ఈ కులమతాల ముద్రలెందుకు?

10 Jan, 2021 01:14 IST|Sakshi

సందర్భం

నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన దాదాపు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రతి పక్ష నేతగా పనిచేశారు. ఇంతటి అనుభవ మున్న వ్యక్తి.. ఏపీలో ప్రస్తుతం సీఐడీ అధిపతిగా ఉన్నవారు ఒక మతానికి చెందిన వ్యక్తి కాబట్టి రామతీర్థం విగ్రహ విధ్వంసం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారని అన్నట్లు 6 జనవరి 2021న మీడియాలో చూశాను. అలాగే హిందువులపై దాడి జరిగితే ఖబడ్దార్‌ అని కూడా చంద్ర బాబు అన్నారని వార్తలొచ్చాయి. ఆయన అలా అనే బదులు ఏ మతం వారూ మరో మతంవారిపై, వారి మందిరాలపై దాడి చేసినా అది మంచిదికాదు అని చెప్పి ఉండాల్సింది. ఎవరు ఎవ రిపై దాడి చేసినా సహించం అనాల్సింది.

అధికారులకు కులాన్ని, మతాన్ని అంటగడితే ఏ అధికారి కూడా చట్టప్రకారం పని చేయలేడు. ఏ అధికారి అయినా విధి నిర్వహణలో అవినీతి, అలక్ష్యానికి పాల్పడినా, లేదా పక్షపాతం చూపినా ఆ అధికారిమీద తప్పకుండా చర్య తీసుకోవాలి. మన సమాజంలో అత్యంత నిజాయితీ పరులు, అత్యంత అవినీతిపరులు అన్ని కులాల్లో, మతాల్లో ఉన్నారు. ఈ రోజు ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తి అధికారంలో ఉండ వచ్చు. రేపు మరో కులానికి, మతా నికి చెందిన వ్యక్తి అధికారంలోకి రావచ్చు. అతడు ఏం చేస్తున్నాడు, పేద ప్రజలకు లాభం చేస్తున్నాడా లేదా? రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతున్నదా లేదా అతడేమైనా అవినీతికి పాల్పడుతున్నాడా? ఎక్కడైనా పక్షపాతం చూపుతు న్నాడా– వాటిని గమనించాలి. పొరపాటు ఉంటే ఖండించాలి.

అంతే కానీ, అతని కులాన్ని బట్టి, మతవిశ్వాసాలను బట్టి ఆ వ్యక్తిని అంచనావేయడం చాలా తప్పు. చంద్రబాబు నాయుడి వంటి పరిపాలనా అనుభవం కలిగిన నాయకులు కులభేదాలను ప్రస్తావిస్తూ ఈ విధంగా మాట్లాడితే సమాజం విచ్ఛిన్న మౌతుంది. ప్రజలు అధికారుల పట్ల, న్యాయమూర్తుల పట్ల విశ్వాసం కోల్పోతారు. రాజ్యాంగ వ్యవస్థ మనుగడ పెను ప్రమా దంలో పడుతుంది. కులమత భేదాలు, ఘర్షణలు ఎక్కువై పోతాయి.  ఒక చిన్న ఉదాహరణ. మా నాన్నగారు గొప్ప రామభక్తులు. నిరంతరం రామనామం ఆయన పెదాలపై ఉండేది. అమ్మ నిరంతరం పూజలు పునస్కారాలు చేసేది, కానీ ఎంతోమంది ఇతర మతస్తులకు, ఇతర కులాలవారికి మా ఇంట్లో మాతోపాటు భోజనం పెట్టేవారు. ఎంతోమంది పేద విద్యార్థులకు వారు తోడ్పడ్డారు. ఏ రోజూ కుల, మత భేదాలు పాటించలేదు. 

కాబట్టి నేను అందరిని కోరుతున్నది ఏమిటంటే అధి కారంలో ఉన్నవారికి కులాలకు, మతాలను ఏ పరిస్థితుల్లోనూ ఆపాదించవద్దు. శంకరన్‌ లాంటి ఐఏఎస్‌ అధికారి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో శ్రమించారు. ఆదివాసీల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.అధికారుల్లో, న్యాయమూర్తుల్లో ఏ కులం వారైనా ఉండ వచ్చు. ఒక అధికారి, న్యాయమూర్తి ఫలానా కులం వ్యక్తి కాబట్టి ఒక కేసులో వాది, ప్రతివాది లేదా ముద్దాయి అతని కులంవాడు కాబట్టి ఆ అధికారి లేదా న్యాయమూర్తి న్యాయం చేయడేమో అని అనుమానిస్తే ఇక ఎవరూ దర్యాప్తు చేయలేదు. ఏ కేసును విచా రించలేదు. ఇలా ఐతే ఈ రాజ్యాంగ వ్యవస్థ కూలిపోతుంది.

