వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?

25 Apr, 2022 01:08 IST|Sakshi

ద్వేషాన్ని, వివక్షను స్వయంగా అనుభవించడం వేరు; బయటి నుంచి దాన్ని తెలుసుకోవడం వేరు. భారత్‌లో ఒక ముస్లింగా ఉండటం అనేది ఎలా ఉంటుందో స్వయంగా అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారికే తెలుసు. నిరుపేదలూ, నిరక్షరాస్యులైన ముస్లింలు కూడా ఈరోజు ద్వేషాగ్ని బారిన పడుతున్నారు. అయినా మనలో చాలా మందిమి ఇంకా ముస్లింలను ఈ దేశంలో బుజ్జగిస్తున్నారని భావిస్తుండటమే దారుణం. మన దేశంలో ప్రతి రంగంలోనూ ముస్లింల ప్రాతినిధ్యం వారి జనాభాతో పోలిస్తే కింది స్థాయిలోనే ఉందన్నదే నిజం. ఆర్థిక, సామాజిక అంశాల్లో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకంటే ముస్లింల పరిస్థితే ఘోరంగా ఉందని సచార్‌ కమిటీ దశాబ్దిన్నర కాలం క్రితమే తేల్చి చెప్పింది. నిజాలు ఇలా ఉండగా... ఇంత ద్వేషపూరిత వాతావరణాన్ని ఇన్నేళ్లుగా, నిరవధికంగా దేశీయ ముస్లింలు భరిస్తూ ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మంచివారు లేచి నిలబడి చెడుకు వ్యతిరేకంగా ఏమీ చేయనప్పుడే సమాజంలో దుష్టత్వం సంభవిస్తుంది. 

ఈ వారం నేను ఒక ప్రశ్న సంధించాలని అనుకుంటున్నాను. మీరు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించినట్లయితే, మన దేశంలో ఇవాళ జరుగుతున్న అత్యంత విషాదకరమైన, కలవరపెట్టేటటువంటి పరివర్తనలను మీరు అర్థం చేసుకోవడంలో నా ప్రశ్న మీకు సహాయపడుతుంది. ఈరోజు మన భారతదేశంలో ఒక ముస్లింగా ఉండటం అంటే ఎలా ఉంటుందో నన్ను కాస్త వివరించనివ్వండి. అలాగని నేను సంపన్నులను, ప్రభావశీలురను లేదా బాగా చదువుకున్న ముస్లింల గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేకించి తమకు అందుతున్నదానితో బతకడం తప్ప మరేమీ చేయలేని నిరుపేద, నిరక్షరాస్యులైన ముస్లింల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ముస్లింలలో వీరి జనాభానే అధికంగా ఉంటోంది. వీరిలో ఒకరిగా ఉన్నట్లయితే మనకు ఏమనిపిస్తుంది అనేదే నా ప్రశ్న.

అనుభవిస్తేనే బాధ తెలుస్తుంది!
ద్వేషాన్ని, వివక్షను స్వయంగా అనుభవించడం వేరు; బయటినుంచి దాన్ని తెలుసుకోవడం వేరు. భారత్‌లో ఒక ముస్లింగా ఉండటం అనేది ఎలా ఉంటుందో స్వయంగా అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారికే తెలుసు. కొన్ని నెలలుగా తమను ఊచకోత కోయాలనీ, ముస్లిం జాతినే లేకుండా చేయాలనీ చేస్తున్న పిలుపులను వాళ్లు వింటూ వచ్చారు. అల్లర్లకు తామే కారణమని ఆరోపణలకు గురయ్యారు. వారి ఇళ్లను కూల్చి వేశారు. ఈ చర్యలకు పాల్పడినట్లు రుజువైన వారిని బాధితులు చూస్తుండగానే క్షేమంగా పంపేశారు. ప్రధాని ఆవాస్‌ యోజన లబ్ధిదారులైన వితంతువులు కూడా బాధితులయ్యారు. పాకిస్తానీ పాటలను విన్నందుకు వారి మైనర్‌ పిల్లలను నిర్బంధించారు. హిందూ పూజారులం అని చెప్పుకున్న పురుషులు ముస్లింల మహిళలపై అత్యాచారం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఇది ఏ రకంగానూ సమగ్రమైన జాబితా కాదు ఇది, ఈ కథనాన్ని రాయడం ప్రారంభించినప్పుడు నా దృష్టికి వచ్చిన అనేక ఘటనలకు సంబంధించిన వివరాల సేకరణ మాత్రమే! మరింత లోతుగా పరిశోధిస్తే ఇలాంటి ఘటనలు ఎన్నో బయటపడే అవకాశం ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి అనుభవాలు మీకు ఎదురై ఉండి ఉంటే మీరు ఏ అనుభూతి పొంది ఉంటారు అన్నదే.

