ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాల్సిందే కానీ...

19 Dec, 2021 01:46 IST|Sakshi

తెలంగాణ రాష్ట్రంలో 2021–2022 సంవత్సరం యాసంగి నుంచి ప్రస్తుత పంటలకు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రచారం చేస్తున్నది. కానీ యాసంగి పంటల కాలం 15 రోజుల గడువు ఉండగానే ఈ ప్రచారం చేయడం వల్ల ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళడం సాధ్యం కాదు. ప్రత్యామ్నాయ పంటలు అంటే ప్రస్తుతం ఉన్న వరి, పత్తి విస్తీర్ణాన్ని తగ్గించడం!  ఆ విస్తీర్ణంలో ఇతర ఆహార, వాణిజ్య పంటలు వేయాలి. ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటే దానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తన విధానాలలో కొన్ని మార్పులు చేయాలి. రాష్ట్ర అవసరాలను గుర్తించాలి. భూసారాన్నిబట్టి పంటలను గుర్తించాలి. ఆ పంటలకు తగిన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో పెట్టాలి. రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులను సమాయత్తం చేయాలి. ఇవేవీ చేయకుండానే ప్రత్యామ్నాయాన్ని పలవరింతలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండకపోగా రైతాంగం ఆందోళనకు గురై ఏ పంటలు వేయాలో తెలియక బీళ్ళుగా మార్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో అగ్రగామి అని ప్రభుత్వం ప్రకటించిన తెలుగు రాష్ట్రం బీడు భూముల రాష్ట్రంగా చూడాల్సి వస్తుంది. అందుకు ప్రత్యామ్నాయ విధానాలు ఏమిటి?

రాష్ట్ర పంటల శాస్త్రీయ ప్రణాళిక
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకటిస్తున్న ‘ఆక్షన్‌ ప్లాన్‌’ రైతులకు ఉపయోగపడేది కాదు. వ్యవసాయశాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఉపయోగపడుతుంది. శాస్త్రీయ ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో భూసార పరీక్షలు నిర్వహించి ఏ మండలంలో ఏ రకమైన భూములు ఉన్నాయో గుర్తించి ప్రకటించాలి. భూసారాన్ని బట్టి ఏ మండలంలో, ఏ పంటలు వేయాలో నిర్ణయించాలి. పంటలకు కావాల్సిన రుణాలను ఇచ్చే విధంగా ప్రస్తుతం ఉన్న బ్యాంకింగ్‌ వ్యవస్థను సవరించాలి. బ్యాంకులు ఇష్టారాజ్యంగా రుణ విధానాన్ని రూపొందించకుండా రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం రుణ మొత్తాలను రైతులందరికీ ఇవ్వాలి. ప్రస్తుతం 60 లక్షల మంది రైతుల్లో 40 లక్షల మందికే రుణాలు ఇస్తున్నారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలి. అవి కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి. మధ్య దళారీలకు అప్పగించరాదు. ‘ధరల నిర్ణాయక సంఘం’ (రాష్ట్ర సీఏసీపీ) మద్దతు ధరలు నిర్ణయించాలి.

నిల్వ సౌకర్యాలకు గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయాలి. ఏ రైతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా చూడాలి. ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి అమ్మితే ప్రస్తుత రేటుకు అదనపు ధర లభిస్తుంది. ఉత్పత్తి వ్యయాన్ని శాస్త్రీయంగా లెక్కగట్టి దానికి 50 శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు గ్యారెంటీ ఇవ్వాలి. అవసరాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇతర దేశాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు పొందాలి.

హార్టికల్చర్‌ పంటలను అభివృద్ధి చేయాలి

రాష్ట్రంలో 6.35 లక్షల ఎకరాలలో మాత్రమే హర్టికల్చర్‌ పంటలు వేస్తున్నారు. మన అవసరాల మేరకు పండ్లు ఉత్పత్తి చేసినప్పటికీ మిగిలిన హార్టికల్చర్‌ పంటలలో లోటు ఉంది. కనీసం 15 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్‌ పంటలను పెంచడం ద్వారా పంటల మార్పిడికి ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది. హార్టికల్చర్‌ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్రానికి లాభాలు వస్తాయి.
ధరల నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరల జాబితా కాకుండా, జాబితాలో లేని పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయించాలి. కొనుగోలుకు గ్యారెంటీ ఇవ్వాలి. ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా ఎగుమతులు చేసుకునే అవకాశాలను పరిశీలించాలి. ఈ పనులు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు అత్యధికంగా ఆదాయం వస్తుంది. రైతులకు ప్రయోజనం ఉంటుంది. అనేక రాష్ట్రాలలో మద్దతు ధరల నిర్ణయానికి సంఘాలను నిర్ణయించడమేగాక, ఈ విపత్కర పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు బోనస్‌లు ఇచ్చి రక్షించుకుంటున్నాయి. 

నాణ్యత లేని విత్తనాలు     
రాష్ట్రంలో నాణ్యత లేని విత్తనాల బెడద ప్రమాదపు అంచుకు చేరింది. ఏటా 30 వేల క్వింటాళ్ళ వరకు వివిధ పంటల విత్తనాలను నాణ్యత లేనివి రైతులకు అంటగట్టి పంటలు పండకుండా చేస్తున్నారు. రైతులు వేలకోట్ల పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. ప్రభుత్వం ధీరోచిత మాటలు చెప్పినప్పటికీ ఆచరణలో కల్తీ విత్తన వ్యాపారులు, కొందరు ప్రభుత్వ అధికారులు మిలా ఖత్‌ అయి కేసులకు శిక్షలు పడకుండా చూస్తున్నారు. ఇంత వరకు ఏ ఒక్క విత్తన కంపెనీ లైసెన్సూ రద్దు చేయలేదు. పీడీయాక్ట్‌ కింద ఎవరినీ అరెస్టు చేయలేదు.  

విదేశీ ఎగుమతులకు అవకాశం కల్పించాలి
విదేశీ ఎగుమతులకు భారత ప్రభుత్వం రాష్ట్రాలకు హక్కులు కల్పించాలి. ప్రత్యేకంగా వ్యవసాయోత్పత్తులకు ఈ అవకాశం కల్పించాలి. కానీ, మన దేశానికి ఎగుమతులు చేస్తున్న దేశాల లాబీ, డబ్ల్యూటీఓ, జీ7 దేశాలు భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన పంటలను దెబ్బతీసే కార్యక్రమం కొనసాగిస్తున్నాయి. పాలు, పసుపు, మిరప, బియ్యం, గోదుమ పంటలను మనం ప్రపంచంలోనే అత్యధిక ఉత్పత్తి చేస్తున్నప్పటికీ అందుకు సంబంధించిన ఉప ఉత్పత్తులు భారతదేశానికి దిగుమతి చేసి, ఇక్కడి రైతులకు నష్టం కలిగిస్తున్నారు. దీనిని ఎదుర్కోవాలి. 

ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని పంటలు మన అవసరాలకు తగినంత ఉత్పత్తి కావడం లేదు. దిగుమతులు చేసుకుంటున్నాం. ముందు ఈ సమస్యను పరిష్కరించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించినట్లు లోటు పంటలను పరిశీలించాలి. ఈ పంటలు పండించడానికి తగిన భూములను గుర్తించి హార్టికల్చర్‌శాఖ, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఈ లోటు పంటలను భర్తీ చేయాలి. ఇది మొదటి కర్తవ్యంగా చూడాలి.

సారం పల్లి మల్లారెడ్డి
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు ‘ 94900 98666

 

మరిన్ని వార్తలు