సామాజిక న్యాయంలో ఓ విప్లవం!

15 Apr, 2022 01:24 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో పునర్‌ వ్యవస్థీకరించిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు కల్పించడం చరిత్రాత్మకం. ఇది అత్యంత ధైర్యసాహసాలతో కూడిన చర్య. ఇది దేశ చరిత్రలో తొలి రికార్డు. 74 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ వర్గాలకు 50 శాతం మించి ఇవ్వలేదు. బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ముఖ్యమంత్రులు అయిన రాష్ట్రాలలో కూడా 50 శాతం మంత్రి పదవులు ఇచ్చే ధైర్యం చేయలేదు. కానీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ వీరోచితంగా ఈ వర్గాలకు జనాభా ప్రాతిపదికన మంత్రివర్గంలో స్థానం కల్పించి, సామాజిక న్యాయానికి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు.

ఆంధ్రప్రదేశ్‌లో పునర్‌ వ్యవస్థీకరించిన 25 మంది మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మందికి అవకాశం కల్పించారు. ఇందులో బీసీలు 10 మంది, ఎస్సీలు ఐదుగురు, ఎస్టీ, మైనారిటీల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ ఘట్టంతో బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్‌ ఆప్తుడయ్యారు. దీని వలన బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఆయన పట్ల తిరుగులేని అభిమానం, మద్దతు పెరిగింది. ఇతర రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్ప చిత్తశుద్ధితో ఈ వర్గాల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి పాటుపడలేదని బీసీలు గుర్తించారు. అందుకే మెజారిటీ ప్రజలైన బహుజనులలో రోజు రోజుకూ జగన్‌పై క్రేజ్‌ పెరుగుతోంది. గత ఎన్నికలలో 50 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించిన వైఎస్సార్‌సీపీ ఈ దఫా 60 శాతం ఓట్లతో 170 సీట్లకు పైగా గెలుస్తుంది అనడంలో అనుమానం లేదు.

మంత్రివర్గంలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాశారు. వైఎస్సార్‌సీపీ రెండు సంవత్సరాల క్రితం రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టింది. దీనికి మద్దతుగా 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. విశేషం ఏమిటంటే, గత 74 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంటులో ఈ బిల్లు పెట్టలేదు. చివరకు పార్లమెంటులో బీసీ పార్టీలుగా చలామణీ అవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ, బీఎస్పీ, అప్నాదళ్, జనతాదళ్‌ లాంటి పార్టీలు కూడా ఈ బిల్లు పెట్టలేదు. 

ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ నామినేటెడ్‌ పోస్టులలో 50 శాతం స్థానాలను వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో 137 చైర్మన్‌ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్‌ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్‌ చైర్మన్, డైరెక్టర్‌ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి  58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. అంతేగాక 56 బీసీ కులాల కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్‌లలో పోస్టులు మొత్తం 100 శాతం బీసీలకు కేటాయిం చారు.193 కార్పొరేషన్లలో బీసీలకు 109 చైర్మన్‌ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగింది. దీని మూలంగా బీసీ కులాల నాయకత్వం పెరిగింది. ఆ కులాలలో తరతరాలుగా పేరుకుపోయిన భావదాస్యం, బానిస ఆలోచనా విధానం పోయి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.

అలాగే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెబితే, దానికి పార్టీ పరంగా అదనంగా మరో 20 శాతం చేర్చి మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు ఇచ్చారు జగన్‌. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ గెలవగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్‌ ఎన్నికల్లో 648 మండలాలకుగానూ వైసీపీ 635 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను గెలిస్తే అందులో ఈ వర్గాలకు 442  స్థానాలు (67 శాతం) కేటాయించారు. 13 మున్సిపల్‌ కార్పొరేషన్లలో వైసీపీ గెలిస్తే, ఏడు చోట్ల మేయర్‌ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్‌ పదవుల్లో 12 పదవులను అంటే 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలు అధికార పార్టీకి దక్కితే వాటి చైర్‌పర్సన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 73 శాతం ఇచ్చారు. 

