ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం

26 Aug, 2021 00:18 IST|Sakshi

విశ్లేషణ

తీవ్ర దారిద్య్రం, గ్రామీణ, పట్టణ నిరుద్యోగిత తాండవిస్తున్న దేశంలో పిల్లలందరికీ నాణ్యమైన, ఒకే జాతీయ భాషలో విద్యను అందించడం అతిపెద్ద విప్లవం అని చెప్పాలి. రాష్ట్రంలోని పిల్లలందరి ఆస్తిగా విద్యను మలచాలనే కృతనిశ్చయంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాల,కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తారంగా పెట్టుబడి పెట్టడం ద్వారా చరిత్ర సృష్టించారు. తెలుగును ఒక సబ్జెక్టుగా కొనసాగిస్తూనే అంగన్‌వాడీ∙(ప్రీ–స్కూల్‌) నుంచి విశ్వవిద్యాలయ డిగ్రీ వరకు అన్ని స్థాయిల్లోనూ ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని తప్పనిసరి చేశారు. భారతీయ భాషా విధానంలో ఇది నిజంగానే పెనుమార్పు. కేంద్ర ప్రభుత్వం తన భాషా విధానాన్ని ఏకీకృత జాతీయ భాషా విధానంగా మార్చనంత వరకు, అన్నితరాలకు అవసరమయ్యే నాణ్యమైన కంటెంట్‌ విద్యను అందివ్వడం సాధ్యం కాదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఒక దారి చూపిస్తోంది.

ఒక తెలుగు దినపత్రికలో జూలై 30వ తేదీన ’పేద పిల్లలు పెద్ద చదువులు’ అనే వార్తను చూశాను. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యావిధానంపై, విద్య ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న పేద పిల్లల జీవితాల్లో విద్యా మాధ్యమం ఎలాంటి మార్పు తీసుకొస్తోందనే అంశంపై ఆ వార్త ఒక సమగ్ర వివరణను అందించింది. భారతీయ విద్యా వ్యవస్థలోని ప్రతి ఒక్క అంశంలో సమాన అవకాశాల విషయంలో తిరస్కరణకు గురైన భారతీయ సమాజంలోని వివిధ వర్గాలకు ఏపీ విద్యా విధానం కచ్చితంగా సరికొత్త ఆశను కలిగిస్తోంది. రాష్ట్రంలోని పిల్లలందరి ఆస్తిగా విద్యను మలచాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తారంగా పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ కొత్త ఆశ పుట్టుకొచ్చింది. ఆయన విధానంలో మూడు కీలక అంశాలున్నాయి.

ఒకటి, ఏపీ సీఎం పదే పదే చెప్పినట్లుగా, అన్ని అంశాల్లో నాణ్యమైన, సమాన విద్య అనేది ప్రభుత్వం యువతరానికి ఇచ్చే అత్యుత్తమ సంపదగా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి చివరి ఊపిరి వరకు మిగిలి ఉండే ఏకైక సంపద విద్యే. ఎవరూ దాన్ని దొంగిలించలేరు. ఎవరూ దాన్ని దుర్వినియోగపర్చలేరు. రెండు, భారతీయులు తమ చరిత్ర పొడవునా అంటే ప్రజాతంత్ర రాజ్యాంగ వ్యవస్థను ఏర్పర్చుకున్న తర్వాతి కాలంలో కూడా ఒకే భాషలో అనేక బోధనావకాశాలను పొందే అవకాశానికి నోచుకోలేదు.. ఇలాంటి నేపథ్యంలో ఏపీ సీఎం తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటూనే అంగన్‌వాడీ (ప్రీ–స్కూల్‌) నుంచి విశ్వవిద్యాలయ డిగ్రీ వరకు అన్ని స్థాయిల్లోనూ ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని తప్పక నేర్చుకునేలా చేశారు. భారతీయ భాషా విధానంలో ఇది అతి గొప్ప గెంతుగా చెప్పాలి. మూడు, ఏపీ ప్రభుత్వం విద్యారంగంపై గణనీయమైన మొత్తాన్ని చాలా సృజనాత్మకంగా ఖర్చుపెడుతోంది.
 
ఇక్కడ ఇచ్చిన డేటా దీనిపై స్పష్టమైన చిత్రణను అందజేస్తుంది. ఇక్కడ ఇచ్చిన నగదు వివరాలు 2019లో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బడ్జెట్‌ సంవత్సరాల్లో విద్యపై పెట్టిన ఖర్చుకు సంబంధించిన వివరాలు. జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ.13,022 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ మొత్తం బడికి వెళుతున్న తమ పిల్లల విద్యకోసం ఖర్చుపెట్టడానికి నిరుపేద తల్లుల ఖాతాలోకి జమచేశారు. ఇది 44 లక్షల 48 వేల 865 కుటుంబాలకు ప్రయోజనం కలి గించింది. ఇక జగనన్న విద్యా దీవెన కింద రూ. 5,573 కోట్లను కాలేజీ వెళుతున్న పిల్లలకు ఫీజు చెల్లించడానికి తల్లుల ఖాతాలోకి జమచేశారు. ఈ మొత్తం 18 లక్షల 80 వేల 934 కుటుంబాలకు లబ్ధి కలి గించింది. జగనన్న వసతి దీవెన కింద రూ. 2,270 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ మొత్తం కూడా అనేక విద్యాపరమైన, కుటుంబపరమైన ఖర్చుల నిమిత్తం మహిళల ఖాతాల్లోకి వెళ్లింది. 

ఇకపోతే జగనన్న గోరుముద్ద పథకానికి రూ. 1,600 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ పథకంకింద పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించారు. ప్రతిపిల్లవాడి పళ్లెంలో నాణ్యమైన ఆహారం అందించడం కోసం దీన్ని వెచ్చించారు. చివరకు కరోనా మహమ్మారి కాలంలో పాఠశాలలు మూతపడిన సందర్భంలో కూడా వండిన భోజ నాన్ని పిల్లల ఇళ్లకే వెళ్లి అందించారు. ఇది 36,88,618 మంది పిల్లలకు ప్రయోజనం కలిగించింది. జగనన్న విద్యా కానుక అనే మరో పథకం కింద పుస్తకాలు, బ్యాగులు, షూలు తదితరాల కోసం రూ. 650 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ పథకం 45 లక్షల పిల్లలకు ప్రయోజనం కలిగిం చింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చక్కటి పాఠశాల మౌలిక వసతులను నిర్మించడానికి ‘నాడు నేడు’ పథకం ప్రారంభించింది. మౌలిక వసతుల అభివృద్ధి పథకం తొలిదశలో రూ. 3,564 కోట్లు వెచ్చించి 15,205 పాఠశాలల్లో నాణ్యమైన వసతులు కల్పించారు. మొత్తం మీద చూస్తే ఈ విద్యా పథకాలన్నింటిపై రెండు ఆర్థిక సంవత్సరాల సమయంలో రూ. 26,678 కోట్లను ఏపీ ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఈ పథకాలకు పెట్టిన ఖర్చు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలకంటే ఎంతో ఎక్కువ. తీవ్ర దారిద్య్రం, గ్రామీణ, పట్టణ నిరుద్యోగిత తాండవిస్తున్న దేశంలో పిల్లలందరికీ నాణ్యమైన, ఒకే జాతీయ భాషలో విద్యను అందించడం అనేది అతిపెద్ద విప్లవం అని చెప్పాలి. 

