సానుకూల దృక్పథమే సరైన మార్గం

20 Aug, 2020 01:04 IST|Sakshi

అభిప్రాయం

ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘గుంజన్‌ సక్సేనా’ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆ సినిమాకు ప్రేరణగా నిలిచి నిజజీవితంలోనూ కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న భారతీయ వాయుసేన రిటైర్డ్‌ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ గుంజన్‌ సక్సేనా ఆ సినిమాలో తన పాత్ర చిత్రీకరణ గురించి వివరణ ఇచ్చారు. సంస్థగా వాయుసేనలో మహిళాధికారులుగా తామెన్నడూ వివక్షను ఎదుర్కోలేదని, కొంతమంది అధికారుల చిన్నచూపును చవిచూశామన్నారు. వారితో పోటీపడుతూనే వాయుసేనలో సమున్నత స్థానానికి చేరగలిగామని, మహిళలుగా అనేక అవకాశాలు పొందామని చెప్పారు. తన జీవితాన్ని, తన ప్రయాణాన్ని, తన కలలను, తాను సాధించిన చిన్న విజయాలను చిత్రిక పట్టడమే సినిమా ఉద్దేశమని చెప్పారు. శక్తివంతమైన పుకార్లు, పచ్చి అబద్ధాలు రాజ్యమేలుతూ మీ ఉనికిని సందేహాల ధూళిలో కనుమరుగు చేసే సమయాలు కూడా ఉంటాయి. గత కొన్ని రోజులుగా ఇలాంటి తుపానులో నేను చిక్కుకుపోయాను. అది సోషల్‌ మీడియా కావచ్చు, ముద్రణా మాధ్యమం కావచ్చు.. కొంతమంది వ్యక్తులు నా ఉనికి, మనుగడకు సంబంధించిన మౌలిక విలువలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవం. ఈ దుమారాన్ని రూపుమాపవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను.

పాఠకులకు ఒక విషయం చెప్పనివ్వండి. గుంజన్‌ సక్సేనా చిత్ర నిర్మాతలు నా జీవితం ఆధారంగా తీసిన సినిమాలో సినిమాటిక్‌ స్వేచ్ఛను తీసుకున్నప్పటికీ వారు తప్పించనిది, అతిశయోక్తులు చెప్పనిది అయిన ఒక అంశం ఉంది. అదేమిటంటే నేనే.. నిజమైన గుంజన్‌ సక్సేనాని. సినిమాలో చిత్రించినదాని కంటే నేను మరింత ఉక్కుసంకల్పంతో, దృఢ చిత్తంతో ఉంటూ వచ్చానని చెప్పగలను. వాయుసేనలో నా ఎనిమిదేళ్ల స్వల్ప కెరీర్‌లో నేను నా సీనియర్లు, జూనియర్లు, కొలీగ్స్‌ నుంచి పొందగలిగిన అమూల్యమైన అంశం ఏదంటే గౌరవం, ఆరాధన మాత్రమే. ఎంతో కష్టపడి సాధించిన ఈ ప్రతిష్టను కొద్దిమంది వ్యక్తుల బృందం అసందర్భ వ్యాఖ్యలతో మలినపర్చడం చూస్తూంటే నా హృదయం బద్దలవుతోంది. భారతీయ వాయుసేనలో నా తొలి సంవత్సరాల్లో ఎన్నో అంశాల్లో నేను ప్రథమురాలిగా ఉండగలిగి నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని అనే చెప్పాలి. వాటిలో కొన్నింటిని పేర్కొనాలంటే.. నా ప్రాథమిక శిక్షణలో, హెలికాప్టర్‌ శిక్షణలో కూడా నేనే ప్ర«థమురాలిగా ఉన్నాను. యుద్ధరంగంలో హెలికాప్టర్‌ నడిపిన తొలి మహిళను నేనే (లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులలో ఇది నమోదైంది కూడా). మహిళా హెలికాప్టర్‌ పైలట్లలో మొదటి బిజి (ప్రథమ శ్రేణి ఫ్లైయింగ్‌ కేటగిరీ) నాదే. అడవుల్లో, మంచులో ఎలా బతకాలో నేర్పే కోర్సు చేసిన మొట్టమొదటి మహిళా అధికారిని కూడా నేనే. ఇంకా మరెన్నో చిన్న విజయాలు ఉన్నాయి కానీ నా ఈ కథనానికి సంబంధించి వాటికేమంత ప్రాధాన్యత లేదు. 

ప్రశాంతంగానూ, రిజర్వుడ్‌గానూ ఉండే నా లాంటి వ్యక్తి ఇలా నా సొంత డబ్బా కొట్టకుండా ఉండటానికి కారణం ఉంది. ఈ వాస్తవాలను తారుమారు చేయడానికి ప్రయత్నించే ఎవరినైనా బహిరంగంగా సవాల్‌ చేయడమే నా ఉద్దేశం. నేను సాధించిన ఈ ప్రథమ రికార్డులన్నీ ఐఏఎఫ్‌ చరిత్రలో నమోదై ఉన్నాయి కూడా. అవన్నీ నా విశ్వసనీయతకు, నా విజయాలకు సంబంధించినవి. స్వార్థ ప్రయోజనాలు కలిగిన ఏ ఒక్కరినీ నా ప్రతిష్టపై వేలెత్తి చూపడాన్ని నేను అంగీకరించను. నిపుణురాలిగా చెప్పుకునే ఒకరయితే.. నేను కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి మహిళాధికారిని కాదని కూడా చెప్పేశారు. ఈ అసంబద్ధ ప్రచారాన్ని చదువుతున్న, పచ్చి అబద్ధాలను చూస్తున్న వారందరికీ నేను వినమ్రంగా ఒక విషయం చెబుతున్నాను. రహస్య ఎజెండాలో భాగంగా తాము ఐఏఎఫ్‌ ప్రతిష్టను కాపాడుతున్నట్లు చెప్పుకుంటున్న వారు కార్గిల్‌ యుద్ధం తర్వాత 1999లో వాయుసేన దృక్పథానికి చెందిన సాధికారతనే ప్రశ్నిస్తున్నారు.

నేను స్వభావరీత్యా రిజర్వుడ్‌గా ఉంటాను. కానీ భారతీయ వాయుసేన నా విజయాలను మొత్తంగా మీడియా ముందు విప్పి చెప్పేసింది. ఇప్పుడే కాదు ఎప్పుడూ నేను మీడియా ముందుకు రావడాన్ని అసౌకర్యంగానే భావిస్తాను. కానీ కార్గిల్‌ యుద్ధ కాలంలో చక్కటి విజయాలు సాధించిన మహిళాధికారిగా నాకు సంబంధించిన వాస్తవాన్ని ఎవరైనా ఎలా తోసిపుచ్చగలరు? నేను కానీ, చిత్ర నిర్మాతలు కానీ నేను శౌర్యచక్ర అవార్డు గ్రహీతనని ఎన్నడూ చెప్పుకోలేదు. కార్గిల్‌ యుద్ధం తర్వాత ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక పౌర సంస్థ నాకు శౌర్య వీర్‌ అనే అవార్డు బహూకరించింది. కానీ ఇంటర్నెట్‌ వార్తల మీడియాకు చెందిన కొందరు బహుశా వీర్‌ పదాన్ని చక్రగా మార్చేసి ఉండవచ్చు. సినిమా ప్రమోషన్లలో భాగంగా నేను మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ ఈ విషయాన్ని నేను స్పష్టం చేస్తూ వచ్చాను. నేను పొందని శౌర్య చక్ర అవార్డు విషయంలో నన్ను నిందించడం ఎంతవరకు సబబు?

‘గుంజన్‌ సక్సేనా’ సినిమా విడుదలయ్యాక సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్న మరొక అంశం ఏదంటే లింగ వివక్ష. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదలయింది మొదలుకుని భారత వాయుసేన ప్రతిష్టపై దాడిగా అభివర్ణిస్తూ కవచధారులైన అనేకమంది వీరులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. వీళ్లందరికీ నేను చెప్పేదొకటే. ఐఏఎఫ్‌ అనేది అతి పెద్ద సంస్థ. ఏ వివాదం కూడా దానికి కాసింత మరకలు కూడా పడనీయనంత ప్రతిష్టాత్మక సంస్థ. లింగపరంగా కానీ, మరే రకంగానైనా సరే.. ఒక సంస్థగా ఐఏఎఫ్‌ సంస్థాగత వివక్షకు చోటివ్వదు. నేను వాయుసేనలో చేరినప్పుడు సంస్ధాగతంగా దాంట్లో ఎలాంటి వివక్షా ఉండేది కాదు. కానీ.. వ్యక్తిగతంగా చూస్తే ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకే విధంగా ఉండరు. కొంతమంది వ్యక్తులు ఇతరుల కంటే బాగా మార్పును స్వీకరించగలరు. వివక్ష అనేది సంస్థాగతం కాదు కాబట్టి మహిళాధికారుల అనుభవాలు కూడా విభిన్నంగానే ఉంటాయి. దీన్ని నిరాకరించడం అంటే అది భూస్వామ్య మనస్తత్వాన్నే చూపుతుంది. అంతే కాకుండా మహిళాధికారులు ఎదుర్కొన్న సమస్యలను పలుచన చేస్తుంది. వాయుసేనలోని కొందరు వ్యక్తుల్లోని దురభిప్రాయాలు, వివక్షకు చెందిన సమస్యలతో ఒక స్త్రీగా నేను కూడా పోరాడాను. కానీ అది సంస్థాగతంగా ఎన్నడూ ఉండేది కాదు కాబట్టే నేను అన్ని సమయాల్లోనూ సమాన అవకాశాలనే పొందాను.

వాయుసేనలో చేరిన నా ప్రారంభ సంవత్సరాల్లో మహిళలకు ప్రత్యేక టాయ్‌లెట్, మహిళలు దుస్తులు మార్చుకునే చోటు విషయంలో మౌలిక వసతులకు సంబంధించి ఎలాంటి ఆరోపణనూ నేను చేయలేదు. ఇక నెలరోజులపాటు సర్వైవల్‌ కోర్సును పూర్తి చేసిన సమయంలో నేను ఒకే టెంటులో పురుష అధికారులతో కలిసి ఉండేదాన్ని. అనేక సందర్భాల్లో అడవుల్లో ఆరుబయట తెల్లారకముందే నేను కాలకృత్యాలు తీర్చుకునేదాన్ని. ఈ విషయంలో నేను ఎలాంటి మినహా యింపులు అడగలేదు. వాయుసేనలోని పురుషుల్లాగే నేను సర్వైవల్‌ కోర్సును ముగించాలని కోరుకున్నాను. ఇలాంటి స్వల్పాతిస్వల్పమైన అంశాలకు నా ఐఏఎఫ్‌ కెరీర్‌లో ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదనే చెబుతున్నాను. సినిమాలో కూడా నా పాత్ర టాయ్‌లెట్లు లేకపోవడంపై ఆరోపించలేదు కదా. అది ముఖ్యమే కావచ్చు కానీ ఒక విషయానికి మరీ ప్రాధాన్యత ఇవ్వడం అనవసరం.

సినిమాలో వాస్తవ విరుద్ధ అంశాల గురించి ఒక సీనియర్‌ జర్నలిస్టు ఎత్తి చూపినట్లు నేను విన్నాను. అవును. వాటిని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే కార్గిల్‌ యుద్ధంలో ఘటనల పర్యవసానాలు నాకు తెలుసు. నేను వాటిని ఎన్నడూ తోసిపుచ్చలేదు. లేదా వాస్తవమని అంగీకరించలేదు. ఒకటి మాత్రం నిజం. సినిమా ఉద్దేశం తమ స్వప్నాలను ఆశాభావంతో, సానుకూల దృష్టితో ఎదుర్కోవాలని వ్యక్తులను ప్రభావితం చేయడమే. నేను కూడా అలాగే ఎదుర్కొన్నాను. మొత్తం సినిమా కథ అంతా నా జీవిత గమనం ఎలా సాగింది, నా స్వప్నాలు ఎలా సాకారమయ్యాయి అని చూపించడమే. కార్గిల్‌ యుద్ధంపై డాక్యుమెంటరీ తీయాలని ఈ సినిమా ఉద్దేశం కాదని నా భావం. నా జీవి తాన్ని, నా ప్రయాణాన్ని, నా కలలను, నేను సాధించిన చిన్న విజయాలను చిత్రిక పట్టడమే సినిమా ఉద్దేశం. నేను కానీ, చిత్ర దర్శకుడు శరణ్‌ శర్మ కానీ భారత వాయుసేనను అవమానించాలని అనుకోలేదు. నిజానికి వాయుసేన యూనిఫాం, నేను మెలిగిన తీరు, సైనిక కార్యాలయాల స్వరూపం, ఫ్లైయింగ్‌కు చెందిన సాంకేతిక పదాల సాధికారతపై నన్ను వాళ్లు ఫోన్‌ ద్వారా కానీ, నేరుగా కానీ సంప్రదించేవాళ్లు. 

చివరగా, మరొక విషయం చెప్పదలిచాను. ఈ సెలబ్రిటీ స్థాయి అనేది నా జీవితంలో అడుగుపెట్టిన కొత్త వైరస్‌ లాంటింది. నా మౌలిక విలువలను ఇది ఎన్నటికీ ముట్టలేదు. చెరపలేదు. ఎందుకంటే నా హృదయంలోనూ, మనస్సులోనూ ఒక విశ్వాసం ఉండేది. నేను పుట్టిన రోజు మొదలుకుని నా జీవితంలోని ప్రతి క్షణంలోనూ సైనిక దుస్తులు ధరించి ఉన్న వారి మధ్యే జీవించాను. నా సోదరుడు, నేను ఇద్దరం సాయుధ బలగాల్లోనే మా కెరీర్లను నిర్మించుకున్నాం. నా యూని ఫారం విడిచిపెట్టిన తర్వాత కూడా, ఒక అధికారి భార్యగా నేను వాయుసేన ఆవరణలోనే జీవించడం కొనసాగించాను. సాయుధ బలగాలకు సంబంధించి నా జ్ఞానం లేక జ్ఞాన లేమికి సంబంధించి ఎవరి ప్రబోధాలూ నాకు అవసరం లేదు. వ్యక్తిగతంగా కానీ, వృత్తి రంగంలో కానీ నేను సాధించిన అతి కొద్ది విజయాలు కూడా వాయుసేన నుంచే పొందాను. మిగిలిన విషయాలు అంటారా.. వాటిని మీ తీర్పుకు, మీ విజ్ఞతకే వదిలేస్తాను.  (ఎన్డీటీవీ సౌజన్యంతో...)

వ్యాసకర్త రిటైర్డ్‌ ఫ్లైట్‌ లెఫ్టినెంట్,
హెలికాప్టర్‌ పైలట్, భారతీయ వాయుసేన

గుంజన్‌ సక్సేనా 

>
మరిన్ని వార్తలు