బాబాసాహెబ్‌ కలల సాకారంలో...

17 Sep, 2022 00:41 IST|Sakshi

అంబేడ్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్‌ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. మోదీ బలమైన సంకల్పం ఫలితంగా ఆర్టికల్‌ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్‌ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలన్నింటి లోనూ అంబేడ్కర్‌ ప్రభావం సుస్పష్టం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్‌ ముద్ర ఆయన పాలనా శైలిలో సర్వత్రా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభిప్రాయం.

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మన సమాజ భాగ స్వాములైన బడుగు, బలహీన వర్గాల వారి ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగిన రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్‌ డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంత యినా ఉంది. స్వాతంత్య్రం తర్వాత దేశ ప్రగతికి వివిధ ప్రభుత్వాలు తమ వంతు కృషి చేసినప్పటీకీ అంబేడ్కర్‌ కన్న కలల్లో ఏళ్ల తరబడి నెరవేరని ఎన్నో స్వప్నాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి పుట్టినరోజు. ఆయనతో నాది చాలా సుదీర్ఘ, చిరస్మరణీయ అనుబంధం. సంస్థలో ఒకరిగా, ముఖ్యమంత్రిగా, ఇవాళ ప్రధానమంత్రిగా ఆయన పనిచేయడం నేను చూస్తూ వచ్చాను. 

దళితులు, ఆదివాసీలు, మహిళల సాధికారతలో ఆయన ప్రదర్శించిన శ్రద్ధాసక్తులు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆ మేరకు బాబాసాహెబ్‌కు నిజమైన శిష్యుడిగా భారతదేశాన్ని సమసమాజంగా రూపుదిద్దడానికి మోదీ ముమ్మర కృషి చేస్తున్నారు. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలు తదితరాలన్నింటిలోనూ అంబే డ్కర్‌ ప్రభావం సుస్పష్టం. ఒక సంస్థలో సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, నేడు ప్రధానమంత్రిగానూ మోదీ సదా బాబాసాహెబ్‌ బాటలోనే నడుస్తున్నారు. తదనుగుణంగా దేశానికేగాక ప్రపంచం మొత్తానికీ చిరకాలం గుర్తుండిపోయే బహుమతిని ‘పంచతీర్థం’ రూపంలో మోదీ అందించారు. బాబాసాహెబ్‌ జయంతిని ‘సమతా దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించడమేగాక నవంబర్‌ 26ను భారత ‘రాజ్యాంగ దినోత్సవం’గానూ మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ చూపిన ఈ చొరవతో ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్‌ 125వ జయంతి వేడుకను నిర్వహించింది. 

అంబేడ్కర్‌ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ నెరవేరని– ఆర్టికల్‌ 370 రద్దు, స్వయం సమృద్ధ భారతం స్వప్నాలను మోదీ ప్రభుత్వం పటిష్ఠ చర్యలతో సాకారం చేయగలిగింది. కాగా, ఆనాడు అంబేడ్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్‌ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. దీంతో భారతదేశంలో జమ్ము–కశ్మీర్‌ విలీనానికి అడ్డుకట్ట పడింది. అయితే, మోదీ బలమైన సంకల్పం, దీక్ష ఫలితంగా ఆర్టికల్‌ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్‌ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. అదేవిధంగా శక్తిమంతమైన స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణం దిశగా ప్రధానమంత్రి మోదీ ఉద్యమ సంక ల్పంతో శ్రమిస్తున్నారు. ‘స్వయం సమృద్ధం’ కావడం ద్వారానే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగలదని అంబేడ్కర్‌ గట్టిగా విశ్వసించారు. కానీ, భారతదేశాన్ని స్వావలంబన మార్గంలో నడి పించడంలో మునుపటి ప్రభుత్వాలకు సంకల్పం, చిత్తశుద్ధి లోపిం చాయి. కానీ, మోదీ ఈ పరిస్థితిని చక్కదిద్ది, భారత ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడం ద్వారా ప్రపంచానికి మన శక్తిని చాటారు. కాబట్టే మన బలమేమిటో ప్రపంచం ఇవాళ గుర్తించింది.   

రాష్ట్రపతి హోదాలో నేను పలు సామాజిక సమస్యలు, పాలనా వ్యవహారాలపై ప్రధానితో సంభాషించినప్పుడల్లా వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతి గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసేవారు. ఈ జాడ్యం కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పేదలేనని చెప్పేవారు. ఈ నేపథ్యంలో గడచిన ఎనిమిదేళ్లుగా మోదీ అవినీతిపై అలుపెరుగని నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నారు. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ నిరుపేద లందరికీ అందేలా ఆయన చేసిన కృషిని మనమంతా ప్రత్యక్షంగా చూశాం. పర్యవసానంగా ఇవాళ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ సాఫీగా సాగిపోతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలన్నీ నిరుపేదలపై కరుణను ప్రతిబింబించేవి కావడం గమనార్హం.   

