RS Praveen Kumar: ఇది సర్కారీ కాంట్రాక్టుల దోపిడీ!

14 Jul, 2022 13:00 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున మెహిదీపట్నంలోని భోజగుట్ట బస్తీలో ప్రభుత్వ పాఠశాలను ఇటీవల సందర్శించాను. అక్కడ పాఠశాల ప్రాంగణంలోనే అంగన్‌ వాడీ కేంద్రం కూడా ఉంది. అందులో 20 మంది చిన్నపిల్లలున్నారు. కానీ ఆ గదిలో కనీసం కరెంటు లేదు. పాఠశాల విద్యార్థులు తరగతి గదులు లేక నాలుగు, ఐదవ తరగతుల పిల్లలు ఒకే గదిలో కూర్చోగా, ఒకటవ తరగతి పిల్లలు బయట వరండాలో కూర్చొని చదువుకుంటున్నారు. ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థికి కూడా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. యూనిఫాం అందలేదు. పాఠశాల పక్కనే కాలనీవాసులు చెత్తను పడేస్తున్నారు. ఇదీ తెలంగాణలో విద్యావ్యవస్థ పరిస్థితి. రాజధాని నగరంలోనే ఇలా ఉందంటే ఇక గ్రామాల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. బడులను బాగుచేస్తామని చేపట్టిన ‘మన ఊరు– మన బడి’ పథకం వంటివి ఇప్పుడు అయినవారికీ, బడాబాబులకూ దోచిపెట్టే మార్గాలుగా మారడం దారుణం.

‘మన ఊరు– మన బడి’ పథకం కింద రూ.7,200 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతలో భాగంగా రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. గత మే నెలలో పాఠశాలల్లో చిన్న, పెద్ద మరమ్మత్తుల కోసం రూ.1,539 కోట్లకు టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి 24 గంటల లోపే రద్దు చేశారు. తిరిగి రాత్రికి రాత్రే నోటిఫికేషన్‌ లోని విధివిధానాలు మార్చారు. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఏడాదికి రూ. 180 కోట్ల రాబడి ఉన్న సంస్థలే అర్హమైనవి. ఈ ఆదాయం, అర్హత ఎవరికి ఉంటుంది? కచ్చితంగా బహుజన వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణపేదలు) ప్రజలకు అయితే ఉండదు. కేవలం బడా కాంట్రాక్టర్లకు మాత్రమే అర్హత ఉంటుంది. పెద్ద కాంట్రాక్టర్లయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండేవారికే టెండర్లు దక్కేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఈ విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాధనాన్ని, పేదలకు ఉపయోగపడాల్సిన బడ్జెట్‌ను కేవలం ఆయనకు సన్నిహితులైన ఒకరిద్దరికే దోచిపెట్టడానికి శాయశక్తులా కృషి చేస్తున్నది. కాకపోతే ఏమిటి? కేవలం రూ.4,500కు వచ్చే డ్యూయల్‌ డెస్క్‌ ధరను అమాంతం రూ. 12,000కు పెంచి, వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అధికారికంగా చెల్లించే పనికి ఒడిగట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జైళ్లలో ఉండే ఖైదీలు తయారుచేసిన వస్తువులను కూడా అతితక్కువ ధరకు తీసుకునే అవకాశం ఉన్నా, ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతోంది. గ్రీన్‌ బోర్డు ఒక చదరపు ఫీట్‌ ధరను రూ. 280 నుండి రూ. 370కి పెంచారు. 

అయితే మొదటిసారి టెండర్‌ నోటిఫికేషన్‌కు ప్రతిస్పందిస్తూ టెండర్‌ దాఖలు చేసిన సంస్థలు... తాము అర్హులమైనా తమను అనర్హులుగా ప్రభుత్వం ఎలా తమ టెండర్లను తిరస్కరిస్తుందని ప్రశ్నిస్తూ హైకోర్టుకు ఎక్కాయి. కోర్టులో ఈ వివాదంపై వాదనలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం రెండోసారి పిలిచిన టెండర్లనూ రద్దు చేస్తున్నట్లు కోర్టుకు తెలియచేసింది. దీనర్థం ఏమిటి? మేం మొదటి నుంచీ ‘మన ఊరు– మన బడి’ పనుల టెండర్లలో అవకతవకలూ, ఆశ్రిత పక్షపాతం ఉన్నాయని ఆరోపిస్తున్న విషయాలు నిజమే అని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా. అంతా సజావుగా ఉంటే రెండోసారీ టెండర్లను ఎందుకు రద్దుచేసినట్లు?

ప్రభుత్వం గ్రామాల్లో పాఠశాల భవనాలకు పెయింటింగ్‌ వేసే కాంట్రాక్టులనూ బడా కాంట్రాక్టర్లే దక్కించుకునేలా నిబంధనలు రూపొందిస్తే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పారిశ్రామికవేత్తల గతేం కావాలి? ఇదంతా చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగా ఎంఎస్‌ఎంఈలు మూతపడేలా ప్రభుత్వమే పాటుపడుతున్నదని అర్థమవుతోంది. ఒకపక్క విదేశాలకు వెళ్ళి, అనేక రాయితీలు ప్రకటించి అంతర్జాతీయ కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తున్న మంత్రి కేటీఆర్‌... ఇదే రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు, రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదు. 5,000 ఎంఎస్‌ఎంఈలు మూత బడుతుంటే ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లతోపాటూ ఎంఎస్‌ఎంఈలనూ టెడర్ల ప్రక్రియలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. అప్పుడే చిన్నాచితక కంపెనీలు నడుపుతున్న బహుజనులకూ అభివృద్ధి చెందే అవకాశం దక్కుతుంది.

తెలంగాణలోని పేద ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కుట్రలను అర్థం చేసుకోవాలి. మోసానికి గురవుతున్న మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ‘మన ఊరు – మన బడి’ పథకానికి కావా ల్సిన నిధులను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల నుంచి కూడా సేకరిస్తున్నది కానీ, జీఓ నం. 59/2018, జీఓ నం. 32/2022లు చెప్పిన ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు అవకాశం ఇవ్వాలన్న నిబంధనలను పట్టించుకోకుండా మోసం చేస్తోంది.

ఒక్క విద్యా వ్యవస్థలోనే కాదు మిగతా రంగాలలోనూ ఈ దోచిపెట్టే పని కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన 1.15 లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులో గానీ, రూ. 36 వేల కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ ప్రాజెక్టులో గానీ ఒక్క బహుజనుడు కూడా కాంట్రాక్టరుగా లేడు. ఈ అన్యాయాన్ని మిగతా పార్టీలవారు ఎవరూ ప్రశ్నించడం లేదు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఒక్కటే కాంట్రాక్టుల్లో మా బహుజనుల వాటా ఏదని ప్రశ్నిస్తోంది.

గత 70 ఏళ్లుగా బహుజన సమాజం మోసపోతున్నది. ఆధిపత్య పార్టీల నాయకులు బహుజనులను కేవలం ఓటు వేసే యంత్రాలుగానే చూస్తున్నారు. సంపద ఉన్న చోటికి వారిని రానివ్వడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఒక బహుజనుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోకపోతే, తెలంగాణ రాష్ట్ర ఆస్తి, వనరులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే పేద ప్రజల సొమ్మును ఎత్తుకుపోయే రాబందుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. బహుజన తెలంగాణను సాధించాలి, తెలంగాణ అమరుల ఆశయాలను నిజం చేయాలి. (క్లిక్‌: పోడు రైతుకు హరితహారం గండం)


- డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌
రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్‌ సమాజ్‌ పార్టీ

మరిన్ని వార్తలు