సందేహం లేదు... ముమ్మాటికీ ఇది కుట్రే!

25 May, 2021 12:41 IST|Sakshi

ప్రపంచ దేశాలు, దేశంలోని అన్ని రాష్ట్రాలు కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ఏడాదికి పైబడి అలుపెరగకుండా పోరాడు తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం గత 15 నెలలుగా కరోనా వైరస్‌తోను, రెండేళ్లుగా కరోనా భూతాన్ని మించిన శక్తులతో, వ్యక్తులతో ఒకలాంటి యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ఇందులో కొన్ని ప్రత్యక్షంగానే దాడికి పూనుకోగా, మరికొన్ని స్లీపర్‌సెల్స్‌ తరహాలో ముసుగులు ధరించి ఆపరేట్‌ చేస్తున్నాయి. ఈ శక్తులన్నింటి వెనుక ఉండి మార్గదర్శనం చేసేది మరెవరోకాదు, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడే. ఆయన కుటిల వ్యూహాలను అమలుపరుస్తున్న వారిలో ఇతర పార్టీలలో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు, ఓ వర్గం మీడియా, కొందరు పారిశ్రామిక వేత్తలు, పలువురు ఎన్నారైలు, విశ్లేషకుల ముసుగులో టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న మేధావులు కనిపిస్తారు. వీరందరి ఉమ్మడి లక్ష్యం ఒక్కటే. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని అప్రజాస్వామిక విధానాలలో కూలదోయడం, వీలైనంత త్వరగా చంద్రబాబునాయుణ్ణి గద్దెనెక్కించడం. ఈ క్రమంలోనే చంద్రబాబు విసిరిన పాచికలలో ‘రఘురామ కృష్ణంరాజు’ ఒకరు. 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికలపై వాటిని ప్రస్తావించవచ్చు. అయితే, పార్టీ అంతిమంగా తీసుకునే నిర్ణయాలకు పార్టీలోని ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. వ్యతిరేకంగా మాట్లాడటం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లే అవుతుంది. అధికార పార్టీలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారు ప్రభుత్వ విధానాలను విభేదించాల్సి వస్తే వారు పార్టీని వీడి బయటకు పోవడం మినహా రెండో మార్గం లేదు.  కానీ, రఘురామ కృష్ణంరాజు ఏం చేశారు? అధికారపార్టీలో ప్రజాప్రతినిధిగా కొనసాగుతూనే ప్రభుత్వ నిర్ణయాలను అనుచితంగా విమర్శించడం, చివరకు సీఎంని వ్యక్తిగతంగా దూషించడం వరకు వెళ్లారు. కులాలు, మతాలకు అతీతంగా పరిపాలన అందిస్తున్న జగన్‌కి కులాన్ని, మతాన్ని అంటగట్టి దుర్భాషలాడటం ఆయనకు రివాజుగా మారింది. ప్రధాన స్రవంతి ఛానెళ్లు ఏవీ ఇప్పటివరకూ ఏ నాయకుడి బూతుల్ని, తిట్లను ప్రసారం చేయలేదు. కానీ రెండు ఛానెళ్లు రఘురామకృష్ణంరాజు అన్‌ పార్లమెంటరీ భాషను, చేష్టలను యధాతథంగా ప్రసారం చేయడం, అదే అంశాలపై డిబేట్లు నిర్వహించడం ఓ నిరంతర కార్యక్రమంగా మారిపోయింది.

పత్రికా స్వేచ్ఛ, విలువల గురించి పేజీల కొద్దీ వ్యాసాలు రాసేవారు ఆయన ఏ విమర్శలు చేసినా అందుకు సంబంధించిన వివరణ తీసుకోకుండానే ప్రచురించడం ప్రజలందరూ గమనిస్తూవచ్చారు.  ఓ లోక్‌సభ సభ్యుడికి సాధారణంగానైతే అంత ‘స్పేస్‌’ ఇవ్వరు. కానీ, ఆయన చేసే విమర్శలు వైఎస్సాఆర్‌సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసేవి కనుక అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. నిజానికి, ఈ వ్యవహారమంతా కుట్రపూరితంగా, లోపాయికారి ఒప్పందాల ప్రకారమే సాగిందన్నది బహిరంగ రహస్యమే. రోజు వారీ తిట్ల పురాణాన్ని యధాతథంగా ప్రసారం చేయడం ద్వారా మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాకు, సోషల్‌ మీడియాకు తేడా లేకుండా చేసి మీడియా ప్రమాణాల్ని దిగజార్చేంత వరకు వెళ్లడంలో తమ ఇంట్రెస్ట్‌ ఏమిటో ఈ మీడియా యాజమాన్యాలు ప్రజలకు వివరించగలవా? కులాలు, మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తుంటే ఈ మీడియా సంస్థలు అందుకు ప్రాచుర్యం కల్పించడం వెనుక ఉన్నది కుట్రకోణంకాక మరేమిటి? ప్రత్యేకించి ఓ కులాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదంటూ నిరాధార ఆరోపణలు చేసి ఆ కులంపై మిగతా కులాలను ఎగదోసేందుకు ప్రయత్నించడం కుట్రకాక మరేమిటి? ఓ మతాన్ని, ఆ మతస్థుల ఆచార వ్యవహారాలను, కించపరిచేటట్లు  వెక్కిరించడం ఎంత అనాగరికం, అమానవీయం? అతని దిగజారుడు ప్రవర్తనను యధాతథంగా మీడియా ఛానెళ్లు ప్రసారం చేయడం అభ్యంతరకరం, చట్టవ్యతిరేకం. 

సమాజంలో కులాల మధ్య చిచ్చురేపడానికి ప్రమాద కరమైన రాజకీయ క్రీడకు తెర లేపారు. దీనిని రాజద్రోహం గానే పరిగణించాలి. ‘కావాలని ఎవరు పుడతారు ఎస్సీల్లో’ అంటూ వ్యాఖ్యానించడమేకాక బీసీలు న్యాయమూర్తుల పదవులకు పనికిరారు అంటూ రాతపూర్వకంగా తెలియ జేసిన వ్యక్తి నేడు రాష్ట్రంలో కులాల కుంపట్లను రాజేస్తు న్నారు. కులాల కళ్లద్దాల నుంచే ప్రతి అంశాన్ని దర్శించే వ్యక్తి నేడు సీఎంకి కులం రంగు పులమడానికి, మతం ముసుగు తొడగడానికి తన మీడియా ద్వారా, రఘురామకృష్ణంరాజు వంటి వ్యక్తుల ద్వారా కుట్ర పన్నడం సుస్పష్టం.

మీడియాకు స్వేచ్ఛ ఉంది. సద్విమర్శ చేసే హక్కు ఉంది. కానీ, ప్రజా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రపన్నే వెసులుబాటు భారత రాజ్యాంగం మీడియాకు కల్పించ లేదు. ప్రభుత్వాల తప్పొప్పులను ఎత్తి చూపడం మీడియా బాధ్యతే. కానీ, ఆ బాధ్యతను చంద్రబాబు అధికారంలో ఉండగా ఈ మీడియా ఎందుకు చేయలేదు? పార్టీ ఫిరాయిం పులకు పాల్పడి 29 మంది నాటి ప్రతిపక్ష వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుల్ని తమలో కలిపేసుకొని, అందులో నలుగుర్ని మంత్రులుగా చేసినప్పుడు ఇదే మీడియా ఓ చిన్న విమర్శ కూడా చేయలేకపోయింది. పాలనలో దారితప్పిన చంద్రబాబును,  మెజారిటీ మీడియా ఏ సందర్భంలోనూ విమర్శించకపోవడం వల్లనే ఆ ఐదేళ్లూ ప్రజాస్వామిక వ్యవస్థలు, విలువలు కొడిగట్టాయి. ‘యువర్‌ ఫ్రీడమ్‌ ఎండ్స్‌ వేర్‌ మై నోస్‌ బిగిన్స్‌’ అన్నది మీడియా రంగానికి కూడా వర్తిస్తుంది. జగన్‌పై గత 9 ఏళ్లుగా అనేక కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కరోనాను మించిన ఈ ఉపద్రవం నుండి ఆయన్ని కాపాడి అధికారం అప్పజెప్పింది ప్రజలే. ఇప్పుడు  రక్షణ కవచంగా నిలిచేది కూడా ప్రజలే.


– సి. రామచంద్రయ్య 
శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ 

మరిన్ని వార్తలు