ఘర్షణ సరే... వాణిజ్యం తప్పదు!

4 Nov, 2021 02:22 IST|Sakshi

విశ్లేషణ

సరిహద్దు వివాదానికి శాశ్వతంగా పరిష్కారం దొరక్కపోయినప్పటికీ భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పక తప్పదు. ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్యం పాత రికార్డులను బద్దలు గొట్టి 9 వేలకోట్ల రూపాయలకు చేరుకుంది. సరిహద్దు ఘర్షణల తర్వాత దేశవ్యాప్తంగా ప్రబలిన, ‘చైనా ఉత్పత్తులను నిషేధించండి’ అనే నినాదాలు ఆశించిన ఫలితాలను సాధించలేదని దీంతో స్పష్టమైంది. ముఖ్యంగా మందుల పరిశ్రమ, ఎలక్ట్రానిక్‌ గూడ్స్, భారీయంత్రాల వంటి వాటిపై మనం చైనాపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఒకవైపు మనం ఇలాంటి ఉత్పత్తుల్లో స్వావలంబన సాధిస్తూనే, చైనాతో వాణిజ్య లోటును తగ్గించుకునే మార్గంలో సంబంధాలు కొనసాగించాలి. దేశాల మధ్య ఘర్షణ తాత్కాలికం, వాణిజ్య తదితర బంధాలు శాశ్వతం అనే సత్యాన్ని రెండు దేశాలూ గ్రహించాలి. 

సంక్లిష్టమైన సరిహద్దు వివాదాలకు పరి ష్కారం కనుగొనలేకపోతున్నప్పటికీ భారత్, చైనా మధ్య పరస్పర వాణిజ్య సంబంధాలు చెక్కుచెదరకుండా కొనసాగుతుండటం విశేషం. దీనికోసం రెండు దేశాలు అప్రకటిత ఒప్పందం కుదుర్చుకున్నట్లు కనబడుతోంది. తూర్పు లద్దాక్‌ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి రెండు దేశాల మధ్య 13వ కార్ప్స్‌ కమాండర్స్‌కి చెందిన విభాగం ఇటీవలే చర్చలు జరిపింది. ఈ సమావేశంలో ఏ పురోగతీ సాధ్యం కాకపోయినప్పటికీ భారత ప్రతి నిధి బృందం వివాదాస్పద ప్రాంతంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యపై నిర్మాణాత్మకమైన సూచనలు చేసింది. ఈ చర్చలు కొనసాగనున్నాయని చెబుతున్నారు. ఇటీవలే, భారత్‌–చైనా మధ్య పరస్పర వాణిజ్యం పాత రికార్డులను బద్దలు గొట్టి 9 వేలకోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలోనే ఇది సాధ్యపడటం మరీ విశేషం. గత సంవత్సరం ఇదే కాలంతో జరిగిన వాణిజ్యంతో పోలిస్తే ఇది 40 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అందుచేత, సరి హద్దు వివాదానికి శాశ్వతంగా పరిష్కారం దొరకకపోయినప్పటికీ భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పక తప్పదు.

ఇప్పటికైతే, ‘చైనా ఉత్పత్తులను నిషేధించండి’ అనే నినాదాలు ఆశించిన ఫలితాలను సాధించలేదని స్పష్టమైంది. లద్దాక్‌ సరిహద్దు ప్రాంతంలో చైనా ఆక్రమణలు, హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న తర్వాత, చైనా సరకులను జాతీయవ్యాప్తంగా బహిష్కరించాలనే డిమాండ్‌ తారస్థాయికి చేరిన విషయం గుర్తుంచుకోవాలి. మరోవైపున చైనా నుంచి భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను, మొబైల్‌ ఫోన్లను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. ఇక చైనాపై మన ఫార్మసీ కంపెనీలు చాలా ఎక్కువగా ఆధారపడుతున్నదీ వాస్తవమే. దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ఈ పరాధీనతను నినాదాలు గుప్పించడం ద్వారా కొద్ది నెలల్లోపే ముగించలేం. మనం స్వావలంబన సాధించనిదే, చైనా నుంచి వివిధ ఉత్పత్తుల దిగుమతిని కొనసాగించడం తప్ప మరొక ప్రత్యామ్నాయం భారత్‌కు లేదన్నది గ్రహించాలి.

