ఆయన వారసత్వాన్ని నిలబెడదాం!

19 May, 2022 12:58 IST|Sakshi

ఆదర్శవంతమైన రాజకీయనేతగా, దక్షిణ భారత కమ్యూనిస్ట్‌ ఉద్యమ నిర్మాతగా, పీడిత ప్రజల ప్రియ తమ నాయకునిగా కామ్రేడ్‌ పుచ్చల పల్లి సుందరయ్య (పీఎస్‌)కు ఆధునిక భారత చరిత్రలో చెరగని స్థానం ఉంది. 

1913 మే 1వ తేదీన నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పీఎస్‌... చిన్న వయసులోనే సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్నారు. 1930వ దశకంలో దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్ట్‌ ఉద్యమ నిర్మాణానికి బీజాలు వేశారు. దేశంలోనే తొలి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారు. తన వాటాకి వచ్చిన యావదాస్తినీ పార్టీకీ, ఉద్యమానికీ ధారబోసి అత్యంత నిరాడంబరంగా, నియమబద్ధంగా, నిర్మాణాత్మకంగా జీవించారు. 

1934లో ఏర్పడిన తొలి ఆంధ్ర కమ్యూనిస్ట్‌ కమిటీలో సభ్యుడైన సుందరయ్య వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. భూమి లేని నిరు పేదలకు ఆ పోరాటం 10 లక్షల ఎకరాల భూమిని పంచింది. 3,000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పర్చారు. నైజాంను భారతదేశంలో విలీనం చేయడానికి భారత సైన్యాలు వచ్చినప్పటికీ అవి కమ్యూనిస్టులను అణచివేయ చూసినప్పుడు... సాయుధ పోరాటం కొనసాగిస్తూ ఉద్య మాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో ఆయన కృషి గణ నీయమైనది. 

కమ్యూనిస్ట్‌ పార్టీ తొలి కేంద్ర కమిటీలో సభ్యుడైన సుందరయ్య ఆఖరి వరకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. మితవాద, ఉగ్రవాద పెడ ధోరణులు తలెత్తినపుడు మార్క్సిజం సిద్ధాంత స్వచ్ఛతను కాపాడడం కోసం అంతర్గత పోరాటాన్ని సాగించడమే గాక చాలా కాలం కారాగారవాసం కూడా అనుభవించారు. సీపీఎం ఏర్పడినప్పుడు తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ప్రధాన కమ్యూనిస్టు పార్టీగా తీర్చిదిద్దడానికి పునాదులు వేశారు. పశ్చిమబెంగాల్లో ‘అర్ధ ఫాసిస్టు బీభత్స కాండ’ కాలంలో రంగంలో ఉండి వారికి చేయూతనందించారు. ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యమ నిర్మాణాన్ని పటిష్టం చేసేం దుకూ, విస్తృత పరిచేందుకూ అంకితమైనారు. రెండేళ్ల పాటు రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారు.

ప్రజా ఉద్యమాలు పోరాటాలతో పాటు చట్టసభల్లోనూ సుందరయ్య ప్రజల వాణి వినిపించడంలో గొప్పపాత్ర నిర్వహించారు. భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా 1952– 54 మధ్య రాజ్యసభలో ఉండి నాటి ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్టు సభ్యులకు నేతృత్వం వహించారు. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లిన ఆయన నిరాడంబరత్వం చరిత్రలో నిలిచిపోయింది.

1955లో ఆంధ్ర శాసనసభ మధ్యంతర ఎన్నికలలో పాలకవర్గాలు, బడా పత్రికలు విషపు ప్రచారాలు సాగించినా వాటిని లెక్కచేయకుండా నికరంగా పోరాడారు. 1962లో గెలుపొంది విశాఖ ఉక్కు సమస్యపై రాజీనామా చేసి మళ్ళీ 1978 – 83 మధ్య శాసనసభ్యుడుగా ఉన్నారు. సుందరయ్య, ఆయనను వివాహమాడిన కమ్యూనిస్ట్‌ కార్యకర్త కామ్రేడ్‌ లీల ఇద్దరూ... సంతానాన్ని కూడా వద్దనుకుని ఉద్యమ నిర్మాణానికే అంకితమైన తీరు ఒక ఉదాత్త ఉదాహరణగా మిగిలిపోయింది.

కామ్రేడ్‌ సుందరయ్య రాజకీయాలతో పాటు కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలోనూ మహత్తర కృషి చేశారు. తెలుగు జాతి సాహిత్య సాంస్కృతిక పునరు జ్జీవనానికి సదా శ్రద్ధ వహించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తకం రాసి భావి బాషా రాష్ట్రాల స్థాపన బాట చూపారు. ‘నవ శక్తి’, ‘స్వతంత్ర భారత్‌’, ‘ప్రజాశక్తి’, ‘విశాలాంధ్ర’, తిరిగి ‘ప్రజాశక్తి’ వంటి పత్రికలు స్థాపించడం ద్వారా కమ్యూనిస్ట్‌ భావాల వ్యాప్తికి కృషి చేశారు. (చదవండి: రాజ్యాంగస్ఫూర్తే విరుగుడు!)

అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో గౌరవాభిమానాలు పొందిన సుందరయ్య... శ్రామిక వర్గ అంతర్జాతీయతను నిలబెట్టిన యోధుడు. ఈ నిర్విరామ కృషిలో ఆయన అనారోగ్యంతో పెనుగులాడుతూ వచ్చారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉండగానే 1985 మే 19వ తేదీన ఆయన కన్నుమూశారు. బహుముఖ కార్యక్రమాలతో సుందరయ్య స్ఫూర్తిని ఈ తరానికి అందించడం మనందరి కర్తవ్యం. (Enugula Veeraswamy: ఆ యాత్ర ఓ చరిత్ర)

- జూలకంటి రంగారెడ్డి 
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
(మే 19న పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి
)

మరిన్ని వార్తలు