పరువు హత్యలు మానవతకు అవమానం!

26 Apr, 2022 12:38 IST|Sakshi

దేశంలో రాజ్యాంగం అమలు లోకి వచ్చి 71 వసంతాలు గడిచిపోయాయి. భారత రాజ్యాంగం పౌరులందరికీ కుల మత ప్రాంతాలకు అతీతంగా సమానత్వం, సమ న్యాయం, వ్యక్తిగత స్వేచ్ఛ, లింగ వివక్ష లేని సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించింది. అందులో భాగంగా ఆర్టికల్‌ 21 వ్యక్తిగత స్వేచ్ఛతో స్వతంత్రంగా జీవించే హక్కును కల్పించింది, ఆర్టికల్‌ 17 అంటరానితనాన్ని నిషేధించింది. దేశం కుల రహిత సమాజంగా రూపాంతరం చెంది పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించడం రాజ్యాంగ అంతిమ లక్ష్యం. ఇవే అంశాలను సుప్రీంకోర్టు 2011లో ‘కేకే  భాస్కరన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు’, ‘నందిని వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఛత్తీస్‌గఢ్‌’ కేసుల తీర్పుల్లో స్పష్టంగా తెలియజేసింది. 

పురాతన ఆచార సంప్రదాయాలు మానవాళిని అభివృద్ధి పథంలో నడిపించేలా ఉండాలి. కానీ, సంప్రదాయాల చుట్టూ అవివేకంగా పరిభ్రమించేలా ఉండకూడదు. నానాటికీ పరువు హత్యల పేరుపై కులాంతర వివాహాలు చేసుకున్న వారినీ, చేసుకోవడానికి సిద్ధమైన వారినీ, వారి కుటుంబ సభ్యులనూ హత్యలు చేయడం లేదా దాడులు చేయడం ఎక్కువవుతోంది. ముఖ్యంగా నయా క్షత్రియ కులాలు, దళిత – బహుజన కులాల మధ్య జరుగుతున్న ప్రేమ వివాహాల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో హత్యలు/దాడులు జరుగుతున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 1936లో కులాంతర వివాహాలతోనే కుల నిర్మూలన సాధ్యమని చెప్పిన సంగతిని అందరూ గుర్తుపెట్టకోవాలి.

కేంద్ర ప్రభుత్వం 2013లో ‘లా’ కమిషన్‌ ఇచ్చిన 242వ నివేదిక ఆధారంగా... ప్రేమ వివాహితుల హత్యల నివారణకు చట్టాన్ని ప్రతిపాదించింది. సదరు చట్టంపై రాష్ట్ర ప్రభుత్వాల నుండి సూచనలు, సలహాలను స్వీకరించే పనిలో ఉన్నారు. కుల అహంకార హత్యల కట్టడికి ప్రత్యేక చట్టం లేని కారణంగా ప్రస్తుతం ఐపీసీ సెక్షన్‌ 300 ప్రకారం హత్యకేసు నమోదు చేస్తుండడంతో... దోషులు బెయిల్‌ పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (చదవండి: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?)

సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాలు 2018లో ‘శక్తి వాహిని వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’, 2021లో ‘హరి వర్సెస్‌ స్టేట్‌ అఫ్‌ ఉత్తర ప్రదేశ్‌’ కేసుల తీర్పుల్లో కుల అహంకార హత్యల నివారణ, విచారణకు సంబంధించి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. దేశంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన హత్యలను జిల్లాల వారీగా లెక్కించడంతోపాటూ ఆయా జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రతి జిల్లాలో 24 గంటల హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి. కులాంతర/ మతాంతర వివాహ జంటలను గుర్తించి వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణలను కల్పించాలి. అధికారుల నిర్లక్ష్యంతో హత్యలు జరిగినట్లయితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అనేవి ఇందులో ముఖ్యమైనవి. (చదవండి: నేరస్థుల గుర్తింపు బిల్లుపై చర్చ ఏది?)

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17 ప్రకారం అంటరాని తనం నిషేధితమయ్యింది కనుక షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు సామాజిక భద్రత కల్పనలో భాగంగా 1989లో అత్యాచార నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా కులనిర్మూలన జరగాలన్నా, కుల అహంకారంతో చేస్తున్న పరువు హత్యలను కట్టడి చేయాలన్నా రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్‌ ‘17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. దీన్ని అన్ని రాజకీయ పార్టీలూ ప్రధాన అంశంగా తీసుకోవాలి. అలాగే అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు ముందుకువచ్చి పరువు హత్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలి. అప్పుడే ఈ అమానవీయ హత్యాకాండకు తెరపడుతుంది.

- కోడెపాక కుమారస్వామి 
సామాజిక విశ్లేషకులు 

మరిన్ని వార్తలు