నెహ్రూ ఆత్మకథకు పొంగిపోయిన రవీంద్రుడు

13 Nov, 2022 00:40 IST|Sakshi

సందర్భం

జవహర్‌లాల్‌ నెహ్రూ స్వాతంత్య్రో ద్యమంలో పాల్గొని జైలు జీవితం గడుపుతున్న దశలో 1934–35 మధ్య కాలంలో తన ఆత్మకథ (టువార్డ్‌ ఫ్రీడమ్‌) రాసుకున్నారు. బానిస సంకెళ్లు తెంచుకుని, దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న దశలో తన అనుభవాల్ని నమోదు చేసుకున్నారు. నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య కమలా నెహ్రూ అనారోగ్యంతో మంచానపడి ఉన్నారు. కూతురు ఇందిర చిన్నపిల్ల. ఆమె ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేకపోవడం వల్ల, తరచూ రవీంద్రుడి శాంతినికేతన్‌కు పంపు తుండేవారు. అందరినీ, అన్నింటినీ ప్రేమగా చూసే లక్షణం ఆ బాలికలో ఉందని గ్రహించి రవీంద్రనాథ్‌ టాగూర్‌ ఆమెను ‘ప్రియదర్శిని’ అన్నారు. అప్పటి నుండి ఆమె ఇందిరా ప్రియ దర్శిని అయ్యింది.

పండిట్‌ నెహ్రూకు సాహిత్యం, కళల పట్ల ఉన్న అవ్యా జమైన ప్రేమ జగద్విదితం. ఆయన ఆత్మకథను చదివి ‘విశ్వ కవి’ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉత్తరం రాశారు. 1936 మే 31న శాంతినికేతన్‌ నుండి రవీంద్రుడు రాసిన ఉత్తరం ఇలా ఉంది: ‘‘ప్రియమైన జవహర్‌లాల్‌!

మీ పుస్తకం చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నిజంగా అది చాలా గొప్ప పుస్తకం. చదువుతూ ఎంతో చలించిపోయాను. మీరు సాధించిన విజయాలు తెలుసుకుని గర్వపడుతున్నాను. అన్నింటినీ మించి అట్టడుగున ప్రవహించే లోతైన మీ మానవత్వపు దృక్కోణం, సంక్లిష్టమైన చిక్కుముడులనన్నింటినీ విప్పుతూ ఉంది. వాస్తవాల్ని నిబ్బరంగా బహిర్గతం చేస్తూ ఉంది. ఇంతవరకూ సాధించిన విజయాలకు మించిన మహో న్నతమైన వ్యక్తిత్వం మీది – అనే విషయం తెలిసిపోతూ ఉంది. సమకాలీన స్థితిగతుల నుంచి నిజాయతీ అయిన ఒక నిఖార్స యిన మీ వ్యక్తిత్వం గోచరిస్తూ ఉంది.’’ 

సాహిత్యకారుడు అయిన నెహ్రూకు, అమృతా షేర్‌గిల్, సరోజినీ నాయుడు, ఫ్రెంచ్‌ సాహిత్యకారుడు రోమా రోలా వంటి దిగ్గజాల నుండి ఉత్తరాలు వస్తుండేవి. ఆ రోజుల్లో లేఖలు రాయడం కూడా ఒక కళగా పరిగణింపబడుతూ ఉండేది. జైలు నుండి నెహ్రూజీ తన కూతురికి రాసిన ఉత్తరాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ఆ ఉత్తరాల్లో సాహిత్య, సామాజిక, చారి త్రక, స్వాతంత్య్రోద్యమ అంశాలు; దేశ, కాల పరిస్థితుల గురించి చర్చించారు. తరువాత కాలంలో ఆ లేఖలన్నీ పుస్తక రూపంలో వెలువడ్డాయి. పిల్లల పట్ల ఆయనకు గల ప్రత్యే కమైన శ్రద్ధ, ప్రేమల వల్ల ఎన్నో సంస్థలకు, ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. చాచా నెహ్రూగా శాశ్వతత్వం పొందారు. అందుకే ఆయన పుట్టినరోజు 14 నవంబర్‌ను పిల్లల దినంగా జరుపుకొంటున్నాం.

జాతీయ సంస్థల్ని ప్రారంభించి నిలబెట్టింది నెహ్రూజీ అయితే, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసింది మోదీజీ. తొలి ప్రధాని నుండి ఇటీవలి కాలం వరకు ఏ ప్రధానీ చేయని ‘ఘన’మైన పనులు ఇప్పటి ప్రధాని చేశారు. పటేల్‌ విగ్రహం నెలకొల్పారు. దాన్ని ఐక్యతా విగ్రహం అన్నారు. బావుంది. ప్రారంభోత్సవ సభలో నేటి హోంమంత్రి కనబడలేదు. విగ్రహం తొలి హోంమంత్రిది కదా? పైగా వేల సంఖ్యలో మత గురువుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అసలది మతానికేం సంబంధం? ఏమీ మాట్లాడలేక వారసత్వ పాలనకు నెహ్రూయే కారణమని నిందిస్తారు. ఆయన మరణానంతరం జరిగిన సంఘటనలకు నెహ్రూ ఎలా బాధ్యులవుతారు? 

ఆ రోజుల్లో ఆసేతు హిమాచలం స్వాతంత్య్ర సమర యోధులు లక్షలమంది ఉండి ఉంటారు. వారందరిలోకి నాయ కత్వ లక్షణాలు, చురుకుదనం, విశాల భావాలు, అభ్యుదయ ధోరణి, విదేశాంగ విధానాల మీద పట్టు, చదువు, సంస్కారం అన్నీ పుణికిపుచ్చుకుని ఉన్నారు గనుక నెహ్రూ తొలి ప్రధాని కాగలిగారు. సుదీర్ఘ కాలం ఆ పదవిలో మనగలిగారు. మనిషిలో ఎంతో సంయమనం ఉంటేగానీ అలా నిలబడలేరు. ధనం, స్థాయి, స్థోమత ఏమీ లేనివాడు త్యాగం చేయడానికి ఏముం టుంది? కానీ, నెహ్రూజీకి ఇవన్నీ ఉండి కూడా అన్నింటినీ త్యజించి, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం గొప్ప. పైగా కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడై ఉండి, నిరీశ్వరవాది కావడం అంతకన్నా గొప్ప!

డాక్టర్‌ దేవరాజు మహారాజు 
వ్యాసకర్త రచయిత, సామాజికాంశాల వ్యాఖ్యాత

మరిన్ని వార్తలు