భిక్ష కాదు... వాటా కావాలి!

14 Jan, 2022 00:31 IST|Sakshi

స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు దాటినా, 56 శాతం జనాభా గలిగిన బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం స్పష్టంగా కన్పిస్తోంది. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం 28 ఏళ్ల క్రితం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికి బీసీలకు 15 శాతం కూడా వాటా లేదు. చట్టసభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అనేక రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా తీర్మానం చేశాయి. ప్రజాస్వామ్యం సుస్థిరంగా కొనసాగాలంటే అన్ని సామాజిక వర్గాలకూ, వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ సామాజిక రంగాలలో వారి వాటా వారికివ్వాలి. బీసీలకు కావలసింది భిక్ష కాదు... రాజ్యాంగబద్ధంగా వాటా!

త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా గణనలో కుల గణన కూడా  చేయా లనీ, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. జనాభా గణన పట్టికలో 34 కాలమ్స్‌ ఉన్నాయి. కుల గణన చేస్తే అదనంగా ఇంకొక కాలమ్‌ మాత్రమే చేరుతుంది. దీనికి రూపాయి కూడా ఖర్చు కాదు. ఒక్క కాలమ్‌ పెట్టడానికి అంగీకరించని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 70 కోట్ల మంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తుంది? జనాభా గణనలో కుల గణనను భాగం చేస్తే బీసీలకు విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలలో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని కేంద్ర పాలకులు భావిస్తున్నట్లుంది.

అలాగే కొత్తగా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలనే డిమాండ్‌ ముందుకు వస్తుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కులాలవారీ జనగణనకు వెనకాడుతోం దని రాజకీయ పరిశీలకుల భావన. ఇది నిజమే కావచ్చు. కానీ అంత మాత్రాన బీసీ కులాలకు ఇవ్వవలసిన ప్రజాస్వామ్య వాటా ఇవ్వ కుండా ఎన్ని రోజులు దాటవేస్తారు? స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు దాటినా, 56 శాతం జనాభా గలిగిన బీసీలకు రిజర్వేషన్ల కేటాయిం పులో అన్యాయం స్పష్టంగా కన్పిస్తోంది. 

కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మేరకు, ఈ దేశంలోని 2,648 బీసీ కులాలలో దాదాపు 1,800 కులాలు చాలా పేదరికంలో, దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నాయి. ఈ కులాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్యం ఇప్పటివరకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదు. రాజ్యాంగం లోని 340 ఆర్టికల్‌ ప్రకారం 1953లో కాకా కలేల్కర్‌ కమిషన్‌ను నియమించారు. కానీ దాని సిఫార్సులను అమలు చేయకుండా తొక్కి పెట్టారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్‌ 1978లో మండల్‌ కమిషన్‌ను నియమించి; ఈ కులాల విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులఫై అధ్యయనం చేశారు. బీసీ కులాల అభివృద్ధికి మండల్‌ కమిషన్‌ 40 సిఫార్సులు చేస్తే కేవలం మూడు సిఫార్సులు మాత్రమే అమలు చేశారు. మిగతా 37 సిఫార్సులు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. బీసీ కులాలను అభివృద్ధి చేయకపోతే ఈ దేశం అగ్రదేశంగా ఎలా రూపుదిద్దుకుంటుంది? బీజేపీ కలలుగనే అఖండ భారత్‌లో బీసీలు భాగం కారా?

రాజ్యాధికారంలో బీసీలకు వాటా ఇవ్వడం లేదు. ఇంతవరకు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. బడ్జెటు కేటా యింపులు లేవు. కనీసం ఐఐటీ, ఐఐఎం తదితర కోర్సులు చదివే వారికి స్కాలర్‌షిప్‌లు, ఫీజుల రియంబర్స్‌మెంటు స్కీమూ లేవు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలలో జనాభా ప్రకారం ప్రజాస్వామిక వాటా దక్కడం లేదు. దీనికోసం రాజకీయ పార్టీలు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలసిన సమయం ఆసన్నమైనది.

బీసీలకు చట్టసభలలో జనాభా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇందుకోసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి.  చట్ట సభ లలో, అసెంబ్లీ – పార్లమెంటు ఎన్నికలలో బీసీలకు 33 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని అనేక రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేశారు. ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలో 1996లో, 2008లో, 2010లో బీసీ రిజర్వేషన్లపై తీర్మానాలు చేశారు. 2014 తర్వాత ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలూ వీటిపై తీర్మానం చేశాయి. చట్ట సభలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టారు. కానీ బీసీలకు కల్పించ లేదు.

దేశంలో 2,642 బీసీ కులాలు ఉంటే 2,560 బీసీ కులాలు ఇంతవరకు పార్లమెంటులో ప్రవేశించలేదు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో 14 శాతం కూడా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి బీసీ కులాలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెడితే తప్ప వారికి ప్రజాస్వామిక వాటా లభించదని తేలుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని 2010లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం అనేక రాష్ట్రాలలో బీసీ రిజర్వే షన్లను 34 శాతం నుండి 22 శాతానికి తగ్గించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాజ్యాంగ సవరణ మాత్రమే. జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. రాజ్యాంగాన్ని సవరించి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం, బీసీ రిజర్వేషన్లకు ఒక్కసారైనా రాజ్యాంగాన్ని సవరించిందా? 

పాలనారంగంలో బీసీల ప్రాతినిధ్యం ఇప్పటికీ 15 శాతం దాటడం లేదు. కేంద్రస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని కేటగిరీలతో కలిసి బీసీల శాతం 15 మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపు తున్నాయి. కేంద్రంలోని 54 లక్షల ఉద్యోగాలలో బీసీలు కేవలం 7 లక్షల 62 వేలు మాత్రమే ఉన్నట్లు తేలింది. మండల్‌ కమిషన్‌ సిఫా ర్సుల ప్రకారం 28 సంవత్సరాల క్రితం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికి బీసీలకు 15 శాతం కూడా వాటా లేదు. కాబట్టి ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీల ప్రాతినిధ్యం పెరగదనేది ఇన్నేళ్ల అనుభవం ద్వారా కనిపిస్తున్న నిజం.

అలాగే కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయవల సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని 16(4)ఎ ఆర్టికల్‌ ప్రకారం జనాభా ప్రకారం ప్రాతినిధ్యం లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు. జనాభా నిష్పత్తిలో ప్రాతినిధ్యం లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని పలు సందర్భాల్లో కోర్టులూ తీర్పులు చెప్పాయి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీలకు న్యాయం జరగదు. కేంద్రస్థాయిలో బీసీల సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. బీసీ రిజర్వేషన్ల అంశంపై అనేక చట్టపరమైన, న్యాయపరమైన వివాదాలు వస్తున్నాయి. అనేక స్కీములను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉంది.

కేంద్ర బడ్జెట్‌ 34 లక్షల కోట్లు కాగా, 70 కోట్ల మంది బీసీల అభివృద్ధికి వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ఈ దేశంలో బీసీలను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ బడ్జెట్‌తో బీసీలకు బిస్కెట్లు కూడా సరిపోవు. ఇక బీసీల అర్థికాభివృద్ధి ఎలా జరుగుతుంది? కేంద్ర స్థాయిలో బీసీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు, ఫీజుల మంజూరు, పోటీ పరీక్షలకు కోచింగ్‌ లాంటి అనేక ఇతర స్కీములు పెట్టవలసిన అవసరం ఉంది. బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించి బడ్జెటులో కేటాయింపులు చేయవలసిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములకు 80 శాతం మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వవలసిన అవసరం ఉంది. స్కాలర్‌షిప్‌ మంజూరు, పూర్తి ఫీజుల మంజూరు, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠ శాలల ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కేంద్రీయ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఈ రిజర్వేషన్ల కింద సీట్లు పొందినవారు ఫీజులు కట్టే ఆర్థిక స్థోమత లేని వారు. కాగా ఐఐటీ, ఐఐఎం లాంటి కోర్సుల ఫీజులు సంవత్సరానికి రూ. 90 వేల నుండి 1,70,000 వరకు ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తం ఫీజులను పేద కులాలైన బీసీలు కట్టే పరిస్థితి లేదు. ఇందుకు ఏటా లక్ష కోట్ల రూపా యలను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించాల్సిన ఆవశ్యకత ఉంది. 

కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శి స్తోంది. ప్రజాస్వామ్యం సుస్థిరంగా, శాంతియుతంగా కొనసాగా లంటే అన్ని సామాజిక వర్గాలకు, వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ సామాజిక రంగాలలో వారి వాటా వారికివ్వాలి. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన డిమాండ్‌. పీడిత ప్రజానీకం ఎదురు తిరుగుతున్న ప్రపంచ చరిత్రను చూస్తున్నాం. సమన్యాయం పాటించకపోతే ఇక్కడా అదే జరుగుతుంది! 

ఆర్‌. కృష్ణయ్య 
వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం
మొబైల్‌: 90000 09164

మరిన్ని వార్తలు