కోవిడ్‌–19 మహమ్మారి, భారత పార్మాసూటికల్‌ రంగానికి స్వావలంబన సాధించేవైపుగా గొప్ప అవకాశాన్ని అందించింది. దేశ విదేశాల్లో మందులను అమ్మడం ద్వారా ప్రతి ఏటా వందలాది కోట్ల రూపాయలను భారత ఫార్మా రంగం ఆర్జిస్తున్నప్పటికీ దేశంలో రూపొందిస్తున్న జెనరిక్‌ మందుల ఉత్పత్తిలో ఉపయోగిస్తున్న క్రియాశీలక మందుల దినుసు (ఏపీఐ)ల్లో 85 శాతం దాకా చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే అనేది వాస్తవం. ఏపీఐ అంటే మందుల తయారీలో ఉపయోగించే ముడి సరకు అన్నమాట. భారత్‌లో ఈ మందుల ముడిసరకుల ఉత్పత్తి చాలా తక్కువే అని చెప్పాలి. తుది ఉత్పత్తిని కూర్చడానికి భారత్‌లోనే తయారు చేసిన మందుల ముడిసరుకుల్లో కూడా కొన్ని చైనానుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోందని మర్చిపోవద్దు.

అంతకుమించి, దేశంలో క్రియాశీల మందుల దినుసుల తయారీ కోసం కూడా ఎల్లప్పుడూ చైనా వైపే భారత మందుల కంపెనీలు చూస్తున్నాయన్న వాస్తవాన్ని మనం విస్మరించలేం. ఏ మందుల కంపెనీ గుర్తింపు అయినా సరే, ప్రజానీకానికి అవసరమైన ఎన్ని ప్రాణాధార మందులను అది కనుగొంటోంది, విజయవంతంగా ఉత్పత్తి చేస్తోంది అనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ చేయాలన్న కుతూహలం కానీ, ఆకాంక్షను కానీ మన మందుల కంపెనీలు ఎన్నడూ ప్రదర్శించలేదన్నది ఎంతో చింతించాల్సిన విషయం. ధన సంపాదన, లాభార్జన ఒక్కటే వీటి ప్రాథమిక లక్ష్యమైపోయింది. కొత్త మందులను అభివృద్ధి చేయడంపై మన కంపెనీలకు విశ్వాసం లేదు.

ఈ నేపథ్యంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్లను వృద్ధి చేయడం ద్వారా భారతీయ మందుల కంపెనీలు బహుళ ప్రజాదరణ పొందాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్, జైదుస్‌ కాడిలా, బయొలాజికల్స్‌ ఇ, జెనోవా బయో ఫార్మా, పనేసియా బయోటెక్‌ వంటి కంపెనీలకు జాతి మొత్తం కృతజ్ఞత చూపుతోంది. 1970లలో ఇండియన్‌ డ్రగ్‌ అండ్‌ పార్మాసూటికల్స్‌ లిమిటెడ్‌ (ఐడీపీఎల్‌)ని భారత ప్రభుత్వం నెలకొల్పింది. క్రియాశీలకమైన మందుల ముడిసరకులను తయారు చేయడమే దీని లక్ష్యం. కానీ పాలనారాహిత్యం, అవినీతి కారణంగా ఈ సంస్థ రిషీకేష్, ముజఫర్‌పూర్‌ వంటి చోట్ల నెలకొల్పిన ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి.

పైగా, భారత్, చైనాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు అసాధారణ స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. అయితే వీటి నుంచి భారతదేశం పెద్దగా లాభపడుతున్నదేమీ లేదు. చైనా నుంచి మనం కొనుగోలు చేస్తున్న సరకుల కంటే మనం చైనాకు అమ్మగలుగుతున్న సరకుల పరిమాణం చాలా చాలా తక్కువ. ఇదే మనకు నష్టదాయకం. చైనాతో మన వాణిజ్య లోటు కొన్ని సంవత్సరాల క్రితం వరకు 29 బిలియన్‌ డాలర్ల వరకు ఉండేది. ఈ వాణిజ్యపరమైన లోటును తక్షణం సమతుల్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్‌‡్ష వర్ధన్‌ ష్రింగ్లా పదేపదే చెబుతున్నారు. భారతదేశం తనకు సాధ్యమైన ప్రతిదీ ఎగుమతి చేయడానికి ప్రయత్నించాలి. మన ఎగుమతులను అత్యంత లాభదాయకంగా, గరిష్టంగా ఉత్తమమైన ధరకు అమ్మవలసి ఉంది. అదే సమయంలో అత్యంత చౌకగా లభిస్తాయనుకున్న దేశాల నుంచి మనం సరకులను దిగుమతి చేసుకోవలసి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలక్ట్రికల్‌ అలంకరణ వస్తువుల నుంచి, దుస్తులు, శిల్పాలనుంచి వేటిని కూడా భారత్‌ దిగుమతి చేసుకోకూడదు. ఎందుకంటే వీటన్నింటినీ మన కుటీర పరిశ్రమలు సులభంగా ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం, దీపావళి సంబరాలలో దేశం మునిగితేలుతోంది. కొన్నేళ్ల క్రితం వరకు మన మార్కెట్లు చైనానుంచి దీపావళి కోసం పటాసులను కుప్పతెప్పలుగా దిగుమతి చేసుకునేవని మనం గుర్తుంచాలి. తర్వాత విదేశీ పటాసులను ప్రత్యేకించి చైనా పటాసులను స్థానిక మార్కెట్లలో అమ్మడం చట్టవిరుద్ధమని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది శివకాశిలోని సాంప్రదాయిక బాణసంచా తయారీ పరిశ్రమకు ప్రాణం పోసిందనే చెప్పాలి.

అనేక చైనా తయారీ సరకులను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. ప్రత్యేకించి యంత్రాలు, టెలికాం పరికరాలు, ఎలక్ట్రికల్‌ గూడ్స్, బొమ్మలు, ఎలక్ట్రికల్‌ మెషనరీ, సామగ్రి, మెకానికల్‌ యంత్రసామగ్రి, ప్రాజెక్టు గూడ్స్, సేంద్రియ ఎరువులు, ఇనుము–ఉక్కు వంటి ఎన్నో రంగాలకు చెందిన సరకులు చైనానుంచే వస్తుంటాయి. దీనికి భిన్నంగా చైనాకు భారత ఉత్పత్తులు ప్రధానంగా ఇనుప ఖనిజం, ఇతర ఖనిజాలకు సంబంధించినవే ఎగుమతి అవుతుం టాయి. అంటే మనం స్వావలంబనను సాధించేంతవరకు భారత్, చైనా వాణిజ్యం కొనసాగుతూనే ఉంటుంది. దీంతోపాటు ఇరుదేశాలూ సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవలసి ఉంది. అన్నిటికంటే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే రెండు దేశాలు కనీసం పరస్పరం చర్చించుకుంటున్నాయి. ఒక ముఖ్యమైన అంశాన్ని మనం మనసులో ఉంచుకోవలసి ఉంది. భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో, భారత్‌లో ఉంటున్న చైనా పౌరుల పట్ల ఎలాంటి దౌర్జన్యాలకు, అన్యాయానికి తావులేకుండా చూడాలి. గత వందేళ్లుగా చైనీయులు భారత్‌లో నివసిస్తున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో వేలాదిమంది చైనా పౌరులు నివసిస్తూ ఉన్నారు. వీరిలో దంతవైద్యులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు కూడా ఉండవచ్చు. వీరిలో కొందరు బాగా పేరు పొందారు కూడా. కాబట్టి మన రెండు దేశాలు చర్చలు జరుపుతూనే పరస్పర వాణిజ్యాన్ని కొనసాగించాల్సి ఉంది.

వ్యాసకర్త: ఆర్‌. కె. సిన్హా 
సీనియర్‌ ఎడిటర్, రాజ్యసభ మాజీ ఎంపీ

మరిన్ని వార్తలు