వివక్షా, బుజ్జగింపా... ఏది సత్యం?
నిజంగా విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇంత ఘోరంగా ముస్లింల పట్ల వ్యవహరిస్తున్నప్పటికీ మనలో చాలామందిమి ఇంకా ముస్లింలను ఈ దేశంలో బుజ్జగిస్తున్నారని భావిస్తుండటమే! మనం వాస్తవాలను మాత్రమే తెలుసుకున్నట్లయితే, మన దేశంలో ప్రతి రంగంలోనూ ముస్లింల ప్రాతినిధ్యం వారి జనాభాతో పోలిస్తే కింది స్థాయిలోనే ఉందన్నదే నిజం. 2006 సంవత్సరంలోకి వెళ్లి చూసినట్లయితే, ఆర్థిక, సామాజిక అంశాల్లో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకంటే ముస్లింల పరిస్థితే ఘోరంగా ఉందని సచార్‌ కమిటీ తేల్చి చెప్పింది.

ఈ ఒక్క వాస్తవమే మనదేశంలో ముస్లింల అసలైన స్థితిగతులను తేటతెల్లం చేస్తోంది. నేను ఆకార్‌ పటేల్‌  రాసిన ‘అవర్‌ హిందూ రాష్ట్ర’ పుస్తకంపై ఆధారపడి ఈ విషయాలు చెబుతున్నాను. దేశ జనాభాలో ముస్లింలు 15 శాతంగా ఉన్నారు కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల వాటా 4.9 శాతం మాత్రమే. పారామిలిటరీ సర్వీసులో 4.6 శాతం మంది ముస్లింలు ఉండగా, ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌ ఉద్యోగాల్లో ముస్లింల వాటా 3.2 శాతం మాత్రమే. ఇక సైన్యం విషయానికి వస్తే 1 శాతం మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు.

దామాషా ప్రాతినిధ్యం ప్రకారం అయితే పార్లమెంటులో 74 సీట్లు ముస్లింలకే ఉండాలి. కానీ 27 మంది ముస్లింలు మాత్రమే ప్రస్తుత పార్లమెంటులో ఉన్నారు. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేడంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 15 రాష్ట్రాల్లోని మంత్రివర్గాల్లో ఒక్క ముస్లిం మంత్రీ లేరు. 10 రాష్ట్రాల్లో ఒకే ఒక్క ముస్లిం మంత్రి ఉన్నారు. అది కూడా మైనారిటీ వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ పదవి మాత్రమే వీరికి దక్కుతోంది.

అందులోనూ అన్యాయమే...
2014లో గానీ, 2019లో గానీ భారతీయ జనతా పార్టీ తరçఫున ఒక్క ముస్లిం కూడా లోక్‌సభ ఎంపీగా లేరు. 1998 నుంచి గుజరాత్‌ రాష్ట్రం తరపున లోక్‌సభకు గానీ, విధాన సభకు గానీ ఒక్క ముస్లింను కూడా బీజేపీ పోటీలో నిలబెట్టలేదని ఆకార్‌ పటేల్‌ తన పుస్తకంలో రాశారు. అంటే గుజరాత్‌ జనాభాలో 9 శాతం మంది ముస్లింలు ఉన్నా, గత 24 సంవత్సరాలుగా ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బీజేపీ అటు ఎంపీ స్థానానికి గానీ, ఇటు ఎంఎల్‌ఏ సీటుకు గానీ పోటీలో నిలపలేదు. ఇలాంటి పచ్చి నిజాలను నేను ఇంకా ఇంకా చెప్పగలను గానీ చెప్పను. నేను చెప్పదలుచుకున్నది చెప్పేశాను. మన రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ (రా)లో ఒక్క ముస్లింను కూడా నియమించినట్లుగా నేనయితే వినలేదు. ఈ పరిస్థితుల్లో ‘రా’ సంస్థ ఒక ముస్లిం ఉద్యోగిని కలిగి ఉంటేనే మనం ఆశ్చర్యపడాల్సి ఉంటుంది.

అయితే, ఈ వాస్తవాలన్నీ కూడా మనకు బోధపర్చని విషయం ఒకటుంది. ఇంత ద్వేషపూరిత వాతావరణాన్ని ఇన్నేళ్లుగా, నిరవధికంగా భరిస్తూ ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనకు ఈ విషయం నిజంగానే తెలీదు. ఎందుకంటే ఇదంతా మన అనుభవంలోకి రాలేదు కదా! రాజకీయనేతలు నన్ను చెదపురుగు అని పిలుస్తారనీ, బాబర్‌ సంతానం అని నన్ను వర్గీకరిస్తారనీ, పదేపదే నన్ను పాకిస్తాన్‌ వెళ్లిపొమ్మంటారనీ నేనయితే ఊహించలేను. కానీ ప్రతిరోజూ మన ముస్లిం సోదరులూ, సోదరీమణులూ ఈ అనుభవాలనే ఎదుర్కొంటున్నారు.

మౌనమునిత్వం ఇంకా ఎన్నాళ్లు?
మతద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారి మాటలూ, చేతలకూ వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుతూ గత వారమే 13 ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉత్తరం రాశారు. ప్రధాని అలా మాట్లాడతారో లేదో నాకయితే తెలీదు. వాస్తవానికి చాలా కాలంగా ప్రధాని మోదీ ఇలాంటి విద్వేష వాతావరణాన్ని రెచ్చగొట్టే వారి వ్యవహారానికి సంబంధించి మౌనం పాటిస్తున్నారని మాత్రం తెలుసు. కారణాలు ఏవయినా కావచ్చు... అత్యంత క్షుద్ర స్వరాలు మాట్లాడటాన్ని అనుమతిస్తూ వాటి ప్రభావం గురించి ప్రధాని పట్టించుకోకుండా ఉదాసీనతను పాటిస్తున్నారు.

విజ్ఞానం అనేది తరచుగా వాట్సాప్‌ మీమ్స్‌ స్థాయికి కుదించుకుపోతున్న ఈ రోజుల్లో మనందరికీ ఒక విషయం వర్తిస్తుంది. మంచివారు లేచి నిలబడి చెడుకు వ్యతిరేకంగా ఏమీ చేయనప్పుడే సమాజంలో దుష్టత్వం సంభవిస్తుంది. ఈ వాస్తవాన్ని మరింత గంభీరంగా మీరు వర్ణించాలనుకుంటుంటే... జాన్‌ డానీ చెప్పిన సూక్తిని నన్ను చెప్పనివ్వండి. ‘‘ఏ మనిషీ ఒంటరి ద్వీపంలో లేడు. ముస్లింల జీవితాలపై ఈ రోజు మోగుతున్న మృత్యుఘంట రేపు మీ మీదకు కూడా మళ్లవచ్చు.’’ 

కరణ్‌ థాపర్‌,వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు


 

మరిన్ని వార్తలు