దివంగత  వైఎస్సార్‌: చిరునవ్వుల వేగుచుక్క 

2 Sep, 2021 08:58 IST|Sakshi

తెలుగునేల మీద ఎవరూ చెరపలేని నిఖార్సయిన చెరగని సంతకం దివంగత  వైఎస్సార్‌. రాజకీయాలకు అతీతంగా బీదాబిక్కీ ప్రజానీకాన్ని అక్కున చేర్చుకున్నారు. అందుకే మరణానంతరం కూడా వైఎస్సార్‌ను జనం అంతలా ప్రేమిస్తున్నారు. మహానేత అంటూ పూజిస్తున్నారు. నిజంగానే మహానేత అనేది వైఎస్సార్‌కు పర్యాయపదమై పోయింది. గుండెను గుడిని చేసుకుని వైఎస్సార్‌ను దేవునిలా కొలుస్తున్నారు. ఇళ్ళలో దేవుని పటం పక్కన మహానేత ఫొటో పెట్టుకుని పూజలు చేసుకుంటున్నారు. తమ బతుకులు పండించిన దేవుడు వైఎస్సార్‌ అనుకుంటూ, ఆనాటి పాలనను సువర్ణ యుగంగా తలపోసుకుంటున్నారు.

2010 లో ఓ చర్చా కార్యక్రమంలో  నన్ను ఓ ప్రశ్న అడిగేరు. ‘వైఎస్సార్‌ను ఇంతలా ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారు’ అని. ‘ప్రజలను, పల్లెలను మరచిపోయిన గత పాలకుల పాలనకు భిన్నంగా, నేలతల్లినీ, పచ్చదనాన్నీ, పల్లెపట్టులనూ, రైతునీ, పాడీనీ, పంటనూ, పేదా బీదా ఆరోగ్యాన్నీ, వారి సొంత గూడునీ, పేద పిల్లల చదువునూ, పేదేళ్ల ఉన్నతినీ ఆలోచించి, వారి కోసం పాటుపడిన పాలన వైఎస్సార్‌ది కాబట్టి. బీద బిక్కీ బతుకుల్ని స్పృశించి, వారికేమి కావాలో అది చేసి  చూపించేరు వైఎస్సార్‌ కాబట్టి జనం ఆరాధిస్తున్నారు’ అని చెప్పాను.

అవును. 2004లో వైఎస్సార్‌ అధికారంలోకి రాకుండా ఉంటే ఏమయ్యేది? పల్లెలను, పేదోళ్ళను, రైతులను గాలికొదిలి, లేనిపోని  టెక్నాలజీ భ్రమలలో, మొత్తం పాలనంతా, బడా బాబుల డాబుగా మారిపోయి ఉండేది. వైఎస్సార్‌ రాకతో  పేదోడికి పట్టాభిషేకం చేసే పాలనకు అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత వచ్చే పాలకులు కూడా తప్పని సరై పేదోడి అవసరాలను, రైతుల ఇక్కట్లను పట్టించుకోవలసిన అవసరం ఏర్పడింది. అంతటి బలమైన ముద్ర వైఎస్సార్‌ది. వైఎస్సార్‌ ఆశయాలే తన జెండాగా, తన పార్టీ ఎజెండాగా, తండ్రి ఓ అడుగు వేస్తే, తను మరో నాలుగడుగులు  వేస్తున్న వైఎస్‌ జగన్‌ పాలనలో వైఎస్సార్‌ సజీవమై బ్రతికి ఉన్నారనీ, భవిష్యత్తులో కూడా బతికే ఉంటారనీ, ఘంటాపథంగా చెబుతున్నాను.
– రమాప్రసాద్‌ ఆదిభట్ల, విశ్రాంత డైరెక్టర్‌
యూజీసీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, విశాఖపట్నం.
 మొబైల్‌ 93480 06669 

మరిన్ని వార్తలు