ఆర్టికల్‌ 370 రద్దు చట్టబద్ధమేనా? 

8 Aug, 2022 00:38 IST|Sakshi

కామెంట్‌

జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రప్రభుత్వం రద్దుచేసి మూడు సంవత్సరాలు అయింది. మూడేళ్ల తర్వాత, ఇక గడియారాన్ని వెనక్కు తిప్పడం సాధ్యంకాని పని అని చాలామంది ప్రజలు భావిస్తున్న సమయంలో ఒక పుస్తకం... ఆర్టికల్‌ 370 రద్దు చట్టప్రకారం చెల్లనేరదని వాదిస్తోంది. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు ఆర్టికల్‌ 370 రద్దుకు గవర్నర్‌ తన ఆమోదం తెలిపారు. ఇలాంటి సందర్భంలో గవర్నర్‌ తన స్వతంత్ర హోదాలో కాకుండా రాష్ట్రపతి ప్రతినిధిగా వ్యవహరిస్తారు. అంటే ఇది రాష్ట్రపతి స్వయానా తన సొంత ఆమోదం కోరిన దానితో సమానం అవుతుందని పుస్తకం అంటోంది. ఇక రాజ్యాంగాన్ని అన్వయించుకోవడంలో సహాయం చేయడం కోసం ఉద్దేశించిన ఆర్టికల్‌ 367ను అనుచితంగా ఉపయోగించారనీ చెబుతోంది. వీటిని ఒకానొక పుస్తకపు అభిప్రాయాలుగా కొట్టేయడం అంత సులభం కాదు. ఎందుకంటే దీన్ని ప్రచురించిన విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ డైరెక్టర్‌ అర్ఘ్యా సేన్‌గుప్తా రాజ్యాంగం మీద సాధికారత కలిగిన వ్యక్తిగా గౌరవం ఉన్నవారు. 

ఆగస్ట్‌ 5వ తేదీ శుక్రవారం నాటికి జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దుచేసి మూడేళ్ళు నిండాయి. ఈ సందర్భంగా ‘హమీ అస్త్‌: ఎ బయోగ్రఫీ ఆఫ్‌ ఆర్టికల్‌ 370’ అనే పుస్త కాన్ని విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ సంస్థ ప్రచురించింది(‘భూమ్మీద ఎక్కడైనా స్వర్గం ఉన్నదీ అంటే... అది ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది’ అని కశ్మీర్‌ సౌందర్యం గురించి అమీర్‌ ఖుస్రో పలికిన పంక్తుల్లోని ఇక్కడే ఉంది (హమీ   అస్త్‌) అన్నది ఈ పుస్తకం టైటిల్‌).

ఈ పుస్తకం తీవ్రమైన కలకలం సృష్టించగలదు. ఎందుకంటే ‘ఆర్టికల్‌ 370 రద్దు చట్టప్రకారం చెల్లనేరదు’ అని ఇది వాదించింది. ఈ పుస్తకాన్ని నలుగురు రచయితలు రాశారు – అర్ఘ్యా సేన్‌గుప్తా, జినాలీ డేనీ (రీసెర్చ్‌ ఫెలో), ప్రణయ్‌ మోదీ (ప్రాజెక్ట్‌ ఫెలో), కెవిన్‌ జేమ్స్‌ (మాజీ రీసెర్చ్‌ ఫెలో). సేన్‌గుప్తా... విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ వ్యవ స్థాపకుడు, రీసెర్చ్‌ డైరెక్టర్‌ కూడా. (మిగిలిన ముగ్గురూ ‘విధి’ సెంటర్‌తో సంబంధం ఉన్నవారే.)

‘హమీ అస్త్‌’ రచయితలు మూడు కారణాల వల్ల ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం అని వాదిస్తున్నారు. ఈ కారణాలు సాంకేతికపర మైనవి. వాస్తవానికి ఆర్టికల్‌ 370 రద్దు వంటి చర్యకు ఎందుకు పాల్పడ్డారు, దాన్ని ఎలా అమలు పర్చారు అనే విషయాన్ని మనందరం తెలుసు కోవలసిన అవసరం ఉంది. సాధారణ వ్యక్తులు వీటిని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. అయితే సమస్య చాలా ముఖ్యమైంది కాబట్టి, ఈ వాదన లను సంగ్రహరూపంలో చెబుతాను.

‘హమీ అస్త్‌’లో చెప్పిన తొలి కారణం ప్రకారం, జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ ఆమోదం అనేది శాసన సభతో రాజ్యాంగ అసెంబ్లీని సమానం చేస్తోంది.  అది ఎలా జరిగింది అన్నది ఇక్కడ ప్రధానం కాదు. నిజానికి అది కూడా ఒక సమస్యే అయినప్పటికీ ఆ సమయంలో గవర్నర్‌ నడవడిక ఎలా ఉండింది అనేది ఇక్కడ కీలకమైన విషయం. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు ఆర్టికల్‌ 370 రద్దుకు గవర్నర్‌ తన ఆమోదం తెలిపారు.

పుస్తకం ఏమంటున్నదంటే: ‘‘జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర గవర్నర్‌ ఉద్దేశపూర్వకంగా తన ఆమోదం తెలిపినప్పుడు, తన స్వతంత్ర హోదాలో కాకుండా నిజానికి రాష్ట్రపతి ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తారు... అంటే ఇది రాష్ట్రపతి స్వయానా తన సొంత ఆమోదం కోరిన దానితో సమానం అవుతుంది... అయితే అలాంటి స్వీయ ఆమోదం అనేది చట్ట అవసరాలను సంతృప్తి పరుస్తుందా అనేది ఇక్కడ ప్రశ్న. క్లుప్త సమాధానం ఏమిటంటే, లేదు అనే.’’

రెండో కారణం ఏమిటంటే, ఆర్టికల్‌ 367ను ఉపయోగించిన విధానమే. రాజ్యాంగాన్ని అన్వ యించుకోవడంలో సహాయం చేయడం ఈ ఆర్టికల్‌ ఉద్దేశం. రాజ్యాంగ అసెంబ్లీని శాసన సభలాగా వ్యాఖ్యానించడానికి ఈ ఆర్టికల్‌ 367ను ఉప యోగించారు. అయితే, అలా వాడుతున్నప్పుడు ‘‘రాజ్యాంగ నిబంధనల్లోనే గణనీయంగా మార్పులు తీసుకొచ్చారు’’. ‘హమీ అస్త్‌’ పుస్తకం ఇలా అంటుంది: వివరణాత్మక ఘర్షణ లేదా గందరగోళాన్ని పరిష్కరించడం కోసం ఆర్టికల్‌ 367ని ఉపయోగించలేదనేది చాలా స్పష్టం... ఇంతకుముందు రాజ్యాంగ సభకు లేని నిర్దిష్టమైన వాస్తవిక అధికారంతో శాసనసభను రద్దు చేయ డానికి ఈ ఆర్టికల్‌ని ఉపయోగించారు. చివ రగా, ఆర్టికల్‌ 367ను అనుచితంగానూ, శాసన విరుద్ధంగానూ ఉపయోగించారని ఈ పుస్తకం ముగిస్తుంది.

ఇక ‘హమీ అస్త్‌’ చెప్పిన మూడో కార ణాన్ని పరిశీలిద్దాం. జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ప్రకటించే ఉద్దేశంతోనే ఆర్టికల్‌ 367ను ఉపయో గించారు. సందర్భం మరోలా అవస రమైతే తప్ప, రాష్ట్ర అసెంబ్లీ అధికారాలు పార్లమెంటు ద్వారా అమలవుతాయని ఇది ప్రకటించింది. అంటే ఇక్కడ సందర్భం అనేదే నిర్ణయాత్మక అంశం అన్నమాట.

ఈ సందర్భం అనేది ఏమిటి? జమ్మూ కశ్మీర్, భారత కేంద్రప్రభుత్వం మధ్య చారిత్రక రాజీ కుదరడమే ఆ సందర్భమనీ, ఆర్టికల్‌ 370లో దీన్ని పొందుపర్చారనీ పుస్తకం చెబుతోంది. అంటే, భారతదేశంతో జమ్మూ కశ్మీర్‌ రాజ్యాంగబద్ధ సంబంధంలోని నియమ నిబంధనలు జమ్మూ కశ్మీర్‌ ప్రజల ప్రతినిధుల ద్వారా, అలాగే తక్కిన భారత ప్రజల ప్రతినిధులతో ఉమ్మడిగా నిర్ణయించబడతాయని దీనర్థం. ఈ రాజ్యాంగ పరమైన సంబంధానికి ఎలాంటి మార్పు చేయా లన్నా రెండు చేతులూ చప్పట్లు కొట్టాల్సి ఉండ టమే ఇక్కడ సందర్భం. కానీ ఆర్టికల్‌ 370 రద్దులో రెండో చేయి మిస్సయింది. అదీ విషయం.

ఈ పుస్తకంలోని అంశం సులభమైందే కానీ, చాలా తీవ్రమైంది. రాష్ట్రపతి పాలన విధింపు పర్యవసానంగా శాసనసభ అధికారాలను పార్ల మెంట్‌ స్వాధీనపర్చుకుంది. అయితే ఆర్టికల్‌ 370 వెలుగులో జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ తరఫున పార్ల మెంట్‌ అధికారాలను అమలు చేయడాన్ని రాష్ట్రపతి పాలన విధింపులోని నిబంధనలు నిషేధిస్తున్నా యని ఈ పుస్తకం చెబుతోంది.

ఇప్పుడు ‘హమీ అస్త్‌’ అనేది కేవలం విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీకి సంబంధించిన ఒక అభిప్రాయం మాత్రమే. కానీ ప్రత్యేకించి ఈ సెంటర్, అంతకంటే ముఖ్యంగా సేన్‌గుప్తా అభిప్రా యాలు చాలా విలువైనవి. రాజ్యాంగంపై సాధికా రిక అవగాహన కలిగి ఉన్నారన్న గౌరవం వీరికి ఉంది. కాబట్టి ఇక్కడ వెలువడిన వాదనలు చాలా విలువైనవి. పైగా వీటిని పుస్తక రూపంలో తేవడం అనేది మరింత ప్రాధాన్యం కలిగిన విషయంగా మారింది. తమ వాదనలను తాము నమ్మకపోతే పుస్తక రూపంలో ఇలా ప్రచురించరు కదా!

అయితే సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ఇంకా విచారించలేదు. ఇంతవరకూ ఈ అంశాన్ని సర్వో న్నత న్యాయస్థానం వాయిదాలు వేస్తూ పోతోంది. గడియారాన్ని వెనక్కు తిప్పవచ్చు అనే విశ్వాసం కూడా దీనివెనుక ఉండవచ్చు మరి. కానీ, మూడేళ్ల తర్వాత ఇప్పుడు అది సాధ్యం పని అని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. ‘హమీ అస్త్‌’ మరో అడుగు ముందుకేసింది. ఆర్టికల్‌ 370 రద్దు అనేది జరిగిపోయిన వ్యవహారంగా మిగిలిపోతే, అది రాజకీయ అపహాస్యం కిందికి వస్తుందని ఈ పుస్తకం సూచిస్తోంది.


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు 

మరిన్ని వార్తలు