మళ్లీ కావాలి ఒక ‘సెన్సేషన్‌’!

29 Nov, 2022 00:32 IST|Sakshi
కేంద్ర మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌

రెండో మాట 

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను ఆగమేఘాల మీద నియమించారన్న విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం నిశితమైన వ్యాఖ్యానాలు చేసింది. టీఎన్‌ శేషన్‌ లాంటి ఒక బాధ్యతాయుతమైన అధికారిని కోరుకుంటున్నట్టు చెప్పింది. అయితే రెండు దశాబ్దాలుగా ఏ ఒక్క కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా పూర్తికాలం తన పదవిలో కొనసాగడం లేదు. యూపీఏ, ఎన్డీయే రెండు పాలక కూటముల హయాంలోనూ జరిగింది ఇదే. ఇంత అస్థిరంగా పదవిలో ఉండే అధికారి, ఒకవేళ అత్యంత శక్తిమంతమైన స్థానంలో ఉన్నవారి మీద ఆరోపణలు వస్తే ఏం చర్యలు తీసుకోగలరు? స్వతంత్ర ప్రతిపత్తి, విలువలు ముఖ్యమైనందున సీఈసీ నియామకానికి స్వతంత్రమైన నిర్ణయాధికారం గల ప్యానెల్‌ ఉండి తీరాలి.

‘‘దేశంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈసీ), ఇతర ఎన్నికల అధికారుల (ఈసీ) నియామకాల విషయంలో రాజ్యాంగపు మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయి. ఇది అవాంఛనీయ పోకడ. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ దేశ రాజ్యాంగం, అందులోని 324వ అధికరణ నిర్దేశించలేదు. కానీ, ఎన్ని కల కమిషనర్ల నియామకం విషయంలో చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించిపోయినా గత 72 ఏళ్లుగా ఆ పనిని పాలకులు చేయలేదు. ఫలితంగా ఏ ఒక్క చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ కూడా 2004 నుంచీ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోలేదు.

ఇక పదేళ్ల యూపీఏ (కాంగ్రెస్‌ కూటమి) పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారి పోగా, ప్రస్తుత ఎన్డీఏ (బీజేపీ కూటమి) ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా ఎనిమిదిమంది సీఈసీలను మార్చేశారు. ఈ పరిస్థితుల్లో ఒకనాడు భారతదేశ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా, వ్యక్తిత్వం ఉన్న అధికారిగా పని చేసిన టీఎన్‌ శేషన్‌ లాంటి వారు సీఈసీగా రావాలని మేము కోరు కుంటున్నాం. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి, విలువలు ముఖ్యమైనందున సీఈసీ నియామకానికి స్వతంత్రమైన నిర్ణయా ధికారం గల ప్యానెల్‌ ఉండి తీరాలి. ఎందుకంటే, ఇప్పటి పద్ధతిలో అస్వతంత్రమైన సీఈసీ నియామకం వల్ల ఒకవేళ ప్రధానమంత్రిపై ఆరోపణలొస్తే సీఈసీ నిర్ణయం తీసుకోగలరా?’’
– సీఈసీల స్వల్పకాలిక నియామకాలతో కేంద్ర పాలకులు అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం (22 నవంబర్‌ 2022)

టీఎన్‌ శేషన్‌ 1990 డిసెంబర్‌ నుంచి 1996 డిసెంబర్‌ దాకా దేశ 10వ సీఈసీగా పనిచేశారు. అలాంటి బాధ్యతాయుత ఉన్నతాధికారి నేడు దేశానికి కావాలని సుప్రీంకోర్టు గౌరవ ధర్మాసనం ఎందుకు అభి ప్రాయపడవలసి వచ్చిందో ప్రతి పౌరుడు పరిశీలించాల్సిన అవసరం తలెత్తింది. 1950  మార్చి నుంచి 2022 ‘మే’ దాకా శేషన్‌ సహా సీఈసీ లుగా పనిచేసినవారు మొత్తం 25 మంది. ఒకసారి రాష్ట్రపతి నియ మించిన తర్వాత, ఏ సీఈసీ అయినా బాధ్యతలను సక్రమంగా నిర్వ హించక పోయినా, తప్పుడు నిర్ణయాలకు పాల్పడినా ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలంటే – లోక్‌సభ, రాజ్యసభ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ఓటు వేయాల్సి ఉంటుంది. 

ఈ బాధ్యతలన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు, తన పరిధిలో నిక్కచ్చి అయిన సాహసి కాబట్టే టీఎన్‌ శేషన్‌ తన హయాంలో దేశ ఎన్నికల నిర్వహణలోనే ‘పాపం’లా పేరుకుపోయిన వందకుపైగా అవకతవక లను గుర్తించి, దేశ ఎన్నికల నిర్వహణ తీరును సంస్కరించడానికి నడుం బిగించారు.

మన కేంద్ర పాలకుల స్వార్థపూరిత విధానాలలోని అవకతవకలను సరిదిద్ది, సకాలంలో పాలకుల్ని ‘గాడి’లో పెట్టేందుకు దోహదపడమని అధికారుల నిబంధనలు ఘోషిస్తున్నా... ‘చూసి రమ్మంటే కాల్చి వచ్చే’ బాపతువాళ్లు అధికార గణంలో కూడా ఉండ బట్టే అనేక అవకతవకలకు ఆస్కారం కల్గుతోందని గతంలో ‘రీసెర్చి అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌’ (‘రా’) గూఢచారి సంస్థ అధిపతిగా పనిచేసిన ‘కా’(కేఏడబ్ల్యూ) వెల్లడించిన విషయం ఈ సందర్భంగా గుర్తొస్తోంది.

కానీ సీఈసీగా శేషన్‌ భారత ఎన్నికల నిర్వహణ వ్యవస్థలోని లొసుగుల ఆధారంగా రాజకీయ పార్టీలు చేస్తున్న అవినీతి, అక్రమ చర్యలకు అడ్డుకట్ట వేశారు. ఈ క్రమంలోనే ఒక జనరల్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనాయకుల్ని శేషన్‌ అడ్డు కున్నారు. ‘రాజ్యాంగ సెక్యులర్‌ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారా, లేదా? అయినప్పుడు ఆ ప్రతిజ్ఞకు భిన్నంగా వ్యవహ రించిన మిమ్మల్ని, మీ పార్టీని ఎందుకు నిషేధించరాదో చెప్పమని (అద్వానీ ప్రభృతుల్ని) నిలేసినవారు శేషన్‌. 

ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళిని పకడ్బందీగా రూపొందించ డంతో పాటు, అర్హులైన వారందరికీ ఓటర్ల గుర్తింపు కార్డుల్ని సిద్ధం చేసి పంపిణీ చేసినవారు శేషన్‌! ఎన్నికల ప్రచారం పేరిట విచ్చల విడిగా డబ్బులతో ఓటర్లను కొనేయడానికి, మద్యాన్ని విచ్చలవిడిగా అభ్యర్థులు ఏరులై పారించడాన్ని చట్ట విరుద్ధ అవినీతికర చర్యలుగా ప్రకటించి తాను సీఈసీ హోదాలో వాటిని కొనసాగించవలసిన ఆదర్శాలుగా మలిచారు.

ఈ కఠినమైన ఆదర్శ నిర్ణయాలను చేసి అమలు జరిపినందుకు శేషన్‌ను ప్రశంసించినవారూ ఉన్నారు, విమ ర్శించినవారూ ఉన్నారు. ఎన్నికల ప్రచారం పేరుతో ‘లౌడ్‌ స్పీకర్ల’ విచ్చలవిడి వాడకాన్ని నియంత్రించిన వారాయన. కనుకనే  గిట్టిన వారి దృష్టిలో ‘సెన్సేషన్‌’గానూ, గిట్టనివారి దృష్టిలో తమ పాలిట ‘అల్సేషన్‌’ గానూ ఆయన కనిపించారు. సీఈసీ పదవిలో అంత వరకూ పనిచేసిన మొత్తం 25 మంది సీఈసీలలో ఒక్క శేషన్‌కే ప్రసిద్ధ రామన్‌ మెగసెసే పురస్కారం లభించింది.

లక్ష్యం సరైనదైతే ‘సుపరి పాలనా వ్యవస్థ నిర్మాణం అసాధ్యమేమీ కాదు’ అని స్పష్టంగా ప్రకటించినవాడు శేషన్‌. కనుకనే సీఈసీ పదవిలో ఉన్న వ్యక్తులు పాలకుల కోరికల మేరకు ‘తలలూపే’ బాపతుగా ఉండటం దేశ నడవడికకు ఆదర్శనీయమైన ఆచరణను ప్రసాదించలేదని దేశ అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం దృఢాభిప్రాయంగా మనం తీర్మా నించుకోవచ్చు. 

సీఈసీ పదవికి ప్రతిపాదించిన నాలుగైదు పేర్లలో ఒకరిని (అరుణ్‌ గోయెల్‌) నిమిషాల మీద నియమించి దేశంలో ‘గత్తర’ లేపారు పాలకులు. ‘ఆగమేఘాల’ మీద ఒక అధికారిని నియ మించడానికి చూపిన చొరవను ఆక్షేపిస్తూ రాజ్యాంగ ధర్మాసనం తరఫున జస్టిస్‌ కె.ఎం. జోసఫ్‌ చేసిన ప్రకటనను సునిశిత వ్యాఖ్యగా మనం పరిగణించాలి. జస్టిస్‌ జోసఫ్‌ మాటల్లో: ‘స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి.

ఇంతకూ అసలు సమస్యల్లా సంబంధిత వ్యక్తి (అధికారి) నిజంగా స్వతంత్ర శక్తి ఉన్నవాడా కాదా అన్నదే అసలు ప్రశ్న’! కనుకనే కేంద్ర ఎన్నికల కమిషనర్‌ల నియామకానికి కేంద్రంలో తటస్థంగా వ్యవహరించే స్వతంత్రమైన యంత్రాంగం ఉండి తీరాలని జస్టిస్‌ జోసఫ్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి అభిప్రాయ పడ్డారు. ధర్మాసనం వేసిన సూటి ప్రశ్న: ‘ప్రధానమంత్రిపై ఆరోప ణలు వస్తే ప్రధాన ఎన్నికల అధికారి చర్యలు తీసుకోగలరా? అందుకే సీఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి, వ్యక్తిత్వం ముఖ్యం’!

కులాతీత, వర్గాతీత, మతాతీత రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చుకున్నామా అన్నది ఈ రోజుకీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇందుకు కారణాన్ని అన్వేషించడం ఇప్పటికైనా కష్టమేమీ కాదు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు భారత ప్రజల అనుభవంలోకి, ఆచరణ లోకి అనువదించుకోవాలంటే – ముందు తక్షణమే జరగవలసిన పని – రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలకు, పౌరుల ప్రాథమిక హక్కుల అధ్యాయానికి మధ్య వ్యత్యాసాన్ని పూర్తిగా తొల గించగలగాలి. ఆచరణలో అమలు చేయకుండా సంపన్న వర్గాల ప్రయోజనాలను కాపాడే ఆదేశిక సూత్రాలను పౌరుల ప్రాథమిక హక్కుల జాబితాలోకి మార్చడానికి పాలక వర్గాలు సంసిద్ధం కావాలి. పౌరుల ప్రాథమిక హక్కులకు ఆచరణలో విలువ ఇచ్చిననాడే 75వ స్వాతంత్య్ర అమృతోత్సవాలకు విలువా, సలువా ఉంటుంది.

ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రసిద్ధ కవుల్లో, కథకుల్లో ఒకరైన అట్టాడ అప్పల్నాయుడు ‘చిటికెన వేలు’ కథలోని ఒక పాత్ర గుర్తుకొస్తోంది: ‘‘మన దేశంలో జరిగే ఎన్నికల్లో ధనమూ, దైవమూ, మద్యమూ గాక నెత్తురు కూడా గద్దె ఎక్కడానికి అవసరం అని తెలుసుకున్నాడు. నెత్తురు మన మూకదయినా సరే, శత్రు మూక దయినా సరే పారాల్సిందే.’’ మన ఎన్నికల నిర్వహణ తంతు 75 ఏళ్ల తర్వాత కూడా అలాగే కొనసాగుతోందంటే ఆశ్చర్యమా?!
abkprasad2006@yahoo.co.in 

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

మరిన్ని వార్తలు