ఏ ప్రభుత్వమైనా ఇదే తంతు!

14 Mar, 2023 00:41 IST|Sakshi

రెండో మాట

నిష్పక్షపాతంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థలు పాలకుల చేతి చిలకలుగా ఉంటున్నాయన్న ఆరోపణలు కొత్తవి కాదు. ఈ సంస్కృతికి ఏ ఒక్క పార్టీనో నిందించి ప్రయోజనం లేదు. సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారుల చేతులు మెలిపెట్టి వారిని వాడుకోవడంలోనూ; రాజనీతికి, దేశ విశిష్ట రాజ్యాంగ చట్ట నిబంధనలకు యథేచ్ఛగా తిలోదకాలివ్వడంలోనూ పాలకుల మధ్య ఎత్తుగడలలో తేడాలే తప్ప వ్యవహారం మొత్తం ఒకే రకం. అలాగే ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని, పాత్రికేయుల్ని, ప్రజా సమస్యలకు న్యాయమైన పరిష్కారాన్ని కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్న పౌర హక్కుల ఉద్యమకారులపై పోలీసు జులుం వినియోగించే సంస్కృతికి కూడా పాలక పార్టీలు సమాన స్థాయిలో మూల విరాట్టులేనని మరచిపోరాదు.

నిష్పక్షపాతంగా ఉండాల్సిన సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందన్న రొడ్డ కొట్టుడు ప్రకటనలను ప్రజలు వినలేక చస్తున్నారు. ఎందుకంటే,‘అందరూ శాకాహారులే అయితే రొయ్యల బుట్ట కాస్తా ఎలా ఖాళీ అయిపోయిం’దన్న ప్రశ్నకు సమాధానం వారికి ఇంతవరకూ దొరక లేదు కాబట్టి! దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న ముహూర్త కాలంలో కూడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఎందుకని? నాయకులకన్నా స్వాతంత్య్రం కోసం ఆస్తులు, ప్రాణాలు సహా దేశ ప్రజా బాహుళ్యం అనంతమైన త్యాగాలు చేసి ఉన్నారు గనుక. 

ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని, వారి అనుయాయుల్ని, పాత్రికే యుల్ని, పౌర సమాజాన్ని, ప్రజా సమస్యలకు న్యాయమైన పరిష్కా రాన్ని కోరుతూ ఉద్యమాలు నిర్వహిస్తున్న పౌర హక్కుల ఉద్యమ కారులను హింసిస్తూ, వారిపై పోలీసు జులుం వినియోగించే పాలక సంస్కృతికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాన స్థాయిలో మూల విరాట్టులేనని మరచిపోరాదు. అంతేగాదు, కోర్టుల్ని ధిక్కరించి, వాటి చేతుల్ని మెలిపెట్టి పనులు నిర్వహించుకునే సంస్కృతికి తెరలేపినవీ కూడా ఈ రెండు పార్టీలేనని నిద్రలోనూ మరవరాదు. 

అలహాబాద్‌ హైకోర్టు సాహసించి ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ రాకెట్‌’ బాగోతాన్ని బట్టబయలు చేస్తూ శఠిస్తూ చెప్పిన చరిత్రాత్మక తీర్పును ఆమోదిస్తూనే సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయమూర్తి కృష్ణయ్యర్‌ ఉదార దృక్పథంతో ఇందిరా గాంధీ ‘విషయాన్ని చక్కబెట్టుకోవడానికి’ వెసులుబాటు కల్పించబట్టి తక్షణం ఆమె రాజీనామా వాయిదాపడింది. సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారుల చేతులు మెలిపెట్టి వారిని వాడుకోవడంలోనూ; రాజనీతికి, దేశ విశిష్ట రాజ్యాంగ చట్ట నిబంధనలకు యథేచ్ఛగా తిలోదకాలివ్వడంలోనూ కాంగ్రెస్, బీజేపీ పాలకుల మధ్య ఎత్తుగడలలో తేడాపాడాలే తప్ప వ్యవహారం మొత్తం ఒకే రకం.

ప్రజాబాహుళ్యాన్ని, వారి సంక్షేమాన్ని ప్రజాస్వామిక పద్ధతుల్లో తీర్చిదిద్దుతూ వచ్చిన ఉదాహరణలు తక్కువ. స్వతంత్ర సంస్థలుగా ఉండవలసిన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలను గతంలో ‘చేతివాటు’ పనిముట్లుగా వాడుకున్న తీరు చివరికి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడమూ, కోర్టు సీబీఐ, ఈడీ అధికారు లను చీవాట్లు పెడుతూ, ఇకమీదట ‘మీరు కేంద్ర ప్రభుత్వానికే కాదు, సుప్రీం న్యాయస్థానానికి బాధ్యులై ఉండాల’ని కఠినంగా ఆదేశించడమూ జరిగింది. 

బహుశా ఈ పరిణామాలను గమనించిన తరువాతనే కేంద్ర సీబీఐ మాజీ ఉన్నతాధికారి, గూఢచార శాఖ మాజీ అధిపతి రామేశ్వర్‌ నాథ్‌ కావ్‌ కూడా పాలకుల ప్రలోభాల ఫలితంగా గూఢచార శాఖ అధికారులు చూచి రమ్మంటే కాల్చి వచ్చే బాపతులుగా తయారు కావడం విచారకరమని ఒక పుస్తకమే రాసి విడుదల చేశారు. ఈ బాగోతం ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇలాంటి ఉదాహరణలను పెక్కింటిని ‘హిందూ’ దినపత్రిక మేటి పక్ష పత్రిక అయిన ‘ఫ్రంట్‌ లైన్‌’ ప్రత్యేక ప్రతినిధి, విశిష్ట విశ్లేషకుడైన ఆశుతోష్‌ శర్మ పేర్కొన్నారు: ‘‘రూ. 300 కోట్ల మనీ లాండరింగ్‌ కుంభకోణం కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి నారాయణ్‌ రానే, అధికార పక్షంలో చేరడంతోనే అతనిపై అంతకుముందున్న కేసు కాస్తా మాఫీ అయిపోయింది.

అదే తరహాలో పశ్చిమ బెంగాల్‌లో ‘నారదా’ కుంభ కోణంలో నిందితుడైన సువేందు అధికారిపై విచారణ కాస్తా రద్దయిపోయింది. మధ్యప్రదేశ్‌ షిండే సేనకు చెందిన భావనా గవ్లీకి ‘ఈడీ’ జారీ చేసిన అయిదు సమన్లను ఖాతరు చేయకపోయినా ప్రస్తుత లోక్‌సభలో ‘షిండే సేన’కు ఛీఫ్‌ విప్‌గా ఉన్నారు. అలాగే, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్ట (ఫెమా) ఉల్లంఘన కేసులో ఈడీ విచారణలో ఉన్న యశ్వంత్‌ యాదవ్, ఎమ్మెల్యే యామినీ యాదవ్‌ దంపతులిద్దరూ ఇప్పుడు ‘షిండే సేన’లో సభ్యులుగా ఉన్నారు. మనీ లాండరింగ్‌ కేసులో శివ సేన సభ్యుడుగా ఉన్న ప్రతాప్‌ సర్‌ నాయిక్‌పై ‘ఈడీ’ సోదా నిర్వహించితే ఇప్పుడతను షిండే సేనలోకి చేరడంతోనే కేసు కాస్తా మాఫీ అయిపోయింది. 

