విమర్శ ప్రాధాన్యం మరిచారా?

27 Mar, 2023 00:18 IST|Sakshi

కామెంట్‌

కొన్నేళ్ల క్రితం నరేంద్ర మోదీ ‘‘ప్రభుత్వాలపై, వాటి పనితీరుపై వీలైనంత కఠినాతికఠినమైన విశ్లేషణ, విమర్శ చేయాలన్నది నా బలమైన విశ్వాసం. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం నడవదు’’ అన్నారు. మీడియా విమర్శనాత్మకంగా ఉండకపోతే ప్రభుత్వంలో భయం పోయి దేశానికి తీవ్ర నష్టం జరుగు తుందన్నారు.

చాలామంది బలమైన విమర్శను ఆహ్వానిస్తారు, కానీ ప్రభుత్వాన్ని భయంలో ఉంచాలని ఎవరూ చెప్పలేదు. కొంతమంది మంత్రులు మోదీ మాటల్ని మర్చిపోయారు. విమర్శకులను జాతి వ్యతిరేకులు అని నిందిస్తే, ఆ ప్రతిస్పందన విమర్శ కంటే ఎక్కువ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది.

సాక్షాత్తూ తన ప్రభుత్వాన్ని విమర్శించ డానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రధాన మంత్రే చెప్పిన మాటలు ఎంతమందికి గుర్తున్నాయో నాకు తెలీదు. ఆయన ప్రకటనలోని విషయం మాత్రమే కాదు, ఆయన జాగ్రత్తగా వాడిన పదాలు కూడా.

ఆ ప్రసంగ వీడియోలోని క్లిప్‌ను ప్రదర్శించినట్లయితే, ప్రధాని ప్రసంగంలోని ధాటిని కూడా మీరు గమనిస్తారు. ఆ మూడింటినీ కలిపిచూస్తే, ఆయన చెప్పిన మాటల్ని సరిగ్గా అలాగే ఉద్దేశించారని మనల్ని స్పష్టంగా నమ్మమని అన్నట్లుగా ఉంటాయి.

ప్రధాని పదవిని చేపట్టిన రెండేళ్ల తర్వాత, అంటే 2016 సెప్టెంబర్‌లో ‘నెట్‌వర్క్‌ 18’ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ అన్నారు: ‘‘ప్రభుత్వాలపై, వాటి పనితీరుపై వీలైనంత కఠినాతి కఠినమైన విశ్లేషణ, విమర్శ చేయాలన్నది నా బలమైన విశ్వాసం. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం నడవదు.’’

భయం ఉండాల్సిన అవసరం
మొదటగా ఆ పదాల ఎంపికను గమనించండి. ‘కఠినాతి కఠినమైన’ విశ్లేషణ, విమర్శ. మృదువైన, సూక్ష్మ కాదు. పరుషంగా, దాపరికం లేకుండా, శక్తిమంతంగా! రెండవది, ప్రభుత్వ పనిని మాత్రమే కాదు, ప్రభుత్వాన్నే విమర్శించి, విశ్లేషించాలి. మోదీ వీటిని ప్రత్యేక అంశాలుగా పేర్కొన్నారు. ఇది ఉద్దేశపూర్వక విభజన.

మోదీ మరింత ముందుకెళ్లారు. అంతే సమానమైన, శక్తిమంతమైన పదాలతో ఒకవేళ ప్రభుత్వాన్ని విమర్శించడంలో మీడియా విఫలమైతే రాదగిన నిర్దేశిత ఫలితమేమిటో చెప్పారు. ‘‘ప్రభుత్వంలో తేవాల్సిన మెరుగుదల, ప్రభుత్వంలో ఉండి తీరాల్సిన భయం లేకుండాపోతాయి.

ఒకవేళ ఆ భయం ప్రభుత్వంలో అదృశ్యమైతే, దేశం ఘోరంగా దెబ్బతింటుంది. అందువల్లే మీడియా అత్యంత విమర్శ నాత్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’’.

అంటే, ప్రభుత్వాన్ని భయపడుతున్న స్థితిలోనే ఉంచాలని ప్రధాని కోరుకుంటున్నారు. ఆయన ‘భయం’ అనేమాటను అను కోకుండా ఉపయోగించలేదు. చెప్పాలంటే, ఆ పదాన్ని ఆయన మూడుసార్లు వాడారు. ప్రభుత్వం భయపడటం మానేస్తే ఏం జరుగుతుందో గమనించండి– దేశానికి తీవ్ర నష్టం!