ఇది ఇలా ఉండగా, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేద కులాలు పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య, వృత్తి విద్యల వరకు ఉచితంగా చదువుకోవాలనే మహత్తర ఆశయంతో అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థికీ 15 వేలు, కాలేజీ కోర్సులు చదివే వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, అలాగే జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రతి కాలేజీ విద్యార్థికి సంవత్సరానికి 20 వేల స్కాలర్‌షిప్‌ ఇస్తున్నారు. ఈ పథకాల వలన కూలీ నాలీ చేసుకొనేవారు ఉన్నత విద్య చదివే అవకాశం లభించింది. దీని వల్ల సమాజంలో సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది. 

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేటాయించని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీల అభివృద్ధికి 30 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించి ఆశ్చర్యపరిచారు. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలకు రూ.1,460 కోట్లు కేటాయిస్తే లోటు బడ్జెట్‌తో విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బీసీల సంక్షేమానికి రూ.30వేల కోట్లు కేటాయించడం చూసి దేశంలోని బీసీలందరూ ఆశ్చర్యపోయారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా బీసీలకు రూ.6 వేల కోట్లకు మించి కేటాయించలేదు. అలాగే బీసీ కులాలు అభివృద్ధి చెందడానికి ‘బీసీ సబ్‌ ప్లాన్‌’ ఏర్పాటుచేసి, అన్ని కులాల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చారు. బలహీన వర్గాలను పరిశ్రమల అధిపతులుగా చేయాలని, పెద్ద కాంట్రాక్టర్లుగా చేయాలనే చిత్తశుద్ధితో పారిశ్రామిక పాలసీ రూపొందించారు.

రాష్ట్రంలో 196 మార్కెటింగ్‌ కమిటీ(ఏఎంసీ) చైర్మన్‌ పదవుల్లో 76 బీసీలకు ఇచ్చారు. 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. శాసన మండలిలో వైఎస్సార్‌సీపీకి 32 మంది సభ్యులు ఉంటే, అందులో 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే! వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో నాలుగు స్థానాలు దక్కితే, అందులో రెండింటిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు.

మన దేశంలో మంత్రి పదవి, చైర్మన్‌ పదవి, ఇతర రాజకీయ పదవులు అంటే ఒక హోదా, ఒక సామాజిక గౌరవం అని ప్రజలు నమ్ముతారు. ఈ హోదాను, పదవిని, అధికారాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందించడానికే రిజర్వేషన్లు లేదా కోటా ఇవ్వాలి. తద్వారా దేశ పరిపాలనలో తాము కూడా భాగం అవుతున్నామన్న అభిప్రాయం ఈ వర్గాల్లో కలుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేనో, మంత్రో, చైర్మనో అయితే ఆ జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఆ కులస్థులు ‘మావాడు మంత్రి అయ్యాడు, చైర్మన్‌ అయ్యా’డనే భావంతో ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు. ఈ భావన జాతి ఐక్యతకు, దేశ సమగ్రతకు ఉపయోగపడుతుంది. 

బలమైన సామాజిక, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కావాలంటే పటిష్ఠమైన, సమగ్రమైన రాజకీయ వ్యవస్థ ఉండాలి. భారతదేశంలో పటిష్ఠ మైన వ్యవస్థ నిర్మాణాన్ని కుల వివక్ష దెబ్బ కొడుతోంది. జాతి పరస్పరం సంఘర్షించుకొని వేలాది కులాలుగా చీలిపోయింది. ఇది జాతి ఐక్యత, సామాజిక సామరస్యం, మానవ వికాసానికి అవరోధంగా తయారైంది. సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో ఈ కుల వివక్ష తొలగాలంటే అన్ని రంగాలలో ముఖ్యంగా విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగం, పాలన రంగంలో ఈ కులాలకు ప్రాతినిధ్యం కల్పించడం చారిత్రక అవసరం. దేశంలో 56 శాతం జనాభా గల బీసీ కులాలను అభివృద్ధి చేయకుండా భారత్‌ అగ్రదేశంగా రూపొందదు. ఈ చారిత్రక అన్యాయాన్ని గుర్తించి వై.ఎస్‌.జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇస్తున్న ప్రాధాన్యం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.    
    
- ఆర్‌. కృష్ణయ్య 
ధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం. 
మొబైల్‌: 90000 09164 

మరిన్ని వార్తలు