ఆర్థికంగా... అడకత్తెరలో బ్రిటన్‌?

26 Oct, 2022 02:03 IST|Sakshi

విశ్లేషణ

భారత సంతతికి చెందిన రిషీ సునాక్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించడంతో... సమస్యల నుండి ఆయన దేశాన్ని ఎలా బయటపడ వేయగలడా అనే చర్చ జరుగుతోంది. మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ తన మినీ బడ్జెట్‌లో బ్యాంకర్లకు బోనసులు పెంచటం, కార్పొరేట్లకు పన్నులను తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రయత్నించారు. కానీ మార్కెట్‌ ఆమె సంస్కరణలను తిరస్కరించింది. ఫలితంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే రిషీ సునాక్‌ అయినా, మరొకరు అయినా కూడా స్థూలంగా ఈ కార్పొరేట్‌ అనుకూల చట్రం నుంచి బయటకు రాలేనంత కాలమూ, నయా ఉదారవాద సంస్కరణల చట్రాన్ని బద్దలు కొట్టనంతకాలమూ బ్రిటన్‌ ఆర్థిక పరిస్థితిలో ఏ మార్పూ ఉండదు.

బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రిగా భారతీయ మూలాలున్న రిషీ సునాక్‌ పదవిని చేపట్టారు. అంతకుముందరి ప్రధాని లిజ్‌ ట్రస్‌ కేవలం 45 రోజులపాటు మాత్రమే బ్రిటన్‌ ప్రధానిగా కొనసాగగలిగారు. గత రెండు నెలల కాలంలో బ్రిటన్‌లో ముగ్గురు ప్రధానులు మారారు. ఇటువంటి పరి స్థితి సాధారణంగా మనం ధనిక దేశాలలో, అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యాలు అనబడే వాటిలో చూడం. 

మరి ప్రస్తుతం ఈ దుఃస్థితి బ్రిటన్‌కి ఎందుకు దాపురించింది? ఈ కారణాలలోకి పోయేముందు – కొత్త ప్రధాని సునాక్‌ అయినా నిల దొక్కుకోగలడా? అన్న ప్రశ్న ఎటూ ఎదురవుతూనే ఉంది. దీనికి జవాబుగా ‘గార్డియన్‌’ పత్రిక మూడు అంశాలను ముందుకు తెచ్చింది: 1. నిన్నటి ప్రధాని లిజ్‌ ట్రస్‌ ఏ సమస్యలను అయితే ఆర్థిక రంగంలో ఎదుర్కొన్నారో అదే సమస్యలు నేడు సునాక్‌ ముందు∙అలాగే అపరిష్కృతంగా నిలబడి ఉన్నాయి. 2. సునాక్‌ తాలూకూ కన్జర్వేటివ్‌ పార్టీ వారే ఆయనను ప్రజల మద్దతుతో ఎంపిక అయిన ప్రధానిగా చూడటం లేదు. 3. పైగా, కన్జర్వేటివ్‌ పార్టీలోని అనేక మంది అభిప్రాయం ప్రకారం – పార్టీని సమైక్యంగా ముందుకు తీసుకెళ్లగలగటం కష్టమైపోతోంది.

అదీ పరిస్థితి! అంటే స్థూలంగా కన్జర్వేటివ్‌ పక్షంలోనే అనేక గందరగోళాలున్నాయి. వీటన్నింటికీ మూలం, వెనుకన ఉన్నది – బ్రిటన్‌ దేశంలో అపరిష్కృతంగా ఉండిపోయిన ఆర్థిక సమస్యలు.   బెడిసికొట్టిన లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌ తాలూకు సారాంశం – ఆ దేశంలో అమలు జరుగుతోన్న ఆర్థిక విధానాల లోపాన్ని పట్టి ఇస్తుంది. ఆ బడ్జెట్‌లోని కీలక అంశాలు – బ్యాంకర్లు పొందగల బోనస్‌ మొత్తం పరిమితిని పెంచేయటం, కార్పొరేట్‌ ట్యాక్స్‌లను తగ్గించటం.

ఈ చర్యలు – ఇప్పటికే భారీ బోనస్‌లు పొందుతోన్న బ్యాంకర్లకు, బ్రిటన్‌ కార్పొరేట్లకు మాత్రమే లాభం కలిగించేవి. అయితే ఈ చర్యలతోనే బ్రిటన్‌ పురోగతిని సాధిస్తుందని లిజ్‌ ట్రస్‌ అభిప్రాయాల సారాంశం. కానీ, ఆమె ఆలోచనలను – కడకు ఆ దేశం తాలూకు ఫైనాన్స్‌ మార్కెట్లు కూడా తిప్పికొట్టాయి. అయితే ఈ ఆలోచనలు కేవలం లిజ్‌ ట్రస్‌వి మాత్రమే కాదు. అవి ఆ దేశంలో మొదలై నేడు ప్రపంచ వ్యాపితంగా అమలు జరుగుతోన్న ఉదారవాద సంస్కరణల ఆత్మగా ఉన్నాయి. 

సామాన్య జనం, కింది వర్గాలకు కాకుండా... పై వర్గాల వారైన ధనికులూ, కార్పొరేట్లకూ మరిన్ని రాయితీలు ఇస్తే ఆర్థికాభివృద్ధి మరింత బాగా జరుగుతుందనీ, ఈ వర్గాల పెట్టుబడుల వల్ల ప్రజలకు మరింతగా ఉపాధి కల్పించబడుతుందనీ ఈ విధాన సారాంశం. 1979–80లలో ఆరంభమైన ఈ ప్రపంచీకరణ విధానాలు... సంక్షో భాలు లేని ఆర్థిక వ్యవస్థ కోసం ప్రజల కొనుగోలు శక్తి బాగుండటం (మార్కెట్లో డిమాండ్‌ ఉండటం) అనే అంశాన్ని విస్మరించాయి.

ఈ విధానాలతోపాటుగా రంగ ప్రవేశం చేసిందే – ‘ద్రవ్యలోటు ఉండటం తప్పనే’ ఆర్థిక సిద్ధాంతం. ఒక దేశ ప్రభుత్వం తాలూకు ఖర్చులు, దాని ఆదాయంకంటే ఎక్కువగా ఉండరాదనే దీని అర్థం. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని అంటున్నారు. దీనిని నియం త్రించేందుకు ప్రభుత్వాలు పొదుపు చర్యలను పాటించాలనీ... ఖర్చు లను తగ్గించుకోవాలనీ బోధిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచం లోని పలు ఇతర దేశాలలోలాగానే – బ్రిటన్‌లో కూడా ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై రానురానూ కోతలు పెరిగి పోతున్నాయి.

కాగా, కోవిడ్‌ కాలంలో అనివార్యమైన అధిక ప్రభుత్వ వ్యయాల వల్ల బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం కట్టలుదాటింది. నేడు అది 10.1 శాతంగా ఉంది. పెరిగిన ధరలతో వారి కొనుగోలు శక్తి పడి పోయింది. ఫలితంగా నేడు ప్రతి ఐదుగురిలో ఒకరు రోజూ పస్తులు ఉండవలసిన పరిస్థితి దాపురించింది. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంవల్ల ఇంధన ధరలు బ్రిటన్‌లో కూడా నింగినంటాయి. దీనికోసం ప్రభుత్వం ప్రజలకు మరింతగా ఇంధన వ్యయాల రాయితీలు ఇవ్వడం, సంక్షేమాన్ని మెరుగుపరచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా, మరోపక్కన ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే పేరిట బ్రిటన్‌ కేంద్ర బ్యాంక్‌ వడ్డీరేట్లను పెంచుతోంది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి మరింత పడిపోతోంది. అలాగే, ఆర్థిక వృద్ధి రేటు కూడా మందగిస్తోంది. అంటే ద్రవ్యోల్బణం అదుపుకు వడ్డీరేట్లు పెంచితే అది అసలుకే ముప్పు తెచ్చి ఆర్థిక వృద్ధి రేటును దిగజారు స్తోందన్నమాట! ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోతోంది.

ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలలాగానే బ్రిటన్‌ కూడా ఈ ద్రవ్యోల్బణం – వృద్ధి రేటు పతనం అడకత్తెరలో చిక్కుకుంది. అంటే, వృద్ధి రేటు పడి పోయి... నిరుద్యోగం పెరిగిపోతోందని తిరిగి మరలా వృద్ధి రేటును పెంచేందుకు ఆర్థిక వ్యవస్థలోకి ఉద్దీపనల రూపంలో డబ్బును పంప్‌ చేస్తే– రెండోపక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అలాగని ద్రవ్యోల్బ ణాన్ని అదుపు చేసేందుకు – వడ్డీ రేట్ల పెంపుదల వంటి డబ్బు చలామణిని తగ్గించే చర్యలు తీసుకుంటే వృద్ధి రేటు మరలా తక్షణమే పతనం అవుతోంది. 

ఈ ద్రవ్యోల్బణ సమస్య కేవలం ప్రజలకే కాక, షేర్‌ మార్కెట్లలో అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడిదారుల పెట్టుబడులకూ... అలాగే, కార్పొరేట్ల లాభాల మార్జిన్‌లకూ కూడా కంటగింపుగానే ఉంది. నిజా నికి నేడు బ్రిటన్‌లో కావచ్చూ, ఇతర దేశాలలోనూ కావచ్చు... ఆయా దేశాల ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం అదుపు పేరిట బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచడం... ప్రజలను ధరల పెరుగుదల నుంచి కాపాడేందుకు కాదు.

ప్రధానంగా షేర్‌ మార్కెట్లలోని ఫైనాన్స్‌ పెట్టుబడిదారుల మదుపుల తాలూకు విలువను కాపాడటం. అంటే, ఒక ఫైనాన్స్‌ పెట్టుబడి దారుడు షేర్‌ మార్కెట్‌లో 100 పౌండ్లు పెట్టుబడి పెట్టి దానిపై మరో పది పౌండ్లు లాభం సంపాదిస్తే గనుక... ఈ అసలు+లాభం (110 పౌండ్లు) తాలూకు సంపూర్ణ ఫలితం అతనికి దక్కా లంటే – పౌండ్‌ కరెన్సీ విలువ కాపాడబడాలి. అంటే, అతను ఆ పెట్టుబడి పెట్టే నాటి కంటే – దానిని సొమ్ము చేసుకునే నాటికి గనుక పౌండ్‌ విలువ తగ్గితే, ఆ మేరకు అతని రాబడి తాలూకు నికర విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఫైనాన్స్‌ పెట్టుబడిదారుల రాబడులను కాపాడాలంటే ద్రవ్యోల్బ ణాన్ని నిలువరించాలి. అదీ కథ. 

ఆయా దేశాలలోని సామాన్య జనం తాలూకు ప్రయోజనాలూ, వారిపై పడుతోన్న ధరాభారానికి పరిష్కారం అనేవి కేవలం ముసు గులు మాత్రమే. అందుచేతనే ప్రస్తుతం నిరుద్యోగం పెరిగి... ధరలూ పెరిగిపోయి సతమతమవుతోన్న జనాన్ని ఆదుకునేందుకు ఆర్థిక ప్రణాళికలను రూపొందించే బదులు... ప్రస్తుత బ్రిటన్‌ ప్రభుత్వం కార్పొరేట్‌ రాయితీలు ఇచ్చి సమస్యను పరిష్కరించ జూస్తోంది. ఇక నేడు రిషీ సునాక్‌ కూడా కొద్దిపాటిగా ప్రజలకు కొన్ని రాయితీలు ఇచ్చే ప్రయత్నం చేసినా– స్థూలంగా కార్పొరేట్‌ అనుకూల చట్రం నుంచి ఆయన కూడా బయటకు రాలేడు.

అంతిమంగా అది సునాక్‌ అయినా, మరొకరయినా ఈ కార్పొరేట్, షేర్‌ మార్కెట్‌ అనుకూల చట్రం నుంచీ బయటపడలేనంత కాలం సమస్యలు పరిష్కారం కావు.  రష్యా విప్లవనేత వ్లాదిమిర్‌ లెనిన్‌ బోధించిన విప్లవ పరిస్థితి గురించిన 3 అంశాలలోని ఒకటి ఇక్కడ గమనించి తీరవలసింది. ఒక దేశంలో విప్లవాత్మక (రచయిత: హింసాత్మకమే కానక్కర లేదు) మార్పునకు పరిస్థితి ముంచుకొచ్చిందనటానికి ఒక ప్రధాన తార్కాణం – ఆ దేశం లోని పాలక వర్గం ఇక ఎంతమాత్రమూ పాత పద్ధతులలో పరిపా లించ లేకపోవడం! ప్రస్తుతం ప్రపంచమంతటా జరుగుతుంది ఇదే.

వివిధ ప్రభుత్వాలు నయా ఉదారవాద సంస్కరణల ఊబిలో కూరుకు పోయి – ద్రవ్యోల్బణం – వృద్ధి పతనం అడకత్తెరకు పరిష్కారం చూప లేక ఒకదాని తరువాత ఒకటిగా సంక్షోభంలోకి పోతున్నాయి. ఈ చట్రాన్ని బద్ధలు కొట్టనంతవరకు ఏ దేశంలోని ప్రజలకూ స్థిమితం ఉండదు... పాలకులకు స్థిరత్వం ఉండదు!

డి. పాపారావు 
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు ‘ 98661 79615 

మరిన్ని వార్తలు