శతతంత్రుల మాంత్రికుడు

15 May, 2022 00:41 IST|Sakshi

భారత శాస్త్రీయ సంగీతానికి మే 10 అత్యంత విషాదకరమైన రోజులలో ఒకటి. పండిట్‌ రాజన్‌ మిశ్రా, పండిట్‌ బిర్జూ మహారాజ్‌ల తర్వాత... ఆ రోజున మనం మరొక సంగీత దిగ్గజం పండిట్‌ శివకుమార్‌ శర్మను కోల్పోయాం. ఏళ్ల క్రితం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో సితార్, సరోద్, వయోలిన్‌లు ఆధిపత్యం చలాయిస్తున్న సమయంలో పండిట్‌ శివకుమార్‌ శర్మ శతతంత్రీ వీణ (సంతూర్‌) ఆ మూడు వాద్యాలకు సమవుజ్జీగా స్థానం సంపాదించిందంటే ఆ ఘనత శర్మాజీదే. 60–70 ఏళ్ల క్రితం సంతూర్‌ అనే ఈ జమ్మూకశ్మీర్‌ పల్లెసీమల, జానపదుల సూఫీ సంగీతపు నూరు తంత్రుల పక్క వాద్యాన్ని శర్మాజీ అత్యద్భు తంగా మలిచి, పలికించారు.

ప్రతి కొత్త విషయానికి జరిగినట్లే ఇక్కడా జరిగింది. అందుకు నేనొక సాక్షిని. సంతూర్‌ అనే ఆ కొత్త పరికరం గురించి ప్రేక్షకులు సందేహాలు వ్యక్తం చేశారు. సంతూర్‌ ధ్వనిలో భారత శాస్త్రీయ సంగీత సారాంశం లేదని పెదవి విరిచారు. గమకాలు, స్వర విరామాలు శ్రావ్యంగా లేవని అన్నారు. కానీ పండిట్‌ శర్మ ఆ వాద్యానికి, వాద్య ధ్వనికి ఏకంగా దేవశ్రుతినే కల్పించారు. కుడిచేతి బొటనవేలితో తంత్రుల్ని మూర్ఛనలు పోనిచ్చారు. ఉదాహరణకు, రూపకతాళం అనే ఒక్క ఏడు లయల భావాంశం లోనే పండిట్‌జీ ఝప్తాల్‌ (10 బీట్లు), ఏక్‌ తాల్‌ (12 బీట్లు), తీన్‌ తాల్‌ (16 బీట్‌లు) కూడా పలికించేవారు. 

పండిట్‌జీ కొద్దిమాటల మనిషి. ప్రశాంతంగా, మౌనంగా,  మర్యాదగా, వినయంగా ఉండేవారు. కచేరీ ప్రారంభానికి ముందు వేదిక తెరల వెనుక ధ్యానముద్రలోకి వెళ్లిపోయేవారు. ఆలోచనల్ని వేళ్లలోకి తెచ్చేసుకునేవారు. ఎంతటి మాటల పొదు పరి అయినా సహ కళాకారుల గురించి ఆరా తీసేవారు. వారిని ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన ఎవర్నయినా విమర్శించడం నేను ఎప్పుడూ చూడ లేదు. ఆయనలో హాస్య ప్రియత్వం ఉండేది. ఒకసారి ఒక జర్నలిస్ట్‌ ఇంటర్వ్యూకి ముందు ‘నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి’ అని అన్న ప్పుడు, పండిట్‌జీ ఇలా సమాధానమిచ్చారు: ‘క్షమిస్తాను. ముందు మీరు తప్పు చేయండి’.

శర్మాజీ మొదట్లో తబలా వాద్యకారులు. 1950వ దశకం చివరిలో మా కుటుంబానికి యువ శర్మ గురించిన తొలి జ్ఞాప కాలలో ఒకటి... మా అన్నగారు, సితార్‌ వాద్యకారుడు పండిట్‌ శశి మోహన్‌ భట్‌ జమ్మూలో ఆల్‌ ఇండియా రేడియో షో కోసం రికార్డింగ్‌ చేస్తున్నప్పుడు శివకుమార్‌ శర్మ తబలా వాయించడం! సంవత్సరాల తరువాత శర్మాజీ, నేనూ ఒకే కచేరీలో వాద్యకారు లుగా కలుసుకున్నాం. ఆయన పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసి యాతో (శివ్‌–హరిగా) కలిసి యుగళ గీతాలకు సంతూర్‌ స్వర ప్రతిష్ఠ చేసేవారు.

నేనప్పటికి జూనియర్‌ ఆర్టిస్ట్‌ని మాత్రమే! శర్మాజీ, నేను కలిసి ఎప్పుడూ యుగళ గీతాలను పలికించలేదు. కానీ మేము ఒకే విమానంలో న్యూయార్క్‌లోని భారతీయ విద్యా భవన్‌లో కచేరీలకు, ఎ.ఆర్‌. రెహమాన్‌ ‘జనగణమన’ వీడియో షూట్‌ల కోసం లేహ్, లద్దాఖ్, మాంట్రియల్‌కు వెళ్లాం. పండిట్‌ జస్రాజ్‌ కుమార్తె దుర్గా జస్రాజ్‌ ఏర్పాటు చేసిన టెలివిజన్‌ షో రికార్డింగ్‌లో ఆమె నా పేరును ప్రస్తావించినప్పుడు, పండిట్‌ శివ కుమార్‌ శర్మాజీ... ‘అతను మోహన వీణను ప్రపంచమంతటికీ తీసుకెళ్లాడు’ అని నా పరిచయానికి జోడింపునిచ్చారు. నేను గ్రామీ (1994) గెలుచుకున్నప్పుడు ‘నువ్వు గొప్పగా చేశావు’ అన్నారు. ఆయన్నుంచి నాకు లభించిన ఆశీస్సులవి. 

సంగీతకారులకే పథనిర్దేశం చేసిన సంగీత విద్వాంసులు పండిట్‌జీ. ఒక గంట పాటు మనం ఆయన మాటల్ని వింటే, సంగీతంలో తాకగల ఎత్తులు ఎన్నో ఉన్నాయని మన గ్రహింపునకు వస్తుంది. సృజనశీలురు తమ ఊహల నుండి సృష్టిస్తారు. కానీ మనం శర్మాజీ జ్ఞానం, శైలి నుంచి నేర్చుకున్న నైపుణ్యాలతోనైనా నవ రాగాలకు ఊపిరి పొయ్యొచ్చు.

చాలామంది కళాకారుల మాదిరిగా పండిట్‌జీ నుంచి నేను కూడా రాగాలను ఎలా నియంత్రించాలి, లయలను ఎలా విభజించాలి, కూర్పులో ఎన్ని వైవిధ్యాలు తీసుకురావాలి, ఇవన్నీ చేస్తున్న ప్పుడు ప్రేక్షకుల ధ్యాసను ఎలా పట్టుకోవాలి; సంప్రదాయానికీ, ఆధునికతకూ ఎలా వంతెన వేయాలి అనే విషయాలను నేర్చు కున్నాను. కొత్తవాద్యంతో సంప్రదాయ ప్రేక్షకులను ఒప్పించి, మెప్పించడం చాలా కష్టమైన పని. కానీ పండిట్‌జీ గొప్ప శక్తితో, ఉత్సాహంతో ఆ పని చేయగలిగారు. నావంటి వారికి ఒక కొత్త ప్రయోగాన్ని చెయ్యడానికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చారు. 

విశ్వమోహన్‌ భట్‌ 
వ్యాసకర్త ప్రసిద్ధ వాద్య సంగీతకారులు,గ్రామీ అవార్డు గ్రహీత 

మరిన్ని వార్తలు