బిహార్‌లో సరికొత్త అడుగులు!

12 Nov, 2020 00:37 IST|Sakshi

విశ్లేషణ

భారత రాజకీయాల్లో ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భావానికి బిహార్‌ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజíస్వీ యాదవ్‌. విభజన రాజకీయాల ప్రాతిపదికన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వీ యాదవ్‌ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వీ.. యాదవ రాజకీయాల బరువునుంచి పూర్తిగా తప్పుకుని కొత్త పంథాలో నడిచి అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు. తన వంటి అతి పిన్నవయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్‌ అనంతర రాజకీయాలను ప్రతిబింబిస్తున్న సరికొత్త హీరో తేజస్వీ యాదవ్‌.

చిట్టచివరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించింది.. 243 మంది సభ్యులు కల రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 125 స్థానాలు గెల్చుకుని సరిగ్గా ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి సరిపోయేటన్ని సీట్లను సాధించి బతుకుజీవుడా అని బయటపడింది. బీజేపీ నాయకత్వం దేన్నయితే ఆశించిందో సరిగ్గా అలాగే పోలింగ్‌ సరళి సాగిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీ స్వయంగా 74 స్థానాలు గెల్చుకుని 70 శాతం విజయశాతాన్ని సాధించింది. బిహార్‌ ఎన్నికల్లో అది సాధించిన ఉత్తమ ఫలితాలు ఇవే మరి. నితీశ్‌ కుమార్‌ని ఆయన జేడీయూని ఈ ఎన్నికల్లో ఒక జూనియర్‌ భాగస్వామి పాత్రకు కుదించాలని బీజేపీ పన్నిన పథకం బ్రహ్మాండంగా ఫలించింది. ప్రతిపక్ష శ్రేణులను ఎంతగా దెబ్బకొట్టాలో అంతగా దెబ్బకొట్టడమే కాదు.. విజయానికి దాదాపు దగ్గరగా వచ్చేలా ప్రతిపక్షాల ఓట్లను కూడా శాసించి బ్రాండ్‌ మోడీ ప్రభావం వల్లే ఈ గెలుపు సాధ్యం చేశానని బీజేపీ ఇరుపక్షాల శ్రేణుల ముందు ఘనంగా ప్రదర్శించింది. 

అయితే అదే సమయంలో భారత రాజకీయాల్లోకి ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భవానికి బిహార్‌ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజస్వి యాదవ్‌. విభజన రాజకీయాల ప్రాతిపది కన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వి యాదవ్‌ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. గెలిచిన స్థానాలను పరిశీలిస్తే తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ 75 స్థానాలు సాధించి బిహార్‌లో అతిపెద్ద పార్టీగా కొనసాగింది. దాదాపు 30 లక్షల ఓట్లను లేదా 40 శాతాన్ని దక్కించుకున్న ఆర్జేడీకి, 2015 నాటి ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు దక్కాయి. ముస్లింలు, యాదవుల ఓటు పునాది కలిగిన పరిమితిని దాటి ఆర్జేడీ తన పలుకుబడిని విస్తృతస్థాయిలో విస్తరించిందని తేటతెల్లమైంది.

గుర్తించదగిన విషయం ఏమిటంటే రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) తన ఓటు షేరును 18.3 శాతం నుంచి 23.1 శాతానికి పెంచుకునే క్రమంలో జేడీయూ పార్టీకి చెందిన ఓట్ల కంటే బీజేపీ కోటాను కొల్లగొట్టడమే. ఈ దెబ్బకు బీజేపీ ఓటు షేర్‌ గతంలోని 24.4 శాతం నుంచి 19.5 శాతానికి పడిపోయింది. 2015తో పోలిస్తే బీజేపీకి ప్రస్తుతం 10 లక్షల పదివేల ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. అయితే కూట మిలో భాగంగా తక్కువ స్థానాలకు కట్టుబడినందువల్ల కూడా బీజేపీకి ఓట్ల శాతం తక్కువగా వచ్చి ఉండవచ్చు. జేడీయు ఓటు షేర్‌ను దెబ్బకొట్టడంలో బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించింది. బీజేపీ ఇలా దెబ్బ కొట్టినా ఈదఫా ఎన్నికల్లో జేడీయూకు ఓటు శాతం 16.8 నుంచి 15.8 శాతం మాత్రమే తగ్గింది. ఒకవైపు బీజేపీ అభ్యర్థులు జేడీయూ ఓటర్లను పొందగలిగారు తప్పితే బీజేపీకి చెందిన అగ్రకులాల ఓటర్లు జేడీయూ పోటీ చేసిన స్థానాల్లో తమ ఓటు వేయకుండా జాగ్రత్తపడ్డారు. జేడీయూకు బదులుగా వీరు అటు ఎల్జేపీనుంచి లేదా ఆర్జేడీనుంచి పోటీ చేసిన బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులకు, తమ ఓటు గుద్దేశారు. కొన్ని సందర్భాల్లో వీరి ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు, ప్లూరల్స్‌ పార్టీ వంటి అతి చిన్న పార్టీల ఖాతాలోకి కూడా వెళ్లిపోయాయి.

ముందుండి నడిపించిన సమర యోధుడు
గతంలో 2015లో జరిగిన ఎన్నికల్లో మహాగట్‌ బంధన్‌ ప్రధాన వ్యూహకర్తగా తలపండిన రాజకీయనేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సర్వం తానై ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు. ఈ ప్రచార ముఖ చిత్రంగా నితీశ్‌ కుమార్‌ నిలిచి తన పార్టీనీ, పొత్తు పార్టీలను ఒంటిచేత్తో విజయం వైపు తీసుకుపోయారు. పైగా ఆనాడు బిహార్‌లో ప్రతిపక్షం ఎన్నికలకు కొద్ది నెలల ముందువరకు చెల్లాచెదురై ఉండేది.  అందుకనే 2015లో సాధించిన 80 సీట్లతో పోలిస్తే ఇప్పుడు 75 స్థానాలు చేజిక్కించుకుని గణనీయమైన విజయం సాధించిన ఘనత పూర్తిగా యువ తేజస్వీ యాదవ్‌కే దక్కుతుంది. తన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఛాయ నుంచి పూర్తిగా బయటపడిన 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వి యాదవ్‌ అతి తక్కువ సమయంలో సాధించిన విజయం సాధారణమైనది కాదు. యాదవ రాజకీయాల బరువునుంచి తప్పుకుని కొత్త పంథాలోసాగిన తేజస్వి బిహార్‌లోని అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు.

అంతకంటే ముఖ్యంగా ఇటీవలి కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా బిహార్‌లో సాగిన ఎన్నికల ప్రచారం సాపేక్షికంగా శాంతియుతంగా, విద్వేష రహితంగా సాగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఈ గొప్ప మార్పునకు పూర్తి ఘనత ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌కే దక్కాల్సి ఉంటుంది. జాతీయ మీడియా కూడా ఈ విషయంలో తేజస్వి విశిష్టతను స్పష్టంగా గుర్తించి ప్రశంసించింది. 2020లో సాగిన ఎన్నికల్లో కూడా బీజేపీ య«థాప్రకారంగా కశ్మీర్, సీఏఏ, రామ్‌ మందిర్‌ వంటి అంశాలను పదేపదే ప్రస్తావించి విభజన రాజకీయాలను ప్రేరేపించా లని ప్రయత్నించింది. కానీ దానివల్ల అది సాధించింది పెద్దగా ఏమీలేదు. చివరకు బాలీవుడ్‌లో కొనసాగుతున్న సాంస్కృతిక తప్పిదాల వల్లే యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుని కన్నుమూశాడంటూ చెలరేగిన తీవ్రవివాదాస్పద అంశాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిం చింది. ఇక నితీశ్‌ తనవంతుగా జంగిల్‌ రాజ్‌ అనే పాత ముద్రను ఆర్జేడీపై పదేపదే సంధిస్తూ తేజస్విపై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దాడులకు కూడా ప్రయత్నించినా, అవేవీ పెద్దగా ఫలవంతం కాలేదు. 

ఈ మొత్తం వ్యతిరేక ప్రచారంలో కూడా తేజస్వి అత్యంత పరిణతిని ప్రదర్శించారు. తన వంటి అతి పిన్న వయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. తనపై సాగుతున్న దాడిలో పొరపాటున కూడా ప్రవేశించకుండా తేజస్వి యాదవ్‌ మొదటినుంచి చివరివరకూ తాను విశ్వసించినటువంటి.. బిహార్‌ యువతకు విద్య, ఉద్యోగాలు అనే అంశాలపైన మాత్రమే దృష్టి సారించి ప్రచారం సాగిం చాడు. మహాగట్‌ బంధన్‌ బలమైన అధికార కూటమిని ఈ స్థాయిలో ముప్పు తిప్పలు పెట్టిందంటే తేజస్వి అత్యంత ప్రతిభావంతంగా అల్లిన ప్రచార ఎజెండానే కారణమని చెప్పక తప్పదు.

ఈ ప్రయాణ క్రమంలో తేజస్వి ఈ దఫా ఎన్నికలకు మాత్రమే కాకుండా, దేశంలో కోవిడ్‌–19 అనంతర రాజకీయాలకు కూడా అజెండాను నిర్దేశించడంలో బ్రహ్మాండంగా సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. బిహార్‌ యువతీయువకులకు పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తానని తేజస్వి ఇచ్చిన ఎన్నికల హామీ బీజేపీని ఎంతగా భీతిల్లజేసిందంటే తమ కూటమిని గెలిపిస్తే 19 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని ఎదురు హామీ ఇవ్వాల్సి వచ్చింది. అంతే కాకుండా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ని ఉచితంగా అందిస్తానని కూడా హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది మధ్యేవాద వామపక్ష రాజకీయ ఆర్థిక విధానాన్ని ఒక మితవాద పార్టీ ప్రకటించవలసి రావడంగా తప్ప మరోలా దీన్ని చూడలేం. 

మరోవిధంగా బిహార్‌లో వామపక్షాలు సాగించిన గొప్ప విజ యంలో కూడా ఇది ప్రతిఫలించింది. పోటీ చేసింది 29 స్థానాల్లోనే అయినప్పటికీ ఈ దఫా ఎన్నికల్లో వామపక్షాలు 16 సీట్లు కొల్లగొట్టి షాక్‌ తెప్పించాయి. గతంతో పోలిస్తే 50 శాతం విజయాల రేటును పెంచుకున్న వామపక్షాలు ఆర్జేడీతో సమానంగా విజయాలు సాధించడమే కాకుండా కాంగ్రెస్‌ (30 శాతం), జేడీయూ (40శాతం) కంటే మంచి స్థానంలో నిలబడటం చెప్పుకోదగిన విషయం. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ–జేడీయు కూటమి అత్తెసరి మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ భారతదేశంలో మధ్యేవాద–వామపక్ష రాజకీయాలకు ఏకకాలలో బిహార్‌ పైకెత్తి నిలిపింది. వచ్చే సంవత్సరం పశ్చిమబెంగాల్, అస్సామ్, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలు కూడా బిహార్‌ అనుభవాన్ని ప్రతిబింబించినట్లయితే, అప్పడు బిహార్‌ ప్రజలు అలాంటి మార్గాన్ని చూపించింది మేమే కదా అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్‌ అనంతర రాజకీయాలకు సంబంధించిన సరికొత్త హీరో తేజస్వి యాదవ్‌.

వ్యాసకర్త
రాజేష్‌ మహాపాత్ర
స్వతంత్ర జర్నలిస్టు

మరిన్ని వార్తలు