ఉపాధి, ఉత్పత్తులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధి

30 Aug, 2022 14:47 IST|Sakshi

ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్‌ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో పారిశ్రామికాభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఇప్పటికే రాష్ట్రంలో పెట్టిన యూనిట్లను త్వరిత గతిన పూర్తి చేసి ఉత్పత్తి ప్రారం భించేలా చర్యలు చేపట్టింది. ప్రతి నెలా రాష్ట్రంలో పరిశ్రమల ప్రారంభోత్స వాలు, శంకు స్థాపనలు నిర్వహించేలా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది సత్ఫలితాల నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌  ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు అంటే ఆర్నెల్ల వ్యవధిలో రాష్ట్రంలో 22 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా, వీటి ద్వారా రూ. 20,682 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ తన తాజా నివేదికలో వెల్లడించింది. తొలి ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించిన ప్రధాన కంపెనీల్లో గ్రాసిం ఇండస్ట్రీస్, పానా సోనిక్‌ లైఫ్‌ సైన్స్‌ సొల్యూషన్స్, కాప్రికాన్‌ డిస్టిలరీ, ఆంజనేయ ఫెర్రో అల్లాయిస్, నోవా ఎయిర్, తారక్‌ టెక్స్‌టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్‌ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్‌ మిల్‌ లాంటివి ఉన్నాయి.

కోవిడ్‌ సంక్షోభం కుదిపివేసిన 2020, 2021తో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో రెట్టింపు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 2019లో 42 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ. 9,840 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా...  2021లో రూ. 10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత రెండున్నరేళ్లలో మొత్తం 111 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా మొత్తం రూ. 40,872 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 

పారిశ్రామికవేత్తల నుంచి కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన అందిన నాటి నుంచి యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో చేయూత అందించేలా ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు, సేవలు అందిస్తోంది. తాజాగా విశాఖ వద్ద ప్రముఖ జపాన్‌ కంపెనీ యకహోమా గ్రూపు సంస్థ ఏటీసీ టైర్స్‌ యూనిట్‌ ప్రారంభం సందర్భంగా సంస్థ సీఈవో నితిన్‌... మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటును కొనియాడారు. సాధారణంగా అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందనీ, రాష్ట్రంలో మాత్రం ‘సింగిల్‌ డెస్క్‌’ విధానంలో వేగంగా మంజూరయ్యాయనీ తెలిపారు. దీంతో రికార్డు సమయంలో 15 నెలల్లోనే తొలిదశ యూనిట్‌ను ప్రారంభించడమే కాకుండా రెండో దశ పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. కోవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించినట్లు నోవా ఎయిర్‌ ప్రతినిధులు వెల్లడించారు. 2020 డిసెంబర్‌లో నిర్మాణం ప్రారంభించి 11 నెలల్లోనే పనులు పూర్తి చేశామనీ, దీనివల్ల 250 టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందనీ తెలిపారు.

గత రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలోకి కొత్తగా రూ. 24,956 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ నివేదిక పేర్కొంది. 2020 జనవరి నుంచి 2022 జూన్‌ నాటికి కొత్తగా 129 భారీ యూనిట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా  ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరునెలల కాలంలో కొత్తగా 23 కంపెనీలు రూ. 5,856 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిశ్రామికీకరణ విధానాలను పునఃసమీక్షిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) ఆధునిక సాంకే తిక పరిజ్ఞానాన్ని అందిస్తూ, ఉత్పత్తి పెంచుతూ, ఆర్థిక చేయూతను ఇస్తూ ఉద్యోగ, ఉపాధులు కల్పిస్తోంది ప్రభుత్వం.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో 28,343 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా రూ. రూ. 47,490.28 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 2,48,122 మందికి ఉపాధి లభించింది. ఇందులో 28,247 ఎంఎస్‌ఎంఈలు ఉండగా 96 భారీ యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో రూ. 1,51,372 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల ఎంఎస్‌ఎంఈలను ‘ఉదయం’ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదయ్యాయి. 

రాష్ట్రంలో ప్రతి విద్యార్థినీ అత్యుత్తమ నైపుణ్యాలతో ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఉద్యోగాన్వేషణలో అత్యంత కీలకమైన సాఫ్ట్‌స్కిల్స్‌ పెంపొందించడంపై 1.62 లక్షల మంది విద్యార్థులకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ అందజేస్తోంది. రూ. 465 కోట్ల వ్యయమయ్యే ఈ శిక్షణను మైక్రోసాఫ్ట్‌ సంస్థ రాష్ట్ర విద్యార్థులకు దాదాపు రూ. 32 కోట్లకే అందిస్తోంది. అది కూడా విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ కోర్సులే కాకుండా ‘లింక్డిన్‌’ ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేస్తున్నారు. దీని ద్వారా లింక్డిన్‌లోని టెక్నాలజీ, క్రియేటివిటీ, బిజినెస్‌ విభాగాల్లో 8 వేలకు పైగా కోర్సులు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. (క్లిక్‌: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!)

వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు–2023లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా పటిష్ఠ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేలా కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ (సీఐఐ) భాగస్వామ్యంతో భారీస్థాయి పెట్టుబడి దారులతో జనవరి తర్వాత ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే మరిన్ని ఉద్యోగాలు అందు బాటులోకి వస్తాయి. (క్లిక్‌: ఇంగ్లిష్‌ వెలుగులు చెదరనివ్వొద్దు)


- డాక్టర్‌ పూనూరు గౌతమ్‌ రెడ్డి 
ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌

మరిన్ని వార్తలు