విశ్వసనీయతే అధికారానికి సోపానం

27 Jan, 2023 12:33 IST|Sakshi

అభిప్రాయం

విశ్వసనీయత గల నాయకులకు అధికారం దగ్గరగా ఉంటుంది. అనేక మంది నాయకులు అనేక దశాబ్దాలుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిపాలన సాగించారు. విశ్వసనీయత కోల్పోయినప్పుడు ప్రజలు వారిని గద్దెదించారు. ఉదాహరణకు ఏ సామాజిక మాధ్యమాలూ లేనటువంటి కాలంలోనే ఇందిరాగాంధీ తప్పు చేస్తే ప్రజలు ఓడించి, అధికారానికి దూరం చేశారు. అందుకే విశ్వసనీయత రాజకీయాల్లో చాలా అవసరం.

విశ్వసనీయతతో జ్యోతిబసు మూడు దశాబ్దాలు పరిపాలించారు. లాలూ 15 సంవత్సరాలు, ఒకప్పుడు బిజూ పట్నాయక్, ఇప్పుడు నవీన్‌ పట్నాయక్, కరుణానిధి, జయలలిత, వైఎస్, మమతా బెనర్జీ, ఎన్టీఆర్‌... ఇలా అనేక మందిని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కొత్తగా కేజ్రీవాల్‌ ఢిల్లీ లోనూ విశ్వసనీయతతో గెలుస్తూ వస్తున్నారు.

నా విశ్లేషణ ప్రకారం భారతదేశ రాజకీయాల్లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి తర్వాత అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుల్లో నరేంద్ర మోదీ మొదటి వరుసలో ఉంటారంటే అతిశయోక్తి లేదు. గుజరాత్‌లో మూడు సార్లు హ్యాట్రిక్‌ విజయం సాధించి, మరో మూడుసార్లు గుజ రాత్‌ను బయట ఉండి గెలిపించిన నాయకుడిగా ఖ్యాతి చెందారు. అదే విధంగా 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రధాని అభ్యర్థిగా ప్రజలు నరేంద్ర మోదీని నమ్మి భాజపాను గెలిపించారు. ఇప్పుడు హ్యాట్రిక్‌ దిశగా 2024 పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

బెంగాల్‌లో కమ్యూనిస్టుల తర్వాత మమతా బెనర్జీ వరుసగా మూడుసార్లు ప్రజల అచంచల విశ్వాసంతో అధికారాన్ని చేపట్టారు. ఒరిస్సాలో నవీన్‌ పట్నాయక్‌ ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఐదో సారి అధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత తమ ప్రభావాన్ని ప్రజల్లో నిలబెట్టుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు ప్రజల్లో విశ్వసనీయ నేతగా మన్ననలు పొందారు. ఒంటిచేత్తో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. పేదప్రజల మనిషిగా సుస్థిర స్థానాన్నిపొందారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రజల మన్నన, విశ్వాసాలు పొందారు.

అదే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పటికీ, మరో 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికల్లోనూ ఎవరో ఒకరితో పొత్తుతోనే గెలుపొందారు. ఒంటరిగా ఎప్పుడు కూడా గెలవలేకపోయారు. 1999 ఎన్నికల్లో భాజపాతో జట్టుకట్టి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో తిరిగి భాజపాతో జట్టుకట్టారు. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. 2014లో మళ్ళీ భాజపా, జనసేనతో జట్టుకట్టి విజయం సాధించారు. 2019లో తెలుగుదేశానికీ, ఎన్టీఆర్‌కూ బద్ధ శత్రువైన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకొని పరువు పోగొట్టుకున్నారు. ఒకసారి అటల్‌ బిహారీ వాజ్‌పేయి చరిష్మాతో పొత్తులో విజయం సాధించారు. మరోసారి నరేంద్ర మోదీ హవాలో గెలుపొందారు. కానీ ఎన్నడూ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేదు. 

2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమౌతున్న నేపథ్యంలో చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. జనసేనతో కలవాలనీ, భాజపాతో కూడా కలిసి పనిచెయ్యాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు. 2014 పొత్తులను మళ్ళీ పునరావృతం చెయ్యాలనే గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం ఒంటరి పోరుతోనే బరిలోకి దిగాలని నిశ్చయించారు. ఏది ఏమైనా రాబోయే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. 

- రఘురామ్‌ పురిఘళ్ళ 
బీజేపీ సీనియర్‌ నాయకులు, న్యూఢిల్లీ

మరిన్ని వార్తలు