జాతి వ్యతిరేకులా?
ఇతర ప్రజాస్వామిక నేతలు విమర్శ అవసరం గురించి ఈ స్థాయిలో చెప్పి ఉంటారా అని నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను. చాలామంది బలమైన విమర్శను ఆహ్వానిస్తారు, కానీ ప్రభుత్వాన్ని భయంలో ఉంచాలని ఎవరూ చెప్పలేదు. పైగా మోదీ ప్రభుత్వాలను అని బహువచనంలో మాట్లాడలేదు. ప్రత్యేకించి తన సొంత ప్రభుత్వం గురించే మాట్లాడారు.

ఇప్పుడు నేను దీన్ని ఎందుకు పునరుల్లేఖించాను? మామూలు కారణం ఏమిటంటే, కొంతమంది మంత్రులు దాన్ని మర్చిపోయారు లేదా ఉద్దేశపూర్వకంగా విస్మరించేశారు. అందుకు నేను అనేక ఉదాహరణలు ఇవ్వగలను. కానీ రెండింటికి మాత్రమే పరిమిత మవుతాను. 

కొంతమంది రిటైరైన న్యాయమూర్తులు ‘భారత వ్యతిరేక గ్యాంగ్‌’లో భాగమయ్యారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఆరోపించారు. ఎందుకంటే ఈ న్యాయమూర్తులు పాల్గొన్న ఒక సెమినార్‌లో– మోదీ ప్రభుత్వం నియమించిన న్యాయమూర్తుల గురించిన విశ్లేషణను ప్రొఫెసర్‌ మోహన్‌ గోపాల్‌ సమర్పిస్తూ, వారిలో 15 శాతంమంది మతరాజ్య వ్యవస్థకు తప్ప రాజ్యాంగబద్ధ న్యాయ మూర్తులాగా లేరని పేర్కొన్నారు.

మోదీ ప్రకటన సరిగ్గా ఇదే మాట్లాడుతోందని న్యాయమంత్రి గుర్తించడం లేదా? అయినప్పటికీ ఆయన దాన్ని ‘భారత వ్యతిరేకం’ అన్నారు. న్యాయమూర్తులు దీనికి ‘తగిన మూల్యం’ చెల్లిస్తారని హెచ్చరించారు కూడా!

చతురత లేకపోతే...
నా రెండో ఉదాహరణ – ఉప రాష్ట్రపతికి సంబంధించినది. ఆయన మోదీ ప్రభుత్వంలో సభ్యుడు కాదు. ఆయన స్థానం ఆయన్ని మించినది. కానీ ‘మేధావర్గం, మీడియా జనాల’ గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘మన వృద్ధి వేగాన్ని తగ్గించి చూపడానికి భారత వ్యతిరేక శక్తులు హానికరమైన కథనాలను అల్లుతున్నాయి.

మన క్రియాత్మక ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగబద్ధ సంస్థలకు కళంకం తెస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఇంటర్వ్యూలోని విష యాలు తనకు కూడా వర్తిస్తాయని ఆయన మరిచిపోయినట్లు ఉన్నారు.

‘‘మన వృద్ధి వేగాన్ని తగ్గించాలని చూస్తున్నవారు’’ మన స్థూలదేశీయోత్పత్తి యథార్థతను ప్రశ్నిస్తున్నారు. ‘‘మన క్రియాత్మక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను’’ కళంకపరుస్తున్నవారు పార్లమెంటు, ఎన్నికల కమిషన్, మన భద్రతా సంస్థల పనితీరును ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విమర్శను కేవలం స్వాగతించడం కాదు, ఇది అవసరమే అని మోదీ చెప్పారు.

ప్రభుత్వ విమర్శలకు జవాబు ఇవ్వాల్సిన కేంద్ర మంత్రులూ, బీజేపీ అధికార ప్రతినిధులూ ప్రధానమంత్రి వివేకవంతమైన మాటలను కంఠతా పట్టాల్సి ఉంది. నన్ను మరో అంశాన్ని కూడా చేర్చనివ్వండి. విమర్శను ఎదుర్కొన్నప్పుడు చిరునవ్వుతో వినాలి, హుందాగా స్పందించాలి.

అప్పుడు ఆ విమర్శ వెంటనే వీగిపోతుంది. అలా కాకుండా విమర్శతో ఘర్షించడం, ఇంకా ఘోరంగా విమర్శకు లను జాతి వ్యతిరేకులు అని నిందించడం చేస్తే, ఆ ప్రతిస్పందన విమర్శ కంటే ఎక్కువ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, చతురతతో వ్యవహరించు, రాజకీయం చేయవద్దు!

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు