సంక్షోభం నుంచి సంక్షేమం లోకి...

17 Nov, 2022 14:11 IST|Sakshi
విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని మహిళలతో వ్యాసకర్త

విశ్లేషణ

సంక్షేమ కార్యక్రమాలు వర్సెస్‌ ఉచితాలు, అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతోంది. సంక్షేమ కార్యక్రమాలు ఉచితాలు కావనీ మానవ వనరుల అభివృద్ధికి అవి తప్పనిసరి అనీ, దీర్ఘకాలంలో నిలకడైన అభివృద్ధికి అవి దోహదపడతాయనీ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. పైగా ఈ పథకాల ద్వారా కలిగే ప్రయోజనాలు కింది వర్గాల కొనుగోలు శక్తిని పెంచి దారిద్య్రాన్ని తగ్గించడమే కాక, కుటుంబాల శ్రేయస్సును, పురోగతిని పెంచుతాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపున ప్రధాన ప్రతిపక్షం మాత్రం సంక్షేమ పథకాలు అంటే ఉచితాలు మాత్రమేననీ, అవి వృధా ఖర్చు మాత్రమేననీ, అనుత్పాదకమైనవనీ విమర్శిస్తోంది. పైగా ఈ సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రజాకర్షక మార్గాలు మాత్రమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకుల నుంచి రుణాల ప్రభావం గురించి  సెర్ప్‌ (ఎస్‌ఈఆర్‌పీ) సంస్థ సీఈఓ అంచనా వేయాలని భావించారు. కూలంకషమైన చర్చల తర్వాత, ఒక కన్సల్టెంటుగా (ఎమ్‌ అండ్‌ ఈ) విశాఖపట్నం జిల్లాలో పద్మనాభ మండలాన్ని, రెండు మండల మహిళా సమాఖ్యలు, మరో రెండు గ్రామ సంస్థలను పరిశీలన కోసం ఎంపిక చేసుకున్నాను. ఎఫ్‌జీడీల ద్వారా, వీఓ నేతలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులతో వ్యూహాత్మక ఇంటర్వ్యూల ద్వారా ఈ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేయాలని నిర్ణయించుకున్నాను. ఈ పనిలో భాగంగా అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్లు, క్లస్టర్‌ కోఆర్డినేటర్లు, వ్యవసాయ అధికారులు, మండలంలోని అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, ఆదర్శ వ్యవసాయదారులతో కూలంకషంగా చర్చించాను. 

పద్మనాభ మండల మహిళా సమాఖ్య 45 వీవోలతో కూడి ఉంది. ప్రతి వీఓలో ఇద్దరు లీడర్లు ఉంటారు. 1,423 స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీలు) ఉన్నాయి. వీటి మొత్తం సభ్యుల సంఖ్య 15,363. మండలంలోని దాదాపు 90 శాతం గృహాలు ఎస్‌హెచ్‌జీల పరిధి కింద ఉంటున్నాయి. మండలంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలపై అభిప్రాయాలు తీసుకోవడానికి 100 మందితో మాట్లాడటం జరిగింది.

సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ సభ్యులు, మండలంలోని ప్రజల సామాజిక నిర్మాణం గురించి తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది. అప్పుడే ఏఏ వర్గాల వారు ఏ మేరకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందుతున్నారో అవగతమవుతుంది. ఎస్‌హెచ్‌జీలోని మొత్తం సభ్యులలో ఎస్సీలు 10 శాతం, ఓసీలు 10 శాతం, బీసీలు 70 శాతం మంది ఉంటున్నారు. సామాజికంగా వెనుకబడిన బృందాల వద్ద తక్కువ పరిమాణంలో భూమి ఉన్నదనీ తేలింది.

దారిద్య్రం నుంచి బయటపడేయటానికి ప్రధాన సూచికలలో ఒకటి ఏమిటంటే డబ్బు అందుబాటులోకి రావడం. బ్యాంకులు, స్త్రీనిధి కలిసి 2019 నుంచి 2022 జూలై వరకు స్వయం సహాయక బృందాలకు రూ. 130 కోట్ల నగదును పంపిణీ చేశాయి. సున్నా వడ్డీ కారణంగా బృంద సభ్యులు ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోగలిగారు. పైన పేర్కొన్న కాలంలోనే రూ. 130 కోట్లను వీరికి పంపిణీ చేశారు. ఎస్‌జీహెచ్‌లలోని సభ్యుల్లో 95 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందారని తేలింది. మరోమాటలో చెప్పాలంటే 5 శాతం మంది సభ్యులు ఒక ప్రయోజనం మాత్రమే పొందగా 40 శాతం మంది సభ్యులు 3 ప్రయోజనాలు పొందారనీ, మిగిలిన 55 శాతం సభ్యులు 6 కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందారనీ తేలింది. సగటున ప్రతి గ్రూప్‌ మెంబర్‌ సంవత్సరానికి 50 వేల నుంచి లక్షరూపాయల వరకు లబ్ది పొందారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా స్వయం సహాయక బృందాలకు దాదాపు రూ. 170 కోట్లు పంపిణీ చేశారు. ఇది కాకుండా, రైతు భరోసా, అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, శ్రీనిధి తదితర సంక్షేమ పథకాలు, బ్యాంక్‌ రుణాలు కలిసి రూ. 300 కోట్ల  నగదు మహిళలకు అందింది. 

‘నవరత్నాలు’ పేరిట సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిని అనుసరించింది. దీంతో ప్రభుత్వం అందించే ప్రయోజనాలు నేరుగా లబ్ధి దారుల ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయి. వలంటీర్‌ వ్యవస్థతో కూడిన గ్రామ, వార్టు సచివాలయాల వ్యవస్థ ద్వారా కులం, మతం, జెండర్, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయి.

బ్యాంకుల రుణాలు, సంక్షేమ పథకాలు సకాలంలో అందితే వ్యవసాయరంగం ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఏపీ ప్రభుత్వ పాలన నిరూపించింది. గత మూడేళ్ల నాలుగు నెలల్లో ఈ మండలంలో రైతులు ఖరీఫ్, రబీ సీజన్లు రెండింటిలోనూ మూడు పంటలు పండిస్తూ వచ్చారు. ఖరీఫ్‌లో ప్రధానంగా వరి పంట పండించారు. రబీలో బోర్‌వెల్స్‌లో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో రాగులు, వరి, నువ్వులు, నల్ల ఉలవలు వంటి పంటలను పండించారు. ఈ మూడేళ్ల  నాలుగు నెలల కాలంలో వరి ధాన్యం 24– 26 సంచులు ఎక్కువగా పండించారు. వరి పంట పండించిన రైతుల ఆదాయం రూ. 12 వేల నుంచి 15 వేల రూపాయల వరకు పెరిగింది. రాగి పంట 7 బస్తాలు అదనంగా పండింది. ఆదాయం రూ. 30 వేలవరకు పెరిగింది. నువ్వుల పంట కూడా 3 క్వింటాల్స్‌ అదనంగా పెరిగి రూ. 30 వేల వరకు ఆదాయం కూడా పెరిగింది. 

మూడేళ్లలోపే పంటల విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగి రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరగడానికి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల వల్ల లభించే సహాయం సకాలంలో రైతులకు అందడమే కారణమని స్వయం సహాయక గ్రూపు సభ్యులు ముక్త కంఠంతో చెప్పారు. రైతుభరోసా కేంద్రాల్లో అవసరమైనంత పరిమాణంలో ఎరువులు, పురుగు మందులు మార్కెట్‌ రేట్‌ కంటే పది శాతం తక్కువ ధరకే లభించడంతో వ్యవసాయ దిగుబడుల్లో గణనీయంగా మార్పు వచ్చింది. వ్యవసాయ యంత్రాలు, ఇతర ఉప కరణాలను కూడా రైతు భరోసా కేంద్రాలు అద్దె ప్రాతిపదికన అందించడంతోపాటు వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి సేకరించడంతో రైతుకు బహుళ ప్రయోజనాలు కలిగాయి.

మండలంలో అనేక కార్యక్రమాల ద్వారా కుటుంబ ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. సున్నావడ్డీ కారణంగా ఒకటి నుంచి రెండులక్షల రూపాయల మేరకు రుణాలను తీసుకున్న మహిళా సభ్యులు పెద్దగా కష్టం లేకుండానే రుణ చెల్లింపులు చేస్తూవచ్చారు. దీంతో మహిళా స్వయం సహాయక గ్రూపులు తీసుకున్న బ్యాంక్‌ రుణాల్లో నిరర్థక రుణాల శాతం 0.5 శాతం మాత్రమే నమోదవడం విశేషం. 

ఏపీలో ప్రభుత్వం ప్రారభించిన అమ్మ ఒడి పథకం కారణంగా మహిళలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దఎత్తున చేర్పించ గలిగారు. ఇక ‘విద్యా దీవెన’, ‘విద్యా వసతి’ పథకాల ద్వారా  ఆర్థిక ఇబ్బందులు లేకుండానే మహిళలు తమ పిల్లలను ఉన్నత విద్య చదవడానికి పంపించారు. పద్మనాభ మండలంలోని స్వయం సహాయక బృందంలోని 600 మంది సభ్యుల్లో వందమంది చేయూత పథకం కింద గొర్రెలు, మేకలు కొన్నారు.  ఈ మండలం లోని 900 మంది మహిళా సభ్యులు ‘జగనన్న తోడు’ పథకం కింద తమ కూరగాయాలు, ఆకు కూరలను అమ్ముకోగలిగారు. దీంతో వడ్డీ చెల్లింపుల భారం తగ్గిపోయింది. ‘తోపుడు బండి’ పథకం కింద 300 మంది మహిళలు ఊరగాయలు తయారు చేసి అమ్మి లాభాలు సంపాదించారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాల కల్పన, చక్కటి వర్షపాతం కారణంగా పద్మనాభ మండలంలోని ప్రతి ఒక్క కుటుంబం తాము సంతోషంగా ఉంటున్నట్లు తెలిపారు. రెండు పంటలు పండటం, పంటల్లో వైవిధ్యత, ప్రత్యేకించి కూరగాయలు, ఆకుకూరల సేద్యం పెరగడం వల్ల రైతుల నికర ఆదాయం బాగా పెరిగింది.  దీంతో లేబర్‌కి డిమాండ్‌ పెరిగి కూలీ రేట్లుకూడా పెరిగాయి. ఇవన్నీ చేరి రైతు కుటుంబాలు రుణ భారం నుంచి బయటపడ్డాయి. కుటుంబాలు తమ సొంత వనరులను ఏర్పర్చుకోవడంతో అప్పులు లేకుండా ఇళ్లు కట్టుకుంటున్నారు. ఇటుకల బట్టీలు, ఆటో ట్రాన్స్‌పోర్ట్‌ వంటి వ్యవసాయేతర ఉపాధి అవకాశాలను వీరు సృష్టించుకున్నారు. పిల్లలకు ఉచిత విద్య కారణంగా మహిళలు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కేటాయించినా, 65 శాతం పైగా సీట్లను మహిళలే కైవసం చేసుకోవడం ఇందుకు నిదర్శనం.

ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల వితరణ కారణంగా కుటుంబాల్లో దారిద్య్రస్థాయి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా నిరుపేదల్లో కెల్లా నిరుపేద కుటుంబాల్లో 90 శాతంపైగా దారిద్య్ర రేఖను అధిగమించేశారు. ప్రతి సంవత్సరమూ పెరుగుతున్న సంపాదన కారణంగా వీరు ఇప్పుడు దిగువ మధ్యతరగతి వర్గంలోకి చేరుకున్నారు. పోషకాహారం పట్ల శ్రద్ధ పెరగడం, నాణ్యమైన దుస్తులు ధరించడం, రోజువారీ దుస్తుల స్టయిల్‌ కూడా మారిపోవడం వంటి పలు కారణాలతో మహిళా బృంద సభ్యులు ఎలాంటి ఆకస్మిక పరిణామాలు, ఎదురుదెబ్బలనైనా తాము తట్టుకోగలమని ఆత్మ విశ్వాసంతో ఉండటం మరీ విశేషం. అంతిమంగా పేదల అనుకూల విధానాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం క్రియాశీలకంగా అమలు చేయడం వల్లే  గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి గొప్ప మార్పు చోటు చేసుకుంటోందని చెప్పవచ్చు. సంక్షేమ పథకాల ద్వారా అట్టడుగు వర్గాలు, పేదల జీవితాల్లో సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుండటమే దీనికి  కారణమని నొక్కి చెప్పవచ్చు. (క్లిక్‌ చేయండి: పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు)


- ప్రొఫెసర్‌ కె.వి.రమణా రెడ్డి 
 రిటైర్డ్‌ ప్రొఫెసర్‌

మరిన్ని వార్తలు