పార్లమెంటరీ కమిటీలను చిన్న చూపు చూస్తే..!

25 Jul, 2021 00:15 IST|Sakshi

పార్లమెంటరీ కమిటీలు కేంద్ర చట్టసభల్లో అత్యంత కీలకమైనవి. ఏ ప్రభుత్వమైనా అవసరమైన బిల్లులను రూపొందించి వాటికి శాసన రూపం ఇచ్చేముందు పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు పంపిస్తుంటుంది. వాస్తవానికి వివిధ స్థాయీ కమిటీల ద్వారానే మన పార్లమెంట్‌ పనిచేస్తుంది. ప్రభుత్వ, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో వీటిని ఏర్పరుస్తారు. ప్రభుత్వ బిల్లులకు బడ్జెట్‌ అంచనాలకు తుదిరూపం ఇవ్వడానికి ఉభయసభల సెషన్లు జరగని సమయంలో కూడా ఈ పార్లమెంటరీ కమిటీలు సంవత్సరం పొడవునా పనిచేస్తూనే ఉంటాయి. అయితే తాను రూపొందించిన బిల్లులను కమిటీలకు పంపించాల్సిన అవసరం చట్టపరంగా ప్రభుత్వాలకు ఉండకపోవచ్చు. కానీ అలాచేయడమే ఉత్తమ ప్రజాస్వామిక ఆచరణ. కమిటీల వ్యవస్థను చిన్నచూపు చూడడం అంటే భారత ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన పార్లమెంటును చిన్నబుచ్చడమే అవుతుంది.

కొన్ని నిర్దిష్ట రంగాలపై శాసనాలను ఖరారు చేయడానికి ఆయా పార్లమెంటరీ కమిటీలు ఆ రంగాలకు సంబంధించిన నిపుణులను కూడా పిలిపిస్తుంటాయి. చివరగా ఈ కమిటీలు తమ నివేదికను చట్టసభకు సమర్పిస్తాయి. కమిటీల ప్రతిపాదనను దాదాపుగా ప్రభుత్వాలు ఆమోదించి నూతన చట్టాలను రూపొందిస్తాయి. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని తొలి హయాంలో 27 శాతం బిల్లులను వివిధ పార్లమెంటరీ కమిటీలకు పంపించింది. ప్రస్తుతం కోవిడ్‌–19 ప్రత్యేక సందర్భం, పార్లమెంట్‌ సమావేశాల కుదింపును ప్రస్తావించనవసరం లేదు కానీ వివిధ రాజకీయ పక్షాల సభ్యులతో కూడిన పార్లమెంటరీ కమిటీలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చడం ఇప్పుడు స్పష్టంగానే కనిపిస్తోంది. గతంలో యూపీఏ–1 పాలనలో 60 శాతం బిల్లులను కమిటీలకు పంపిస్తే యూపీఏ–2 పాలనలో 71 శాతం బిల్లులను వివిధ కమిటీలకు పంపిం చిన విషయం గుర్తుంచుకోవాలి.

ప్రత్యేకించి, 2019లో గెలుపు సాధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన చట్టాలను ఏ కమిటీకి కూడా పంపించడం జరగలేదు. దీని పర్యవసానాలను మనందరం చూస్తూనే ఉన్నాం. ఉదా‘‘ ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం, జమ్మూకశ్మీర్‌ ప్రతిపత్తిని మార్చివేసిన మౌలిక చట్టాలను తీసుకురావడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం దీనికి పరాకాష్ఠ. ఇది బీజేపీ సైద్ధాంతిక ఎజెం డాలో భాగం కాబట్టి ఎలాంటి సంప్రదింపులూ లేకుండానే ఒక్క కలంపోటుతో ఇంత కీలక మార్పును తీసుకొచ్చారు.

అలాగే గత సెప్టెంబర్‌లో వ్యవసాయ చట్టాలను ఆదరాబాదరాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పర్యవసానానికి దేశం మొత్తం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది. అప్పటినుంచి దేశ రాజధాని సమీపంలో ప్రారంభమైన రైతాంగ నిరసనలు ఇప్పటికీ ఆగిపోలేదు. అంతేకాకుండా ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను నోటిఫై చేయడం కూడా సాధ్యంకాని పరిస్థితిలో కూరుకుపోయింది. రాజ్యసభలో మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదిం పజేసుకున్నప్పుడు ఏంజరిగిందో తిరిగి మననం చేసుకుందాం. మొదటగా ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని డిమాండ్‌ చేశాయి. రైతు లాబీలు, వ్యవసాయ వ్యవస్థలోని ఇతరుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ముందుకు కదలాలని కేంద్రానికి సూచించాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చింది. తర్వాత ఈ బిల్లులపై డివిజన్‌ పెట్టాలని లేదా సభ్యుల ఓట్లను లెక్కించాలని ప్రతిపక్షం కోరింది. దాన్నీ ప్రభుత్వం తోసిపుచ్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ మూజు వాణీ ఓటు ద్వారా వ్యవసాయ చట్టాలకు ఆమోదముద్ర వేశారు. దాంతో సభలో తీవ్ర గలాభా చెలరేగింది. ప్రతిపక్ష ఎంపీలు రూల్‌ బుక్‌ని హరివంశ్‌ మీదికి విసిరేశారు. దీంతో 8 మంది ఎంపీలను వారంపాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.

నిజానికి మన ప్రజాస్వామ్య చరిత్రలో అది ఒక చీకటిదినం. ఎలాంటి విచారణ జరపకుండానే, ప్రభుత్వం తాను కోరుకుం టున్న చట్టాలను ఆమోదింపచేసుకునే ఒక లాంఛనప్రాయమైన పరిష్కార గృహంగా పార్లమెంట్‌ మారిపోయిం దని ప్రతిపక్ష పార్టీలు ఆనాటి నుంచి చెబుతూ వస్తున్నాయి. పార్లమెంటును ఎంతగానో గౌరవించిన పాతతరం సభ్యుల ఆచరణను తోసిపుచ్చడంలో పాలకపార్టీ వైఖరిని మరొక అంశం కూడా ఎత్తి చూపుతుంది. ఉదాహరణకు బీజేపీ తొలి ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి ఉత్తమ పార్లమెంటేరియన్‌. సభకు సంబంధించిన అన్ని నియమాలు, సంప్రదాయాలను పాటించడంలో ఆయన పేరెన్నికగన్న వ్యక్తి. పార్లమెంట్‌ అనేది బాక్సింగ్‌ రింగులో ప్రత్యర్థిని నాకౌట్‌ చేయడమే లక్ష్యంగా చూపే టెలి విజన్‌లో ప్రసారమయ్యే మ్యాచ్‌ లాంటిది కాదని ఆయన పదేపదే చెప్పేవారని గుర్తుంచుకోవాలి. ఏదేమైనప్పటికీ పార్లమెంట్‌ ఒక విశిష్టమైన సంస్థ కాబట్టి మన ప్రజాజీవితంలో ప్రజాస్వామిక చర్చను అది తిరిగి తీసుకొస్తుందని మనం ఆశిద్దాం. అసమ్మతి స్వరాలు పార్లమెంటులో వినిపిస్తాయని, ముఖ్యమైన అంశాలను సభ స్వీకరిస్తుందని ఆశిద్దాం.


సబా నఖ్వీ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు

మరిన్ని వార్తలు