అందరి చూపు... రామప్ప వైపు..!

28 Jul, 2021 16:01 IST|Sakshi

సందర్భం

దాదాపు 200 సంవత్సరాల పాటు సుస్థిర పాలనను అందించి, వర్తక, వాణిజ్య, వ్యవసాయాభివృద్ధితో పాటు, సాహిత్యం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనాలను పోషించిన కాకతీయులు తెలుగునాట, ప్రత్యే కించి తెలంగాణలో వేయికి పైగా దేవాలయాలను నిర్మించారు. హన్మ కొండలోని వేయి స్తంభాలగుడి, వరంగల్‌ కోటలోని శంభుని గుడి, ఘనపూర్‌లోని కోటగుళ్లు, పాలంపేటలోని రామప్ప దేవాలయం కాకతీయ శిల్పకళా కౌశలానికి అద్దంపడుతున్నాయి. కాకతీయ చక్రవర్తి గణ పతిదేవుని సైనాధ్యక్షుడైన రేచర్ల రుద్రారెడ్డి పాలంపేటలో తన పేరిట రుద్రేశ్వర ఆలయాన్ని, సముద్రాన్ని తలపించే చెరువును క్రీ.శ.1213లో నిర్మించాడు. 

పరచుకొన్న పచ్చటి తివాచీలాంటి ప్రకృతి ఒడిలో, అందాన్ని మరింత ఇనుమడింపజేసే కొండపానుపుల దిగువనున్న పాలంపేటలో తాను కూడా తన ప్రభువు మాదిరే శివునికి ఒక వినూత్నమైన ఆలయాన్ని నిర్మించా లనుకొని, అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకొన్నాడు. తానొక అద్భుత ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నానని, కాకతీయ సామ్రాజ్యానికే మణిమకుటంగా ఆ ఆలయం భాసిల్లాలనీ తన తలంపును ప్రకటించాడు. ఇక అంతే! అద్భుత ఆలయాల నిర్మాణంలో సిద్ధహస్తులైన కాకతీయ శిల్పులు, అప్ప టివరకూ అందుబాటులో ఉన్న ఆలయాలకు భిన్నంగా, ఒక అపురూప దేవాలయాన్ని బట్టపై చిత్రించి, కొయ్యలో నమూనా దేవాలయాన్ని చెక్కి చూపించారు. 

మునుపటి కళ్యాణీ చాళుక్య దేవాలయాల వాస్తునే ఎంచుకొన్నా, నిర్మాణం వరకే ఆ శైలికి పరిమితమై, ఎల్తైన ఉపపీఠంలో మరిన్ని వరుసలు చేర్చి, తమ ప్రయోగ పరం పరలో సాటిలేని మేటి భూమిజ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏమంత లోతు లేని పునాదుల్ని రచించి, ఆధారశిలతో ప్రారంభించి, నక్షత్రాకారపు ఉపపీఠాన్ని ప్రద క్షిణాపథంగా తీర్చిదిద్దారు. కట్టడభాగాలకు పాలంపేట, రామానుజపురం మధ్యలో గల ఎర్ర ఇసుకరాతిని, ద్వారాలు, రంగమంటప స్థంభాలు, దూలాలు, మధ్య కప్పులు, రుద్రేశ్వర శివలింగపానపట్టాలు, నంది వాహనం, రంగ మండపం ముందుభాగంలో చుట్టూ మదనికలు, అలసకన్యలు, నాగినులు, సురసుందరీమణులను బోలిన అందాలొలికే అప్సరసలాంటి యువతుల శిల్పాలను నల్ల శానపు రాతితోనూ, కప్పుపైన శిఖరా (విమానా)న్ని నీళ్లపై తేలియాడే ఇటుకలతో నిర్మించబోతున్నామని వివరించగా, రుద్రుడు, చిరునవ్వుతో ఆమోదాన్ని తెలిపాడు.

అపురూప ఆలయ రూపురేఖల గురించి విన్న గణపతి దేవచక్రవర్తి, మహారాణి సోమలదేవి, ప్రధానులు, మహా ప్రధానులు ఎప్పుడు పూర్తవుతుందా అని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఎర్ర ఇసుక రాయి స్థానికంగానే దొరికినా, ద్వారాలకు స్తంభాలకు కావలసిన నల్ల శానపు రాతిని ఖమ్మం చుట్టు పక్కల నుంచి తరలించాల్సి రావటంతో మండప నిర్మాణం కొంత ఆలస్యమైంది. విమానానికి కావలసిన సున్నాన్ని ఏటూరు నాగారం నుంచి, తేలికపాటి ఇటుకల కోసం చెరువు అడుగుభాగం మట్టిని తెచ్చి, రంపపు పొట్టు, ఊక, తుమ్మ చెక్క, కరక్కాయలు, బెల్లం కలిపి, బాగా కలియదొక్కి, ఇటుక పెళ్లలను పోతపోసి, ఆవంలలో కాల్చి సిద్ధం చేసుకొన్నారు. చిన్నదైనా మన్నికగల అధి ష్ఠానాన్ని రచించి, ఎల్తైన గోడలు, వాటిపై పొలాల్లో రైతులు వేసుకునే మంచె లాంటి కోష్టాలను, వాటిపైన శిఖరం, కలశాలతో అలంకరించారు. గోడలపైన కప్పు భాగంలో బాగా విస్తరించిన ప్రస్తరకపోతాన్ని తీర్చిదిద్ది, వర్షపు నీరు ఆలయ గోడలపై పడకుండా జాగ్రత్తలు తీసుకొని, నిర్మాణ పరంగా ఆధునిక ఇంజనీర్లకు ఏమాత్రం తీసిపోమని కాక తీయ శిల్పులు ఆనాడే నిరూపించారు. 

తెలంగాణ దేవాలయాల్లో మేటి, కాకతీయ కళా కౌశలానికి మచ్చుతునక రామప్ప దేవాలయం. సార్వత్రిక కళా నైపుణ్యంతో, అబ్బురపరచే సాంకేతిక పరిజ్ఞానానికి, మేధో మథనమందించిన సృజనాత్మకతకు నిదర్శనంగా ప్రపంచ దృష్టినాకర్షించి, తెలంగాణ తల్లి కీర్తి కిరీటంలో మణి మకుటంగా వెలుగొందుతూ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబి తాలో చోటును దక్కించుకొంది. ప్రతి తెలుగువాడికీ గర్వ కారణమైంది.

రామప్ప ఎవరో తెలియదుగానీ, అన్నీ తానై అపురూప ఆలయాన్ని సృష్టించిన రేచర్ల రుద్రసేనాని, 31–3–1213న ఆలయంలో తన పేరిట రుద్రేశ్వరుని ప్రతిష్టించి, చరిత్రలో మిగిలిపోయాడు. విశ్వకర్మ దిగొచ్చి రామప్ప అవతారమెత్తి, రేచర్ల రుద్రునితో భూలోక పుష్పకాన్ని మనకందించి, తర తరాల తెలుగువారి కీర్తికి స్ఫూర్తిగా నిలిచాడు.


- ఈమని శివనాగిరెడ్డి 

వ్యాసకర్త స్థపతి, సీఈవో, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌.

మరిన్ని వార్తలు