సయోధ్యతోనే సరిహద్దులు భద్రం

20 Aug, 2020 01:16 IST|Sakshi

సందర్భం

భారత్‌ చైనా సరిహద్దులలోని తూర్పు లదాఖ్, గల్వాన్‌ నదీలోయలలో జరిగిన ఘర్షణతో ప్రాణనష్టం జరిగి, దేశమంతా ఒక  ఉద్వేగం అలుముకుంది. చైనా వ్యతిరేక ప్రచారం పెచ్చుమీరి, యుద్ధం విరుచుకుపడుతుందన్న భావావేశాలు, ప్రతీకారేచ్ఛలు వచ్చాయి. ఇరుదేశాల మిలటరీ అధికారులు, దౌత్యవేత్తలు చర్చించి, తాత్కాలికంగానైనా ఉద్రిక్తతలు సడలించే ప్రయత్నాలు చేస్తున్నారు. పొరుగునున్న దేశాలతో మైత్రి, సయోధ్యతోనే మన సరిహద్దులు భద్రంగా ఉంటాయి. భారత్‌ చైనా మైత్రిని కోరే రెండు దేశాల మధ్య చిర శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయాలి. బ్రిటిష్‌ పాలకులు తమ వలసపాలనా కాలంలో, ఏకపక్షంగా సరిహద్దు గీతలు గీసి సృష్టిం చిపోయిన వివాదం ఇది. ఇంతవరకు భారతదేశానికి, చైనాకు మధ్య ఇరువురూ కలిసి అంగీకరించిన ‘సరిహద్దుల నిర్ణయం’ జరగలేదు. ఎవరి ప్రాంతం ఎవరి అధీనంలో ఉంది అని ఉజ్జాయింపుగా చెప్పే వాస్త్తవాధీనరేఖ పట్ల కూడా రెండు ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేదు. కనుక  వాస్తవాధీన రేఖ ఏదో తెలియందే, నిర్ణయించుకోందే ఎవరు దురాక్రమిస్తున్నదీ ఎలా చెప్పగలం? ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఎదుటి పక్షం వారి వాదనల సమంజసత్వాన్ని అంగీకరించగల రాజకీయ విజ్ఞత ఉండాలి. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యను తీర్చడానికి వాస్తవ ప్రాతిపదికగా, చైనాపట్ల సయోధ్యగల ఇరుగుపొరుగు వారిగా జీవించే అవకాశాలను అన్వేషించాలి. అన్ని అక్రమ మార్గాలతో, కుట్రలతో ఆనాడు బ్రిటిష్‌ వారు సాధించి, అందించిన అన్ని ‘భూభాగాలు మావే’ అనే వైఖరి భారత పాలకులు అనుసరించడం భావ్యం కాదు. ‘భూభాగాలు చర్చనీ యాంశం కాదు’ అన్న నాటి నెహ్రూ వైఖరిని ఇప్పటికైనా వదిలి దీనిపైనే చర్చించాలి.

ఏకపక్షంగా సరిహద్దులు నిర్ణయించుకోవడం, మనవని చెప్పుకునే ప్రాంతాలను విస్తరించుకోవటం, వాటిని వివాదంలో ఉన్నాయని ఒప్పుకుంటూ కూడా సైన్యాలతో,  గస్తీ దళాలతో నింపి సైనిక శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి ‘ముందుకు దూసుకుపోయే’ నెహ్రూ విధానం వల్లనే 1962లో యుద్ధం జరిగింది. ఇప్పటికయినా ఆ విధానం వీడి సర్దుబాటు ధోరణితో, పరస్పర ప్రయోజనకరంగా మొత్తం సరిహద్దును నిర్ధారించుకోవాలి. దీనికి ప్రాతిపదికగా చైనా గతం నుంచీ అనేక  ప్రతిపాదనలు చేసింది. తూర్పు హద్దుల్లో అరుణాచల్‌ ప్రాంతంపై ఇండియాకున్న పాలనాధికారాన్ని తాము గుర్తిస్తామనీ, అలాగే పశ్చిమ భాగాన ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతంపై చైనాకున్న వాస్తవ పాలనాధికారాన్ని భారత్‌ గుర్తించాలనీ చైనా ప్రతిపాదించింది. ఇందిర, రాజీవ్‌ గాంధీ, వాజ్‌పేయి కాలంలో సహకారాన్ని పెంచుకునే ఒప్పం దాలు వ్యాపార వాణిజ్య బంధాలు మెరుగుపడ్డాయి. ఇప్పుడు కూడా చైనాతో కలిసి చర్చించి శాశ్వత పరి ష్కారం చేసుకోవాలి. ఈలోగా దేశంలో చైనా వ్యతి రేక భావనలు పెంచిపోషిస్తే అది సమస్య పరిష్కారానికి అడ్డంకిగా మారుతుంది. ‘చైనా పెట్టు బడులు, ఎగుమతులపై ఆంక్షలు, నిషేధాలు అంతి మంగా భారత ఆర్థిక వ్యవస్థకే నష్టదాయకంగా  పరిణమిస్తాయి’ అనే ఆర్థికవేత్తల అభిప్రాయాలను గౌరవించాలి. ప్రపంచీకరణ స్థితిలో ఏ దేశమైనా పరస్పర ఆశ్రితంగానూ, పరస్పరప్రయోజనకరంగానూ ఉండే తన జాతీయ విధానాలు అవలంభించాలి. ప్రాంతీయ సహకారం, ప్రపంచశాంతి లక్ష్యం గల విదేశాంగ విధానంతో చైనా సహా మన పొరుగు రాజ్యాలన్నిటితో పంచశీల సూత్రాల వెలుగులో వ్యవహరించాలి. ‘విస్తరణ వాదం కాదు వికాసపథం’ అన్న ప్రధాని మోదీ పలుకులకు ఆచరణలో అర్థం కల్పించి తదనుగుణంగా వ్యవహరించాలి.

కరోనా కల్లోలంతో అస్తవ్యస్తంగా తయారైన ఆర్థిక వ్యవస్థను ప్రజోపయోగకరంగా తీర్చిదిద్దవలసిన సమయంలో అరకొరగా ఉన్న నిధులను యుద్ధ తయారీకి, క్షిపణి వ్యవస్థల బలోపేతానికి తరలించడం భారత ప్రజానీకంపై పెనుభారమే. కనుక వివాదాలు పరిష్కరించుకుని, వైషమ్యాలు లేని ఇరుగుపొరుగుల మైత్రిని సాధించాలి. సామాన్య ప్రజల భాగ్యోదయానికి కృషి చేయడమే దేశభక్తి. అలాంటి దేశభక్తిపరుల వల్లనే సరిహద్దులు భద్రంగా ఉంటాయి.

డా.ఎస్‌. జతిన్‌కుమార్‌ 
వ్యాసకర్త భారత చైనా మిత్ర మండలి జాతీయ కార్యవర్గ సభ్యులు
మొబైల్‌ : 98498 06281

మరిన్ని వార్తలు