మన ప్రజాస్వామ్య వ్యవస్థను అనువంశిక రాజకీయాలు నియంత్రించడం మోదీకి తీవ్ర ఆందోళన కలిగించిన మరో అంశం. ఈ అనువంశిక రాజకీయాలు చిత్తశుద్ధితో, శ్రమించి పనిచేసే రాజ కీయ కార్యకర్తల హక్కులను ఏ విధంగా లాగివేసుకుంటాయనే అంశంపై ఆయన సదా గళం విప్పుతూనే వచ్చారు. మోదీ ఎల్లప్పుడూ అర్హత ప్రాతిపదికగానే నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అనువంశిక రాజకీయాలపై మోదీ చేసిన యుద్ధం ఇప్పటికే తన ప్రభావం చూపుతోంది. ఈ మేరకు మన ప్రజాస్వా మ్యాన్ని పటిష్ఠం, మరింత శక్తిమంతం చేసేది ప్రతిభ ఆధారిత రాజకీయాలే తప్ప అనువంశిక రాజకీయాలు కావన్నది స్పష్టమైంది.

మోదీ పాలన శైలికి మరో నిలువెత్తు నిదర్శనం ‘పద్మ’ పురస్కరాలు. ఒకనాడు సంపన్న, పలుకుబడిగల వర్గాలకు ‘విశేష పరి గణన’ ఇచ్చేవిగా భావించబడిన ఈ పురస్కారం నేడు ‘సామా న్యుడి’తో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకుంది. ఈ మేరకు ఇవాళ ‘జన సామాన్యం’తో మమేకమైన వారికి అంకితం చేయబడ్డాయి.  అత్యంత వెనుకబడిన రంగాలలో అభివృద్ధి, తదనుగుణంగా అట్టడుగు వర్గాల జీవితాల్లో కొత్త అధ్యాయం లిఖించే విధంగా ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక చర్యల గురించి ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలిచాను. ఇందులో ఒకటి ‘ఆకాంక్షాత్మక జిల్లాల కార్య క్రమం’ కాగా, రెండోది ‘ఆదర్శ గ్రామాల పథకం’. మోదీ విశిష్ట ఆలోచన శైలికి ఇదే నిదర్శనం. వేలెత్తి చూపలేని పటిష్ట ప్రణాళికలు, లోపరహితంగా వాటిని అమలు చేయడం వల్ల నిరుపేదల జీవితాల్లో సుస్పష్టమైన మార్పులు వచ్చాయి. అనేక సాంఘిక సంక్షేమ పథకాలే ఇందుకు తిరుగులేని ఉదాహరణలు. వీటిలో ప్రపంచంలోనే అత్యంత భారీ ఉచిత రేషన్‌ పథకమైన ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ అత్యంత విశిష్టమైనది. భారతీయులు కరోనా మహ మ్మారిపై సాహసోపేత పోరాటం సలుపుతున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందారు.

మహమ్మారి వైరస్‌పై భారత్‌ పోరాటాన్ని ప్రధాని మోదీ ఏ విధంగా ముందుండి నడిపారో నేను ప్రత్యక్షంగా చూశాను. మన శాస్త్రవేత్తలు, వైద్యులు ఒకటికి రెండు ‘దేశీయ’ (మేడ్‌ ఇన్‌ ఇండియా) టీకాలను రూపొందించడంలో ఆయనిచ్చిన చేయూత, మద్దతు నిరుపమానం. దీంతో మనందరికీ భద్రత లభించడమేగాక అనేక ఇతర దేశాల ప్రజానీకం సంక్షేమానికీ మనమంతా తోడ్పడినట్ల యింది. మరోవైపు మహమ్మారి గరిష్ఠ స్థాయిలో విజృంభించే నాటికి 100 కోట్ల మంది భారతీయులకు టీకాలు వేసే బృహత్తర కార్యాచర ణను కూడా ప్రధానమంత్రి చేపట్టారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత భారీ, వేగవంతమైన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతం చేశారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలను కోవిడ్‌ ఊపిరాడకుండా చేసిన సమయంలో ప్రధాని మన ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమేగాక విస్తరించారు. సమయ స్ఫూర్తితో కూడిన విధానపరమైన కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధి స్తంభించకుండా ఎంతో జాగ్రత్త వహించారు.   

మోదీ గత ఎనిమిదేళ్ల పాలన అత్యద్భుతం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్‌ ముద్ర ఆయన పాలన శైలిలో సర్వత్రా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభి ప్రాయం. అంబేడ్కర్‌ అడుగుజాడల్లో మన ప్రధాని ‘దేశమే ప్రథమం’ అనే నినాదాన్ని తారకమంత్రంగా స్వీకరించారు. మరోవైపు సుపరి పాలన, సామాజిక సమన్వయం, క్రమశిక్షణలనే విశిష్ట లక్షణాలతో ఆయన ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోంది.
(నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు)

రామ్‌నాథ్‌ కోవింద్‌ (భారత మాజీ రాష్ట్రపతి)

మరిన్ని వార్తలు