ఈ సందర్భంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్‌’ జాతీయ నాయకు డైన అరవింద కేజ్రీవాల్‌ (మార్చి 1న) ఒక ప్రశ్న సంధిస్తూ ‘ఈ రోజున ఆప్‌ మంత్రి మనీష్‌ సిసోడియా బీజేపీలో చేరితే, రేపంటే రేపే విడుదలైపోడా?’ అని ఓ జోక్‌ వదిలారు. అంతేగాదు, సుప్రీంకోర్టు న్యాయవాది కాళీశ్వరం రాజ్‌ – ‘భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందంటే, కోర్టు నిర్ణయించిన న్యాయమూర్తుల నియా మకాల్ని కూడా తిమ్మినిబమ్మిని చేసి తారుమారు చేయగల శక్తి పాలక వర్గానికి ఉందని అర్థమవుతోంది’ అని చురక వేశారు. అయితే, ఎప్పు డయితే సుప్రీం కోర్టుకు ప్రగతిశీల ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్‌ పదవీ స్వీకారం చేశారో అప్పటినుంచీ సుప్రీంకోర్టు నుంచి వెలువడుతున్న ప్రజాహిత నిర్ణయాలు దేశ ప్రజలకు మంగళకర సూచనగా భావించాలి.

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనా కాలంలో సుప్రీం న్యాయమూర్తి హోదాలో జస్టిస్‌ ఖన్నా దేశవ్యాప్తంగా పౌర హక్కుల వినాశానికి, పాలక నియంతృత్వ ధోరణులకు ‘ఫుల్‌ స్టాప్‌’ పెట్టించి రాజకీయ ఖైదీల విడుదలకు ఉత్తర్వులు జరూరుగా జారీ చేసి, దేశంలోనూ, విదేశాలలోనూ ఖ్యాతి గడించారు. తాను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కానున్న సమయంలో ఆ పదవిని త్యాగం చేసిన జస్టిస్‌ ఖన్నాను విదేశాలు మరచిపోలేదుగానీ, మన దేశంలో అలాంటి న్యాయమూర్తికి ఏటా నివాళులర్పించగల కనీస
సంస్కారం కూడా మనలో కరువై పోయింది. 

ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే నాయకుడు అన్న ధోరణి రాజ్యాంగం నిర్దేశించి, గ్యారంటీ చేసిన ఫెడరల్‌ (సమాఖ్య) వ్యవస్థకు చేటు కల్గి స్తుందని దేశ ప్రజలు స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఈ సందర్భంగా కవయిత్రి మాయా ఏంజెలో (శివలక్ష్మి అనువాదం) స్వేచ్ఛా పక్షికీ, ‘పంజరంలోని పక్షి’కీ గల తేడాను వర్ణిస్తూ చెప్పిన మాటల్ని విందాం:

‘‘స్వేచ్ఛా పక్షి తన శక్తి మేరకు
ఆకాశాన్ని సైతం శుభ్రం చేయడానికి
ధైర్యం చేస్తుంది...
పంజరంలో పక్షి
భయంకరంగా వణికే గొంతుతో పాడుతుంది
కానీ, చాలాకాలంగా
సుదూరపు కొండలనుంచి
శ్రుతి తప్పిన రాగం అస్పష్టంగా 
పంజరం నుంచి విముక్తి కోసం
పక్షి స్వర రాగం
విషాదంగా వినపడుతూనే ఉంటుంది
స్వేచ్ఛా పక్షులు ఆహ్లాదకరమైన ఇతర పక్షుల
గురించి ఆలోచిస్తాయి
చెట్లు వదిలే వాణిజ్య వాయువుల్ని మృదువుగా ఆస్వాదిస్తాయి
ఆ పక్షులు ఆకాశానికి తమ పేరు పెట్టుకుంటాయి!
కానీ పంజరంలోని పక్షి తన కలల సమాధిపై నిలబడి ఉంటుంది
ఆ పక్షి రెక్కలు కత్తిరించబడ్డాయి, పాదాలు కట్టివేయబడ్డాయి
కాబట్టి పంజరంలో పక్షి పాడటానికి తన గొంతు
సవరించుకుంటుంది
పంజరంలో పక్షి పాడుతుంది
భయకంపితమైన స్వరంతో
తన స్వేచ్ఛను ఎలుగెత్తి చాటే
పక్షి స్వర రాగం విషాదంగా వినబడుతూనే ఉంది!’’

 

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు