కార్మిక హక్కులకు అసలు ప్రమాదం

10 May, 2022 03:18 IST|Sakshi

మంచి జీవితాన్ని గడిపే హక్కు, సంపదను కొంతమంది చేతుల్లో కేంద్రీకరించని ఆర్థిక వ్యవస్థ, పనిలో మానవీయ పరిస్థితులు... ఇలా రాజ్యాంగ ప్రవేశికలో ప్రజల మనోభావాలన్నింటికీ రూపమివ్వడమే కాకుండా సోషలిస్టు అనే పదం కూడా జోడించారు. కానీ ఆచరణలో వేతనాలు, జీవన ప్రమాణాలు, యూనియన్‌ పెట్టుకునే హక్కు గగన కుసుమాల్లాగే మారాయి. వందేళ్లుగా అనేక పోరాటాలు, త్యాగాలతో కార్మికులు తమ హక్కులను కాపాడుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 46 లేబర్‌ చట్టాలను తొలగించి వాటి స్థానంలో 4 చట్టాలను తీసుకురావాలనుకుంటోంది. కార్మిక సంఘాలు ఈ మార్పుల పట్ల తీవ్ర ఆందోళనగా ఉన్నాయి. వారి డిమాండ్ల పట్ల  కేంద్రం ప్రదర్శిస్తున్న మౌనం ప్రమాదకరంగా కనిపిస్తోంది.

భారతీయ కార్మికవర్గం మొదటినుంచీ బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకుంటూ వచ్చింది.  1908లో ముంబైలో చేసిన ఆరురోజుల సమ్మె, 1913లో కెనడాలోని పంజాబీ వలస కార్మికులు స్థాపించిన గదర్‌ పార్టీ, 1930లో నాలుగురోజుల పాటు నడిచిన సోలాపూర్‌ కమ్యూన్‌ లాంటి వాటివల్ల భారత కార్మికవర్గం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1930లో కార్మికులు కలకత్తా కాంగ్రెస్‌ సెషన్‌లోకి దూసుకెళ్లినప్పుడు పూర్ణ స్వరాజ్‌ తీర్మానం ప్రకటించడానికి దారి తీసింది. 1937లో కిసాన్‌ సభ, వర్కర్స్‌ పీసెంట్స్‌ పార్టీ కార్యాచరణలు, యునైటెడ్‌ ప్రావెన్స్‌లలో జమీందారీ వ్యవస్థ రద్దు తీర్మానాలకు దారితీశాయి. 

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్‌ దళాలకు సరఫరాలు తీసుకెళ్లడానికి 1945లో ముంబై, కలకత్తా డాక్‌ వర్కర్లు తిరస్కరిం చారు. 1946లో రాయల్‌ ఇండియన్‌ నేవీలో తిరుగుబాటుకు ముంబై కార్మిక వర్గం ఇచ్చిన వీరోచిత మద్దతు బ్రిటిష్‌ రాజ్‌కి చివరి సమాధి రాయిగా మారింది. ఈ కాలంలోనే, దేశంలో మొట్టమొదటి కార్మిక వర్గ సమాఖ్య అయిన అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌కు (ఇది తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీకి అనుబంధ సంస్థగా మారి పోయింది) బలమైన రాజకీయ మద్దతు లభించింది. లాలా లజపతి రాయ్‌ నుంచి జవహర్‌ లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్, సరోజిని నాయుడు వరకు ఈ సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు. 

మరోవైపున 1944లో ‘ఎ బ్రీఫ్‌ మెమొరాండమ్‌ అవుట్‌లైనింగ్‌ ఎ ప్లాన్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ ఇండియా’ (బాంబే ప్లాన్‌గా సుప్రసిద్ధమైంది) ప్రచురితమైంది. ఈ ప్లాన్‌పై జేఆర్‌డి టాటా, ఘన శ్యామ్‌ దాస్‌ బిర్లా, అర్దెషిర్‌ దలాల్, లాలా శ్రీరామ్, కస్తూర్‌ బాయి లాల్‌ భాయి, అర్దేషిర్‌ దారాబ్‌ ష్రాఫ్, పురుషోత్తమ్‌ దాస్‌ ఠాకూర్దాస్, జాన్‌ మథాయి వంటి ప్రముఖులు సంతకాలు పెట్టారు. జోక్యం చేసుకునే ప్రభుత్వం, ప్రభుత్వ రంగానికి ప్రాముఖ్యత ఉండే ఆర్థిక వ్యవస్థను బాంబే ప్లాన్‌ ప్రబోధించింది. ఆనాటి పెట్టుబడిదారీ వర్గం జాతీయవాద ఆకాంక్షలను ఒక మంచి మౌలికరంగ వ్యవస్థను అభి వృద్ధి చేసేవైపునకు మళ్లించాలనీ, అది దేశీయ ప్రైవేట్‌ పరిశ్రమకు పునాది వేస్తుందనీ భావించింది.

మంచి జీవితాన్ని గడిపే హక్కు, సంపదనూ, ఉత్పత్తి సాధనా లనూ కొంతమంది చేతుల్లో కేంద్రీకరించని ఆర్థిక వ్యవస్థ, స్త్రీపురుషు లకు సమానవేతనం, ఆర్థిక అవసరాల పేరిట కార్మికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకపోవడం, వృద్ధాప్యం, వ్యాధులు, అంగవైకల్యం వంటి అంశాలలో సాయం చేయడం... ఇలా రాజ్యాంగ ప్రవేశికలో ప్రజల మనోభావాలన్నింటికీ రూపమివ్వడమే కాకుండా సోషలిస్టు అనే పదం కూడా దానికి జోడించారు. కానీ ఆచరణలో వేతనాలు, జీవన ప్రమాణాలు, యూనియన్‌ పెట్టుకునే హక్కు, అస్థిరత నుంచి పరి రక్షించే హక్కు వంటివి గగన కుసుమాల్లాగే మారాయి.

1920లో ఏఐటీయూసీ ఏర్పడిన నాటి నుంచీ గత వందేళ్లుగా అనేక పోరాటాలు, అనంత త్యాగాల నుంచే కార్మికులు తమ హక్కు లను కాపాడుకుంటూ వచ్చారు. భద్రతా ప్రమాణాలను నెలకొల్పి, పరిమిత పనిగంటలను కల్పించిన ఫ్యాక్ట రీస్‌ యాక్ట్,  ఇండస్ట్రియల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ యాక్ట్, ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ యాక్ట్, కనీస వేతనాల చట్టం వంటివి స్వాతంత్య్రం సిద్ధించిన ప్రారంభ సంవత్స రాల్లోనే ఏర్పడుతూ వచ్చాయి. 1950లలో విభిన్న కార్మిక బృందాలు తమ సమ్మె శక్తి ద్వారానే డాక్‌ వర్క్స్‌ చట్టం, గనుల చట్టం, ప్లాంటేషన్‌ యాక్ట్, సినీ వర్కర్స్‌ యాక్ట్, వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ యాక్ట్‌ వంటివి సాధించుకున్నారు.

పెరుగుతున్న ప్రైవేట్‌ రంగం, రాజకీయాల్లో ప్రైవేట్‌ పరిశ్రమ దారుల బలం పెరుగుతూ వచ్చిన క్రమంలో రకరకాల పరిణామాలు సంభవించాయి. ప్రభుత్వ రంగం అనేది సామాజిక, ఆర్థిక సము ద్ధరణ లక్ష్యంతో పనిచేయడం కాకుండా లాభాలను సృష్టించే రంగంగా మారిపోసాగింది. శాశ్వత కార్మికులు సోమరులుగా ఉంటు న్నారనీ, కూర్చుండబెట్టి మరీ జీతాలు ఇస్తున్నారనే భావాలు కొత్తగా ఏర్పడే క్రమంలో లేబర్‌ వెసులుబాటు పేరుతో ఉద్యోగాల్లోకి తీసు కోవడం, ఉద్యోగాల్లోంచి తొలగించడం వంటి పద్ధతులు పుట్టు కొచ్చాయి. వెనువెంటనే మానవశక్తిని తగ్గిస్తూ, యాంత్రికీకరణను పెంచే ధోరణులు ప్రారంభమయ్యాయి.

మొదట్లో పర్మనెంట్‌ వర్కర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. వారి స్థానంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరగసాగింది. 1950ల చివరలో భిలాయి స్టీల్‌ ప్లాంటులో 96 వేలమంది పర్మనెంట్‌ కార్మికులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య పదివేలకు పడిపోయింది. వారి స్థానంలో 40 వేలమంది కాంట్రాక్టు కార్మికులు వచ్చి చేరారు. వీరికి పర్మనెంట్‌ కార్మికుల జీతాల్లో మూడో వంతు కూడా దక్కడం లేదు. 1970లో వచ్చిన కాంట్రాక్ట్‌ లేబర్‌ (క్రమబద్ధీకరణ మరియు రద్దు) చట్టం పారిశ్రామిక రంగంలోని కార్మి కులకు అనుకూలంగా ఉన్న చిట్టచివరి చట్టాల్లో ఒకటి. కాంట్రాక్ట్‌ లేబర్‌ వ్యవస్థను తొలగించడం సాధ్యం కాకున్నా కాంట్రాక్ట్‌ కార్మికుల పని పరిస్థితులను మెరుగుపర్చి వారి వేతనాలకు, నిత్యాసరాలకు హామీ ఇచ్చేందుకు ఈ చట్టం వీలు కల్పించింది. 

కీలకమైన ఉత్పత్తి రంగంలో నిపుణ శ్రమలు, కఠిన శ్రమలు చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా నామమాత్రపు కూలీ మాత్రమే దక్కుతోంది. 1974లో చారిత్రాత్మక రైల్వే సమ్మెలో 17 లక్షలమంది పాల్గొనగా 20 రోజులపాటు భారతదేశం స్తంభించిపోయింది. ఎమ ర్జెన్సీ విధింపునకు, నూతన పాలనకు కూడా ఇదొక కారణమని చెబుతుంటారు. ఈ సమ్మె తర్వాతే రైల్వే కార్మికుల్లో కాంట్రాక్టీరణ శర వేగంతో సాగింది. ఈరోజు లోకో పైలట్లు, ట్రావెలింగ్‌ టికెట్‌ ఎగ్జామి నర్లు వంటి వివిధ విభాగాల కార్మికులు రైల్వే నియమాకం చేసినవారు కాదు. కేటరింగ్‌ స్టాఫ్, క్లీనింగ్‌ స్టాఫ్, గ్యాంగ్‌మెన్లు కూడా కాంట్రాక్టు కార్మికులుగా మారిపోయారు.

ముంబైలో 1982లో 65 మిల్లులలోని 2.5 లక్షలమంది మిల్లు కార్మికులు తలపెట్టిన గొప్ప సమ్మె విషాదకరగా మిల్లులు మూసి వేతకు, భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు దారితీసింది. అప్పట్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు తమకు రావలసిన బకాయిల కోసం నేటికీ దీనంగా ఎదురుచూస్తున్నారు. 2011–12లో గుర్గావ్‌లో మారుతి సుజుకిలో జరిగిన సాహసోపేతమైన సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణిచేశారు. ఆ ఫ్యాక్టరీకి చెందిన మేనేజర్‌ హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలో కొంతమంది కార్మిక నేతలు నేటికీ జైల్లో ఉంటున్నారు.

ఉద్యోగాల వాటా ప్రకారం చూస్తే దేశ అసంఘటిత రంగంలో 83 శాతం మంది ఉండగా 17 శాతం మాత్రమే సంఘటిత రంగంలో ఉంటున్నారు. కానీ ఎంప్లాయ్‌మెంట్‌ స్వభావం బట్టి చూస్తే, మన దేశంలో 92.4 శాతం మంది కార్మికులు అనియత రంగంలోనే ఉన్నా రని బోధపడుతుంది. వీరంతా రాతపూర్వక కాంట్రాక్ట్‌ ఉద్యోగాల్లో లేరు కాబట్టి లేబర్‌ చట్టాలు వీరికి వర్తించవు. భారత్‌లో నిజవేతన పెరుగుదల ఆసియాలోనే అతి తక్కువ అని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. 2015–2018 వరకు భారత్‌లో నిజ వేతన పెరుగు దల 2.8 నుంచి 2.5 శాతానికి దిగజారుతూ వస్తోందని తెలిపింది. పాకిస్తాన్, శ్రీలంక, చైనా, నేపాల్‌ వంటి పొరుగు దేశాలతో పోలిస్తే కూడా భారత్‌లో నిజవేతన పెరుగుదల చాలా తక్కువగా నమోదైంది.
 
ఈరోజు, కార్మికుల్లో చాలా తక్కువమంది యూనియన్లలో ఉంటున్నారు. అసంఘటిత రంగంలోని వివిధ సెక్షన్ల కార్మికులు ప్రత్యే కించి నిర్మాణ కార్మికులు, సఫాయి కర్మచారీలు, హాకర్లు వంటి వారు తమను కాపాడే చట్టాల కోసం పోరాడుతున్నారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశంలోని 46 లేబర్‌ చట్టాలను తొలగించి వాటిస్థానంలో 4 చట్టాలను తీసుకురావాలనుకుంటోంది. కానీ బీజేపికి చెందిన భార తీయ మజ్దూర్‌ సంఘంతో సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు ఈ మార్పుల పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ కార్మిక సంఘాల కనీసపాటి డిమాండ్ల పట్ల కూడా కేంద్రం ప్రదర్శిస్తున్న మౌనం మరింత భయంకరంగా కనిపిస్తోంది.
వ్యాసకర్త న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త 

మరిన్ని వార్తలు