Vivek Ramaswamy: అధ్యక్ష ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నానంటే...

28 Feb, 2023 01:00 IST|Sakshi

అభిప్రాయం

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అప్పుడే కోలాహలం మొదలైంది. ముఖ్యంగా ఈసారి భారత సంతతీయుల సందడి ఎక్కువగా ఉండేట్టుంది. ఇప్పటికే ఆంట్రప్రెన్యూర్, రచయిత వివేక్‌ రామస్వామి తాను అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. దీనికిగానూ ముందు తన సొంత పార్టీ అయిన రిపబ్లికన్‌ పార్టీ మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. ఏమైనా నిండా నలభై ఏళ్లు లేని, కేరళ మూలాలున్న వివేక్‌ రామస్వామి ఇంత పెద్ద పదవికి పోటీ పడాలని అనుకోవడమే విశేషం. ‘ఒక  నూతన అమెరికన్‌ స్వప్నాన్ని రూపొందించడానికి నేను రాజకీయ ప్రచారం మొదలుపెట్టడం మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నాను’ అని ఆయన చెబుతున్నారు.

అమెరికా ప్రస్తుతం జాతీయ అస్తిత్వ సంక్షోభంలో ఉంది. విశ్వాసం, దేశభక్తి, కఠిన శ్రమ వంటివి కుప్పగూలుతున్న క్షణంలో మనం ఒక పరమార్థం కోసం తపిస్తున్నాం. అవగాహనకు సంబంధించిన మన అవసరాలను సంతృప్తిపర్చుకునేందుకు వాతావరణతత్వం, కోవిడ్‌ తత్వం, జెండర్‌ భావజాలం వంటి లౌకిక మతాలను కౌగిలించుకుంటున్నాం. కానీ అమెరికన్‌ అంటే అర్థం ఏమిటనే ప్రశ్నకు మన వద్ద సమాధానం లేదు.

ఈ మేలుకొలుపు వాదాన్ని (వోక్‌ ఎజెండా) పలుచన చేసి దాని ప్రాసంగికతను నిర్వీర్యం చేయడం, ఆ శూన్యాన్ని ఉత్తేజకర జాతీయ అస్తిత్వంతో భర్తీ చేయడం రిపబ్లికన్‌ పార్టీ ప్రథమ ప్రాధాన్యం కావాలి. కానీ దీనికి బదులుగా చాలామంది అగ్రశ్రేణి రిపబ్లికన్లు 1980లలో కంఠస్థం చేసిన నినాదాలను వల్లెవేస్తున్నారు. ప్రత్యామ్నాయాన్ని ప్రతి పాదించకుండానే వామపక్ష సంస్కృతిని విమర్శిస్తున్నారు.

అమెరికాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు, అమెరికా అంటే ఏమిటి అని మనం కొత్తగా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. ఒక నూతన అమెరికన్‌ స్వప్నాన్ని రూపొందించడానికి రాజకీయ ప్రచారాన్ని మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నాను.

37 సంవత్సరాల ఒక రాజకీయ ఔట్‌సైడర్‌ భూమ్మీద అత్యున్న తమైన అధికారాన్ని సాధించాలనుకోవడం అహంకారంగానే కనిపించవచ్చు. కానీ, నేను మన జాతి కోసం, అమెరికన్‌ జీవితంలోని ప్రతి రంగంలోనూ ప్రతిభను పునరుద్ధరించగలిగే జాతి కోసం దార్శని కతలో భాగంగా పోటీ చేస్తున్నాను. 

మనం ప్రతిభను పునరుద్ధరించాలి. నా తల్లిదండ్రులు ఈ దేశానికి చట్టబద్ధంగా వచ్చారు, కష్టపడి పనిచేశారు, వేలాది అమెరికన్ల జీవితా లను మెరుగుపర్చిన వ్యాపార సంస్థలను రూపొందించిన ఇద్దరు పిల్లలను పెంచి పెద్దచేశారు. చట్టాన్ని అతిక్రమించి  ప్రవేశిస్తున్న వారికి బదులుగా మా తల్లిదండ్రుల వంటి వలస ప్రజలు అవసరం.

ఎలాంటి మొహమాటాలకూ తావులేకుండా అమెరికా సరిహద్దులకు భద్రత కల్పించడం, ప్రతిభా ప్రవేశాలకు అనుకూలంగా లాటరీ ప్రాతి పదికతో కూడిన వలస విధానాన్ని నిర్మూలించడం అవసరం.

అమెరికాకు వచ్చి విజయాలు పొందినవారి ప్రతిభను మనం తప్పక ప్రోత్సహించాలి. అమెరికా శ్రామిక శక్తిలో దాదాపు 20 శాతం మందిని నియమిస్తున్న ఫెడరల్‌ కాంట్రాక్టర్లు జాతి ప్రాతిపదికన నియామకాలను చేపట్టడాన్ని తప్పనిసరి చేస్తూ అమెరికా పూర్వ అధ్య క్షుడు లిండన్‌ బి. జాన్సన్‌ కార్యనిర్వాహక ఆదేశం 11246 జారీ చేశారు.

దీనివల్ల నల్లజాతి, హిస్పానిక్‌(స్పానిష్‌ దేశాలు) ఉద్యోగుల పట్ల అగ్రశ్రేణి కంపెనీలు ఎక్కువ అక్కర చూపుతూ– శ్వేత జాతి లేదా ఆసియన్‌ అమెరికన్లుగా ఉంటున్న అర్హత కలిగిన అభ్యర్థుల పట్ల అనిష్టం ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి కార్యనిర్వాహక ఆదేశాన్ని రద్దు చేయటమే కాకుండా, అక్రమమైన జాతి ప్రాతిపదిక ప్రాధాన్యాలపై విచారణ జరిపించాలని న్యాయ శాఖను ఆదేశిస్తాను.

ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ఎంపికైనవాళ్లు వాస్తవంగా ప్రభు త్వాన్ని నిర్వహించాలి. కాన్నీ ఎన్నికలలో పాల్గొనని ఆంథోనీ ఫాచీ (అమెరికా ముఖ్య వైద్య సలహాదారు), మెర్రిక్‌ గార్లండ్‌ (అమెరికా అటార్నీ జనరల్‌) వంటి బ్యూరోక్రాట్లు తమ పరిధిని మీరి ప్రవర్తించారు.

ఇంకోసారి ఇలాంటి బ్యూరోక్రాట్లు తమ పరిధిని మీరినప్పుడు ఒక అధ్యక్షుడికి రాజ్యాంగం కల్పించిన సాధికారతను నేను తప్పకుండా అమలు చేయడానికి నిబద్ధత వహిస్తాను; వారిని తొలగిస్తాను. ఫెడరల్‌ ఉద్యోగులకు కల్పించిన సివిల్‌ సర్వీస్‌ సంరక్షణలను అవస రమైతే కార్యనిర్వాహక ఆదేశం ద్వారా రద్దు చేస్తాను.

వీటికి బదులుగా నిర్దిష్టకాలం మాత్రమే రక్షణ కల్పించే మేనేజీరియల్‌ నిబంధనలను తీసుకొస్తాను. దేశాధ్యక్షుడు ఎనిమిదేళ్లకు మించి అధికారంలో ఉండ నప్పుడు,›బ్యూరోక్రాట్లకు కూడా దాన్నే వర్తింప జేయాలి. డబ్బును వృథా చేస్తున్న లేదా కాలం చెల్లిన సంస్థలకు నిధులను నిలిపివేసేలా– 1974 నాటి ‘ఇంపౌండ్‌మెంట్‌ కంట్రోల్‌’ చట్టాన్ని రద్దు చేయాలని లేక సవరించాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ను కోరతాను. సంస్కరించడానికి సాధ్యం కాని సంస్థలను మూసివేస్తాను. వాటి స్థానంలో పునాదుల నుంచి కొత్త సంస్థలను నిర్మిస్తాను.

ఏ భావాలనూ సెన్సార్‌ చేయనప్పుడే ఉత్తమ ఆలోచనలు పుట్టుకొస్తాయి. తమకు అనుకూలంగా లేని రాజకీయ ప్రసంగాలను సెన్సార్‌ చేయడంపై మన ప్రభుత్వం టెక్నాలజీ కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తోంది. అవి అలా చేసేట్టుగా ప్రత్యేక భద్రతను కల్పిస్తోంది. రాజ్య శక్తులతో కలిసి పనిచేసేలా ఇంటర్నెట్‌ కంపెనీలు అమెరికన్‌ రాజ్యాంగ తొలి సవరణకు కట్టుబడి ఉండాలి.

ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ విషయంలో చేసినట్టుగా, ఫెడరల్‌ గవర్నమెంట్‌ నుంచి ‘స్టేట్‌ యాక్షన్‌ ఫైల్స్‌’ను బహిర్గత పరుస్తాను. రాజ్యాంగం నిషేధించిన కార్య కలాపాలను చేపట్టేలా కంపెనీలను బ్యూరోక్రాట్లు తప్పుడు పద్ధతుల్లో ఒత్తిడిపెట్టినట్టు తెలిపే ప్రతి ఉదంతం దీని ద్వారా బయటికొస్తుంది.

ఇంటర్నెట్‌ని దాటి మన ఆర్థిక వ్యవస్థ మొత్తంగా అభిప్రాయాల సెన్సార్‌షిప్‌ విస్తరించింది. నల్లజాతి, గే లేదా ముస్లింగా ఉంటున్నందుకు మీరు ఎవరినైనా ఉద్యోగం లోంచి తొలగించలేనట్లయితే, రాజ కీయ ప్రసంగం కోసం కూడా మీరు ఎవరినీ ఉద్యోగం లోంచి తొలగించకూడదు. అమెరికన్‌ పౌరహక్కుల కార్యకర్తగా రాజకీయ వ్యక్తీకర ణను ప్రతిష్ఠించడానికి నేను అమెరికన్‌ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాను.

విభేదించే అభిప్రాయాలను కలిగివుండే కార్మికులను వివక్ష నుంచి  కాపాడటానికి ప్రస్తుతం ఉనికిలో ఉన్న పౌర హక్కులను అమలు చేస్తాను. మత పరమైన వివక్షపై ఉన్న ఫెడరల్‌ ప్రభుత్వ నిషేధం ఉద్యోగులను ఏ మతానికీ లోబడనీయకుండా యజమానులను కట్టడి చేస్తోంది.  కార్పొరేట్‌ అమెరికాలో వ్యాపించివున్న మేలుకొలుపు వాదానికి ఇది సరిగ్గా సరిపోయేట్టుగా ఉంది.

పరస్పరం పంచుకునే సూత్రాల చుట్టూ మన జాతీయ అస్తి త్వాన్ని పునరుద్ధరించుకున్న తర్వాత, అమెరికాకు అతి పెద్ద విదేశీ ప్రమాదంగా ఉన్న కమ్యూనిస్టు చైనా వికాసాన్ని ఓడించడానికి అవసరమైన దృఢత్వాన్ని సమకూర్చుకోగలం. 1980లలో సోవియట్‌ యూనియన్‌ లాగా కాకుండా, చైనా నేడు ఆధునిక అమెరికన్‌ జీవన శైలికి కావాల్సిన శక్తిని ప్రసాదిస్తోంది. అందుకే మనం ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలి. చైనాను కనీసం తాకకుండా, అమెరికాను వణికిస్తున్న సరికొత్త వాతావరణ మతం చేస్తున్న డిమాండ్లను వ్యతిరేకించడం ద్వారా మనం ప్రపంచ ఇంధన నాయకత్వాన్ని తిరిగి పొందాలి.

తైవాన్‌ను ఏ విధంగానైనా సరే కాపాడుతూనే సెమీ  కండ క్టర్‌ల తయారీలో స్వయం సమృద్ధిని సాధించాలి. 16  సంవత్సరాల లోపు పిల్లలు టిక్‌ టాక్‌ ఉపయోగించకుండా నిషేధం విధించాలి. కోవిడ్‌–19ను వ్యాప్తి చెందించడంపై చైనాను జవాబుదారీని చేయ డానికి మనం ఆర్థిక తులాదండాన్ని తప్పకుండా ఉపయోగించాలి. చౌర్యం, వ్యాపారమయ ఎత్తుగడలను చైనా ప్రభుత్వం నిలిపి వేసేంతవరకు అవసరమైతే చైనాలోకి అమెరికన్‌  కంపెనీలు విస్తరించడాన్ని నిషేధించడానికి కూడా మనం సిద్ధపడాలి. 

మనం నిజంగా ఎవరం అని తిరిగి ఆవిష్కరించుకున్నట్లయితే మళ్లీ కాలానికి తగినట్టుగా మనం ఎదగగలం. అమెరికా బలం మన భిన్నత్వం కాదు, ఆ భిన్నత్వానికి అతీతంగా మనల్ని ఐక్యం చేస్తున్న ఆదర్శాలే మన బలం. ఈ ఆదర్శాలే అమెరికన్‌ విప్లవాన్ని గెలిపించాయి, అంతర్యుద్ధం తర్వాత దేశాన్ని ఐక్యపరిచాయి, రెండు ప్రపంచ యుద్ధాలను, ప్రచ్ఛన్న యుద్ధాన్ని గెలిపించాయి. ఈ ఆదర్శాలు ఇప్ప టికీ స్వేచ్ఛాయుత ప్రపంచం పట్ల ఆశను కలిగిస్తున్నాయి. వీటిని మనం పునరుద్ధరించినట్లయితే మనల్ని ఏ శక్తీ ఓడించలేదు.

వివేక్‌ రామస్వామి 
వ్యాసకర్త అమెరికా అధ్యక్ష స్థానం కోసం పోటీ పడనున్నారు (‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు