క్వాడ్‌.. ఎవరి ప్రయోజనాల కోసం?

27 May, 2022 12:00 IST|Sakshi

చతుష్టయం(క్వాడ్‌) అని పిలిచే ‘చతుర్ముఖ భద్రతా ముచ్చట్లు’ (క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాల మధ్య వ్యూహాత్మక భద్రతా ఏర్పాటు! ఎవరికి ఎవరి నుండి భద్రత కావాలి? అమెరికాకు చైనా నుండి వాణిజ్య భద్రత, జపాన్‌కు చైనా నుండి సరిహద్దు భద్రత కావాలి. ఈ ముచ్చట్లను 2007లో నాటి జపాన్‌ ప్రధాని షింజొ అబే ప్రారంభించారు. చైనా ఈ కూటమి ఏర్పాటుపై నిరసన తెలిపింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 2008లో తప్పుకొంది. అయితే ఈ చతుష్టయాన్ని 2017లో పునఃప్రారంభించారు. 

ఈ చతుష్టయం మొన్న మే 24న జపాన్‌ రాజధాని టోక్యోలో కలిసింది. చట్టవ్యతిరేక చేపల వేటను ఎదుర్కోడానికి సముద్రయాన ప్రేరణను ప్రారంభించింది. అనుమానిత చేపల వేట చైనా నుండే. ఇండో– పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని నియంత్రించడానికి 4 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. అందులో భారత్‌ వంతు లక్ష కోట్ల రూపాయలు. జపాన్, అమెరికాల ప్రయోజనాలకు, చైనా అభివృద్ధిని అడ్డుకోడానికి మనం ఇంత సొమ్మును వృథా చేయాలా? (👉🏾చదవండి: క్షమాభిక్షలోనూ ఇన్ని రాజకీయాలా?)

గతంలో మోదీ జపాన్‌ గడ్డపై, ప్రత్యక్షంగా జపాన్‌ను, పరోక్షంగా అమెరికాను బుజ్జగించడానికి చైనాను విమర్శించారు. జపాన్, చైనాల మధ్య ‘సెంకకు ద్వీపాల’ సార్వభౌమత్వ, సముద్ర సరిహద్దు వివాదాలున్నాయి. మోదీ విమర్శను చైనా తీవ్రంగా పరిగణించింది. సరైన నిర్ణయం కాకపోయినా భారత సరిహద్దుల్లో చైనా సైనిక చర్యలు దీని ఫలితమే. ‘క్వాడ్‌’ భారత్‌–అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధ్యక్షుడు బైడెన్‌ అన్న మాటల్లో నిజం లేదు. అమెరికా కుట్రలనూ, యుద్ధసామగ్రి వాణిజ్యాన్నీ, మోదీ అమెరికా సౌజన్య పక్షపాతాన్నీ (ఔనంటే ఔను కాదంటే కాదనే గుణం) గర్హించాలి. భారత ప్రజల ప్రయోజనాలను, ఆర్థిక వనరులను, భారత సైనికుల ప్రాణాలను కాపాడుకోవాలి. (👉🏾చదవండి: సైద్ధాంతికంగా కాంగ్రెస్‌ మేల్కొన్నట్లేనా?)

– సంగిరెడ్డి హనుమంత రెడ్డి
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి

మరిన్ని వార్తలు