వారికో న్యాయం.. ఊరికో న్యాయం

14 May, 2022 00:26 IST|Sakshi

విశ్లేషణ 

రాజకీయ, న్యాయపరమైన అవరోధాలను అధిగమించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం పాలసీని ఆంధ్రప్రదేశ్‌ ముందుకు తెచ్చింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏది బోధనాభాషగా ఉండాలి అనే అంశాన్ని రాష్ట్రాలు నిర్ణయించుకోవడానికి తాను వ్యతిరేకిని కానంటూ కాంగ్రెస్‌ పార్టీకి చోదక శక్తిలాంటి రాహుల్‌ గాంధీ కూడా ఎలాంటి ఊగిసలాట లేకుండా స్పష్టత ఇవ్వడం గమనార్హం. కానీ బోధనా మాధ్యమానికి సంబంధించి తమ సొంత పిల్లల, కార్మిక వర్గ పిల్లల భవిష్యత్తు విషయంలో పూర్తిగా వ్యతిరేక వైఖరులను తీసుకుంటున్న మన ప్రజామేధావులతోనే అసలు సమస్య!

ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజా మేధావుల పాత్ర కీలకం. ప్రజాప్రయోజనాలకు ఏది వ్యతిరేకమని భావిస్తారో వాటిని వారు  సవాలు చేస్తారు. భారత చరిత్రలో విద్యారంగం అత్యంత శక్తిమంతమైన వివక్షాపూరిత పాత్రను పోషిస్తూ వచ్చింది. రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్యం అనేక వివక్షా వ్యతిరేక విధానాలకు మార్గం తెరిచింది. ఈ ప్రక్రియలో మన పాఠశాల, యూనివర్సిటీ విద్యావ్యవస్థ నిరంతరం మార్పులకూ, మలుపులకూ లోనవుతోంది.

2022 మే 7న కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌లో కొంతమంది ప్రజా మేధావులను, కార్యకర్తలను కలవాలని కోరుకున్నారు. ఆయనను కలవాల్సిందని నాకూ ఆహ్వానం వచ్చింది. ఎలాంటి ప్రత్యేక ఎజెండా లేదనుకోండి! ప్రధానంగా రెండు అంశాలపై ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను వెళ్లాను.

ఒకటి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యపై, దాంతోపాటు ప్రైవేట్‌ పాఠశాలలతో సరితూగే లాగా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను అభివృద్ధి చేసే సమస్యపై రాహుల్‌ అభిప్రాయం ఏమిటి? రెండు: ఆర్థికంగా వెనుకబడిన (ఓబీసీ) వర్గాల పట్ల కాంగ్రెస్‌ పార్టీ పాలసీ ఏమిటి? ఈ రెండింటికీ తెలంగాణలో తక్షణ ప్రాసంగికత ఉంది. రాహుల్‌ వరంగల్‌లో మే 6న భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అందులో తెలంగాణ కాంగ్రెస్‌ రైతులపై ఒక తీర్మానం చేసింది తప్ప ఇతర సమస్యలపై మౌనం వహించింది.

ఆ తర్వాత మే 7న హైదరాబాద్‌లో భేటీ సందర్భంగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం పట్ల ఆయన వైఖరి ఏమిటని రాహుల్‌ గాంధీని అడిగాను. తాను వ్యతిరేకం కానని రాహుల్‌ సమాధాన మిచ్చారు. తన పక్కనే ఉన్న కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఈ అంశంపై వారి వైఖరి ఏమిటని రాహుల్‌ అడిగారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటికే 2022–23 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను తీసుకొస్తున్నట్లు ప్రకటిం చింది. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధన ఉంటుందని తెలిపింది. రాహుల్‌ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ పాఠ శాలల్లో ఇంగ్లిష్‌ మీడియంకు టీ–కాంగ్రెస్‌ అనుకూలమని రేవంత్‌ రెడ్డి జవాబిచ్చారు.

రాహుల్‌ ఆహ్వానించిన ప్రజా మేధావుల్లో ఒకరు జోక్యం చేసు కుని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రాహుల్‌ ప్రశ్నించారు. తెలుగు మీడియంలోనే తాను చదువుకున్నందున ఇంగ్లిష్‌ మీడియంలో చదవటం కంటే తెలుగు మీడియంలో చదవడం మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఒక వామ పక్ష మేధావి నుంచి ఇలాంటి దృక్పథం నాకు ఆశ్చర్యమేసింది.

ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్‌ మీడియం పట్ల వ్యతిరేకత కలిగి ఉంటున్న వారితో సమస్య ఏమిటంటే, వీరు తమ పిల్లలను మాత్రం తాము భరించ గలిగిన ఉత్తమ ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో చదివిస్తుంటారు. ఆశ్చర్యకరంగా రాహుల్‌తో భేటీ అయిన ఒక ముస్లిం మేధావి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే ముస్లిం యువతకు ఉద్యోగాలు కల్పించగల నైపుణ్యాలు అవసరమనీ, ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఆ నైపు ణ్యాలు బోధించే పరిస్థితి లేదనీ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను తాను వ్యతిరే కించడం లేదని రాహుల్‌ గాంధీ ప్రైవేట్‌ సంభాషణల్లో అయినా సరే, అంగీకరించడం ముఖ్యమైన విషయం. ఎందుకంటే 2015లో నాటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను ఆయన అధికారిక నివా సంలో నేను ముఖాముఖిగా కలిసినప్పుడు, కర్ణాటక ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం గురించి ఆలోచించమని సూచించాను.

ఆయన స్పందనలో రెండు కోణాలున్నాయి. ఒకటి, అలాంటి విద్యా విధానాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం ఒప్పుకోదు. రెండోది, యూఆర్‌ అనంత మూర్తి, గిరీష్‌ కర్నాడ్‌ వంటి కన్నడ మేధావులు చాలా కాలం నుంచీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రతి పాదనను వ్యతిరేకిస్తున్నారు. అందుకని సిద్ధరామయ్య సమాజంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మేధావులు, మీడియా తన ప్రభుత్వా నికి ఈ విషయంలో సమస్యలను సృష్టించవచ్చని చెప్పారు. కాబట్టి, ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టి సమస్యలను కొనితెచ్చుకోవడం కంటే, టిప్పు సుల్తాన్‌ అంశాన్ని ఎత్తుకోవడానికే ఎంచుకున్నారు. అది బీజేపీని బలోపేతం చేసింది.

రాహుల్‌ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంలో ఒక చోదకశక్తిగా ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇంగ్లిష్‌ వ్యతిరేక వైఖరిని కలిగి ఉంటున్న నేపథ్యంలో ఈ అంశంపై రాహుల్‌ వైఖరి కీలకమైనది. మరోవైపున భారత హోంమంత్రి అమిత్‌ షా మరో ముందడుగు వేసి, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలూ ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలోనే మాట్లాడాలని తేల్చి చెప్పేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఏది బోధనాభాషగా ఉండాలి అనే అంశాన్ని రాష్ట్రాలు నిర్ణయించుకోవడానికి తాను వ్యతిరేకిని కానంటూ రాహుల్‌ గాంధీ ఎలాంటి ఊగిసలాట లేకుండా స్పష్టత ఇవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది. భారతదేశం రాష్ట్రాల యూనియన్‌ మాత్రమే తప్ప ఏకీకృత రాష్ట్రం కాదని రాహుల్‌ నమ్ముతున్నందున, ఆయన పార్టీ రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ జాతీయ స్థాయిలో భాషా విధానాన్ని సూత్రీకరిస్తుందని నేను ఆశిస్తున్నాను.

అసలు సమస్య ఎక్కడుందంటే– విద్యకు, ప్రత్యేకించి బోధనా మాధ్యమానికి సంబంధించినంత వరకూ తమ సొంత పిల్లల భవిష్యత్తు విషయంలో, కార్మిక వర్గ పిల్లల భవిష్యత్తు విషయంలో పూర్తిగా వ్యతిరేక వైఖరులను తీసుకుంటున్న మన ప్రజామేధావుల కపట పాత్రేనని చెప్పాల్సి ఉంది.

యూరోపియన్‌–అమెరికన్‌ దేశాల్లో ప్రజా మేధాతత్వం అనేది వామపక్ష ఉదారవాద తత్వంగా ఆవిర్భవించింది. ‘నిజాయితీ భావన’ను, ప్రతి రంగంలోనూ మానవ సమానత్వం కోసం పోరా టాన్ని వ్యాప్తి చెందించడానికి ఆ దేశాల్లో వామపక్ష ఉదారవాదం వృత్తిగతంగా ఏర్పడుతూ వచ్చింది. ఆఫీసులో ఒకటి, వ్యక్తిగత జీవితంలో ఒకటి మాట్లాడటానికి ప్రజా మేధావులనేవారు అటు రాజకీయవాదులూ కారు, ఇటు సంస్థాగతంగా శిక్షణ పొందిన బ్యూరోక్రాట్లు అసలే కారు.

ప్రత్యేకించి ప్రజా సమస్యలకు సంబంధిం చినంత వరకు వీరు సమాజాన్నీ, ప్రభుత్వాన్నీ వ్యతిరేక దిశల్లో నడిపించే విధంగా కాకుండా నిజాయితీ, చిత్తశుద్ధితో కూడిన వైఖరిని కలిగి ఉండాలి. ప్రజామేధావి తమకు ఏది మంచిదో ఇతరులకూ అదే మంచిదని చూడాలి. ఇతరుల ప్రయోజనం కోసం వీరు పోరాడాలి. ఏ సమాజంలో అయినా ప్రజామేధావులు అలాంటి స్థిరమైన వైఖరిని కలిగి ఉంటే, విస్తృత  ప్రజానీకానికి సంబంధించిన అంశాలపై రాజ కీయ నేతలు తమ వైఖరిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.

బ్రాహ్మణుల నియంత్రణలో సంస్కృతం ఆధిపత్యం చలాయిం చిన కాలంలో మన దేశ ఉత్పాదక ప్రజారాసులు చారిత్రకంగా నష్టపోయారు, వెనుకబాటుతనంలో కూరుకుపోయారు. ఇప్పుడు పేద ప్రజలకు ఇంగ్లిష్‌ భాషా విద్యకు సంబంధించి ఇలాంటి బౌద్ధిక నిజాయితీ రాహిత్యం కారణంగా ఇంగ్లిష్‌ విద్యకే గ్రామీణ, పట్టణ శ్రామిక ప్రజారాశులు దూరమైపోయే ప్రమాదం ఉంది. 

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే, మొన్నటి ఆంతరంగిక సమావేశంలో రాహుల్‌ గాంధీ వ్యక్తపరిచిన వైఖరిని ‘గ్రాండ్‌ ఓల్డ్‌’ జాతీయ పార్టీ పాటించినట్లయితే, అప్పుడు దేశం ఒక సరికొత్త విద్యావిధాన దశలోకి ప్రవేశిస్తుంది. అదే జరిగి నప్పుడు బీజేపీ కూడా అదే మార్గాన్ని అనుసరించక తప్పదు.

వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త 

మరిన్ని వార్తలు