అమృతమూర్తిని మరిచిన మహోత్సవం

25 Jun, 2022 01:21 IST|Sakshi

సందర్భం 

స్వాతంత్య్ర సమర యోధులకు ఘనమైన నివాళిగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను నిర్వహిస్తోంది. స్వాతంత్య్రం సాధించి డెబ్బై ఐదేళ్లు అయిన సందర్భంగా... గతేడాది మార్చి 12 (ఉప్పు సత్యాగ్రహం) నుంచి ఈ ఏడాది ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) వరకు... సంకేతాత్మ కంగా డెబ్బై ఐదు వారాలపాటు మన సంగ్రామ చరిత్రలోని ప్రతిధ్వనులు ప్రతి ఒక్క భారతీయుడికీ తలపునకు వచ్చే విధంగా ఒక సమగ్ర ప్రణాళికతో రూపొందించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. అయితే మహాత్మా గాంధీ వంటి ఒక శిఖర సమానుడిని, ఆయన పాటించి ప్రబోధించిన సత్యాగ్రహం, అహింస వంటి మహోన్నత భావాల సమర శక్తిని ఈ ‘అమృత మహోత్సవాలు’ పూర్తిగా విస్మరించాయన్న విమర్శలు వినవస్తున్నాయి.

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట ఈ ఏడాది పొడవునా మనం 75వ స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకొంటున్నాం. వివిధ అంశాలలో, వివిధ వర్గీకరణల కింద ప్రభుత్వం అనేక స్ఫూర్తిదాయక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వాటిల్లో ఎక్కడా కూడా మహాత్మా గాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇంకా మరికొందరు ముఖ్య సమరయోధులు స్వాతంత్య్ర సంగ్రామంలో పోషించిన పాత్రల ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘స్వాతంత్య్ర సాకారం వెనుక ఎవరి త్యాగా లైతే ఉన్నాయో వారి సమర గాథలను సజీవం చేసేందుకు’ ఉద్దేశిం చిన విభాగంలో ఈ ముఖ్య నాయకులిద్దరి ప్రస్థానం లేకపోవడం ఏమిటి? ఉండటానికైతే ఉంది.

కానీ అది నామ మాత్రమే. కొంచెం కటువుగా చెప్పాలంటే సాధారణమైన రీతిలో జరగని తొలగింపు. ఆది వాసీ నాయకుడు బిర్సాముండా, సుభాస్‌ చంద్రబోస్‌లకు మాత్రమే ఇందులో చోటు కల్పించారు. వాళ్ల పోరాటం ప్రత్యక్షమైనదీ, రక్తసిక్త మైనదీ కావచ్చు. సత్యం, అహింస అనేవి యుద్ధ ఫిరంగులు కాలేవా? వాటికి గుర్తింపు ఉండదా? గాంధీ, నెహ్రూల నాయకత్వాలను పక్కన పెట్టి స్వాతంత్య్ర పోరాటాన్ని, స్వాతంత్య్ర సాధనను చూడటం అంటే వాళ్లు వదిలివెళ్లిన అడుగుజాడల్ని అపహాస్యం చేయడమే.

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలోని స్మరణీయ మైలురాళ్లను తలచు కోవడం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ లక్ష్యాలలో ఒకటైనప్పుడు... ముఖ్యంగా మహాత్మా గాంధీ వంటి ఒక శిఖర సమానుడిని; ఆయన పాటించి, ప్రబోధించిన సత్యాగ్రహం, అహింస వంటి మహోన్నత భావాల సమర శక్తిని, దేశ విముక్తి కోసం ఆయన అందజేసిన సంకల్ప బలాన్ని మనం ఎలా విస్మరించగలం?  

స్వాతంత్య్రానంతరం మనం గాంధీమార్గాన్ని దాదాపుగా విస్మ రించామన్నది వాస్తవం. దేశం ముందు గాంధీజీ పరచిన ఆదర్శాలు... రాజకీయ అధికారం కోసం జరిగే పాకులాటల కింద నలిగి పోయాయి. అయినప్పటికీ మన సామాజిక, రాజకీయ వైఫల్యాల నుంచి దేశానికి దారి చూపే ఒక వేగుచుక్కలా ఆయన నిలిచారు. గాంధీ ఒక ఆవాహన. లక్షలాది భారతీయుల్ని తరాలుగా కదలిస్తున్న ప్రచండ ప్రబోధాత్మక శక్తి. నిరాడంబరతకు, కారుణ్యానికి, అన్నిటినీ మించి నిబద్ధతకు, నిజాయితీకి ప్రతీకగా భారతీయులు మనసా వాచా స్వీకరించిన మహా మనిషి.

తన ప్రజల మనోభావాలను ఒడిసిపట్టి, సైద్ధాంతిక ఆలోచనలుగా వాటిని మలిచినందువల్ల ఆయన నాయకుడయ్యారు. అందరు నాయకులలో ఈ గుణం ఉండేదే. కానీ వ్యత్యాసం ఎక్కడంటే... వారు మనల్ని నడిపించడానికి మన మనసులో ఉన్న సదాశయాలను బట్టి వెళుతున్నారా, అందుకు భిన్నంగా మన సంకుచితత్వాలను ప్రేరేపిస్తూ తమ సిద్ధాంతాలకు చోదక ఇంధనంగా మార్చుకుంటున్నారా అన్నదే. గాంధీ సమరశీలత మహోన్నతమైనది. సహనశీలత శతఘ్ని వంటిది. నమ్మిన సిద్ధాంతా లను ఆచరించడం కోసం పోరాట జీవనం సాగించి, ప్రాణత్యాగం చేసిన సంగ్రామ వీరుడు గాంధీ. 

భారతదేశంలోని అనేక భిన్న సమూహాల మధ్య, పైకి కని పించకుండా దాగి ఉండి, విద్వేషపు జ్వాలలకు చిచ్చుపెట్టే రాక్షస త్వాల గురించి గాంధీకి చాలా తెలుసు. అందుకే ఆయన హిందూ– ముస్లిం ఐక్యతనూ; బడుగు, అణగారిన వర్గాల, కులాల, సమాజాల దాస్య విముక్తినీ కోరుకున్నారు. గాంధీజీ మత విశ్వాసాలున్న హిందువే. అందులో సందేహం ఏమీ లేదు. ఆయనే... హిందూ– ముస్లిం అంటూ వేరుగా చూడటం వల్ల బలమైన హిందుత్వ నిర్మాణం జరగదని కూడా నమ్మారు.

ముస్లింల పట్ల దేశంలో నేడు వ్యక్తమౌ తున్న నిర్దాక్షిణ్య అసహనం గాంధీజీ ఏమాత్రం ఇష్టపడనిది.  దేశ విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. విభజనను భవి ష్యత్తులో చీముపట్టే ఒక ప్రాణాంతక గాయంగా ఆయన చూశారు. పరిస్థితి ఇప్పుడలా ఉంది. 

భారత రాయబారి అలన్‌ నజరేత్‌ చొరవతో ఏర్పడిన ‘సర్వోదయ ఫౌండేషన్‌’... గాంధీ ఆలోచనల్ని దేశంలోనూ, దేశం బయటా వ్యాప్తి చేస్తుంటుంది. నజరేత్‌ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో గాంధీ ప్రవచించిన విలువల ప్రాసంగికత అనే అంశపై ఒక చర్చా కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొన్న అనేక మంది విద్యావేత్తలు, ప్రముఖులు, ఆలోచనాపరులు... నాడు గాంధీజీ భారత ప్రజల సుదీర్ఘ సేవలో ఉన్న సంవత్సరాలలో వ్యక్త పరిచిన అనేక ప్రాథమిక ఆలోచనల నుంచి పునరుత్తేజం పొందవలసి ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ ఆలోచనలు భారతదేశంలోని ప్రజల సంస్కృతి, సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయినవీ, సుస్థిర మైన సహజీవన సామరస్య భావనను పెంపొందించేవీ. విధానాల ఎంపికల పరంగా చూస్తే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఎలా ఉండాలనేదానికి గాంధీ చెప్పిన ఒక మాటను ఇక్కడ ఉదహ రించాలి. ‘‘నీకు తారసపడిన అత్యంత నిరుపేదను గుర్తుకు తెచ్చుకో. నువ్వు తర్వాత చేయబోయే పని వల్ల ఆ నిరుపేదకు ఏమైనా ప్రయో జనం ఉంటుందా అని అతడిని అడిగి తెలుసుకో’’ అంటారు గాంధీ. 

గాంధీ సిద్ధాంతాలలో ఉదాసీనతకు గురైన అంశాలలో ఒకటి పర్యావరణ సుస్థిరత కూడానని నాకు అనిపిస్తుంది. గాంధీ జీవించి ఉన్న కాలంలో వాతావరణ మార్పు అనేది ఆందోళన చెందవలసిన ఒక విషయమే కాదన్నట్లుండేది. అయితే పర్యావరణ అత్యవసర స్థితికి వాతావరణ మార్పు ఒక వాస్తవమైన లక్షణమన్నది నేటి ప్రపంచానికి స్పష్టంగా తెలుస్తోంది. భూగోళానికి పొంచి ఉన్న పర్యావరణ సంక్షోభాన్ని గాంధీజీ ఆనాడే తన విస్మయపరిచే శాస్త్రీయ దృక్పథంతో చాల ముందుగానే వీక్షించారు.

భారతదేశ అభివృద్ధి అవకాశాలపై ఆయన మాట్లాడుతూ... ‘‘అభివృద్ధి సాధించడానికి బ్రిటన్‌కు భూగోళంపై సగం వనరులు కావలసి వచ్చాయి. మరి భారత్‌ వంటి దేశం అభివృద్ధి చెందడానికి ఎన్ని గ్రహాలు అవసరం?’’ అని ప్రశ్నించారు. ‘‘పాశ్చాత్యుల మాదిరిగా ఎప్పటికీ పారిశ్రామికీకరణ వైపు వెళ్లే అవసరం దైవానుగ్రహం వల్ల మనకు లేకున్నా... ఒకే ఒక రాజ్యపు ఆర్థిక సామ్రాజ్యవాదం నేడు ప్రపంచాన్ని సంకెళ్లలో ఉంచు తోంది.

30 కోట్ల మంది (ఆనాటి మన దేశ జనాభా) ఉన్న భారత దేశం కూడా ఇదే విధమైన దోపిడీకి గురవుతోంది. మిడతల దండు మీద పడినట్లుగా ప్రపంచాన్ని తొలిచేస్తోంది. భారతీయ సంస్కృతి ఎల్లప్పుడూ ప్రకృతిని తల్లిగా; జీవానికి, జీవికకు మూలంగా భక్తితో కొలుస్తుంది. మనం ఆ మాతృమూర్తి నుంచి తనను తను పునరు ద్ధరించుకోడానికి, పునఃశక్తి పొందడానికి అనుమతించేదానికి కంటే ఎక్కువ తీసుకోకూడదు.’’ పశ్చిమ దేశాల ఐశ్వర్యంతో ఆనాటికే అబ్బురపడి ఉన్న భారతదేశ ప్రజలకు గాంధీజీ అందించడానికి ప్రయ త్నించింది ఇదే. ‘‘మనం ఎంచుకున్న ప్రకృతి బహుమతులను మనం ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ తల్లి ఖాతాలో వచ్చినవి, పోతున్నవి ఎప్పుడూ సమంగా ఉంటాయి’’ అంటారు గాంధీ.

గాంధీ సందేశం నేటికీ ఔచిత్యాన్ని, అత్యవసరతను కలిగి ఉంది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను జరుపుకొంటున్న వేళ గాంధీ లోతైన ఆలోచనలు సమకాల ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. భారత దేశం తన స్వతంత్ర, శక్తిమంత, ప్రజాస్వామిక తదుపరి ప్రయాణ భాగాన్ని ప్రారంభించినప్పుడు గాంధీమార్గంలోనివి అయిన పరమత అంగీకారం, విభిన్న దృక్కోణాలకు చోటు కల్పించడం; సమతౌ ల్యాన్ని, సమ్మిళిత స్వామ్యాన్ని అనుసరించడం, పర్యావరణ, సాంఘిక స్థిరత్వాన్ని నిర్థారించే ఆర్థికవ్యూహం.. వంటి వాటిని అనుసరించే స్ఫూర్తిని దేశ ప్రజలలో కలిగించాలి. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రను పునర్నిర్మించడంలోని ఈ అత్యంత విలువైన గాంధీ విలువల వారసత్వం ప్రస్తుత రాజకీయాల బారిన పడకూడదని కూడా ప్రతి ఒక్కరూ ఆశించాలి. 

శ్యామ్‌ శరణ్‌
వ్యాసకర్త భారత విదేశాంగ మాజీ కార్యదర్శి
(‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు