పనిలో, ఫలితాల్లో నంబర్‌వన్‌ 

17 Aug, 2022 07:09 IST|Sakshi

తాజాగా వచ్చిన ‘ఇండియా టుడే’ సర్వేలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు 57 శాతం ప్రజల మద్దతు ఉందని తేలింది. ఇదే సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో ఇది నలభై శాతం ఉండగా, ఈసారి మరో పదిహేడు శాతం పెరిగింది. అంతేకాదు, దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల విభాగంలోనూ, రాష్ట్రాల వారీగా ప్రజాదరణ ఎలా ఉందన్న విభాగం రెంటిలోనూ జగన్‌కు ఐదో స్థానం లభించింది.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అవకాశం చిక్కినప్పుడల్లా జగన్‌పై వ్యతిరేకత తీవ్రంగా ఉందనీ, ప్రజలలో తిరుగుబాటు వస్తోందనీ చెబుతూ ఉంటారు. ఆయన చెప్పే విషయాలను పరమ పవిత్రంగా భావించే ఆ పార్టీ మద్దతు మీడియా దాన్ని ప్రముఖంగా ప్రచారం చేస్తుంటుంది. అదే సమయంలో ఇలా స్వతంత్ర మీడియా సంస్థలు నిర్వహించే సర్వేలను తమ మీడియాలో కనబడనివ్వకుండా జాగ్రత్తపడతాయి. ఆ విషయానికి అధిక ప్రాధాన్యం ఇస్తే, టీడీపీ కార్యకర్తలలో నైరాశ్యం పెరిగిపోతుందన్నది వారి భయం కావచ్చు.

కొద్ది కాలం క్రితం టీడీపీకి రాజకీయ సలహాదారుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ట్విటర్‌ ద్వారానో, మరే మార్గం ద్వారానో ఒక సర్వే నిర్వహించారట. అందులో జగన్‌ స్థానం ఇరవైగా ఉందట. ఈ ఫేక్‌ సర్వే వచ్చిన వెంటనే చంద్రబాబు రంగంలోకి వచ్చి ‘ఇంకేముంది, జగన్‌ పని అయిపోయిం’దని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టారు. ఆ తర్వాత రెండు సర్వేలు వచ్చాయి. ఇవి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సంస్థలు చేసినవి. వాటి ప్రజాభిప్రాయ సేకరణలలో జగన్‌ రేటింగ్‌ బాగా పెరిగింది. ఈ సర్వేలను ఏ రకంగా చూసినా ఒకటి అర్థమవుతుంది; వైసీపీ బలం ఏ మాత్రం తగ్గలేదని. ఇవి లోక్‌సభ స్థానాలను దృష్టిలో పెట్టుకుని సర్వేలను నిర్వహించినప్పటికీ, వాటి అంచనాల ఆధారంగా పరిశీలిస్తే, శాసనసభ ఎన్నికల్లో వైసీపీదే విజయమనీ స్పష్టం. 

జగన్‌ అధికారంలోకి రాగానే ఎన్నికల మానిఫెస్టోని ధైర్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో ఉంచి, దీనిని అమలు చేయాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తన ఏలుబడిలో మానిఫెస్టో జోలికే పోలేదు. సుమారు 400 ఎన్నికల హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజలను బురిడీ కొట్టించడానికి యత్నించారు. ఆ క్రమంలోనే టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి ఆ మానిఫెస్టోని తొలగించారు. 

విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు గృహ నిర్మాణ రంగాలకు జగన్‌ ఇచ్చిన ప్రాధాన్యం విశిష్టమైనదని చెప్పాలి. విద్యా రంగంలో అమ్మ ఒడి స్కీమ్‌ సంచలనాత్మకమైనది. దేశంలో ఇప్పటికీ అక్షరాస్యత డెబ్బై శాతానికి చేరని నేపథ్యంలో దీనికి ప్రాముఖ్యత ఏర్పడింది. పేదవర్గాల వారు తమ పిల్లలను బడులకు పంపితే 15 వేల రూపాయలిస్తామని చెప్పడం అనూహ్యమైనది. దీనిని ఉచిత పంపిణీ స్కీమ్‌ కింద చూడాలా? లేక పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడిగా చూడాలా అంటే ఎవరూ జగన్‌ స్కీమ్‌ను విమర్శించే పరిస్థితి లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా విద్య, వైద్యానికి పెట్టే ఖర్చు ఉచిత పంపిణీ కాదని చెప్పారు. ఈ స్కీముతో ఏపీలో బడులకు వచ్చే పిల్లల సంఖ్య 7 లక్షలకు పైగా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. 

అలాగే పిల్లలకు ఆంగ్ల మీడియం ప్రవేశ పెట్టాలన్న నిర్ణయం కూడా అందరినీ ఆకర్షించేదే. ఈ ఆలోచనను అడ్డు కోవడానికి ప్రతిపక్ష పార్టీలే కాకుండా, ఆయా వ్యవస్థలలో ప్రముఖంగా ఉన్నవారు కూడా ప్రయత్నించారు. దీనివల్ల జగన్‌ గ్లామర్‌ మరింత పెరిగిపోతుందన్నదే వారి భయం. కొందరు పెద్దలు దురుద్దేశంతో ఆంగ్ల మీడియంను వ్యతిరేకించినా, జనం మాత్రం జగన్‌ వెంటే నిలబడ్డారు. స్కూళ్లను నాడు–నేడు కింద బాగు చేసి కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తయారు చేయడం మరో ఘనత. ఏదైనా స్కూల్‌ బాగోకపోతే, దాని రిపేరుకు ప్రభుత్వం నుంచి నిధులు పొందడానికి ఏళ్ల సమయం పట్టేది. అలాంటిది, ఎవరూ అడగకుండానే ఒక పథకం ప్రకారం జగన్‌ బడులను తీర్చిదిద్దుతున్నారు.

ఆరోగ్య రంగంలో కూడా నాడు–నేడు చేపట్టడం, గ్రామాలలో క్లినిక్స్‌ను ఏర్పాటు చేయడం, ఆరోగ్యశ్రీలో వందల జబ్బులను చేర్చడం, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి చోట్ల కూడా వైద్యం చేసుకునే అవకాశం కల్పించడం, కొత్తగా పదహారు మెడికల్‌ కాలేజీల ఏర్పాటు ప్రయత్నం, కరోనా సమయంలో బాధితు లను ఆదుకోవడానికి అన్ని చర్యలూ జగన్‌కు మంచి పేరు తెచ్చాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక రీతిలో రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పి  రైతుల అవసరాలన్నిటినీ తీర్చే యత్నం చేస్తున్నారు. పరిపాలనను  గ్రామస్థాయికే కాకుండా, ఇంటి గుమ్మం వరకూ తీసుకు వెళ్లడంలో జగన్‌ విజయవంతం అయ్యారు. 

కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఇలా ఒకటి కాదు... సుమారు ముప్పై ఐదు, నలభై రకాల కార్యక్రమాలను చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఈయనే అవుతారు. వీటన్నిటిలోనూ అభివద్ధి కోణం ఉన్న ప్పటికీ, కొందరు కావాలని జగన్‌ ప్రభుత్వంపై అంతా సంక్షేమమేనా? మరి అభివద్ధి మాటేమిటి అని దుష్ప్రచారం చేస్తుంటారు. ఏ గ్రామానికి వెళ్లినా కొత్త భవనాలు, కొత్త పాలనా కేంద్రాలు, స్కూళ్లలో మార్పులు.. ఇవన్నీ అభివద్ధి కిందకు రావా అంటే వాటికి జవాబు ఇవ్వరు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా ఒక్కొక్కరికీ ఐదు నుంచి పది హేను లక్షల ఆస్తి సమకూరింది. ఇదంతా సంపద కాదా?.

వైసీపీ ప్రభుత్వం పరిశ్రమల రంగంలో ప్రచార్భాటాలు లేకుండా సాగిస్తున్న ప్రయత్నాలు కూడా చెప్పుకోదగినవే. గ్రీన్‌ ఎనర్జీ, అదాని డేటా సెంటర్, మధ్య, చిన్నతరహా పరిశ్రమల స్థాపన లాంటి విషయాల్లో గణనీయ ప్రగతి సాధించే దిశలో ప్రభుత్వం ఉంది. మూడు రాజధానుల అంశం పెండింగులోనే ఉన్నా, విశాఖను అభివృద్ధి చేసే విషయంలో జగన్‌ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. నిజానికి జగన్‌ ప్రభుత్వం టీడీపీ కన్నా, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా నుంచే అధిక పోటీని ఎదుర్కుంటోంది. ప్రభుత్వాన్ని ముందుకు కదల కుండా, ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రతిపక్ష మీడియా సాగిస్తున్న కుతంత్రాల్ని ఎదుర్కోవడమే జగన్‌కు పెద్ద సవా లుగా ఉంది. అయినా వాటన్నిటినీ తట్టుకుని ఇన్ని మార్పులు తేవడమే పెద్ద విజయం. 

అలాగని ప్రభుత్వంలో లోటుపాట్లు ఉండవా? అంటే కచ్చితంగా ఉంటాయి. వాటిని సరిదిద్దుకుంటూ ప్రభుత్వం ముందుకు పోవాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అధికారులు ఆశించిన రీతిలో పని చేయకపోవడం, కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు విమర్శలకు గురికావడం వంటివి ఉన్నాయి. ఇలాం టివి అక్కడక్కడా ఉన్నా జగన్‌పై ప్రజలలో విశ్వాసం చెదరకుండా పెరగడం గొప్ప విషయం. వచ్చే ఎన్నికలలో జగన్‌ నాయకత్వం కావాలా, చంద్రబాబు నాయకత్వం కావాలా అన్న దానిపైనే ప్రజలు తీర్పు ఇస్తారు. జగన్‌ అమలు చేస్తున్న స్కీములు కొనసాగాలా, వద్దా? చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో ఈ స్కీములను అమలు చేస్తామని అంటారా? లేక ఎత్తివేస్తామని అంటారా? ఇలాంటి అంశాలన్నీ వచ్చే ఎన్నికలలో చర్చకు వస్తాయి. 

చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఎంతసేపూ నెగిటివ్‌ పాయింట్‌ ఏమి దొరకుతుందా అన్న ఆలోచన తప్ప, పాజిటివ్‌ యాంగిల్‌ లేకపోవడం కూడా జగన్‌కు కలిసి వస్తోంది. చంద్రబాబు వయసు ఏడు పదులు దాటడం, ఆయన  మాట లలో స్థిరత్వం లేక పోవడం, తన కుమారుడు లోకేష్‌కు నాయకత్వం అప్పగించే ధైర్యం లేకపోవడం వంటివి టీడీపీకి మైనస్‌ అయితే... జగన్‌ ఏభై ఏళ్ల వయసులోనే ఉండడం, పేద వర్గాలలో విశేష ప్రభావం చూప గలగడం వైసీపీకి ప్లస్‌ పాయింట్స్‌. ఏది ఏమైనా ఈ ప్రజాభిప్రాయ సేకరణను పరి గణనలోకి తీసుకుంటూనే ప్రభుత్వాన్ని ఈ రెండేళ్ళు మరింత పకడ్బందీగా నడుపుకొంటూ వెళితే జగన్‌కు తిరుగుండదు.

- కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు   

మరిన్ని వార్తలు