వచ్చేది బీజేపీ ప్రభుత్వమే!

1 Aug, 2022 02:49 IST|Sakshi

అభిప్రాయం 

మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రగతిపథంపై పరుగులెడుతోంది. ఏ అంతర్జాతీయ సంస్థ సర్వే చేసిన సరే... ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ సొంతం చేసుకున్న నాయకుడిగా భారత ప్రధాని మోదీనే కితాబందుకుంటున్నారు. ‘బీజేపీ దక్షిణ భారతదేశంలో విస్తరించలేదు’ అన్న వాదనలను తప్పని రుజువు చేస్తూ ఇప్పటికే దక్షిణ భారతానికి ప్రవేశ ద్వారమైన కర్నాటకలో కాషాయ జెండా రెపరెపలాడిస్తోంది. పుదుచ్చేరిలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే విజయవంతంగా కొనసాగుతోంది. బలమైన తెలంగాణ ఉద్యమం రాజేసిన సెంటిమెంటును అడ్డం పెట్టుకొని గద్దెనెక్కిన కేసీఆర్‌... నీళ్లు, నిధులు, నియామకాలు సహా ప్రజల ఆకాంక్షల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. 

భారతీయ జనతా పార్టీ... ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. దేశంలో నలుదిక్కులకూ విస్తరిస్తూ ఎప్పటికప్పుడు బలాన్నీ, ప్రాబల్యాన్నీ, ప్రభావాన్నీ పెంచుకుంటోంది. ‘బీజేపీ దక్షిణ భారతదేశంలో విస్తరించలేదు’ అన్న వాదనలను తప్పని రుజువు చేస్తూ ఇప్పటికే దక్షిణ భారతానికి ప్రవేశ ద్వారమైన కర్నాటకలో కాషాయ జెండా రెపరెపలాడిస్తోంది. పుదుచ్చేరిలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే విజయవంతంగా కొనసాగుతోంది. అందుకే ప్రజలు మోదీ తరహా పాలన కావాలంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అని రాజకీయ పండితులు తమ విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నారు. 

మోదీ నేతృత్వంలో ప్రగతి!
ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రగతిపథంపై పరుగులెడుతోంది. ఏ అంతర్జాతీయ సంస్థ సర్వే చేసిన సరే... ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ సొంతం చేసుకున్న నాయకుడిగా భారత ప్రధాని మోదీనే కితాబందుకుంటున్నారు. ‘‘సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్‌’’ (అందరితో, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం) విధానంతో సంస్కరణ పథంలో నడుస్తూ, దేశంలో అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారతీయుల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతున్నారు. 

పేదింట పుట్టి, పేదల కష్టాలను స్వయంగా చవిచూసిన ప్రధాని పేదల జీవితాల్లో గొప్ప పరివర్తన తీసుకొచ్చారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, 2 కోట్ల కుటుంబాలకు పక్కా ఇండ్లను నిర్మించారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కింద ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.5 లక్షల విలువ గల ఉచిత చికిత్స అందిస్తూ పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘ఉజ్జ్వల యోజన’ కింద 11 కోట్ల మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లిచ్చారు. ‘ముద్ర యోజన’ కింద స్వయం ఉపాధి అవకాశాలు కల్పించారు.  ‘జన్‌ ధన్‌ పథకం’ కింద 45 కోట్ల జీరో బ్యాలెన్స్‌ బ్యాంకు ఖాతాలు తెరిపించి పేదలనూ, గ్రామీణులనూ సైతం ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకొచ్చారు. ‘గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’తో కరోనా విపత్తులో పేదలెవరూ పస్తులుండకుండా కడుపు నింపారు. స్వచ్ఛ భారత్, స్వనిధి, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా... ఇలా చెప్పుకుంటే మోదీ పథకాలెన్నో పేదల కష్టాలకు తెరదించుతూ సులభతర జీవనాన్ని అందించేవే. 2014కు ముందు సామాన్యుడి ఊహకు సైతం అందని అంశాలెన్నో ఇప్పుడు వారి నిత్యజీవితంలో భాగమయ్యాయి.

మోదీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయ సమాజంలో భారతదేశ గౌరవం పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ప్రపంచ దేశాలన్నీ మోదీ నేతృత్వంలోని భారత్‌ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నాయి. మోదీ దేశాభివృద్ధిలో కొత్త శకాన్ని ఆవిష్కరించేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నారు. సంస్కరణలు తీసుకురావడమే కాదు... ‘‘రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ ఫార్మ్‌’’ నినాదంతో ఆ సంస్కరణ ఫలాలను 140 కోట్ల మంది భారతీయులకు చేరవేస్తున్నారు. 2014 వరకు మందగమనంతో సాగిన ఆర్థిక వృద్ధి నేడు జెట్‌ స్పీడుతో దూసుకుపోతుంది. అప్పుడు ఉత్పత్తి తిరోగమనంలో ఉంటే, ఇప్పుడు గణనీయంగా పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పిల్లలు ఆడుకునే బొమ్మల వరకు భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో వాటాను గణనీయంగా పెంచుకుంటున్నాయి. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచిందంటే దానికి కారణం నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలే! 

ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్‌
బలమైన తెలంగాణ ఉద్యమం రాజేసిన సెంటిమెంటును అడ్డం పెట్టుకొని గద్దెనెక్కిన కేసీఆర్‌... నీళ్లు, నిధులు, నియామకాలు సహా ప్రజల ఆకాంక్షల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై ఆశలపై నీళ్లు పోసింది. కనీసం సచివాలయానికి కూడా రాని ముఖ్యమంత్రి నియంతృత్వ వైఖరి, నిజాం పోకడలపై ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. సకల జనులు, సబ్బండ వర్ణాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారం మొత్తం ఒక కుటుంబం చేతిలోనే కేంద్రీకృతం కావడాన్నీ సహించలేకపోతున్నారు. ‘ప్రజల తెలంగాణ అనుకుంటే దొరల తెలంగాణ వచ్చిందా’ అంటూ గొల్లుమంటున్నారు.

ప్రధాని∙మోదీ సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పని చేస్తుంటే... ఇక్కడ కేసీఆర్‌ మాత్రం కుదిరితే ప్రగతి భవన్, లేదంటే ఫామ్‌హౌస్‌ తప్పితే... సచివాలయానికి మచ్చుకైనా రావడం లేదు. ప్రధాని వివిధ మాధ్యమాల ద్వారా నిత్యం ప్రజలతో సంభాషిస్తూ ఉంటే... మంత్రులకు సైతం అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి కేసీఆర్‌. అవినీతిరహిత, పారదర్శకత పాలనతో మోదీ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పాదుకొల్పితే... అవినీతికి గేట్లెత్తుతూ, పారదర్శకత మచ్చుకైనా లేకుండా అన్నింటా గోప్యత పాటిస్తూ, జవాబుదారీతనానికి నీళ్లొదిలిన ఘనత కేసీఆర్‌దే. అందుకే ప్రజలు మోదీ తరహా పాలన కావాలంటున్నారు.

మోదీ నేతృత్వంలో తెలంగాణలోనూ ‘డబుల్‌ ఇంజన్‌ పాలన’ రావాలని కోరుకుంటున్నారు. ‘డబుల్‌ ఇంజన్‌’ అంటే కేంద్రంలో, రాష్ట్రంలో అవినీతిరహిత పారదర్శక పాలన. ‘డబుల్‌ ఇంజన్‌’ అంటే రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పట్టం కట్టే పాలన. ‘డబుల్‌ ఇంజన్‌’ అంటే నియంతృత్వానికి తెరదింపి ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పే పాలన. ‘డబుల్‌ ఇంజన్‌’ అంటే కుటుంబ పాలనకు చరమగీతం పాడి, ప్రజల గోడు పట్టించుకునే పాలన. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తూ, ఆ ప్రయోజనాలను అర్హులందరికీ అందించే పాలన. కేంద్రంతో సమన్వయం చేసు కుంటూ మరిన్ని నిధులు రాబట్టే పాలన. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇవేవీ సాధ్యం కావడం లేదు కాబట్టే ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ‘డబుల్‌ ఇంజన్‌’కు మొగ్గు చూపుతున్నారు.

2018 ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌ పతనం మొదలైంది. 2018లో 7.1 శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఆరు నెలల తిరక్కముందే జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.45 శాతం ఓట్లతో 4 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. అదీ టీఆర్‌ఎస్‌ కంచుకోటలుగా చెప్పుకునే కరీంనగర్, స్వయంగా కేసీఆర్‌ కూతురు పోటీ చేసిన నిజామాబాద్‌తో పాటు ఆదీవాసీలు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, హైదరాబాద్‌ సిటీలో భాగమైన సికింద్రాబాద్‌ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు షాకిస్తూ బీజేపీ అభ్యర్థులు ఘనవిజయాలు సాధించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలు ప్రజలు బీజేపీనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారనడానికి ప్రబల నిదర్శనం. తెలంగాణ అసెంబ్లీలో 1 నుంచి 3కు చేరుకున్న బీజేపీ బలం రేపు జరిగే ఎన్నికల్లో 103కు చేరుకోవడం అసాధ్యమేమీ కాదు.

ఇక తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పప్పులుడకవు. తెలంగాణ సెంటిమెంటు, అలవికాని హామీలు, అరచేతిలో వైకుంఠం చూపించే మోసపు మాటలు... వీటినేవీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అదే తాను ముక్కయిన కాంగ్రెస్‌ ఎప్పుడో ప్రజల విశ్వసనీయత కోల్పోయింది. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే, వారు హస్తానికి చెయ్యిచ్చి, కారెక్కుతున్నారు. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ ప్రజల విశ్వసనీయత చూరగొంటూ, రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై ఫోకస్‌ పెంచింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను భాగ్యనగరంలో నిర్వహించడం తెలంగాణకు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందనడానికి నిదర్శనం.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ నేతృత్వంలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుస్నాబాద్‌ వరకు సాగిన మొదటి విడత అయినా... జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి తుక్కుగూడ వరకు సాగిన రెండో విడత అయినా... ఏ జిల్లా వెళ్లినా, ఏ నియోజకవర్గం వెళ్లినా ప్రజలందరిదీ ఒక్కటే మాట... ‘ఈ టీఆర్‌ఎస్‌ పాలన మాకొద్దు, మోదీ నేతృత్వంలోని డబుల్‌ ఇంజన్‌ పాలన కావాలని! ఆగస్టు 2న మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కానుంది.

అవినీతిమయమైన టీఆర్‌ఎస్‌ పాలనలో తామెదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెట్టేందుకు యాదాద్రి నుంచి వరంగల్‌ భద్రకాళి ఆలయం వరకు సాగనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘‘ప్రజా గోస – బిజెపి భరోసా’’ పేరిట వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకుల పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విశ్వసనీయతే ప్రామాణికంగా జరిగే రానున్న ఎన్నికల్లో ఆశలను వమ్ము చేసిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. పారదర్శక పాలనతో దేశాన్ని విశ్వగురుగా నిలపాలన్న ధ్యేయంతో అహర్నిశలు కృషి చేస్తున్న మోదీ నేతృత్వంలోని బీజేపీకి పట్టం కట్టడమూ ఖాయం.

తరుణ్‌ ఛుగ్‌ 
వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌ఛార్జ్‌

మరిన్ని వార్తలు