స్వీయ దిద్దుబాటుపైనే జాతి భవిష్యత్తు!

15 Mar, 2023 00:38 IST|Sakshi

విశ్లేషణ

బ్రిటిష్‌ పాలనకు ముందు భారతదేశ జనాభాలో 70 శాతం మంది విద్యావంతులేనని మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. 70 శాతం మంది విద్యావంతు లని ప్రకటించడం అంటే సంస్కృతం బోధించే బ్రాహ్మణీయ గురుకులాల్లో శూద్రులు, దళితులు చదువుకునేవారనే అర్థం వస్తోంది. భారతదేశంలో అన్ని కులాలు, వృత్తులకు చెందిన పిల్లలకు బోధించిన బ్రాహ్మణ లేదా హిందూ సంస్థలు ఉండేవా? నేడు దేశంలో ప్రధాన ఓటర్లుగా ఉంటున్న శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ప్రజారాసులకు అవాస్తవ గాథలను వల్లించడం ద్వారా జాతీయవాదాన్ని స్థాపించలేరు. గత తప్పిదాలను ఆమోదించడం ద్వారానే జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో నింపవచ్చు. అసత్యాలతో కాకుండా నిజాయితీ, స్వీయ దిద్దుబాటుపైనే జాతి భవిష్యత్తును నిర్మించవచ్చు.

ఆరెస్సెస్‌ సర్‌సంచాలక్‌ మోహన్‌ భాగవత్‌ కొంతకాలంగా అసాధారణ ప్రకటనలు చేస్తు న్నారు. దేవుడు కులాన్ని సృష్టించలేదనీ, పండిట్లు (పూజారులు) కులాన్ని సృష్టించారనీ అన్నారు. శాస్త్రాలు మౌఖికంగా బదిలీ అయి నంతకాలం బాగుండేవనీ, వాటిని ఎప్పుడైతే రాయడం జరిగిందో తప్పుడు విషయాలు పొందుపరుస్తూ వచ్చారని కూడా అన్నారు. ఈ రెండు ప్రకటనలు కాస్త సంస్కరణ తత్వంతో ఉన్నాయి.

‘2023 మార్చి 5న మోహన్‌ భాగవత్‌ బ్రిటిష్‌ పాలనకు ముందు భారతదేశ జనాభాలో 70 శాతం విద్యావంతులేనని పేర్కొన్నారు. అప్పట్లో దేశంలో నిరుద్యోగమనేది లేదని కూడా చెప్పారు’. ఆయన ఈ ప్రకటనకు మీడియా విస్తృత ప్రచారం కల్పించింది.

సావిత్రీబాయి ఫూలే జయంతి నేపథ్యంలో 2023 మార్చి 7న ‘పుణేకర్‌ న్యూస్‌’లో కేమిల్‌ పార్ఖే 1824లో బాంబేలో మొట్టమొదటి బాలికా పాఠశాలను ప్రారంభించిన అమెరికన్‌ మిషనరీ మహిళ సింథియా ఫరార్‌ గురించి ఒక ఆసక్తికరమైన కథనం రాశారు. పుణేలో బాలికల పాఠశాలను ప్రారంభించడానికి మహాత్మా జ్యోతిరావు ఫూలేకు ఫరార్‌ ఆదర్శంగా నిలిచారు. ఈ పాఠశాలలోనే సావిత్రీ బాయి, ఫాతిమా బాలికలకు పాఠాలు చెప్పేవారు.

జాతీయవాద దృష్టితో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రీ బాయిని దేశం పరిగణిస్తోంది. నిజానికి సింథియా ఫరార్‌ను మొదటి మహిళా టీచర్‌గా భావించాలి. సింథియా పెళ్లి చేసుకోలేదు. భారత దేశంలో బాలికా విద్య కోసం తన జీవితాంతం కృషి చేశారు.

అహ్మద్‌నగర్‌లో 1862లో మరణించారు. ‘‘ముంబై, అహ్మద్‌ నగర్‌లలో అనేక బాలికా పాఠశాలలు, బాలికల బోర్డింగ్‌ స్కూల్స్‌ను ప్రారంభించిన ఘనత సింథియా ఫరార్‌దే’’ అంటారు పార్ఖే. చరిత్రలో ఏ కాలంలోనైనా భారత్‌లో హిందూ బ్రాహ్మణ మిషనరీలు అలాంటి బాలికా పాఠశాలలను ప్రారంభించడం జరిగిందా? 70 శాతం మంది భారతీయులంటే, అందులో శూద్రులు, గ్రామాల, పట్టణాల చివర నివసిస్తున్న దళితులకు విద్యాహక్కు ఉండాలి.

బ్రిటిష్‌ పూర్వ భారతదేశం అంటే మొఘలాయి పాలన గురించి ఆయన మాట్లాడుతున్నారని అర్థం. ముస్లిం పాలనాకాలంలో 70 శాతం మంది భారతీయులు చదువుకున్నవారేనన్న అర్థాన్ని ఇస్తోంది మోహన్‌ భాగవత్‌ ప్రకటన.

అదే నిజమైతే, ముస్లింల పాలన ఎందుకు చెడ్డది? మొఘలుల పాలనాకాలంలో భారత్‌లో 70 శాతం మంది ముస్లింలు లేరు. ముస్లిం పాలకులు శూద్రులను, దళితులను విద్యావంతుల్ని చేశాక కూడా వాళ్లు ఇటీవలి కాలం వరకూ నిరక్ష రాస్యులుగానే ఎందుకు ఉండిపోయినట్లు? మోహన్‌ భాగవత్‌ ప్రకటన సాధారణంగా ఆరెస్సెస్‌ వాస్తవికతను ప్రతిబింబిస్తుంది.

కులం, మహిళల అసమానత్వం అనేవి సంస్కృత శాస్త్రాల్లోకి తదనంతర రచయితలు ప్రవేశపెట్టారని ఆరెస్సెస్‌ చెబు తున్నట్టయితే– ఆరెస్సెస్‌/బీజేపీ ప్రభుత్వం ఒక సమీక్షా కమిటీని ఏర్పర్చి శాస్త్రాల్లో కులం, మహిళల అసమానత్వం గురించిన ప్రస్తా వనలను తొలగించవచ్చు. శాస్త్రాలు, పురాణాల్లో దేవతలకు కూడా కులం అంటగట్టేశారు.

ఉదాహరణకు రాముడిని క్షత్రియుడిగా, కృష్ణు డిని యాదవుడిగా పేర్కొంటారు. శూద్ర, చండాల వంటి కుల బృందాలను అత్యంత హీనంగా శాస్త్రాలు పేర్కొన్నాయి.

అదే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య సామాజిక వర్గాలను అత్యంత గౌరవనీయమైన రీతిలో పేర్కొన్నారు. పైగా శూద్రులు, చండాలురు వీరిని సేవించాల న్నారు. శాస్త్రాల్లో అలాంటి భాషను మార్చడాన్ని ఎవరూ ఆపరు.

హిందువులుగా తమను పరిగణించుకునే అన్ని వృత్తి బృందాలకు అర్చక విద్య పొందే హక్కును కల్పించాలి. ‘దేవుడు కులాన్ని సృష్టించలేదు’ అని ఆరెస్సెస్‌ అధినేతగా భాగవత్‌ చెబుతున్నందున ఇది అవసరమైన చర్యే. ఆధ్యాత్మిక విద్యలో సమాన అవకాశాలపైన ఆధ్యా త్మిక సమానత్వం ఆధారపడి ఉంటుంది.

హిందూ పిల్లలందరికీ హిందూ ఆధ్యాత్మిక విద్యను ఆరెస్సెస్, బీజేపీ కూటమి ప్రారంభించవచ్చు. ఇటీవలి కాలం వరకూ హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలను చదివే హక్కు శూద్రులకు, దళితులకు ఉండేది కాదని తెలిసిన విష యమే. ఈ పుస్తకాల్లోనే వీరి జీవితాన్ని పశువులతో సమానంగా చిత్రించారు. ‘రామచరిత్‌ మానస్‌’లో అలాంటి భాష గురించి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగిన చర్చ అందరికీ తెలిసిందే.

ఆరెస్సెస్, బీజేపీ పాలిస్తున్నప్పుడు అన్ని రంగాల్లో సమానమైన వాతావరణంలో విద్యా హక్కుకు హామీ ఉండేలా చూడాలి. భారతీయ వృత్తిజీవులందరి హుందాతనాన్ని నిలబెట్టేలా పాఠ్యప్రణాళిక ఉండాలి. ఏ కాలంలో, ఏ సమాజమైనా వ్యవసాయం, పశుపోషణ, చేతి వృత్తులు లేకుండా మనుగడ సాగించలేదు.

కానీ రుగ్వేదం నుంచి రామాయణ, మహాభారతాల వరకు ఈ వృత్తులను దైవికం కానివిగా చూశాయి. అందువల్ల అవి శూద్ర లేదా చండాలమైనవి. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న ఆధునిక యువత ఇలాంటి భాషను ఆమోదించలేదు. కాబట్టి మార్పు అవసరం.

బ్రిటిష్‌ పూర్వ భారతదేశంలో 70 శాతం మంది విద్యావంతులని ప్రకటించడం అంటే సంస్కృతం బోధించే బ్రాహ్మణీయ గురుకులాల్లో శూద్రులు, దళితులు, మహిళలు చక్కగా చదువుకునే వారనే అర్థం వస్తోంది.

దీనికి రుజువు ఉందా? ప్రాచీన, మధ్య యుగాల్లో అంటే బ్రిటిష్‌ వారు అడుగుపెట్టేంతవరకూ విద్యావిధానం నుంచి శూద్రులు, దళితులు, మహిళలను దూరం పెట్టాలని శాస్త్రాలే స్వయంగా చెబుతున్నప్పుడు బ్రిటిష్‌ పూర్వ భారతదేశంలో 70 శాతం మంది భారతీ యులు చదువుకున్నారని మోహన్‌ భాగవత్‌ అనడంలో అర్థం ఉందా? భారతదేశంలో అన్ని కులాలు, సామాజిక బృందాల పిల్లలకు సూత్రరీత్యా విద్యను అందించేందుకు ఆమోదించిన మొట్టమొదటి పాఠశాలను విలియం కేరీ అనే బ్రిటిష్‌ మిషనరీ 1817లో కలకత్తాలో రాజా రామ్‌మోహన్‌ రాయ్‌ సహకారంతో ప్రారంభించారు.

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మొట్టమొదటి బాలికల పాఠశా లను 1824లో బాంబేలో అమెరికన్‌ మరాఠీ మిషన్‌ ప్రారంభించింది. ఆ మిషన్‌ తరఫున భారత్‌ వచ్చిన సింథియా ఫరార్‌ అన్ని కులాల మహిళలకు, పిల్లలకు బోధించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు.

ముస్లిం పాలనా కాలంలో కానీ, అంతకుముందు కానీ భారత దేశంలో అన్ని కులాలు, వృత్తులకు చెందిన పిల్లలకు బోధించిన బ్రాహ్మణ లేదా హిందూ సంస్థలు ఉండేవా? అలాంటి విద్యాసంస్థలు లేకుండా దేశంలోని 70 శాతం మంది పిల్లలకు ఎవరు విద్య నేర్పారు?  ఏ రాజరిక ప్రభుత్వమూ పాఠశాలలను నడపలేదు. బ్రాహ్మణులు (ప్రధానంగా బ్రాహ్మణులు, క్షత్రియ విద్యావంతులు) ఆ పని చేసి ఉండాల్సింది. కానీ దానికి శాస్త్రాలు వారిని అనుమతించలేదు.

మొఘలుల కాలంలో కూడా పర్షియా భాషలో అన్ని కులాల కోసం పాఠశాలలను ఏర్పర్చలేదు. సార్వత్రిక విద్యకు వ్యతిరేకులైన బ్రాహ్మణ పండితుల సూచన ప్రకారమే అక్బర్‌తో సహా మొఘల్‌ పాలకులు నడుచుకున్నారు. మొఘలుల పాలనాకాలంలో విషాదకర మైన విషయం ఏమిటంటే – ఇస్లాంలోకి మతం మార్చుకున్న కింది కులాల వారికి ఉన్నత కులాల ముల్లాలు, పఠాన్లు లేదా మొఘల్‌ జాతి వారు విద్య నేర్పలేదు. నేడు దళిత అక్షరాస్యత కంటే కిందికులాలకు చెందిన ముస్లింల నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

70 శాతం అక్షరాస్యత గణాంకాలకు ఆరెస్సెస్‌ అధినేతకు ఆధారం ఏమిటి? నేడు దేశంలో ప్రధాన ఓటర్లుగా ఉంటున్న శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ప్రజారాసులకు అవాస్తవ గాథలను వల్లించడం ద్వారా జాతీయవాదాన్ని స్థాపించలేరు. గతంలోని తప్పిదాలను ఆమోదించడం ద్వారానే జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో నింపవచ్చు. అసత్యాలతో కాకుండా నిజాయితీ, స్వీయ దిద్దుబాటు పైనే జాతి భవిష్యత్తును నిర్మించవచ్చు.

ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు