ఆరోగ్య సంరక్షణపై దశాబ్దాల నిర్లక్ష్యం

17 May, 2021 00:47 IST|Sakshi

విశ్లేషణ

ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల ఘోర దుస్థితికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత కాకపోవచ్చు. కానీ ఉన్న వసతులను మెరుగుపర్చే విషయంలో మోదీ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదు. ప్రజారోగ్య మౌలిక వసతులను తగినంతగా నిర్మించడంలో వైఫల్యానికి 1947 నుంచి అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ కారణమే. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. కాని ఈ వైఫల్యానికి ఇతర పార్టీలు కూడా ఎంతో కొంత బాధ్యత వహించక తప్పదు. పైగా కొందరు బీజేపీ కీలక నేతల అహేతుకమైన, అశాస్త్రీయమైన ఆలోచనా తీరు కలవరం కల్గిస్తోంది. ఆధునిక ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ఆధునిక, హేతుపూర్వకమైన శాస్త్రీయ దృక్పథం చాలా అవసరం.

పరస్పరం ఆరోపించుకునే క్రీడను కట్టిపెడదాం. మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థది ఒకానొక దుఃఖకరమైన నిర్లక్ష్యపూరితమైన విషాదకర గాథ అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ పరమ నిర్లక్ష్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రధాని నరేంద్రమోదీ ఏడేళ్ల పాలనలోనే ఇలా జరిగిందని చెప్పలేము. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న నిరంతర నిర్లక్ష్య ఫలితంగానే ప్రస్తుతం కరోనా మహమ్మారి విసురుతున్న పెనుసవాళ్లను ఎదుర్కోలేక ప్రభుత్వ వ్యవస్థ చేష్టలుడిగిపోతోంది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ కూడా తీవ్రంగా విరుచుకుపడింది కానీ దాన్ని మనం కొన్ని అగ్రదేశాల కంటే కాస్త మెరుగైన రీతిలోనే ఎదుర్కోగలిగాం. కానీ ఆ తర్వాతే నిర్లక్ష్యం, అలసత్వం ఆవరించింది. 2021లో కరోనా సోకిన కేసులు, మరణాల రేట్లు ఇతరదేశాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని సంబరపడిపోయాం. ఆ తర్వాత సెకండ్‌ వేవ్‌ మరింత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన మ్యుటెంట్‌ రకాలతో విరుచుకుపడింది. అప్పటికే చాలీచాలని సౌకర్యాలతో, తక్కువ మంది వైద్య సిబ్బందితో కునారిల్లుతున్న ఆరోగ్య మౌలిక వసతుల కల్పనా రంగం దీని తాకిడిని ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఇప్పుడున్న అంబులెన్సుల కంటే అయిదు రెట్ల సంఖ్యలో అంబులెన్సులు భారత్‌కు అవసరమని తెలుస్తోంది.

అంబులెన్స్‌ సౌకర్యం లేక కార్లు, రిక్షాలలో సైతం తీసుకుపోతున్న కరోనా రోగులు శ్వాస సమస్యతో రొప్పుతూ, ఆసుపత్రిలో బెడ్‌ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నటువంటి హృదయ విదారకమైన దృశ్యాల వర్ణనలతో టీవీలు, సోషల్‌ మీడియా నిత్యం ముంచెత్తుతున్నాయి. అనేకమంది ఆసుపత్రుల వెలుపలే చనిపోతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కాలంలో ప్రపంచదేశాలన్నింటికంటే అధికంగా భారత్‌లోనే కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తం కరోనా మరణాల్లో మూడో వంతు భారత్‌లోనే సంభవించాయి. అయితే అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు అధికంగా వాస్తవ మరణాలు ఉంటున్నాయని ఆధార సహితంగా తెలుస్తూండటం గమనార్హం. ఈరోజుల్లో యావత్‌ ప్రపంచ దృష్టి భారత్‌మీదే కేంద్రీకృతమై ఉందంటే ఏమాత్రం ఆశ్చర్యపడాల్సింది లేదు. గంగానదిలో డజన్లకొద్దీ శవాలు తేలియాడుతున్న భయానక దృశ్యాలు వణికిస్తున్నాయి. ఈ పవిత్ర నది గట్లలో భారీ యంత్రాల సాయంతో గోతులు తవ్వుతూ నదిలో కొట్టుకువస్తున్న శవాలను పూడ్చటానికి స్మశాన క్షేత్రాలను రూపొందిస్తున్నారు.

గత బుధవారం ఒక టీవీ చానల్‌ వారు ఉత్తరప్రదేశ్‌ లోని ఎటావాలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రిని సందర్శించారు. దాంట్లో 100 పడకలు ఉన్నాయి. కానీ అంతకుమించిన రోగులు ఆసుపత్రిలో నేలమీద పడుకుని ఉన్నారు. ఇదే ఘోరమనుకుంటే అంతమంది రోగులున్న ఆ ఆసుపత్రిలో ఒక్క డాక్టర్‌ కానీ, నర్సు కానీ కనిపించలేదంటే నమ్మశక్యం కాదు. చివరకు ఆసుపత్రి పాలనాయంత్రాంగం నుంచి ఒక్కరూ అక్కడ లేకపోవడం విచారకరం. పైగా పారిశుధ్య సిబ్బంది గైర్హాజరీతో ఒక్క టాయెలెట్‌ కూడా అక్కడ పనిచేయడం లేదు. ఇంతవరకు మహమ్మారి పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో వైరస్‌ వ్యాపిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఏమిటి? గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉనికిలోనే లేని నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య వసతి కల్పన ఘోరంగా ఉంటోంది.

భారత్‌కు 73 సంవత్సరాల క్రితం స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు, ఆర్థిక, సామాజిక అభివృద్ధికోసం ప్రాధమ్యాలను దేశం నిర్ణయించుకోవలసి వచ్చింది. విషాదకరంగా ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అనే రెండు అత్యంత కీలకమైన రంగాలను ప్రారంభం నుంచి నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దేశంలో ఉన్నత విద్యారంగంలో ప్రపంచ స్థాయి బోధనా సంస్థలను నెలకొల్పారు. అద్భుతమైన ఆసుపత్రులను నిర్మించారు. కానీ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ప్రాథమిక పాఠశాలలు లేవు. వైద్య క్లినిక్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ లేవు. దీని ఫలితంగానే ముఖ్యంగా బాలికల్లో అక్షరాస్యతా స్థాయి పడిపోయింది. అదేవిధంగా సగటు ఆయుర్దాయం కూడా పడిపోయింది. మంచి ప్రజారోగ్య సంరక్షణకు ఇదే అసలైన సూచిక. చైనా, చివరకు ముస్లిం దేశమైన ఇండోనేషియా వంటి అతిపెద్ద దేశాలు కూడా తమ ప్రాధమ్యాలను సరైన విధంగా నిర్ణయించుకున్నాయి. ఇవి తొలి నుంచీ ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత నిచ్చాయి. ఈ రెండు దేశాల్లోనూ 1947 నాటికి భారత్‌ కంటే తక్కువ అక్షరాస్యతను, తక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉండేవి. కానీ 1980లలో ఈ రెండు కీలక రంగాల్లో ఈ దేశాలు అవలీలగా భారత్‌ని దాటి ముందుకెళ్లిపోయాయి.

ప్రజారోగ్య మౌలిక వసతులను తగినంతగా నిర్మించడంలో వైఫల్యానికి 1947 నుంచి అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ కారణమే. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. కాని ఈ వైఫల్యానికి ఇతర పార్టీలు కూడా ఎంతో కొంత బాధ్యత వహించక తప్పదు. వివిధ కేంద్రప్రభుత్వాలు నియమిస్తూ వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రుల ఎంపికలోనే ప్రజారోగ్యానికి ఎంత తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది దాగి ఉంది. జనతాపార్టీ తరపున రాజ్‌ నారాయణ్, కాంగ్రెస్‌ తరపు ఏఆర్‌ ఆంతూలే వంటి వారు దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. అత్యంత ప్రముఖ, అగ్రశ్రేణి సంస్థలు సైతం కాలం గడిచేకొద్దీ నిర్వహణాలోపం, అవినీతి కారణంగా ప్రమాణాలు దిగజార్చుకుంటూ వచ్చాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఒక చిన్న హిల్‌ స్టేషన్‌ అయిన కసౌలీలో 1904లోనే కేంద్ర పరిశోధనా సంస్థ (సీఆర్‌ఐ)ని నెలకొల్పారు. ఇది ఒకప్పుడు పలు రకాల వ్యాక్సిన్లు, సీరమ్‌ల తయారీదారుగా పేరుకెక్కింది. వీటిలో కొన్నింటిని ఎగుమతి కూడా చేసేవారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించినప్పుడు అన్బుమణి రామ్‌దాస్‌ని కేంద్ర ఆరోగ్యమంత్రిగా చేశారు. ఈయన కాంగ్రెస్‌ కూటమిపార్టీల్లో ఒక పార్టీకి చెందిన నేత. నా అభిప్రాయంలో ఆయన ఎంపిక ఏమాత్రం సరైనది కాదు. ఆయన హయాంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వచ్చిన ఒక ప్రతికూల నివేదిక కారణంగా అంతవరకు వ్యాక్సిన్‌లు, సీరమ్‌ల ప్రముఖ ఉత్పత్తిదారుగా ఉన్న సీఆర్‌ఐ కేవలం ఒక పరీక్షా ప్రయోగశాల స్థాయికి కుదించుకుపోయింది. 

ప్రభుత్వ నిర్వహణలో ఆధునిక ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ఆధునిక, హేతుపూర్వకమైన శాస్త్రీయ దృక్పథం చాలా అవసరం. కానీ ఇప్పుడు జ్యోతిష శాస్త్రానికి సైన్సు స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పైగా ప్రత్యామ్నాయ వైద్యాన్ని అలోపతి కంటే ఆధిక్యతా స్థానంలో ఉంచాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో శాస్త్రీయ, వైద్య ఆవిష్కరణల పేరిట సెమినార్లు ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి ఆవు విసర్జించే వ్యర్థ పదార్ధాలను కేన్సర్‌ వంటి కీలక వ్యాధులకు కూడా ఉపశమన కారులుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలు దేశంలో చలామణీ అవుతున్నప్పుడు, సమర్థవంతమైన, ఆధునిక ఆరోగ్య మౌలిక వసతులను మనం ఏర్పర్చుకోగలమా? శాస్త్రీయ దృక్పథాన్ని, మానవవాదాన్ని, ప్రశ్నించి సంస్కరించే స్ఫూర్తిని అభివృద్ధి పర్చుకోవడం ప్రతి పౌరుడి విధి అని రాజ్యాంగమే నిర్దేశించింది. సైన్స్, ఔషధ రంగంలో భవిష్యత్తులో నిర్వహించే ప్రతి సమావేశంలోనూ భారత రాజ్యాంగం ప్రవచించిన ఈ విశిష్ట వాక్యాన్ని ప్రముఖంగా పొందుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యాసకర్త: రాహుల్‌ సింగ్‌ 
 సీనియర్‌ జర్నలిస్టు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు