నూతన రెవెన్యూ చట్టంలో ఎన్నెన్నో చిక్కుముడులు

18 Oct, 2020 00:47 IST|Sakshi

సందర్భం

భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల చట్టం 2020 తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ సమ్మతితో తెలంగాణ రాజపత్రం ద్వారా 19.9.2020 నుండి అమలులోకి వచ్చింది. సాధారణ పరిభాషలో అందరూ దీనిని నూతన రెవెన్యూ చట్టంగా పిలుస్తున్నారు. సెక్షన్‌ 15లోని నూతన చట్టం ద్వారా గత భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల చట్టం 1971 పూర్తిగా రద్దుపరచబడింది. గత చట్టాన్ని, ప్రస్తుత నూతన రెవెన్యూ చట్టాన్ని సమగ్రంగా పరిశీలిస్తే గత చట్టం లోని ప్రాముఖ్యత కలిగిన అంశాలైన సాదా చైనా మాల ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమ బద్ధీకరణ, తప్పులను సవరించడం, సవరణలను చేయడం, వాస్తవంగా సాగు చేస్తున్న వారిని గుర్తిం చడం ద్వారా పాస్‌బుక్‌ ఇవ్వడం, రెవెన్యూ కోర్టుల ద్వారా పరిష్కారాన్ని చూపడం నూతన రెవెన్యూ చట్టంలో సంపూర్తిగా తొలగించారు. నూతన రెవెన్యూ చట్టంలో ఈ క్రింది అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది.

1. ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా భూమి యజమా నుల హక్కులను గుర్తించి పాస్‌బుక్‌–టైటిల్‌ డీడ్‌ జారీ చేయటం. 2. తహసీల్దార్‌కే రిజిస్ట్రార్‌ అధికా రాలను కల్పించి రిజిస్టర్‌ ఒప్పందం పూర్తయిన వెంటనే పట్టాదారు పాస్‌ జారీ చేయడం. 3. రెవెన్యూ అధికారుల విచక్షణాధికారాలు పూర్తిగా తొలగించారు. 4. ప్రత్యేక ట్రిబ్యునల్‌ ద్వారా ఇప్పుడు పెండింగ్‌ ఉన్న కేసుల పరిష్కారం, అట్టి తీర్పు అంతిమం. నూతన రెవెన్యూ చట్టంలో అతి ప్రాధాన్యత కలిగిన న్యాయపరమైన అంశం ‘ధరణి’ పోర్టల్‌. నూతన చట్టంలో సెక్షన్‌ 3 ద్వారా, సెక్షన్‌ 2(3) ద్వారా ప్రభుత్వం ‘ధరణి’ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌గా గుర్తించి ప్రభుత్వం దాన్ని నిర్వ హిస్తుంది. కానీ హడావుడిగా తెచ్చిన నూతన చట్టంలో చాలా సమస్యలకు పరిష్కారం లభిం చదు. ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్‌ విజయదశమి నాడు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. లోపాలు లేకుండా అన్ని సమస్యలకు సమాధానం చెబుతూ ముఖ్యంగా భూమి సంబంధించిన చట్టాల్ని తయా రుచేయడం అంత సులభం కాదు. ఈ చట్టంలో సాంకేతికతకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం సదు ద్దేశం అయినా నైపుణ్యం లేని శక్తుల ద్వారా సేకరిం చిన పలు అంశాలు క్రోడీకరించడంవల్ల జరిగే తప్పిదాలకు, లోపాలకు సామాన్య భూ యజమా నులు ముఖ్యంగా నిరక్షరాస్యులైన రైతులు అవస్థలు అనుభవిస్తారు. ప్రతి చిన్న పొరపాటుకు సవరణకు సివిల్‌ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది.

కోడ్‌ అండ్‌ సివిల్‌ ప్రొసీజర్, 1905లో సెక్షన్‌ 9 ప్రకారం ఎలాంటి సివిల్‌ తగాదాను పరిష్కరించే అవకాశం సివిల్‌ కోర్టుకు ఉంటుంది. కానీ, కోడ్‌ అండ్‌ సివిల్‌ ప్రొసీజర్‌లోని సెక్షన్‌ 152 నుండి అధికారాన్ని తహసీల్దార్‌ ఇవ్వకపోవడంవలన ప్రతి చిన్న పొరపాటుకు, తప్పుకు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. అది పేదలైన రైతులపై ఆర్థిక భారం, సమయ భారం పడుతుంది. ఒక రైతుకు గ్రామంలో 16వ సర్వే నెంబర్‌లో ఎ2.30 గుంటల భూమి ఉంది. పొరపాటున అట్టి విస్తీర్ణాన్ని ఎ2.03 గుంటలు అని ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తే, ఆ రైతు రికార్డులో తక్కువగా నమోదు చేయబడిన 27 గుంటల భూమి కోసం సివిల్‌ దావా వేయాలి. అట్టి పొరపాటు సాంకేతిక లోపంవల్ల జరిగిందని వివరిస్తూ రైతు తగిన సాక్ష్యాధారాలు కోర్టు ముందుంచినప్పుడే కోర్టు రైతుకు అనుకూలంగా తీర్పు ఇస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు సంవత్సరాల వరకు తుది తీర్పు రావడం కష్టం. అట్టి పరిస్థితులలో పేద రైతులకు ప్రభుత్వం అందించే సహాయం కోల్పోవలసి వస్తుంది. ఒక చిన్న సమస్య అతి చిక్కుముడి సమస్యగా మారుతుంది. నూతన చట్టంలోని సెక్షన్‌ 5ను ఒక సారి పరిశీలిస్తే ఈ సెక్షన్‌ కౌలు ఒప్పందాల్ని గుర్తిం చడం లేదు. కౌలు ఒప్పందాన్ని రిజిస్టర్‌ చేసే అవకాశం ఉందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. నూతన చట్టం వాస్తవంగా సాగు చేస్తున్న వారిని గానీ కౌలుపత్రం ద్వారా సాగు చేస్తున్న వారిని గుర్తించడం లేదు. 1.4.1999 నుండి వీలునామా ద్వారా అనుభవిస్తే అట్టి పత్రాన్ని తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయాలి.

నూతన చట్టంలోని సెక్షన్‌ 6 ద్వారా తహ సీల్దారుకు కుటుంబసభ్యుల మధ్య భాగ పంపిణీకి వెసులుబాటు ఉంది. ఎప్పుడైతే కుటుంబ పెద్ద చనిపోతాడో అతని వారసులు భాగ పరిష్కారానికి తహసీల్దార్‌ ముందు నమోదు చేసుకొని పట్టాదారు పాస్‌ పుస్తకం పొందవచ్చు. ఒక కుటుంబ యజ మానికి వేర్వేరు మండలాల లోని భూములు ఉండే ప్రతి మండలం ఆ భూముల భాగ పరిష్కారం ప్రతి మండలంలో చేసుకోవాలి అన్నది ప్రశ్న. మరొక విషయం ఏమిటంటే ఆ యజమానికున్న ఇతర స్థిర ఆస్తులు ఉదాహరణకు ఇల్లు, చర ఆస్తుల భాగ పరిష్కారం ఎక్కడ నమోదు చేయించుకోవాలి అనేది ప్రధాన సమస్య. సమయాభావంవల్ల ఏ  ఒక్క భాగస్వామి సహకరించకపోతే భాగ పరిష్కా రమయ్యే అవకాశం ఉండదు. అన్ని ఆస్తుల భాగ పంపిణీకి ఏదైనా ఒక రిజిస్ట్రార్‌ దగ్గరే నమోదు చేసే అధికారం కల్పించి పని భారం తగ్గించడం సమంజసం. ఈ చట్టం కేవలం వ్యవసాయ భూమికి సంబంధించే కాబట్టి మిగతా ఆస్తుల విషయంలో భాగ పంపిణీకి అవకాశం లేదు. ఒకే కుటుంబ సభ్యులను నాలుగు కార్యాలయాల చుట్టూ తిరగమనడం సమంజసమేనా?

మరో ప్రముఖ సమస్య ఏమంటే ఇదివరకే భాగ పంపిణీ అయిన భూములను సర్దుబాటు చేసుకొనే అవకాశం లేకపోవడం. భూయజమాని చనిపోయిన తర్వాత ఇదివరలో ప్రతి సర్వే నెంబర్‌లో వారసులకు హక్కు కల్పింంచి పాస్‌బుక్‌ ఇచ్చారు. కానీ వాస్తవ సాగు విషయంలోకి వస్తే నమోదైన రికార్డుకు భిన్నంగా ఉంది. ఉదాహరణకు ఒక యజమానికి రెండు వేర్వేరు సర్వే నెంబర్‌లలో భూమి ఉంటే అతని వారసులు ఇద్దరు అనుకొంటే వారి పేర్లను రెండు సర్వే నెంబర్లలో సరిసమానంగా వాటా చూపించారు. వాస్తవానికి ఇద్దరు వారసులు చెరి ఒక సర్వే నంబర్‌లో సాగు చేసుకున్నారు. ఇట్టి సర్వే నెంబర్ల భూమికి ఎలాంటి సంబంధం లేదు. పైగా చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఒక వారసుడు తన స్వాధీనంలో ఉన్న భూమి అమ్మాలంటే ఇతర వారసుడు తప్పక సహకరిం చాలి. సహకరించకపోతే అమ్మకం పూర్తి కాదు. అందుకని వారసులలో ఎవరైతే వాస్తవంగా సాగు చేస్తున్నారో వారికే ఆ సర్వే నంబర్‌ మీద హక్కు కల్పించి పాస్‌ బుక్‌ ఇవ్వాలి లేదా ఇద్దరి దగ్గరనుంచి అఫిడవిట్‌ తీసుకుని ఆ తహసిల్దారు ముందు హాజరై పాస్‌బుక్‌ తీసుకునే ఏర్పాటు చేయాలి. లేకుంటే ఇద్దరు వారసుల మధ్య తగాదా మొదలై సివిల్‌ తగాదాకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి చిక్కు ముడికి జవాబు ఇవ్వకపోవడం ప్రధాన లోపం.

నూతన రెవెన్యూ చట్టంలోని 16వ అధికరణం ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దాదాపు 16 వేల కేసులను బద లాయిస్తారు. ప్రభుత్వం 16 ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి ఒక సంవత్సరంలో తీర్పులు చెప్పాల్సి ఉంటుంది. విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా నియమించాలనుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలో 16మంది విశ్రాంత న్యాయ మూర్తులు దొరికే అవకాశం లేదు. ఒక ట్రిబ్యునల్‌ ఒక సంవత్సరంలో వేయికేసులు పరిష్కరించడం దాదాపు అసాధ్యం.
పైన ఉదహరించిన సమస్యల పరిష్కారానికి చిన్నరైతులు మధ్యదళారులను ఆశ్రయిస్తారు. అప్పుడు మధ్య దళారులు వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది  చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించే యంత్రాంగం కొరవడటంతో ఈ చట్టం కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా రైతు బంధు వంటి ప్రభుత్వ పథ కాలను సకాలంలో అందుకోకపోవడం వలన రైతులు కష్టాలపాలు కావచ్చు.

నూతన రెవెన్యూ చట్టంలో తహసిల్దారుకు కానీ, కలెక్టర్‌కు కానీ పొరపాటును సవరించడానికి అధికారం లేకపోయినప్పటికీ, పైగా చాలా సమ స్యలలకు తక్షణ పరిష్కారాలు లేనప్పటికీ, కావా లని తప్పు చేసిన తహసిల్దారును తొలగించే అధి కారం కలెక్టరుకు ఉండటం, క్రిమినల్‌ చర్యలు తీసు కునే అవకాశం ఉండటం వల్ల తహసిల్దారు జాగ్ర త్తగా పనిచేసి రైతులకు, భూ యజమానులకు మేలు జరుగుతుందనేది నిర్వివాదాంశం.
 


కూతురు రవీందర్‌ రెడ్డి
వ్యాసకర్త విశ్రాంత జిల్లా న్యాయమూర్తి,
హైకోర్టు న్యాయవాది

మొబైల్‌ : 94406 80789

మరిన్ని వార్తలు