ఆ సిద్ధాంతాల అవసరం ఇప్పుడే ఎక్కువ!

17 Jan, 2022 13:03 IST|Sakshi

సందర్భం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగబోవడం... రాష్ట్ర, దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రపంచ మేధావులను, ఆధ్యాత్మికవేత్తలను, పండితులను ఆలోచింపచేస్తుంది. పరంపరాగతమైన భారతీయ తాత్విక చింతన గురించి మరొకసారి విశ్లేషణలు వెల్లివిరుస్తాయి. ఈ మధ్యన జీయర్‌స్వామి రాష్ట్రపతి, ప్రధానమంత్రులను కలసి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించడంతో ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది.

రామానుజాచార్యుల బోధనల అవసరం వేయి సంవత్సరాల క్రితం సమాజానికి ఎంత ఉండిందో... ఈ కాలానికి అంతకన్నా ఎక్కువ అవసరమైన పరిస్థితి ఏర్పడ్డది. వారు సశాస్త్రీయంగా బోధించిన సామాజిక సమరసా సిద్ధాంతం అన్ని వర్గాల, మతాలకు చెందిన వారికి శిరోధార్యం. ఆనాడు వారు తీసుకున్న భక్తి గమనము, ఎంతోమంది సాధు సంతులను, ప్రజలను, ముఖ్యంగా రామానంద ద్వారా కబీర్‌ దాస్‌లాంటి వాళ్లను ప్రభావితం చేసి దేశ సమగ్రతకు, సమైక్యతకు తోడ్పడ్డాయి.

ఈ సంప్రదాయానికే చిన జీయర్‌స్వామి కొంత సుగం ధాన్ని, మరికొంత సువర్ణాన్ని పూసి సరళమైన భాషలో, స్పష్టమైన భావాలతో చేసిన ప్రసంగాలతో లక్షలమందిని ఆకర్షించారు. ‘‘నీ తల్లిని ప్రేమించు, ఇతరుల తల్లులను గౌరవించు’’ అన్న చిన్న పదాలు– వర్గాలను, కులాలను, మతాలను కలిపి స్వామీజీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు బాట వేసి వేలమందికి విద్య, ఉపాధి పొందే అవకాశాలను కల్పిస్తున్నాయి. మరొకవైపు స్వామి భక్తి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ, సాంస్కృతిక జీవనంలో ఒక కొత్త దనాన్ని తెచ్చాయి. ఈ మధ్యన నిర్వహించిన ఒక సర్వేలో 27 శాతం భారతీయులు – హిందువులలో అత్యధి కంగా 30 శాతం, సిక్కులలో 23 శాతం, ముస్లింలలో 18 శాతం మంది అంటరానితనాన్ని పాటిస్తున్నారని ఎన్‌సీఏఈఆర్‌ నివేదికలో చెప్పారు. వివిధ నివేదికలను పూర్తిగా లెక్కలోకి తీసుకోలేకున్నా... అంటరానితనం ఇంకా ఉన్నదనేది నిర్వివాదం.

ఆది శంకరుడు, రామానుజుడు, బసవేశ్వరుడు, వివేకా నందుడు, నారాయణగురు, బ్రహ్మనాయుడు లాంటి వారెం దరో మన మనస్సులలో సుప్రతిష్ఠితులు. వీరందరూ కులాల, మతాల వివక్షలను నిర్ద్వంద్వంగా ఖండించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని ఒకవైపు రాజ్యాంగం నిర్దేశించినా... పరువు హత్యలు సమాజానికి సవాలుగా మారాయి. ఈ మధ్యన సుప్రీం కోర్టు ఈ కులరక్కసిని అంతమొందించటానికి ఆదేశాలు జారీ చేసి, వాటి అమలుకు కార్యాచరణను రూపొందించింది. రాజస్థాన్‌ ప్రభుత్వమైతే మరణ శిక్షను విధిస్తూ చట్టం చేసింది. కానీ కొందరు మతాంతర వివాహమే మరణ శాసనమని భావిస్తూ బ్రతుకుతున్నారు, మరికొందరు మరణిస్తున్నారు.

 ఈ మధ్యకాలంలో ‘హిందూ’ అన్నపదం, ఇటు రాజకీయాలలో, చట్టసభలల్లో, సమాజంలో కేంద్ర బిందువుగా మారుతున్నది. హిందూ అన్న పదం సాంస్కృ తిక భావన అని దాదాపు అన్ని వర్గాలు ఆలోచించే శుభ పరిణామాన్ని చూస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్, సాంస్కృతిక జాతీయవాదానికి అనుగుణంగానే 1956లో పెద్ద సంఖ్యలో అనుచరులతో కలసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. హిందూ సమాజంలో అమానవీయంగా విలయతాండవం చేసిన అస్పృశ్యత వంటి రుగ్మత లకు నిరసనగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇతర మతాలకు మారవలసిందిగా ఎందరో ఆయనను ప్రలోభ పెట్టారు. అయితే ఈ మతాలకు మారడం అంటే భారతదేశ సంస్కృతి నుండి దూరం కావడమే అనే అద్భుత ప్రకటన చేశారు. దీనికి యావత్‌ భారతదేశం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాల్సిందే.

వివేకానందుడు 1898 జూన్‌ 10 నాడు తన మిత్రుడు మహమ్మద్‌ సర్ఫరాజ్‌ హుసేన్‌కు రాసిన లేఖను డిస్కవరీ ఆఫ్‌ ఇండియాలో జవహర్‌లాల్‌ నెహ్రూ ఉటంకించారు. ఎంతో విశ్లేషణాత్మకమైన ఉత్తరంలో మన మాతృభూమికి హిందూ, ముస్లిం అనే రెండు గొప్ప మతాల కూడలిలో... వేదాంతం బుద్ధి అయితే, ఇస్లాం శరీరం అని రాశారు. దీన్ని అర్థం చేసుకొని హిందువులు, ముస్లిములు ఐక్యంగా ఉండి మళ్ళీ ఈ దేశ ఉజ్జ్వల భవిష్యత్తును రాబోయే తరాలకు అందించాలని కోరారు.

1995 డిసెంబర్‌ 11న సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పులో హిందూ అన్న పదానికి సంబంధించిన అయోమయాన్ని తొలగించి స్పష్టమైన తీర్పునిచ్చింది. హిందూ, హిందుత్వ, హిందూయిజం అన్న పదాలకు నిర్దిష్టమయిన అర్థాన్ని చెప్పలేమని, అయితే ఆ పదం నుంచి భారతీయ సంస్కృతీ పరంపరను, వారసత్వ సంపదను వేరుచేసి సంకుచిత మతానికి పరిమితం చేయలేమని, అది ప్రజల జీవన విధానమని స్పష్టం చేసింది.

హైదరాబాదులో ఒక సమావేశంలో సాంస్కృతిక జీవన విధానాన్ని సమర్థిస్తూ ఆర్చ్‌ బిషప్‌ ఎస్‌. అరుళప్ప ‘జన్మతః నేను భారతీయుడిని. సంస్కృతిపరంగా నేను హిందువును. విశ్వాసం రీత్యా క్రైస్తవుడిని’ అని హర్షధ్వానాల మధ్యన ప్రకటించారు.

స్వామి వివేకానందునికి ఇష్టమైన సూక్తి – ‘‘ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి’’. యువత వేగవంతంగా ముందుకు తీసుకుపోవలసిన స్పూర్తిని రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణ ఇస్తుందని ఆశిద్దాం.

- సీహెచ్‌ విద్యాసాగర రావు 
మహారాష్ట్ర మాజీ గవర్నర్‌

మరిన్ని వార్తలు