భారతీయ విద్యావ్యవస్థ తొలి నుంచీ కుల, వర్గ పక్షపాతంతో కొనసాగుతూ వచ్చింది. భారతీయ ప్రజాస్వామ్యం నాణ్యమైన పాఠశాల విద్య ప్రాముఖ్యతను ఇంతవరకు గుర్తించలేదు. విద్యపై మంచి బడ్జెట్‌ కేటాయింపులను చేయవలసిన అవసరాన్ని కూడా మన వ్యవస్థ గుర్తించలేదు. అలాగే ఏ రాష్ట్ర ప్రభుత్వం లేక కేంద్ర ప్రభుత్వం కూడా పిల్లలందరికీ ఒకే భాషలో విద్యతో జాతిని ఐక్యపర్చవచ్చని గుర్తించలేకపోయాయి. దీనికోసం ఇంగ్లిష్‌ని ప్రధాన జాతీయ బోధనా భాషగా చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది. ఇంగ్లిష్‌ని ఇప్పటికైనా భారతీయ భాషగా గుర్తించితీరాలనీ, అన్ని పాఠశాలల్లో జాతీయ ప్రాధాన్యత కింద ఇంగ్లిష్‌ని బోధించాలనీ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్నార్‌ నారాయణ మూర్తి ఇటీవలే మొట్టమొదటిసారిగా పేర్కొన్నారు. 

అయితే సాహసోపేతమైన ముఖ్యమంత్రులుగా పేరొందిన సిద్ధరామయ్య, పినరయి విజయన్‌ కూడా తమ తమ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంని ప్రవేశపెట్టడానికి భయపడ్డారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లిష్‌ మీడియం విద్యను ప్రవేశపెడతామని వాగ్దానం చేసి దాన్ని నిలుపుకోలేకపోయారు. అత్యంత సాహసిగా పేరొందిన మమతా బెనర్జీ సైతం తన రాష్ట్రంలో ఇంగ్లిష్‌ను ఉమ్మడి బోధనా భాషగా చేయడం ద్వారా విద్యావ్యవస్థను సంస్కరించడానికి చర్యలు చేపట్టలేకపోయారు. పునరుజ్జీవనోద్యమ రాష్ట్రంగా పేరొందిన బెంగాల్‌ ఇప్పుడు అన్ని పరామితులలో చూస్తే విద్యలో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రంగా ఉంటోంది. చివరకు మహారాష్ట్ర, గుజరాత్‌లలో కూడా సంపన్నులు తమ పిల్లలను ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదివిస్తుండగా, మరాఠా, గుజరాతీ భాషా సెంటిమెంట్‌ని నిరుపేద దళితులకు, శూద్రులకు, ఆదివాసీలకు పరిమితం చేసి వారు ప్రాంతీయ భాషా విద్యకు కట్టుబడేలా చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్యను తప్పకుండా అభినందించాల్సి ఉంది.

ఉత్తర భారతదేశంలో ముఖ్యమంత్రులందరూ ప్రభుత్వ పాఠశాలల ద్వారా ప్రాంతీయవాదం అనే సాంప్రదాయ అవగాహనతోనే ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తున్నారు. కానీ సంపన్నులు మాత్రం ఇంగ్లిష్‌ను వలస భాషగా గుర్తించడం లేదు కాబట్టే తమ పిల్లలను ఏ ప్రాంతంలోనైనా, లేక ఏ రాష్ట్రంలోనైనా సరే... ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదివించేందుకు డబ్బు వెచ్చిస్తున్నారు. ఈ వివక్షను ఎందుకు పట్టుకుని ఇంకా వేలాడాలి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యావిధానం భాషా విధానంలో మౌలిక మలుపులాంటిది, అంతేకాకుండా ఇది సమర్థవంతమైన పెట్టుబడి పాలసీ కూడా. బ్రిటిష్‌ నమూనాను పోలినటువంటి విద్యాపరమైన సంక్షేమవాదాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది. అయితే బ్రిటన్‌ వంటి అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో మాదిరి కాకుండా, భారత్‌లో ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు లేదు. కేంద్ర ప్రభుత్వం తన భాషా విధానాన్ని ఏకీకృత జాతీయ భాషా విధానంగా మార్చనంతవరకు, ప్రస్తుతం అంతర్జాతీయీకరణకు గురైన ప్రపంచానికి వర్తించే, అన్ని తరాలకు అవసరమయ్యే నాణ్యమైన కంటెంట్‌ విద్యను అందివ్వడం సాధ్యం కాదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఒక దారి చూపిస్తోంది.

వ్యాసకర్త: ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త


 

మరిన్ని వార్తలు