పది కాలాలు పదిలంగా ఉండాలంటే...

22 Apr, 2022 01:34 IST|Sakshi

భూమి మీద జరుగుతున్న పర్యావరణ విధ్వంసం గురించి ఆందోళన రానురానూ పెరుగుతున్నది. పర్యావరణ విధ్వంసం తగ్గించే ప్రయత్నాలు జరుగు తున్నా కూడా ప్రకృతి వనరుల భక్షణ మీద దేశాల ఆర్థిక వ్యవస్థల నిర్మాణం కొనసాగడం వల్ల ఫలితాలు రాలేదు. ఈ రోజు అవే ఆర్థిక వ్యవస్థలు కాలుష్య దుష్పరిణామాల భారంతో కుప్పకూలుతున్నాయి. విలువైన ప్రాణాలు పోతున్నాయి. ఆహార లేమి బాధిస్తున్నది. నీటి కొరత ఆందోళన కలిగిస్తున్నది. మానవ సమాజ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నది. ప్రకృతి వనరుల సుస్థిర ఉపయోగంలో పాటించాల్సిన సమన్యాయం అంతకంతకూ కొరవడుతున్నది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా పరిణతి కలిగిన ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కదలాల్సిన అవసరం ఉంది.

అనేక రూపాలలో, అనేక విధాలుగా పుడమి ప్రస్తుతం ఎదుర్కొంటున్న భారీ సంక్షోభానికి దీటుగా అంతర్జాతీయ ప్రతిస్పందన ఉండాలనే ఆకాంక్ష ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నది. అయితే ప్రభుత్వాల స్పందన చాలా నెమ్మదిగా ఉంది. భారతదేశం పర్వతాలు, అడవులు, సముద్రాలు, నదులు, ఇతర జలవనరులతో విలసిల్లుతోంది. 91,000 జాతులకు పైగా జంతువులు, 45,000 జాతుల మొక్కలకు ఇది నిలయం. వీటి ఉనికికి ముప్పు ఉంది. ఫలితంగా, ఆహార ఉత్పత్తికి విఘాతం కలుగు తున్నది. పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలు, సాలెపురుగులు, పగడాలు, చెట్లు మానవ మనుగడకు వివిధ పాత్రల ద్వారా దోహదపడుతున్నాయి. దాదాపు 1,000 జాతులు ప్రమాదంలో పడ్డాయి. ప్రాంతాల వారీగా, ఆయా పరిస్థితుల ప్రభావంతో క్రమంగా అంతరించి పోతున్నాయి. వీటిలో అనేకం ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్స్‌ రెడ్‌ లిస్ట్‌’లో చేర్చారు. వీటిని ఇప్పుడు కాపాడుకోలేకపోతే భూమిపై శాశ్వతంగా అదృశ్యమవుతాయి.

పర్యావరణవాదుల ఒత్తిడి మేరకు 2015లో పారిస్‌లో 197 దేశా లకు చెందిన ప్రపంచ దేశాధినేతలు గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పారిస్‌ ఒప్పందంలో ప్రధాన లక్ష్యం భూతాపాన్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ తగ్గించడం, 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవడం. పారిస్‌ ఒప్పందం మేరకు చేసిన వాగ్దానాలపై ప్రభుత్వాలు వేగంగా వ్యవహరిస్తే, వాతా వరణ మార్పుల వలన ఏర్పడుతున్న విపరిణామాలను నివారించ వచ్చు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉపయోగపడే ప్రభుత్వ విధా నాలను నిలువరించడానికి కొన్ని వర్గాలు సర్వ ప్రయత్నాలు చేస్తు న్నాయి. భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాయి. ‘సీఓపీ 26’లో తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి శిలాజ ఇంధనాల మీద ఒప్పం దానికి రాకుండా, శిలాజ ఇంధనాల మీద అంతర్జాతీయ నిషేధం రాకుండా సఫలీకృతం అయినారు.
విపరీత ప్రకృతి వైపరీత్యాల రూపంలో వాతావరణ మార్పుల గురించి ఏడాదికేడాది స్పష్టత వస్తున్నప్పటికీ, బహుళ జాతి కార్పొరేట్‌ సంస్థలు (కార్బన్‌ ఉద్గారాలు అధిక భాగం వాటివల్లే) శిలాజ ఇంధ నాల కోసం డ్రిల్లింగ్, బర్నింగ్‌ కొనసాగిస్తున్నాయి. శిలాజ ఇంధన వ్యవస్థ ద్వార లాభాలు పొందుతున్న సంస్థలు, వర్గాలు తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి పుడమి భవిష్యత్తును పణంగా పెడుతున్నాయి.

ఈ సంవత్సరం పుడమి దినోత్సవ సందర్భంలో సుస్థిర భవి ష్యత్తు కొరకు పెట్టుబడులు పెంచాలని నినాదం ఇచ్చారు. ప్రధాన మైన మూల పరిష్కారాలు మూడున్నాయి. అన్ని దేశాలు అనుసరిం చాల్సిన మార్గాలు ఇవి. శిలాజ వనరులను భూమిలోనే ఉంచాలి. శిలాజ ఇంధనాలలో బొగ్గు, చమురు, సహజ వాయువు ఉన్నాయి. వీటిని వెలికితీసి కాల్చినకొద్దీ, పర్యావరణం మీద, పంచ భూతాల మీద దుష్ప్రభావం పెరుగుతున్నది. అన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా శిలాజ ఇంధనాల నుండి ప్రత్యా మ్నాయ ఇంధనాల వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. పునరుత్పా దక శక్తిలో పెట్టుబడులు కూడా వేగంగా పెంచాలి.

ప్రధాన ఇంధన వనరులను పరిశుభ్రమైన, పునరుత్పాదక శక్తిగా మార్చడం శిలాజ ఇంధనాల వినియోగాన్ని ఆపడానికి ఉత్తమ మార్గం. వీటిలో సోలార్, విండ్, వేవ్, టైడల్, జియోథర్మల్‌ పవర్‌ వంటి వనరులు ఉన్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి ఈ మార్గాల ద్వారా చేసుకోవడం ఉత్తమమైన పరిష్కారం. పెట్రోల్, డీజిల్‌ వాహనాలు, విమానాలు, ఓడలు శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తాయి. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారడం, విమాన ప్రయాణాన్ని తగ్గించడం వలన వాయు కాలుష్యం తగ్గుతుంది. సుస్థిర రవాణా వ్యవస్థకు మారడం చాలా అవసరం. రాజకీయ నాయకులు,  పార్టీలు ఈ దిశగా ఆలోచన చేసే విధంగా పర్యావరణ స్పృహ పెంచుకున్న ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. ఎన్నికల వేళ పునరుత్పాదక శక్తి వనరుల మీద విధానాల మార్పునకై కృషి చేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసే విధంగా ప్రజలు వ్యవహరించాలి.
వాతావరణంలో పెరుగుతున్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సహజంగా గ్రహించే వ్యవస్థలలో కీలకమైనవి రెండు: దట్టమైన అడవులు, సము ద్రాలు. అడవుల నరికివేతను పూర్తిగా నిషేధించాలి. పచ్చదనాన్ని కాపాడితే, కాలుష్య ఉద్గారాలను ప్రకృతి పరిమితిలో ఉంచే అవకాశం ఏర్పడుతుంది. వాతావరణ మార్పుల వ్యతిరేక పోరాటంలో దట్టమైన అడవులు కీలకం. వాటిని రక్షించడం ఒక ముఖ్యమైన వాతావరణ పరి ష్కారం. 30 నుంచి 100 ఏళ్ళ పైన వయసు గల చెట్లు చాలా ముఖ్యం.

పెరుగుతున్న భూతాపం నేపథ్యంలో సముద్ర జీవావరణ వ్యవస్థలను రక్షించాల్సిన బాధ్యత పుడమి వాసుల మీద ఉన్నది. సముద్రాలు వాతావరణం నుండి పెద్ద మొత్తంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తాయి. సముద్రాల జీవావరణ వ్యవస్థ వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తగ్గించే ఏకైక అతిపెద్ద పెట్టుబడి అవసరం లేని సహజ వ్యవస్థ. ఈ ప్రక్రియ పుడమి వాతావరణాన్ని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. సముద్రాలలో ఉన్న జీవావరణ వ్యవస్థల మీద భూతాపం ప్రభావం కూడా ఉంటుంది. సముద్రాలు వేడెక్కడం వలన అందులోని కోట్లాది జీవాలు అతలాకుతలం అయ్యి, అంతరించే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూ సీఓపీ 26లో ఈ వ్యవస్థ సంరక్షణ మీద చర్చ కూడా చేపట్టలేదు.
పారిశ్రామికీకరణ, భూతాపాల మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్ర వేత్తలు చాలా కాలంగా ప్రస్తావిస్తున్నారు. విధానకర్తలు, పెట్టుబడి దారులు, కంపెనీలు డీకార్బనైజేషన్‌ మార్గంలో వెళ్ళడానికి కలిసి కట్టుగా పర్యావరణ అనుకూల చర్యలు తీసుకోవాలి. నూతన పారిశ్రామిక విప్లవం పర్యావరణహితంగా ఉండాలంటే, వనరుల దోపిడీతో కూడిన ప్రస్తుత పారిశ్రామిక ఉత్పత్తి మారాలి. అటువంటి మార్పు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న సాంప్రదాయ వస్తూత్పత్తి వ్యవస్థల ద్వారా సాధ్యం అవుతుంది. చేనేత వస్త్రోత్పత్తికి ఊతం ఇవ్వడం ద్వారా పర్యావరణం మీద దుష్ప్రభావం గణనీయంగా తగ్గ డంతో పాటు ఉపాధి కూడా పెరుగుతుంది. సహజ నూలు ఉత్పత్తికి ప్రోత్సాహం ఇస్తే ఆధునిక జౌళి పరిశ్రమ వల్ల పెరుగుతున్న కాలుష్య ఉద్గారాలను సులభంగా తగ్గించవచ్చు. విని మయ జీవన శైలిలో తీవ్ర మార్పులు రావాలి. పరిశ్రమల ఉత్పత్తులను సమీక్షించి కాలుష్యాన్ని పెంచే వస్తువుల ఉత్పత్తిని తగ్గించడం లేదా పూర్తిగా మానివేయడం ద్వారా నిరంతర కార్బన్‌ కాలుష్యం తగ్గించ వచ్చు.

పుడమి సుస్థిరతకు చేపట్టవలసిన చర్యలు ధనిక దేశాలు, ధనిక వర్గాలు మొదలు పెట్టాలి. సుస్థిర మార్పు దిశగా చేయాల్సిన కార్యక్రమాలకు అత్యవసరమైన త్యాగాలు వాళ్ళు చెయ్యాలి. నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కూడా వారి మీదనే ఉంది. కాలుష్య ఉద్గారాల వల్ల, భూతాపం పెరగడం వల్ల జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా పేద వర్గాల పైననే ఉంటున్నది. ఆహారం దొరకని అభాగ్యుల సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి, పుడమిని కాపాడు కోవడానికి అందరూ నడుం బిగించాలి. భూతాపం వల్ల ఏర్పడుతున్న సామాజిక ఆర్థిక సమస్యల పట్ల, వాటి పరిష్కారాల మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. పర్యావరణ పరిరక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు, జీవ వైవిధ్య విస్తృతికి, ఆహార భద్రతకు, సహజ వనరుల ఉపయోగంలో సమన్యాయానికి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అమలు చేసే దిశగా పరిణతి కలిగిన ప్రజలు ఈ పుడమి దినోత్సవ సందర్భంగా ముందుకు కదులుతారని ఆశిద్దాం.

 
డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి ,వ్యాసకర్త విధాన విశ్లేషకులు
(నేడు ధరిత్రీ దినోత్సవం)

మరిన్ని వార్తలు