మిత్రులను కలిపే బెలూన్‌ దౌత్యం?

24 Feb, 2023 01:13 IST|Sakshi

విశ్లేషణ

చైనా విభజన వ్యూహాలను ఎండగట్టడానికి... సాక్ష్యాధారాలతో దొరికిన బెలూన్‌ వివాదాన్ని ఉపయోగించుకోవచ్చని అమెరికా ఆశలు పెట్టుకుంటోంది. నిఘా కోసం ఇంత పాత టెక్నాలజీని ఉపయోగించాలని చైనా ఎందుకనుకుందో అర్థం చేసుకోవడం కష్టం. దౌత్యపరమైన కీలక క్షణాల్లో ఇలాంటి రెచ్చగొట్టే పనులను నిర్వహించడంలో చైనీయులు ఆరితేరినవారని అందరికీ తెలుసు.

చైనా దుష్ప్రవర్తనపై స్పందించడంలో చాలాసార్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న మిత్రులనూ, పొత్తుదారులనూ ఒకటి చేయడానికి అమెరికా ఈ ఉదంతాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటుంది. బహుశా చైనాకు బెలూన్‌ ఉదంతం ద్వారా సంభవించే అత్యంత నష్టదాయకమైన అంశం ఏమిటంటే, దాని ఎత్తుగడలు సగటు అమెరిన్‌ దృష్టిని ఆకర్షించడమే. 

గత నవంబర్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య బాలిలో చర్చలు జరిగిన తర్వాత రానున్న నెలల్లో అమెరికా, చైనా సంబంధాలలో ఉద్రిక్తతలు సడలిపోతాయని భావించారు. ఈ నెలలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్‌ ప్రథమ సందర్శనకు చైనీయులు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాతే నిఘా కోసం ఉపయోగించారని చెబుతున్న చైనా స్పై బెలూన్‌ని అమెరికా కూల్చి వేసిన ఘటన చోటుచేసుకుంది.

నిఘా కోసం ఇంత పాత టెక్నాలజీని ఉపయోగించాలని చైనా ఎందుకనుకుందో అర్థం చేసుకోవడం కష్టం. అమెరికాపై నిఘా పెట్టడానికి చైనావద్ద అత్యధునాతన శాటిలైట్‌ నెట్‌వర్క్‌ ఉంది. కానీ అమెరికా గగనతల రక్షణ యంత్రాంగ స్వరూప స్వభావాలను తెలుసుకోవడానికీ, కమ్యూనికేషన్స్‌ ఇంటెలిజెన్స్‌ని చౌక మార్గంలో సేకరించడానికీ అమెరికా లాగే చైనా కూడా ఇలాంటి విధానాలను ఉపయోగించడానికి ప్రయోగాలు చేస్తోందని భావిస్తున్నారు. 

మరోవైపున చైనా ఈ ఘటనను తేలిగ్గా తీసుకుంది. అది వాతావరణ బెలూన్‌ మాత్రమేనని చెబుతూనే, తన వాతావరణ సేవల విభాగ అధిపతిని తొలగించింది. అయితే ఈ నిఘా బెలూన్‌ విషయాన్ని తక్షణం గుర్తించలేకపోయిన అమెరికా ఇప్పుడు మాత్రం తాను కొంతకాలంగా బెలూన్ల ద్వారా సాగుతున్న నిఘా వ్యవహా రాలను పసిగడుతూ వస్తున్నట్లు పేర్కొంది.

అమెరికా అతిగా స్పంది స్తోందనీ, ‘అంతర్జాతీయ సంప్రదాయాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందనీ’ అలాగే ‘సారుప్యం గల ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన మార్గాలను ఉపయోగించుకునే హక్కు బీజింగ్‌కు ఉంద’నీ చైనా నొక్కిచెబుతోంది.

మరో వైపున దాదాపు 61 మీటర్ల పొడవైన భారీ బెలూన్‌ ఖండాంతరాలు దాటి, తన అణ్వాయుధాలకు సంబంధించిన కీలక విభా గాలకు నిలయమై ఉన్న ఒక రాష్ట్రంపై విహరించడాన్ని అమెరికా అసలు విస్మరించలేదు. 2022 జనవరిలో ఇదేవిధమైన బెలూన్‌ కాకతాళీయంగా అండమాన్, నికోబార్‌ దీవులపై కనిపించగా దాన్ని ఫొటో తీశారు కూడా. కొన్ని రోజుల క్రితం అలాస్కా, కెనడాలపై మరో రెండు గుర్తు తెలీని ఎగిరే వస్తువులను కూల్చివేశారు. 

అమెరికా విదేశాంగ శాఖ అధికారి అభిప్రాయం ప్రకారం, చైనా ఈ నిఘా బెలూన్లను అయిదు ఖండాల్లో 40 పైగా దేశాల్లోని గగన తలంపై ఉపయోగిస్తోంది. అత్యంత ఎత్తులో ఎగిరే యూ–2 ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఈ బెలూన్‌ని చాలా దగ్గరనుంచి ఫొటోతీసి, దానిలో సౌర శ్రేణులు, బహుళ యాంటెన్నాతోపాటు కమ్యూనికేషన్లను గుర్తించ గలిగిన పరికరం కూడా ఉన్నట్లు కనుగొంది.

తాను స్వాధీనపర్చుకున్న బెలూన్‌ శిథిలాలను అమెరికా విశ్లేషిస్తుండటంతో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలకు గురైన చైనా కంపె నీలు ఈ బెలూన్‌ పనితీరు సామర్థ్యానికి సంబంధించిన ఆధారాలను అందించాయి. యుద్ధవిమానం కంటే ఎత్తులో ఎగిరేలా డిజైన్‌ చేసిన ఎయిర్‌షిప్‌ డెవలపర్‌ కూడా వాటిలో ఉంది. అలాగే శాటి లైట్లతో,కృత్రిమ మేధస్సుతో ఏరియల్‌ వెహికిల్స్‌ని నియంత్రించే పేటెంట్‌ హోల్డర్‌ కూడా ఉంది. 

యాంటీ మిసైల్‌ డిఫెన్స్‌లు, కమ్యూనికేషన్లలో దాని పాత్ర, డేటా రిలే, నిఘా, ఇంటెలెజెన్స్‌  కార్యకలాపాల్లో భాగంగా అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ భూమికి 15 నుంచి 80 కిలోమీటర్ల పైన ఉన్న అంతరిక్షంపై ఆసక్తి చూపుతోంది. యుద్ధవిమానం, ఉపగ్రహాల మధ్య ఉన్న అంత రాన్ని పూరించే ప్రయత్నాల్లో భాగంగా బెలూన్‌ ఉపయోగాన్ని చూడ వచ్చు. సుహృద్భావం కోసం ప్రత్యర్థి ఇలాంటి పనులను పెద్దగా లెక్కలోకి తీసుకోబోడని భావిస్తూ... దౌత్యపరమైన కీలక క్షణాల్లో ఇలాంటి రెచ్చగొట్టే పనులను నిర్వహించడంలో చైనీయులు ఆరి తేరినవారని అందరికీ తెలుసు.

2013లో చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ భారత సందర్శన సమయంలోనే అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలోని దెప్సాంగ్‌ బల్జ్‌లోని వై–జంక్షన్‌ వద్ద వారు దిగ్బంధనను అమలు చేశారు. కెకియాంగ్‌ సంద ర్శనను రద్దు చేస్తానని భారత్‌  హెచ్చరించిన తర్వాతే ఈ దిగ్బంధాన్ని చైనా ఎత్తివేసింది. తర్వాత 2014లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత సందర్శన సమయంలోనే లద్దాఖ్‌లోని చుమర్‌ వద్ద ఉన్న వాస్త వాధీన రేఖ వద్ద భారత భూభాగంలోని
ఎల్తైన ప్రాంతంలో రహదారి నిర్మాణానికి పీఎల్‌ఏ (చైనా సైన్యం) ప్రయత్నించింది.

అయితే భారతీయులూ, ఇప్పుడు అమెరికన్లూ ఇలాంటి ఘటన లను బహిరంగపర్చాలని నిర్ణయించుకున్నారు. అమెరికన్లు బెలూన్‌ను కూల్చివేశారు. ఇప్పుడు అమెరికా సముద్ర జలాల నుంచి బెలూన్‌ శిథిలాలను సేకరిస్తున్నారు. బీజింగ్‌ విభజన వ్యూహాలను ఎండగట్ట డానికి సాక్ష్యాధారాలతో దొరికిన బెలూన్‌ వివాదాన్ని ఉపయోగించు కోవచ్చని అమెరికా ఆశలు పెట్టుకుంటోంది. బహుశా చైనాకు బెలూన్‌ ఉదంతం ద్వారా సంభవించే అత్యంత నష్టదాయికమైన అంశం ఏమిటంటే, దాని ఎత్తుగడలు సగటు అమెరిన్‌ దృష్టిని ఆకర్షించడం. మరెన్నడూ జరగని విధంగా అమెరికా నడిబొడ్డుపై చైనా నిఘా బెలూన్‌ ఎగరడం వారి దృష్టిలో పడింది. 

మొదట తీవ్రంగా మాట్లాడిన అమెరికా... బెలూన్‌ ఆపరేషన్‌ గురించి షీ జిన్‌పింగ్‌కు వ్యక్తిగతంగా తెలీదని చెప్పడం ద్వారా చైనా నాయకత్వాన్ని ఈ వ్యవహారంలోంచి బయట పడేయడానికి ఒక దారి కల్పించినట్లుంది. అయితే దేశాధ్యక్షుడి అను మతి లేకుండా ఇంత తీవ్రాతితీవ్రమైన ఇంటెలిజెన్స్‌ వెంచర్‌కి చైనా సాహసించడం కష్టమనిపిస్తుంది. 2014లో చుమర్‌ ఘటనల సందర్భంగా పీఎల్‌ఏని అక్కడి నుంచి ఉపసంహరించుకుంటామని జిన్‌పింగ్‌ మొదట్లో వాగ్దానం చేశారు. కానీ బీజింగ్‌కి ఆయన తిరిగి వెళ్లిన వారం రోజుల తర్వాతే దీనిపై ఒప్పందం కుదిరింది. 

బ్లింకెన్‌ చైనా సందర్శన వాయిదా పడింది. ఆయన సందర్శనకు తిరిగి ఏర్పాట్లు జరగవచ్చు గాక. వార్షిక జాతీయ ప్రజా కాంగ్రెస్‌ సదస్సుతో  చైనా తలమునకలు కానున్నందున, నూతన ప్రధాని ఎంపికతో సహా కొత్త ప్రభుత్వ మార్పుల సమయంలో... విలువైన సమయం వృ«థా కావచ్చు. కానీ చర్చల పునరుద్ధరణ సమయానికి బెలూన్‌ ఉదంతం అమెరికాను కాస్త మానసికంగా ముందంజలో ఉంచవచ్చు.

చైనా వస్తూత్పత్తికి చెందిన అపార శక్తిని కలిగి ఉన్న ప్పటికీ, అనేక ప్రపంచ దేశాలకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా తలెత్తడానికి ప్రయత్నిస్తునప్నప్పటికీ అది దాని లక్ష్య సాధనలో విఫల మయిందని అమెరికా నమ్ముతోంది. ఇటీవలే అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఆనవాయితీగా చేసే ‘స్టేట్‌ ఆఫ్‌ ద యూనియన్‌’ ప్రసంగంలో బైడెన్‌ బీరాలు పలికారు. ‘‘నేను అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ముందు, చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ తన అధికారాన్ని ఎలా పెంచుకుందీ, ప్రపంచంలో అమెరికా ఎలా పతనం అయిందీ అనే కథే ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. చైనాతో అమెరికా స్పర్థాత్మక సంబంధాన్ని కోరుకుంటోంద’’ని బైడెన్‌ స్పష్టం చేశారు. ‘‘కానీ గత వారం మనం స్పష్టంగా పేర్కొన్నట్లుగా చైనా మన సార్వభౌమత్వానికి ప్రమాదకరంగా ఉన్నట్లయితే, మన దేశాన్ని రక్షించుకోవడానికి మనం తగు చర్య తీసుకుంటాము. మనం ఆ పనే చేశాము కూడా (బెలూన్‌ కూల్చివేత గురించిన ప్రస్తావన)’’.

భీకర యుద్ధాల్లో గెలవడం మాత్రమే కాదు, సమాచార, ప్రజాభి ప్రాయ యుద్ధాలను కూడా గెలవడం ఈ యుగం లక్షణం అనేది గుర్తెర గాలి. బీజింగ్‌ దుష్ప్రవర్తనపై స్పందించడానికి కొన్నిసార్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న మిత్రులను, పొత్తుదారులను ఒకటి చేయడానికి అమె రికా ఈ ఉదంతాన్ని వాడుకుంటుంది అనడంలో సందేహం లేదు.

మనోజ్‌ జోషి 
వ్యాసకర్త రీసెర్చ్‌ ఫెలో, అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌(’ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో

మరిన్ని వార్తలు