ప్రైవేటులోనూ రిజర్వేషన్లు ప్రజల హక్కు

18 Mar, 2021 00:20 IST|Sakshi

విశ్లేషణ

దేశంలో ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు పుట్టడం లేదు. ఉన్న ఖాళీలను నింపడం లేదు. దీనికితోడు ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి చర్యలు ఊపందుకుంటున్నాయి. మరి దేశంలో ఉన్న ఉద్యోగాలన్నీ ప్రైవేటురంగంలోకే పోయినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల మాటేమిటి? సామాజిక న్యాయం బాధ్యత ఎవరు తీసుకోవాలి?  స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఈ వర్గాలు ఇంకా పైకి రాలేవన్నది చేదునిజం. ప్రైవేటు సంస్థల పైస్థాయి ఉద్యోగాల్లో ఈ వర్గాల ప్రజలు నామమాత్రంగా ఉన్నారన్నది నగ్నసత్యం. కాబట్టి కేంద్రప్రభుత్వం సామాజిక అసమానత లను తొలగించే బాధ్యత నుంచి తప్పుకోకూడదు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోకతప్పదు.

‘‘కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి, వ్యాపారాలు చేయడం ప్రభుత్వాల బాధ్యత కాదు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బహి రంగంగా పలుమార్లు ప్రకటించారు. పరిశ్రమ, సేవా రంగాలను దశల వారీగా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసు కుంటున్నదనేది స్పష్టం. అందులో భాగంగా రైల్వే, ఎల్‌ఐసీ, పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్, బ్యాంకింగ్, రక్షణ, బొగ్గు సంస్థలు, విశాఖ ఉక్కు పరి శ్రమలను ప్రైవేటీకరణ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. దీన్ని ప్రజలు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయన్నది ఒక కారణమైతే, అందులో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోతామనే అభద్రత మరో కారణం. అలాగే ప్రైవేటీకరణ వల్ల రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలు జరగదనీ, రద్దు చేయకుండానే రిజర్వేషన్లు రద్దవుతాయనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

ప్రైవేట్‌ యాజమాన్యాలు సామాజిక వర్గాల రిజర్వేషన్ల అమలుకు అంగీకరించడం లేదు. ప్రైవేటు పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం వద్ద అన్ని రకాల సహాయ, సహకారాలు తీసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వ నియమాలను పాటించడం లేదు. ఉద్యోగ రంగంలో 90 శాతం ఉద్యోగాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి పాదనలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరిస్తే మరో 26 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పోతాయి. అప్పుడు అవి 7 శాతానికి తగ్గుతాయి. ఉద్యో గాల్లో ప్రైవేటు రంగం విస్తరిస్తున్న క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజ ర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌ బలంగా ముందుకు వస్తున్నది. 

ప్రైవేటురంగం విస్తరిస్తూ పోతే సమాజంలో సాంఘిక, ఆర్థిక అస మానతలు మరింత పెరుగుతాయి. రాజ్యాంగంలో పేర్కొన్న సమ సమాజం, సామాజిక న్యాయం పుస్తకాల్లోని పదాలుగా మిగిలి పోతాయి. ఆర్థిక అసమానతల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. సంపద కొంతమంది బడా పారి శ్రామికవేత్తల చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల రూపంలో లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. అవి కోట్లాది ప్రజల ఆస్తులు. ఇన్ని ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్‌ దిగ్గజాలకు అప్పగిం చడం ప్రభుత్వం చేయవలసిన పని కాదు.  

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకు ప్రభుత్వం ఆమోదించాలి. ఇది న్యాయమైన డిమాండ్‌ అని సమాజాన్ని ఒప్పించాలి. అలాగే దీనికి రాజ్యాంగపరంగా న్యాయపరమైన అవరోధాలు ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ఇవి సాధించుకోవడానికి ఉద్యమాలు, వ్యూహాలు రూపొందించుకోవాలి. పార్లమెంటులో పాలక, ప్రతి పక్షాలు ఈ అంశం మీద విస్తృతంగా చర్చించాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టడానికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. రాజ్యాంగంలోని 15 (4), 16(4) ప్రకారం ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్న భావన నిబిడీకృతమై ఉంది. ఒకవేళ రాజ్యాంగ సవరణ అవసరమైనా దీనికి అభ్యంతరం చెప్పే రాజకీయ పార్టీలు ఉన్నాయా? సామాజిక న్యాయ సిద్ధాంతానికి విరుద్ధంగా అగ్రకులాల్లోని పేదలకు రెండు రోజుల్లో పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేసి 10 శాతం రిజర్వేషన్లు పెట్టిన కేంద్రం, 90 శాతం జనాభా గల పేద కులాలకు రిజర్వేషన్లు పెడితే అభ్యంతరాలు చెప్పే వారు ఉంటారా? పాలక పక్షం తలుచుకుంటే ఈ రిజర్వేషన్లు అమలు చేయడం ఒక లెక్కలోది కాదు. ఒక్కరోజు పని మాత్రమే. 

ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఏ కేటగిరీ ఉద్యోగాల్లో ఎవరు న్నారు? మేనేజింగ్‌ డైరెక్టర్, ఎగ్జి్జక్యూటివ్‌ డైరెక్టర్‌ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? జనరల్‌ మేనేజర్లు, ఇంజినీర్లు, ఆఫీసర్లు, సూపర్‌వైజరు వగైరా ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? అటెండర్లు, స్వీపర్ల ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? ఇందులో పైస్థాయి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు నామమాత్రంగా కూడా లేరనేది నగ్నసత్యం. వివిధ స్థాయిల్లో అధికార, అనధికార సంస్థలు జరిపిన సర్వేల్లో ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల్లో ఈ వర్గాల వారు ఐదు శాతం కూడా లేరని తేలింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలావుంటే సామాజిక న్యాయం ఇంకెప్పుడు సాధ్యమవుతుంది?

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల డిమాండ్‌ రెండు కోణాల్లో సమర్థ నీయం. ఈ కంపెనీలకు ప్రభుత్వమే రాయితీల మీద భూమి, ముడి సరుకు, ఇతర మౌలిక సదుపాయాలు సమకూరుస్తుంది. అలాగే ఇందులో చెమటోడ్చే కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. అలాంటప్పుడు అధికారం చలాయించే చోట ఈ వర్గాలు ఉండరాదా? ఈ పరిశ్రమల ఉత్పత్తుల్ని సంపన్న వర్గాలే కొనవు. 90 శాతం గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే సింహభాగం కొంటారు. కొనుగోలులో అన్ని కులాల భాగస్వామ్యం ఉన్నప్పుడు పాలనలోనూ వాటా కల్పించడానికి అభ్యంతరం ఏమిటి? ఇంకొక విషయాన్ని గమనించాలి. ఒకనాడు బీసీ కులాల వారు చేసిన కులవృత్తులు, చేతి వృత్తులు నేడు పారిశ్రామికీకరణ చెందాయి. పద్మశాలీలు, దేవాం గులు నేసిన చేనేత వృత్తి బట్టల మిల్లులుగా మారిపోయింది. కమ్మరి, కంచరి పని ఉక్కు, ఇనుము కంపెనీలుగా మారిపోయింది. మేదరి, ఎరుకల వారి గంపలు, బుట్టలు, చాటలను, కుమ్మరివాళ్ల కుండలను ప్లాస్టిక్, స్టీలు పరిశ్రమలు తన్నుకుపోయాయి. ఒకప్పుడు వృత్తులకు యజమా నులైన ఈ కులాలవారు కనీసం ఇందులో ఉద్యోగులు కాకపోతే సామాజిక న్యాయం ఎలా సాధ్యం? మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద పునాదులతో పెట్టుబడిదారీ విధానం అవలం బించే దేశం. అలాంటప్పుడు ప్రభుత్వాలు వ్యాపారం చేసే బాధ్యత తీసుకోవని ప్రధాని ప్రకటించడాన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి?

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో వేగ వంతమైన అభివృద్ధికి ప్రైవేటీకరణే కారణమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. ప్రైవేటీకరణ వల్ల యాజమాన్య పర్యవేక్షణ కట్టుదిట్టంగా అమలవుతుంది. పని సంస్కృతి మారుతుంది. జవాబుదారీతనం పెరుగుతుంది. వృథా తగ్గుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. అందులో సందేహం లేదు. చైనా లాంటి కమ్యూనిస్టు దేశాలు, జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, అమెరికా లాంటి దేశాలు శీఘ్రగతిన అభివృద్ధి చెందడానికి ప్రైవేటీకరణే ప్రధాన కారణం. కానీ మనదేశంలో ఇప్పటికే 95 శాతం పారిశ్రామిక రంగం ప్రైవేట్‌ రంగంలోనే ఉంది. ఇంకా ముందుకు పోవడం వాంఛనీయం కాదు. కొత్త పరిశ్రమలను ప్రైవేటు రంగంలో చేరిస్తే అభ్యంతరం లేదు. కానీ పాతవాటిని, కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించేవాటిని, ప్రజా సేవలో భాగమైన రైల్వేలను, ప్రభుత్వానికి అవసరమైన అప్పులు ఇచ్చే ఎల్‌ఐసీ లాంటి వాటిని కూడా ప్రైవేటీకరించడాన్ని  సమాజం అంగీకరించదు. 

రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. రిటైర్‌ అవుతున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయడం లేదు. కొత్త ఉద్యో గాలు సృష్టించడం లేదు. పైగా శాశ్వత ఉద్యోగాలను తగ్గిస్తూ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, గెస్ట్‌ లెక్చరర్లు, గెస్టు టీచర్లు  విద్యా వాలంటీర్లు, ఎన్‌ఎంఆర్‌లు అంటూ రకరకాల పేర్లతో రిజర్వేషన్లు లేకుండా చేశారు. ప్రైవేటీకరణ రహస్య ఎజెండా వెనకనే ఈ వర్గాలకు ఉద్యోగాలు దక్కకుండా చేయాలనే కుట్ర ఉంది. అలాంటప్పుడు అంత సులభంగా రిజర్వేషన్లు పెడుతారా! అందుకే ఈ కులాలు పెద్ద పోరాటం చేయక తప్పదు. వీరి అభివృద్ధి ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద, సమాజంలోని ఆధిపత్య కులాల సానుభూతి మీద ఆధార పడిలేదు. ఇది భిక్షంగా కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుగా గుర్తించాలి. 

ఆర్‌. కృష్ణయ్య 
వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం
మొబైల్‌ : 90000 09164

మరిన్ని వార్తలు