రేపటి రోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురుకావచ్చు. చంద్రబాబు ప్రకటన ఆధారంగా ఒక  నేరంలో క్రైస్తవులు గానీ ముస్లింలు గానీ ముద్దాయిలుగా ఉంటే ఏ హిందూ అధికారీ వారిని విచారించగూడదని క్రైస్తవులు  లేదా ముస్లింలు డిమాండ్‌  చేయవచ్చు.  అలాగే దళితులు ముద్దాయిలుగా ఉంటే వేరే కులం వారు తమను విచారణ చేయకూడదని డిమాండ్‌ చేయవచ్చు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక దేవాలయంలోని పూజారి ఒక స్త్రీని ఇతరులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడనే వార్త చూశాము. ఇక నేరం చేసిన వ్యక్తి పూజారి (బ్రాహ్మణుడు) కాబట్టి బ్రాహ్మణ కులానికి చెందిన ఏ అధికారి కూడా ఆ పూజారిని విచారించవద్దంటే ఎలా వీలవుతుంది? ఇలా ప్రతీ కేసులో, ప్రతీ విచారణలో విచారణ చేస్తున్న వారిది ఏ మతం, ఏ కులం, ఆ కేసులోని వ్యక్తులది ఏ కులం అని చూడడం మొదలు పెడితే మన సమాజం విచ్ఛిన్నమౌతుంది. కుల, మత ద్వేషాలు పెరుగు తాయి. జస్టిస్‌ ఒ. చిన్నపరెడ్డి, జస్టిస్‌ కృష్ణయ్యర్, జస్టిస్‌ రంగ నాథ్‌ మిశ్రా, జస్టిస్‌ రామస్వామి, జస్టిస్‌ పి. వెంకటరామిరెడ్డి లాంటి విశిష్ట న్యాయమూర్తులు ఏ రోజైనా కుల మతాల గురించి ఆలోచించారా– ఏనాడైనా వారు విచారణ క్రమంలో పక్షపాతం చూపారా; అన్ని కులాల నుంచి వచ్చిన వారిలో ఎంతో నిజాయితీ, నిబద్ధత కల్గిన అధికారులు, న్యాయమూర్తులు ఉంటారు.

బ్రాహ్మణకులంలో పుట్టిన గురజాడ అప్పారావు భర్తలు చనిపోయిన స్త్రీలకు మరో వివాహం చేసుకొనే హక్కు ఉండాలని స్త్రీలకు విద్య కావాలని పోరాడలేదా? అంబేడ్కర్‌ స్త్రీలకు సమాన ఆస్తిహక్కు ఉండాలని వాదించలేదా?అలాగే బ్రాహ్మణుడైన రామకృష్ణ పరమహంస, కాయస్త కులానికి చెందిన వివేకానందుడిని ప్రథమ శిష్యునిగా చేర్చు కోలేదా? పోతులూరి వీరబ్రహ్మం.. దూదేకుల సిద్ధయ్యను తన ప్రథమ శిష్యుడిగా తీర్చిదిద్దలేదా? షిరిడీసాయి అన్ని కులాల వారిని, మతాలవారిని సమానంగా చూడలేదా? మహాత్ములు ఎవ్వరూ ఏ మతం వారైనా ఏ కులం వారైనా కులమత భేదాలను పాటించలేదు. ఒకవైపు ఎందరో కులాంతర వివాహాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో వ్యక్తులందరికీ..  ముఖ్యంగా అధికారులకు కులం అంట గట్టడం విద్వేషాలను పెంచే యత్నంగా భావించాల్సి వస్తుంది. ఇక ముందైనా మన రాజకీయ నాయకులు కాస్త విజ్ఞతతో, ఇంగితజ్ఞానంతో మాట్లాడతారని ఆశిద్దాం.

-జస్టిస్‌ చంద్రకుమార్‌ 
వ్యాసకర్త విశ్రాంత న్యాయమూర్తి
మొబైల్‌ : 79974 8486

మరిన్ని వార్తలు