మానవతకు ఇది రక్షాబంధన్‌!

2 Aug, 2020 00:37 IST|Sakshi

సందర్భం
భారతీయులు నిర్వహించుకునే పండుగల్లో పౌరాణిక, చారిత్రక నేపథ్యం కలిగిన పండుగ రక్షాబంధన్‌. రాక్షస సంహారానికి సన్నద్ధుడైన దేవేంద్రునికి శచీదేవి రక్ష కట్టి విజయ ప్రాప్తికోసం ప్రార్థిం చిందని పౌరాణిక గాథ. కాలక్రమంలో స్త్రీ పురుషుల మధ్య అన్నా చెల్లెళ్ల అనురాగాన్ని, భరతమాత సంతానమైన మనం అందరం అన్నదమ్ములమనే సహోదర భావాన్ని సమాజం అంతటికీ అలవర్చే సంస్కారమే రక్షాబంధన్‌ పండుగ అయింది.

కొన్ని ప్రాంతాలకు కుటుంబాలకు పరిమితమై కొందరి  వేడుకగా సాగుతున్న రక్షాబంధన్‌ని ఇవాళ సర్వే సర్వత్రా సామాజిక ఉత్సవంగా జరపాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్త్రీలకు గౌరవ మర్యాదలు లభించే తావుల్లో దేవతలు సంతసిస్తారు అని చాటి చెప్పిన వేదభూమి మనది. పౌరాణికంగా, చారిత్రకంగా, రాజకీయంగా మహిళలకు సమున్నత స్థానం కల్పించడం భారతీయ సంస్కృతిలో అడుగడుగునా కనిపిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు అని మహిళకు ప్రథమ స్థానం కల్పించిన పౌరాణిక నేపథ్యం మనది. రాణి రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి చెన్నమ్మ వంటి మహిళాపాలకులు మన దేశ చరిత్రలో కనిపిస్తారు. జనరంజకమైన పాలనతో వారు ప్రజల మన్నన చూరగొన్నారు. ఆధునిక రాజకీయాల్లో సైతం భారతీయ మహిళకు సముచిత స్థానమే దక్కింది. భారత్‌ స్వతంత్ర దేశంగా అవతరిస్తూ, ప్రజాస్వామిక వ్యవస్థను స్వీకరించిన మరుక్షణమే ఎలాంటి శషభిషలు లేకుండా సార్వజనిక ఓటు హక్కుతో మహిళలకు కూడా సమాన స్థాయి కల్పిం చడం చరిత్ర. ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే ప్రతిభావంతులైన మహిళలు జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో రాజకీయ పదవులు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించి మహిళా లోకానికి వన్నెతేవడం భారతీయతకు గర్వకారణం. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించి పాలన వ్యవస్థలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ప్రయత్నాన్ని అందరూ స్వాగతించడం హర్షణీయం. వర్తకం, వాణిజ్యం, వ్యవసాయం, పరిశోధన, విద్యా, వైద్య రంగాల నుండి రక్షణ రంగందాకా భారతీయ మహిళలు ప్రవేశించి తమ సత్తా చాటని రంగమే లేదనడం అతిశయోక్తికాదు.

గర్వించదగిన ఇంతటి ఘన చరిత్ర గలిగిన భరత భూమిలో నేడు మహిళల ప్రాణ, మాన, మర్యాదలు ప్రమాదంలో పడడం విషాదం. తమ మానప్రాణాలకు రక్షణ కరువైందని ఘోషిస్తున్న మహిళల ఆక్రందన మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నది. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వాలు తగిన చట్టాలు చేస్తున్నాయి. ‘దిశ’ వంటి చట్టాలు,  ప్రత్యేక మహిళా పోలీసు స్టేషన్లు, ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు జరుగుతోంది. ప్రభుత్వాల ప్రయత్నాలు, ప్రత్యేక చట్టాలు ముమ్మరం అవుతున్నా మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు తగ్గు ముఖం పట్టకపోవడం విషాదం. మన సోదరీమణులకు భద్రత కల్పించవలసిన బాధ్యతను మనమే స్వీకరించాలి. ప్రతి పురుషుడూ మరో మహిళ చేతికి రక్ష కట్టి రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాలి.

చీమలో, బ్రహ్మలో శివ కేశవులలో వెలిగే పరబ్రహ్మ ఒకటే అని ఎలుగెత్తి చాటిన సంస్కృతి మనది. సర్వధర్మ సమభావన వెల్లి విరియాల్సిన దేశంలో కుల వివక్ష, అంటరానితనం వేళ్లూను కోవడం విషాదం. రక్షాబంధన్‌ సందర్భంగా కట్టే రక్ష అన్నిరకాల వివక్షను అంతమొందించే వజ్రాయుధం కావాలి. రాత్రనక, పగలనక, ఎండ వానలను సైతం లెక్క చేయక దేశ సరిహద్దుల్లో నిలబడి కాపలా కాస్తూ విదేశీ దురాక్రమణకారుల ప్రయత్నాలను తిప్పి కొడుతున్న మన వీర జవానులకు రక్షా బంధన్‌ జేజేలు తెలుపుదాం. వారికి రక్షలు పంపించి వీరులారా దేశం అంతా మీ వెనక ఉందని మద్దతు తెల్పుదాం.

1994లో నేను లోక్‌సభ సభ్యునిగా ఉన్నప్పుడు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను విముక్తం చేస్తామంటూ  నాటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో భారత పార్లమెంటు ముందుకు వచ్చిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆనందోత్సాహాలతో ఆ సందర్భంగా తెల్పిన మా మద్దతుకు సంకేతంగా చరిచిన బల్లల చప్పుడు నా చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతోంది. చరిత్రాత్మకమైన ఆ తీర్మానం నేటికీ కాగితాలమీదనే ఉంది. తీర్మానసారాన్ని సాకారం చేయడానికి నేటి మన ప్రియతమ ప్రధాని మోదీ సాగిస్తున్న ప్రయత్నాలను స్వాగతిద్దాం. భారత దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాల కోసం భారత జాతీయులమైన మనం అన్న దమ్ముల్లా కలిసి కట్టుగా కృషి చేయాలి. అలా చేస్తామని ప్రతిజ్ఞాపూర్వకంగా పరస్పరం మనం అందరం రక్షలు కట్టుకుందాం.

ప్రపంచం అంతటా కరోనా ప్రబలిన వేళ భారతీయ సంస్కారమైన నమస్కారం విలువను ప్రపంచం మొత్తం గుర్తిస్తున్నది. ఔషధగుణాలున్న శొంఠి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి భారతీయ వంటింటి దినుసుల సాయంతో పలువురు కరోనాను ఓడించినట్లు తెలుస్తున్న అనుభవాలతో భారతీయ ఆహారపు అలవాట్ల పట్ల ప్రపంచ ప్రజ లకు ఆసక్తి పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే దివ్య ఔషధంగా భారతీయ యోగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఎదుట ప్రస్తావించి భారతీయ యోగాను ప్రపంచ దేశాలకు చేర్చిన మన ప్రధాని మోదీని ప్రపంచ దేశాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. కరోనా విపత్తు నుండి దేశ ప్రజ లను రక్షించడానికి కఠోర దీక్షతో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసు వారికి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపి మన మద్దతు ప్రకటిద్దాం. ప్రభుత్వాల, వైద్యఆరోగ్య అధికారుల సూచనల ప్రకారం పరిశుభ్రతను పాటిస్తూ, మాస్కులు ధరిం చడం, సార్వజనిక స్థలాల్లో ఎడం పాటించడం వంటి జాగ్రత్తలను పాటించి కరోనాను ఓడిద్దాం. ఈ శ్రావణ పూర్ణిమ సందర్భంగా వచ్చే రక్షాబంధన్‌ను సామాజిక ప్రజాఉత్సవంగా నిర్వహించుకుందాం. వివక్షను అంతం చేసి మానవతా విలువల పరిరక్షణకు ముందు నిలిచి ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయం అవుదాం. భారతదేశంలో మహిళా భద్రతకు భరోసా కల్పిద్దాం. మాతృభూమి రక్షణలో,  భారతీయ సంస్కృతి పరిరక్షణలో మనం అంతా ఏకాత్మ భావనతో ఒక్కటిగా నిలబడి నినదిద్దాం!

(రేపు రక్షాబంధన్‌ సందర్భంగా)
వ్యాసకర్త గవర్నర్, హిమాచల్‌ప్రదేశ్‌
బండారు దత్తాత్రేయ

మరిన్ని వార్తలు