్లుగా వైద్య రంగాన్ని కూడా పూర్తిగా మార్కెట్‌కు అప్పజెప్పే దిశలోనే ముందుకెళ్లాం. గత రెండేళ్ళుగా వైద్య రంగం ఎంత లోపభూయిష్ఠంగా ఉందో మనం చూశాం. మొత్తం సమాజం దాని దుష్ఫలితాలకు లోనైంది. వైద్య రంగ సదుపాయాలు సరిగ్గా లేక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు లేక ప్రజలు ఎన్ని రకాల బాధలు పడ్డారో మనమందరం చూశాం. ఈ బాధాకరమైన అనుభవం వల్ల వైద్య రంగానికి పెద్ద ఎత్తున బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని అందరూ ఆశించారు. కానీ చాలా ఆశ్చర్యంగా వైద్యరంగానికి కూడా కేటాయింపులు పెంచలేదు. 

సంపద సృష్టి దేని కోసమో తెలుసా?
మన దేశం పెట్టుబడిదారీ పంథాయే కాక దానికి మించి ప్రమాదకరమైన నియో లిబరలిజం సాలెగూటిలో పడిపోతోంది. నియో లిబరలిజం కేవలం ఆర్థికవృద్ధిపై దృష్టి ఉంచి, సంక్షేమం అనేది అభివృద్ధికి అడ్డంకి అని వాదిస్తుంది. వాళ్ల సంపదను ఏ మాత్రం ముట్టినా దేశ అభివృద్ధి దెబ్బ తింటుందని ఈ విధానాన్ని అనుసరించే వారి వాదన. దేశంలో ప్రజలుంటారనీ, ప్రజల సంక్షేమం రాజ్యం యొక్క  బాధ్యత అనీ, సంపద పెరగడంతో పాటు మనుషుల జీవితాలు మారాలనే ఆశయాలకు ఈ నియో లిబరలిజం పూర్తి వ్యతిరేకం. కానీ, మనం అనివార్యంగా అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే... ఏ సమాజంలోనైనా సంపద సృష్టి దేని కోసం అని? ప్రజల జీవితాలను మార్చకుండా, అందరికీ ఒక సుఖవంతమైన జీవితం కల్పించకుండా సమాజం సామరస్యంగా, సంతోషంగా ఉండడం సాధ్యం కాదు. ఈ మానవీయ దృక్పథాన్ని మనం కోల్పోతే ఒక అమానవీయ సమాజ నిర్మాణానికి దారితీస్తుంది. 

సంపన్న దేశమా? సంక్షేమ దేశమా?
అందరం ఆలోచించాల్సింది మనకు ఎలాంటి సమాజం కావాలి? రాజ్యాంగమే ఎలాంటి సమాజ నిర్మాణం చేయాలో మనకు స్పష్టంగా సూచించింది. కానీ, రాజ్యాంగం నిర్దేశించిన దిశలో కాకుండా మొత్తంగా మన ఆలోచన, విధానాల దిశ మార్చుకుంటున్నాం. ఒక సంపన్న దేశంగా మారాలనుకుంటున్నాం కానీ, ఒక సంక్షేమ దేశంగా మారాలనే స్వప్నాన్ని వదిలేశాం. ఈ నియో లిబరలిజం భావజాలమే మనకు ఈ బడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి స్కాండనేవియన్‌ దేశాల్లో సంపన్నుల దగ్గర దాదాపు 60–65 శాతం ఆదాయాన్ని రాజ్యం తీసుకొని, ప్రజలందరికీ ఒక భద్రత కలిగిన సమాజాన్ని సృష్టించుకున్నారు. ఆ దేశాల్లో ఘర్షణలూ తక్కువ, నేరాలూ తక్కువ. దాదాపు శాంతియుతంగా జీవిస్తున్న సమాజాలు అవి. మనం మాత్రం ఏ దారిలో పోతున్నామో, ఎక్కడికి పోతున్నామో అనే మార్గం తెలియని సందిగ్ధ సామాజిక స్థితిలోకి నెట్టబడ్డాం. బడ్జెట్‌ ఒక సామాజిక, ఆర్థిక మార్పునకు సాధనం అనే ఆశయాన్ని గుర్తిస్తే తప్ప బడ్జెట్‌లకు సంపన్నులకు చేసే సాధనాలుగా మిగిలిపోతాయి. ఇది సమాజ భవిష్యత్తుకు మంచిది కాదు!


ప్రొ. జి. హరగోపాల్‌
వ్యాసకర్త ప్రముఖ సామాజికవేత్త, విశ్లేషకులు

మరిన్ని వార్తలు