రైతులతో ఏనాడైనా మాట్లాడారా?

16 Jan, 2021 00:26 IST|Sakshi

విశ్లేషణ

భారతీయ వ్యవసాయంరంగం ఎదుర్కొంటున్న సమస్య చాలా సంక్లిష్టమైంది. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను రైతులతో చర్చించకుండానే హడావుడిగా తీసుకొచ్చారు. దశాబ్దాలుగా వ్యవసాయ వ్యవహారాల స్థితిగతులను మార్చాల్సిందిగా రైతులు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. కానీ మన పడకకుర్చీ ఆర్థికవేత్తలు కానీ పార్లమెంట్‌ సభ్యులలో చాలామంది కానీ రైతుల జీవితాల్లో సంభవించాల్సిన అసలు మార్పును పట్టిం చుకోవడం లేదు. దేశానికి తిండిపెట్టే అన్నదాత అంటూ ఊరకే ఉబుసుపోక మాటలు గంభీరంగా వల్లించినంత మాత్రాన అవి రైతుల జీవితాల్లో ప్రధాన మార్పును తీసుకురావు. అందుకే ఇలాంటి నూతన చట్టాలను చట్టసభల్లో ఆమోదిస్తున్నప్పుడు దయచేసి రైతులను సంప్రదించండి. అప్పుడు మాత్రమే ఇలాంటి చట్టాలు ఫలవంతమవుతాయి. గ్రామాల నుంచీ వెళ్లిపోయిన వారిని మినహాయిస్తే ఇప్పటికీ చాలామంది అదృష్టం భూమి చుట్టూ తిరుగుతోంది. 

ఢిల్లీవైపు సాగుతున్న పంజాబ్‌ రైతులను చూస్తున్నప్పుడు వారి వేదనను నేను స్వయంగా అనుభవించాను. తెలంగాణలోని వరంగల్‌ సమీపంలోని చిన్నవంగర గ్రామాలో నేను జన్మించాను. మా కుటుంబానికి వ్యవసాయ భూమి ఉండేది. మా ఆదాయం, గౌరవం, చింత–విచారాలు అన్ని దాన్నుంచే వచ్చేవి. ఈ అర్థంలో తెలంగాణ రైతు పంజాబ్‌ రైతుతో ఐక్యమై ఉంటాడు. మా గ్రామంలోని పది ఎకరాల భూమిలో మామిడి తోటను పెంచడానికి నేను 2009 నుంచి మదుపు చేస్తూ వచ్చాను. దీంతో నేను తాత్కాలిక రైతునయ్యాను. పైగా కరువులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో వచ్చే అన్నిరకాల సమస్యలను నేను అనుభవించాను. ఒక నిర్దయాత్మకమైన వేసవిలో మా తోటలోని మామిడి చెట్లు ఎండిపోయి చనిపోయాయి. ఈ నష్టానికి గాను ఇంతవరకు నాకు ఎలాంటి ఆర్థిక సహాయమూ లభించలేదు.

ఈరోజుకు మామిడితోట పక్వానికి వచ్చింది. చెట్లు ఫలాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ పక్కాగా పంట వస్తుందని మాత్రం మేము గ్యారంటీ ఇవ్వలేము. మామిడి చెట్లు పూత పూసి కాయలు కాచి పంట చేతికి వచ్చేంతవరకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ అనిశ్చితి మధ్యలోనే క్షేత్రస్థాయిలో మేము తొలి విడతలోనే మధ్యవర్తులతో ఒప్పందం చేసుకోవలసి వచ్చింది. భారీ మొత్తం నగదు చెల్లిస్తామని, మంచి పంట పండుతుందని పందెం కూడా కాశాడతను. ఈ మధ్యదళారీ వాస్తవానికి చిన్నపాటి కొనుగోలుదారు. ఢిల్లీ మార్కెట్ల వరకు మామిడి పళ్లను సరఫరా చేసే అజాద్‌పూర్‌ వంటి మండీ మార్కెట్లలో పండ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే భారీ కొనుగోలుదారుల వద్ద డబ్బు అప్పుగా తీసుకుని వీరు వ్యాపారం చేస్తుంటారు.

తినే మామిడిపండు రైతు స్వేద ఫలమే
ఢిల్లీ, ఇతర నగర ప్రాంతాల్లో సఫేదా మామిడి పండ్లను మీరు కిలో వందరూపాయలు పెట్టి కొంటున్న సమయంలో దాని అసలు పేరు బంగినపల్లి అని మీరు దయచేసి తెలుసుకోండి. మా వ్యవసాయ క్షేత్రంలో మేము ఈ పండ్లనే పండిస్తున్నాము. ఈ బంగినపల్లి రకం పండు దాదాపు వెయ్యి కిలోమీటర్లు పైగా దూరం ప్రయాణించి ఢిల్లీకి, ఇతర నగరాలకు చేరవచ్చు. వీటిని కాపు కాస్తున్న చెట్లు బహుశా పదేళ్ల కాలంపాటు అత్యంత అనిశ్చిత పరిస్థితుల మధ్య పెరిగి పెద్దవి అయి కాయలు కాస్తాయి. కాబట్టి ఈ బంగినపల్లి మామిడి పండును కిలోకు తక్కువధరకే మీరు కొంటూ ఆస్వాదిస్తున్నప్పుడు, ఎకరా తోటకు మేం పొందుతన్నది ఇరవై ఐదు వేల రూపాయల కంటే తక్కువేనని మీరు గ్రహించాలి. 

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు, కొనుగోలుదారులకు మధ్యన ఉండే చిన్నపాటి వర్తకులను పూర్తిగా లేకుండా చేయనున్నాయి. రైతుల చెమట కష్టాన్ని వీరు లాభాల రూపంలో కొల్లగొడుతున్నారని ఈ కొత్తసాగు చట్టాలు చెబుతున్నాయి. కానీ వ్యవసాయ క్షేత్రం నుంచి మీ ఇంటి డైనింగ్‌ టేబుల్‌ వరకు మామిడి పళ్లను సరఫరా చేయడంలో ఈచిన్న వర్తకులు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను పాలకులు విస్మరిస్తున్నారు.

మార్కెట్లో మంచి ధరను కల్పించడం ద్వారా రైతుకు నూతన వ్యవసాయ చట్టాలు ప్రయోజనం కలిగిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొంటున్నారు. కానీ మధ్యతరహా రైతు కేటగిరీలో చేరే భారతదేశంలోని సగటు కమతాలను కలిగి ఉన్న మాలాంటి రైతు కుటుంబాలకు ఇది సాధ్యపడుతుందా? మార్కెట్‌కు పంటను పంపడానికి ముందు మామిడిపంఢ్లను మేం నిలవచేయవలసి ఉంటుంది. మా గ్రామానికి అతి సమీపంలో ఉన్న శీతల గిడ్డంగి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కిందా మీదా పడి మా పంటలను నిల్వచేసినప్పటికీ అమ్మడానికి మంచి ధరను మేము ఎలా తెలుసుకోగలం? ధరలను పోల్చి చూసుకోవడానికి మాకు రిలయెన్స్‌ ఫ్రెష్, బిగ్‌ బాస్కెట్, నాచుర్స్‌ బాస్కెట్‌ వంటి స్టోర్లు అందుబాటులో ఉండవు. ఒకవేళ వినియోగదారులు నేరుగా రైతులతో అనుసంధానమైనట్లయితే, అప్పుడు కూడా పంటను ప్యాక్‌ చేయడం, పంపిణీ చేయడం అనేది సవాలుగా ఉంటుంది. చిన్న చిన్న రైతులు ఈ అన్ని దశలను అధిగమించి మార్కెట్‌కు పంటను చేర్చేటప్పటికి పంటపొలంలో వారు పడే కష్టానికి రెట్టింపు కష్టం పడాల్సి వస్తుంది.

పంట బీమా పెద్ద పీడకల
ఈ అన్ని రకాల అనిశ్చిత పరిస్థితులను అధిగమించడానికి మాకు పంట బీమా అనేది అందుబాటులో ఉంటుంది కానీ ఈ బీమా ప్రక్రియ అనేది మా లాంటి రైతులకు పీడకలలాంటిది. దీంతో అనివార్యంగా మేము బీమా ఏజెంట్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది. పంట బీమాకు సంబంధించి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను సకాలంలోనే తీసుకొచ్చింది కానీ మాలాంటి రైతుల పంట బీమాను కొనుక్కోవలసి ఉంటుంది. బీమా ఏజెంట్‌  లేక బ్యాంకింగ్‌ ఏజెంట్‌పై ఆధారపడకుండా మేము పంట బీమాను తీసుకోవడం దాదాపుగా అసాధ్యమేనని చెప్పాలి. మరి ఇది మాత్రం మధ్యవర్తి లేక దళారీ లాగా కనిపించడం లేదా? కాగా బిందు సేద్యం లేక ఉద్యానవన శాఖ నుంచి మామిడి మొక్కలను పొందడం వంటి పాలసీ ప్రయోజనాలను పొందడం చాలా కష్టమైన పని. దీనికోసం మాలాంటి రైతులు స్థానిక పాలనా కార్యాలయాల చుట్టూ గిరికీలు తిరగాల్సి ఉంటుంది. దాంతోపాటు అధికారుల చేతులు తడపటం లేక రాజకీయ పలుకుబడిని ఉపయోగించడం తప్పదు.

2013లో భారతదేశంలోని వ్యవసాయ గృహాల సర్వే అంచనా పరిస్థితిపై జాతీయ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నివేదిక చెబుతున్నదాని ప్రకారం జూలై 2012 నుంచి జూన్‌ 2013 వరకు ఒక వ్యవసాయ సంవత్సరంలో భారతీయ వ్యవసాయ కుటుంబాలు పొందుతున్న నెలవారీ సగటు ఆదాయం రూ. 6,426లు మాత్రమేనని తెలుస్తుంది. చాలా దశాబ్దాలుగా భారతీయ రైతుల వ్యధల గురించి నివేదిస్తూ వస్తున్న ప్రముఖ జర్నలిస్టు, వ్యవసాయరంగ నిపుణుడు పి. సాయినాథ్‌.. రైతులు పొందుతున్న ఈ ఆదాయం గురించి ముఖ్యమైన విషయాన్ని ఎత్తిచూపుతూ వస్తున్నారు. రైతులు పొందుతున్నఈ నెలవారీ ఆదాయంలో కనీసం 30 శాతం వరకు వ్యవసాయేతర పనుల ద్వారానే లభిస్తున్నదని సాయినాథ్‌ చెప్పారు. గ్రామానికి దూరంగా కుటుంబ సభ్యులు పనిచేయగా వచ్చే ఆదాయాన్ని, గ్రామ పాఠశాలలో టీచర్‌ వంటి ఉద్యోగాల ద్వారా వేతనాల రూపంలో పొందే మొత్తాన్ని కూడా రైతుల నెలవారీ ఆదాయం నుంచి తీసివేయాల్సి ఉంటుంది. నా విషయానికి వస్తే యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా నా వేతనాన్ని నా వ్యవసాయ ఆదాయం నుంచి పక్కన బెట్టాల్సి ఉంటుంది.

సాగు చట్టాలు ఫలవంతం కావాలంటే...!
భారతీయ వ్యవసాయంరంగం ఎదుర్కొంటున్న సమస్య చాలా సంక్లిష్టమైంది. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు రైతులతో చర్చించకుండానే హడావుడిగా తీసుకొచ్చారు. దశాబ్దాలుగా వ్యవసాయ వ్యవహారాల స్థితిని మార్చాల్సిందిగా రైతులు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. కానీ మన పడకకుర్చీ ఆర్థికవేత్తలు కానీ  పార్లమెంట్‌ సభ్యులలో చాలామంది కానీ రైతుల జీవితాల్లో సంభవించాల్సిన అసలు మార్పును పట్టించుకోవడం లేదు. దేశానికి తిండిపెట్టే అన్నదాత అంటూ ఊరకే ఉబుసుపోక మాటలు గంభీరంగా వల్లించినంత మాత్రాన అవి రైతుల జీవితాల్లో ప్రధాన మార్పును తీసుకురావు. అందుకే ఇలాంటి నూతన చట్టాలను చట్టసభల్లో ఆమోదిస్తున్నప్పుడు దయచేసి రైతులను సంప్రదించండి. అప్పుడు మాత్రమే ఇలాంటి చట్టాలు ఫలవంతమవుతాయి.

భారతీయ ప్రమాణాలను బట్టి చూస్తే గణనీయమైన స్థాయిలో భూమిని కలిగి ఉన్నప్పటికీ మా నాన్న గ్రామం నుంచి బయటపడాలని, భూమ్మీది ఎప్పుడూ ఆధారపడవద్దని నాతో పదే పదే చెప్పేవారు. వ్యవసాయం స్వావలంబన కల్పించదని ఆయన విశ్వాసం. ఆయన మాటల ప్రభావమే కావచ్చు..  నేను ఇప్పుడు యూనివర్శిటీలో ఉద్యోగం చేస్తున్నాను. నా అదృష్టానికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. వ్యవసాయానికి బయట నేను చేస్తున్న ఉద్యోగం కారణంగానే గ్రామంలోని మా తల్లిదండ్రులకు ఎంతో కొంత డబ్బు పంపించగలుగుతున్నాను. గ్రామంనుంచి బయటకు వెళ్లిపోయిన ప్రతి ఒక్క వ్యక్తితో పోలిస్తే ఇప్పటికీ చాలామంది అదృష్టం భూమిచుట్టూనే తిరుగుతూ ఉంది.
-రాజ్‌దీప్‌ పాకనాటి
వ్యాసరచయిత అంతర్జాతీయ వ్యవహారాలలో అధ్యాపకులు, ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ

 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు