సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష

7 Dec, 2022 02:47 IST|Sakshi

భారత లౌకిక రాజ్యాంగ లక్ష్యాల పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు పాత్ర ఎంతో కీలకమైనది. కానీ గత 75 ఏళ్లుగా దాని మీద స్వారీ చేయాలని మొదట కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పుడు బీజేపీ పాలకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతతో వ్యవహరించాల్సి ఉందన్న తీర్పును శిరసా వహించవలసింది పోయి, దాన్ని తోసిపుచ్చుతూనే వచ్చారు.

కానీ దానికి ఎదురు నిలిచి గట్టిగా అడ్డుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు న్యాయ స్థానానికీ, పాలక వర్గానికీ మధ్య అధికార సమతుల్యతను సాధించగలిగారు. కానీ ప్రభుత్వం మాటే చెల్లుబడి కావాలి అన్న వాదన మళ్లీ యధాతథ స్థితికే వచ్చింది. పాలకవర్గానికి అనుకూలురుగా వ్యవహరించగల వ్యవస్థను ఖరారు చేసే ప్రయత్నంలో బీజేపీ పాలకులు ఉండటం గమనార్హం.

‘‘రానున్న దశాబ్దాలలో సుప్రీంకోర్టు దేశ పాలకుల నుంచీ, ఇతర రంగాల నుంచీ పెక్కు సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది. వాస్తవానికి భారత లౌకిక రాజ్యాంగ లక్ష్యాల పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు తన కర్తవ్యాన్ని తు.చ. తప్పకుండా నెరవేర్చవలసి ఉంటుంది.’’
– భారత లా కమిషన్‌ మాజీ అధ్యక్షులు, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.పి. షా (20 సెప్టెంబర్‌ 2022)

గత 75 సంవత్సరాల్లో మొదట కాంగ్రెస్‌ శక్తులు, ఆ పిమ్మట బీజేపీ– ఆరెస్సెస్‌ శక్తులు రాజ్యాంగ లౌకిక సూత్రాలకు కట్టుబడకుండా పాలకుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చాయి.  1971–93 మధ్య దేశ పాలకులు సుప్రీంకోర్టులో తమకు అను కూలంగా ఉండే న్యాయ మూర్తులే ఉండాలని పట్టుబట్టడంతో అలాంటి వారినే ప్రధానంగా నియమిస్తూ వచ్చారు.

దాంతో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ మూర్తుల నియామకాల్లో ‘సీనియారిటీ’ ప్రశ్న తలెత్తకుండా పాలకులు జాగ్రత్త పడుతూ వచ్చారు. 1981లో ‘ఫస్ట్‌ జడ్జెస్‌’ కేసులో (ఎస్‌.పి. గుప్తా కేసు) వెలువరించిన న్యాయ వ్యవస్థ స్వతంత్రత తీర్పును శిరసా వహించవలసిన అవసరాన్ని పాలకులు తోసిపుచ్చుతూనే వచ్చారు. 

ఈ ధోరణిని 1993లో గట్టిగా అడ్డుకున్నవారు నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎన్‌. వెంకటాచలయ్య. దాంతో అప్పటికి న్యాయస్థానానికీ, పాలక వర్గానికీ మధ్య అధికార సమతుల్యత వచ్చినట్టు కన్పించేదిగానీ, పాలక శక్తుల నిరంకుశ ధోరణి (ప్రభుత్వం మాటే చెల్లుబడి కావాలి అన్న వాదన) మళ్లీ యధాతథ స్థితికే వచ్చింది. ఎటుతిరిగీ బలహీనమైన పాలక వర్గాలు అధికారంలో ఉన్న ప్పుడు మాత్రమే న్యాయస్థానాలు కొంత గాలి పీల్చుకోగలిగాయి.

ఈ పరిణామాలు వచ్చివచ్చి నరేంద్ర మోదీ ప్రధానిగా బీజేపీ ప్రభుత్వం రాగానే ‘తీసికట్టు నాగంబొట్టు’ అన్న చందంగా తయారయ్యాయి. అయితే ఈ స్థితి ప్రధాన న్యాయమూర్తిగా మొన్నటిదాకా పనిచేసి రిటైర్‌ అయిన జస్టిస్‌ ఎన్‌.వి. రమణ కాలంలో కొంతవరకు ప్రజాను రంజకంగా కొనసాగింది.

ఆ తరువాత ప్రధాన న్యాయమూర్తిగా వచ్చి 2024వ సంవత్సరం దాకా ఆ పదవిలో కొనసాగనున్న జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ తీసుకొంటున్న నిర్ణయాలు సుప్రీం పరువును, దేశ లౌకిక రాజ్యాంగ ప్రతిపత్తిని అక్షరసత్యంగా కాపాడుతున్నాయి. అయితే జస్టిస్‌ ఎ.పి. షా చెప్పినట్టుగా అప్పుడే ‘‘పాలకవర్గం నుంచి జస్టిస్‌ చంద్రచూడ్‌ విధానాలకు ప్రతిఘటన’’ మొదలైందని మరచిపోరాదు.

ఈ సందర్భంగా ఏపీలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి వ్యతి రేకంగా రాష్ట్ర హైకోర్టు వెలువరించిన ప్రతికూల తీర్పులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తిరుగులేని తీర్పును ఒక కనువిప్పుగా భావించాలి. ‘‘ఏపీలో ప్రభుత్వ కార్యనిర్వాహక విధుల జోలి హైకోర్టుకు ఎందుకు? హైకోర్టే ప్రభుత్వమైతే ఇక అక్కడి మంత్రి మండలి ఎందుకు? ప్రజా ప్రతినిధులెందుకు?’’ అంటూ సుప్రీం జస్టిస్‌ కె.ఎం. జోసఫ్, జస్టిస్‌ బీవీ నాగరత్నం ధర్మాసనం వ్యాఖ్యానించవలసి రావటం సుప్రీం నిర్ణయాలకు ఎంత ప్రాముఖ్యముందో అర్థమవుతోంది.

పరిపాలనా వికేంద్రీకరణ అవసరం ఎంత ఉందో కూడా సుప్రీం ధర్మాసనం గుర్తిం చింది. రాజధాని ఫలానా ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించే అధి కారం కోర్టుకు లేదనీ, కోర్టులకు ఆ హక్కు ఉండే పక్షంలో మంత్రి వర్గాలెందుకనీ కూడా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. 

ఇలా ధర్మాసనం లేవనెత్తిన ప్రజానుకూలమైన ప్రశ్నల నేప థ్యంలో– బీఆర్‌ అంబేడ్కర్‌ను ఉటంకిస్తూ, భారత పాలక వర్గాలు రాజకీయంగా ఎంత పతనమయ్యాయో చెప్పిన మాటల్ని ‘శంకర్స్‌ వీక్లీ’ (16 ఏప్రిల్‌ 1949) ఒక కార్టూన్‌ ద్వారా ఏనాడో వెల్లడించింది. ‘‘భారతదేశంలో రాజకీయ నాయకుణ్ణి ఒక మత గురువు స్థానంలో నిలబెట్టి కొలుస్తారు. కానీ, భారతదేశం వెలుపల మాత్రం అక్కడి ప్రజలు మత గురువుల జన్మదినాలనే జరుపుకొంటారు.

కానీ ఇండియాలో మత గురువుల జన్మదినాలతోపాటు రాజకీయ నాయ కుల జన్మ దినాలు జరుపుతారు. రాజకీయ నాయకుడు సత్ప్రవర్తన గలవాడయినప్పుడు ప్రేమించండి, గౌరవించండి. కానీ నాయకుణ్ణి కొలవడం అనేది ఉండకూడదు. ఆ పని కొలిపించుకునేవాడికీ, కొలిచే వాడికీ తగదు. ఉభయత్రా ఈ పని నైతిక పతనంగా భావించాలి’’ అన్నారు అంబేడ్కర్‌.

ఈ మాటల్నే 1955లో తలచిందెల్ల ధర్మం అని భావించరాదని పార్లమెంట్‌లో చెప్పారు. ‘రాజు తప్పు చేయడన్న’ సంప్రదాయం బ్రిటిష్‌వాడి నమ్మిక. కానీ రాజ్యాంగాన్ని అమలుజరిపే విషయంలో రాచరిక వ్యవస్థల్లో లాగా నేటి ప్రధానమంత్రి తప్పు చేయడనీ, చేయలేడనీ చెప్పడం ఉండకూడదన్నారు. ఈ దృష్ట్యానే అంబేడ్కర్‌ సుప్రీంకోర్టు జడ్జీలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి సర్వాధికారాలు ఉండాలని కోరుతూ సవరణలు ప్రతిపాదించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమానా భివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ప్రాంతీయ రాజధానులు, కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాలు సబబేనన్నది సుప్రీం కోర్టు భావన. ఈ పరిణామాలకు కొన్ని ప్రతిపక్షాలు, వాటికి కొమ్ము కాసే పత్రికలు వక్రభాష్యం చెబుతున్నాయి.

జగన్‌ ప్రభుత్వం నవ రత్నాల పథకాన్ని జయప్రదంగా అమలు కానివ్వకుండా చూసేందుకు కొన్ని ప్రతిపక్షాలు ‘జక్కాయి బుక్కాయి’తో చేతులు కలిపి పాలనా రథాన్ని కుంటుపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. సుప్రీం తాజా నిర్ణ యంతో వాటి నోళ్లు పెగలక ‘రూటు’ మార్చాయి. ప్రపంచంలో ఎక్కడా దేశానికి, రాష్ట్రాలకు రెండేసి మూడేసి రాజధానులు ఉండవని ‘కోత కోస్తూ’ వచ్చిన కొన్ని ప్రతిపక్షాలు తమ మాటలు అబద్ధాలని గుర్తించక తప్పని స్థితి వచ్చింది. 

సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం తీసుకున్న నిర్ణయం ఫలితంగా – జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌ లాంటి దళిత న్యాయమూర్తి నిజాయితీ కూడా ప్రపంచానికి వెల్లడయింది. ఎందుకనంటే రాష్ట్ర గవర్నర్లు... రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, వాటి సలహా సహకారాలతోనే రాజ్యాం గంలోని 163వ అధికరణ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది గానీ, రాష్ట్ర ప్రభుత్వాలను ధిక్కరించి కాదని బొమ్మై కేసులో జస్టిస్‌ జయ చంద్రారెడ్డి తీర్పును దేశవ్యాపిత స్థాయిలోనే ప్రజాస్వామ్య నిర్ణ యంగా న్యాయ శాస్త్రవేత్తలు భావించారు.

ఉత్తరాఖండ్‌లో పరిణామాలు బీజేపీ పాలకులకు వ్యతిరేకంగా ఉన్నందున అర్ధంతరంగా అక్కడ రాష్ట్రపతి పాలనను విధించేందుకు మోదీ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తిప్పి కొట్టడానికి జస్టిస్‌ జోసెఫ్‌ జంకనందున అప్పటికి ఉత్తరాఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న ఆయన్ని సుప్రీంకోర్టు జస్టిస్‌గా పదవీ స్వీకారం చేయనివ్వకుండా మోదీ ప్రభుత్వం అడ్డు కుంది. నేడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలోని బీజేపీ గవర్నర్లు చేస్తున్న నిర్వాకం – దాదాపు పది రాష్ట్రాలలోని బీజేపీయేతర ప్రభు త్వాలను పడగొట్టేందుకు తోడ్పడటం. ఇలా 1960ల నుంచి నేటి దాకా పెక్కుమంది గవర్నర్లు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోయడానికి తోడ్పడుతూ వచ్చినవాళ్లే!

మోదీ మంత్రివర్గ సీనియర్‌ సభ్యుడు కిరణ్‌ రిజిజూ జాతీయ స్థాయి న్యాయమూర్తుల నియామకాలను ఖరారు చేసే వ్యవస్థను రద్దు చేసి, పాలకవర్గానికి అనుకూలురుగా వ్యవహరించగల వ్యవస్థను ఖరారు చేసే ప్రయత్నంలో ఉండటం ఇక్కడ గమనార్హమైన విషయం. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ లోకూర్‌ ఒక తాజా ఇంటర్వ్యూలో ‘న్యాయ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ సంపూర్ణాధి పత్యాన్ని అనుమతిస్తే న్యాయవ్యవస్థ స్వేచ్ఛగా నిర్ణయాలు చేయగల స్థితిలో ఉండదు’ అన్నారు. అందుకేనేమో వేమన మహాకవి ఏనాడో ఇలా తీర్పు చెప్పిపోయాడు.

‘అంతరంగమందు అపరాధములు చేసి
మంచివాని వలెను మనుజుడుండు
ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా?
విశ్వదాభిరామ వినుర వేమ’!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు