తైవాన్‌ ‘ఒకే చైనా’లో అంతర్భాగమే! 

7 Aug, 2022 00:58 IST|Sakshi

సందర్భం

ఉద్రిక్తతల నడుమ తైవాన్‌కు యూఎస్‌ అసెంబ్లీ ప్రతినిధులసభ స్పీకర్‌ నాన్సీ పెలోసీని పంపించటంతో చైనా–తైవాన్‌ల మధ్య భవిష్యత్తులో యుద్ధం జరిగే అవకాశాలను తెరపైకి అమెరికా తీసుకొ చ్చింది. ఇక యుద్ధ బూచితో ఆసియా పసిఫిక్‌ దేశాలకు ‘నాటో’ సభ్యత్వాన్ని ప్రోత్స హిస్తూ, మ్యాడ్రిడ్‌ నిర్ణయాల ప్రకారం నాటోను ఈ ప్రాంతానికి విస్తరించే ప్రయత్నంలో అమెరికా ఉంది.

ఇప్పటికే మన భారతదేశానికి ‘నాటో ప్లస్‌’ సభ్యత్వం ఇవ్వటానికి 6వ దేశంగా అర్హత కోసం యూఎస్‌ అసెంబ్లీలో నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ (ఎన్‌డిఏఏ)కు సవరణలు చేశారు. ఈ తరహా అర్హతలు ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఇజ్రాయిల్, దక్షిణ కొరియాలు కలిగి ఉన్నాయి. బిల్లు ఆమోదం పొందితే నాటో దేశాలతో సఖ్యతగా మెలిగే అవకాశాలను మనదేశానికి కల్పించి, భవిష్యత్తులో నాటో చేసే యుద్ధాలకు మనల్ని బలి పశువులను చేసే అవకాశం ఉంది. 

పెలోసీ పర్యటనను మానుకోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హితవు పలికినప్పటికీ... యూఎస్‌ మిలటరీ, ఇంటెలిజెన్స్‌ విభాగాల అధికారులు పెడచెవినపెట్టి, పర్యటనను ప్రణాళిక ప్రకారం సాగించారు. నాన్సీ పెలోసీని తైవాన్‌కు పంపాలను కోవటం నిప్పుతో చెలగాటం వంటిదనీ, ఆ నిప్పులో ఆహుతిగాక తప్పదనీ చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తీవ్ర స్వరంతో టెలిఫోన్‌లో బైడెన్‌ను హెచ్చరించాడు. ఈ హెచ్చరికతో తాత్కాలికంగా పెలోసీ పర్యటన దేశాల లిస్టులో కేవలం సింగపూర్, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా దేశాల పేర్లు మాత్రమే ప్రకటించారు. తైవాన్‌ చైనాలో అంతర్భాగం గనుక మమ్మల్ని రెచ్చగొట్టటానికి ప్రయ త్నిస్తే తైవాన్‌లో అడుగుపెట్టే ముందే పెలోసీ ప్రయాణిస్తున్న విమానాన్ని  కూల్చివేస్తామనీ, లేకుంటే చైనా ఆర్మీ విమానాలు తైవాన్‌లో దిగుతాయనీ మిలిటరీ శాఖ తీవ్రంగా హెచ్చరించింది.

పెలోసీకి రక్షణగా అమెరికన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ ‘రొనాల్ట్‌ రీగన్‌’, దాని అనుబంధ గ్రూపు యుద్ధ విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, గైడెడ్‌ మిస్సెల్‌ డిస్ట్రాయర్, క్రూయిజ్‌తో సహా రెండు రోజుల క్రితమే సింగపూర్‌ నుండి తైవాన్‌ వైపు దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి వచ్చాయి. చైనా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ కలిసి తైవాన్‌ జలసంధిలో మిలిటరీ విన్యాసాలు చేస్తున్న ఉత్కంఠ పరిణామాల మధ్య పెలోసీ ఆగస్టు 2 రాత్రి తైవాన్‌ విమానా శ్రయంలో దిగారు. ఇందుకు నిరసనగా ఆ తర్వాత తైవాన్‌ చుట్టుప్రక్కల ఉన్న సముద్రంలోని లక్ష్యాలపై క్షిపణుల వర్షం కురిపించి, తైవాన్‌ వాసులను చైనా భయకంపితులను చేసింది. ఈ దృశ్యాలను తైవాన్‌ మీడియా ప్రసారం చేసింది. అదేమంటే దీనికి పూర్తి బాధ్యత అమెరికాదేనని చైనా ఆరోపిస్తోంది.

గతంలోకి వెళితే.. షియాంగ్‌ కై షేక్‌ పాలనలోని చైనాపై 1949లో మావో నాయకత్వాన విప్లవం విజయం సాధించగా, అమెరికా అండతో తైవాన్‌కు పారిపోయిన షియాంగ్‌ అక్కడ నుండి చైనాను పాలించడానికి ప్రయత్నించాడు. 1971 వరకు తైవాన్‌ కేంద్రమయిన ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా’ను మాత్రమే ఐక్య రాజ్యసమితి గుర్తించింది. 1971 నుండి ‘ఒకే చైనా’ దేశంగా మెయిన్‌ ల్యాండ్‌ చైనాను తైవాన్‌తో సహా ‘పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా’ (పీఆర్‌సీ)గా ఐరాస గుర్తించింది. ఈ ఒకే చైనాతో 1979 నుండి జిమ్మీ కార్టర్‌ ప్రభుత్వం దౌత్య సంబంధాలను ఏర్పర్చు కొంది. పీఆర్‌సీ అసలైన చైనా దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటంతో, ఎప్పటి వలెనే తైవాన్‌ చైనాలో అంతర్భాగంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా కనీసం డజను దేశాలు కూడా తైవాన్‌తో దౌత్య సంబంధాలను ఏర్పర్చుకోలేదు. మనదేశం కూడా దౌత్య సంబంధాలు ఏర్పర్చుకోలేదు. 

చైనా, తైవాన్‌ల మధ్య తరచూ అమెరికా కలహాలు సృష్టిస్తూ ఆయుధాల్ని అమ్ముతూ, మూడవ సంస్థలు, వ్యక్తులు, కంపెనీల ద్వారా వర్తక వాణిజ్యాలు చేస్తూ పరోక్ష  సంబంధాలతో చైనాను కవ్విస్తూనే ఉంది. స్వదేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింప టానికీ, రానున్న మధ్యంతర ఎన్నికల్లో రిబ్లికన్లను నెగ్గించటానికీ ఉక్రెయిన్, తైవాన్‌ యుద్ధాలను ప్రోత్సహించటానికై విపక్షాలు, మిలటరీ పరిశ్రమలు తీవ్రంగా కృషి సల్పుతున్నాయి. యుద్ధ వాతావరణాన్ని తక్షణమే ఆపి, చైనాలో అంతర్భాగంగా తైవాన్‌ను గుర్తించి, చైనా–తైవాన్‌ల అంతర్గత వ్యవహారంగా ఒకే చైనా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఇప్పటికే అమెరికా ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందని అఫ్గానిస్తాన్, మధ్యప్రాచ్య యుద్ధాల చరిత్ర స్పష్టం చేసింది. ఇప్పుడు ఉక్రెయిన్‌ యుద్ధం ఆ సంగతిని గట్టిగా ధ్రువీకరించింది. రానున్న కాలం బహుళ ధ్రువ ప్రపంచానిదే. చైనా–తైవాన్, చైనా–హాంగ్‌కాంగ్, చైనా–మకావ్‌ వంటి సమస్యలు చైనా ఆంతరంగిక విషయాలుగా పరిగణించి, విదేశీ శక్తుల జోక్యం లేకపోవటం శ్రేయస్కరం.

బుడ్డిగ జమిందార్‌ 
వ్యాసకర్త హెచ్‌ఓడీ, ఫారెన్‌ లాంగ్వేజెస్,
కేఎల్‌ యూనివర్సిటీ ‘ మొబైల్‌: 98494 91969  

మరిన్ని వార్తలు