వారసత్వ రాజకీయాలకు చెల్లుచీటీ 

6 Apr, 2021 01:58 IST|Sakshi

సందర్భం

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా.. 1998 మే నెలలో పోఖ్రాన్‌2 అణు పరీక్షలను నిర్వహించింది. అప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా, జపాన్, బ్రిటన్‌ సహా చాలా దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాయి. అన్ని విధాలా సహాయ సహకారాలను నిలిపివేస్తామని బెదిరించాయి. నిలిపివేశాయి కూడా. భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా తయారు చేయాలన్న సంకల్పంతో ఉన్న అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. వాస్తవానికి ఈ పరీక్షలను అంతకు ముందే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. కానీ, అమెరికా బెదిరింపులకు ఆ పార్టీ తలొగ్గింది. వాజ్‌పేయి ప్రభుత్వం మాత్రం ముందస్తు వ్యూహాలు, కట్టుదిట్టమైన ప్రణాళికలతో.. మూడో కంటికి తెలియకుండా ఈ పరీక్షలను నిర్వహించడమే కాదు.. ఆ తర్వాత ఎదురైన ఒత్తిళ్లను తట్టుకుని సత్తా చాటుకుంది. భారతీయులంతా సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. అదే వాజ్‌పేయి ప్రభుత్వం.. ఒకే ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయిన పార్టీగా చరిత్రలో నిలవాల్సి వచ్చింది. మిత్ర పక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒకసారి 13 రోజుల్లో, మరోసారి 13 నెలల్లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఇలా అధికారాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడిందే తప్ప ఏనాడూ లాలూచీలు పడాలని, ఎదుటివారిని లాక్కోవాలని చూడలేదు.
 
బీజేపీకి కావాల్సింది ఏంటి? ఈ దేశంలో పేదరికం లేకుండా చేయడం, కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయాన్ని, స్వేచ్ఛను అందించడం, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, అన్నివిధాలా దేశాన్ని అగ్రరాజ్యంగా అవతరింపచేయడం, మన ఘనమైన వారసత్వాన్ని నలుదిక్కులా చాటడం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రతి బీజేపీ కార్యకర్తా, నాయకుడూ పఠించే, పాటించే మంత్రం ఇదే. 1980 ఏప్రిల్‌ 6న ప్రారంభమైన బీజేపీ తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చూసింది. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాజ్‌పేయి, అద్వానీ లాంటి మహామహులైన నాయకులంతా పరాజయం పాలయ్యారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ రెండంటే రెండు సీట్లలోనే గెలుపొందింది. ఆ తర్వాతి ఎన్నికల్లో రెండంకెలు, మూడంకెల సీట్లను సాధించి, క్రమంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత మరలా సీట్లు, ఓట్లు తగ్గి బలహీనంగా కనిపించినప్పటికీ.. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాలను సొంతం చేసుకుంది. 

రెండున్నర దశాబ్దాలపాటు దేశాన్ని సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంతో.. ఇక భారతదేశంలో ఏక పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యం అని రాజకీయ పండితులంతా ఏకగ్రీవంగా ప్రకటించిన సమయంలో బీజేపీ 2014 ఎన్నికల్లో 30 శాతానికి పైగా ఓట్లు, 282 సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది గాలివాటం కాదని నిరూపిస్తూ 2019 ఎన్నికల్లో 37 శాతానికి పైగా ఓట్లు, 300లకు పైగా సీట్లు సాధించింది.

భారతదేశంలో నలు దిక్కులా బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థులను తట్టుకుని నిలబడిన కోట్లాది మంది కార్యకర్తలు సాధించిన, సాధిస్తున్న విజయం ఇది. కార్యకర్తలే బీజేపీకి పునాది, బలం. ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక కుటుంబంతో సంబంధం లేకుండా భారతదేశంలో ఇంత పెద్ద చారిత్రక విజయాలను నమోదు చేసిన ఏకైక పార్టీగా బీజేపీ ఎదిగిందంటే దానికి కారణం కార్యకర్తలే. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా కానీ, మిత్రపక్షాల రూపంలో కానీ అధికారంలో ఉంది. కానీ, ఇప్పటి వరకూ అధికారం చేపట్టని, ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులకు సరితూగే స్థాయిలో ప్రజాకర్షక నాయకులు లేని కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలంగా ఉందంటే బీజేపీ సిద్ధాంతాలను జీర్ణించుకుని, జెండాను భుజాన పెట్టుకున్న కార్యకర్తలే కారణం.

స్వాతంత్య్రానంతరం పాశ్చాత్య ప్రభుత్వ పోకడలకు ప్రభావితమైన నాయకులు భారతీయ ఆత్మతో సంబంధంలేని పోకడలను బలంగా నమ్మి, దేశంపైన బలవంతంగా రుద్దుతున్న సమయంలో భారతీయతత్వంతో ‘సమగ్ర మానవతావాదం’ పేరిట మనదైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ. అత్యంత దీనావస్థలో ఉన్న నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వాలన్నీ ‘అంత్యోదయ’ పథకాలను ప్రారంభించాయి. కింది స్థాయిలో ఉండే వారికి ప్రభుత్వం నుంచి నేరుగా సహాయ, సహకారాలు అందేలా మోదీ ప్రభుత్వం ఎన్నడూ ఊహించని స్థాయిలో చర్యలు చేపట్టి, అమలు చేస్తోంది. సంక్షేమ కార్యక్రమాల అమలును కొత్తపుంతలు తొక్కించి, మధ్య దళారులను, లీకేజీలను అరికట్టింది. భారతీయ చారిత్రక సంస్కృతి స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో అన్ని విధాలుగా అగ్రరాజ్యంగా భారతదేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు ‘దేశం ముందు, పార్టీ తర్వాత, స్వప్రయోజనాలు చివరాఖరున’ అన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. అలాంటి వారందరికీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు.(నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం)


వ్యాసకర్త: పురిఘళ్ల రఘురామ్‌
బీజేపీ సీనియర్‌ నాయకులు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు