ప్రశ్నించినవారికి నిర్బంధమా?

5 Jul, 2022 02:03 IST|Sakshi

రెండో మాట 

సర్వమత సామరస్యాన్నీ, సర్వుల మనోభావాలనూ గౌరవించడం ద్వారా సమాజ శాంతిని శాశ్వతం చేయడం సాధ్యమని నమ్మి ప్రచారం చేసినవాడు కబీర్‌ దాసు. మానవ మనుగడకు ఐకమత్యం అత్యవసరమనీ, ప్రేమను మించిన శక్తి లేదనీ బోధించిన కరుణామయుడు కబీర్‌. ఇలాంటి సమగ్ర దృక్పథం, సమన్వయ దృష్టి మన రాజకీయ నాయకులకు ఎందుకు లోపిస్తోంది? ఇంకా మత దురహంకారాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? వీటిని ప్రశ్నించినవారు నిర్బంధాల పాలవుతున్నారు. లౌకిక రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచే చర్యలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. దేశాన్ని అభ్యుదయ మార్గానికి మళ్లించే అవకాశాన్ని కమ్యూనిస్టు పార్టీలు చేజార్చుకోవడం కూడా మితవాద శక్తులు బలపడటానికి కారణమైంది.

‘‘మానవ హక్కుల సంరక్షణకు కృషి చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం భావించి, అరెస్టు చేయమని సూచించిందా? ప్రస్తుతం ఆమె గుజరాత్‌ పోలీసుల కస్టడీలో ఉంది. ఆమెను అరెస్టు చేయడంగానీ, అరెస్టు చేయాలన్న ఉద్దేశంగానీ తమకు లేదని స్పష్టం చేస్తూ సుప్రీం న్యాయమూర్తులు తక్షణం స్పందించాలని నేను కోరడం తప్పని అనుకోవడం లేదు. కనుక తీస్తా సెతల్వాడ్‌ను తక్షణం బేషరతుగా విడుదల చేయాలనీ; ఆమె అరెస్టునూ, ఆమె డిటెన్షన్‌ కొనసాగింపునూ కొట్టివేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను.’’
– న్యూస్‌పోర్టల్‌ ‘ద వైర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు గౌరవ మాజీ న్యాయమూర్తి మదన్‌ లోకూర్‌

2002 నాటి గుజరాత్‌ అల్లర్లలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న (నేటి ప్రధాని) నరేంద్ర మోదీ ప్రభుత్వం పాత్రపై ‘స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌’ ఇచ్చిన నివేదికను ప్రశ్నిస్తూ, తిరిగి దాని పూర్వా పరాలను విశ్లేషించి నివేదికను సమర్పించాలని సుప్రసిద్ధ న్యాయవాది రాజు రామచంద్రన్‌ను సుప్రీంకోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు 2011 జనవరి – జూలైలలో ప్రత్యేక సలహాదారు హోదాలో రాజు రామచంద్రన్‌ రెండు నివేదికలు సమర్పించారు. అల్లర్ల సమయంలో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్స్‌ వద్ద హోంశాఖతో సంబంధం లేని ఇద్దరు మంత్రులు ఉండటాన్ని రామచంద్రన్‌ నివేదిక తప్పుపట్టింది.

ఇదిలా ఉండగానే, రానున్న పరిణామాలను ముందుగానే హెచ్చరించడంలో దిట్ట అయిన గుజరాత్‌ సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఆర్‌.బి. శ్రీకుమార్‌ను కూడా తీస్తా సెతల్వాడ్‌ మాదిరిగా పోలీసులు అరెస్టు చేసి డిటెన్షన్‌కు పంపడానికి కొన్ని గంటల ముందు ‘నేను జంకేది లేదు, నిజ నిర్ధారణ కోసం పోరాడుతూనే ఉంటాను. నా వ్యక్తిగత కష్టనష్టాలను భరించడానికైనా సిద్ధంగా ఉన్నాను’ అని ప్రసిద్ధ మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించాడు.

అంతేగాదు, గుజరాత్‌ మాజీ గూఢచారి శాఖాధిపతిగా శ్రీకుమార్‌ తన విధేయత కేవలం భారత రాజ్యాంగ పత్రానికేగానీ, ఏ రాజకీయ పార్టీకి కాదనీ, ఎంతటి శక్తిమంతమైన కరడుగట్టిన రాజ కీయ నాయకుడినైనా ఎదుర్కొని నిలబడటానికి తాను సిద్ధంగా ఉన్నా ననీ ప్రకటించాడు. అంతేగాదు, గుజరాత్‌ హత్యాకాండ ఘటనలపై సీబీఐ విచారణను కోరుతూ సుప్రసిద్ధ నర్తకి, సామాజిక కార్యకర్త అయిన మల్లికా సారాభాయి సుప్రీంకోర్టులో రిట్‌ వేయకుండా తప్పిం చేందుకు ఆమె లాయర్‌కు నాటి మోదీ ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇచ్చిందని శ్రీకుమార్‌ ఆరోపించాడు. ఇదే ఆరోపణను మల్లికా సారా భాయి కూడా 2011లో పత్రికా గోష్ఠిలో చేయడం మరొక విశేషం!

ఇన్ని గొడవలతో దేశ రాజకీయాలు సాగుతున్నాయి. పాలనా విధానాలూ, ప్రజా వ్యతిరేక చర్యలూ, పౌరహక్కుల అణచివేత, కోర్టులను అపమార్గం పట్టించే విధానాలూ, ఒక్కమాటలో – లౌకిక రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచే చర్యలు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ‘పళ్ల బిగువు’ మీద తొలి ముప్పయ్యేళ్లు అలా అలా ‘తూట్లు’ పడకుండా లౌకిక రాజ్యాంగం నిలిచింది.

ఆ తరువాత కాంగ్రెస్‌ – బీజేపీ పాలకులు, వారు నిర్వహించిన అవకాశవాద రాజకీయాలతో బీటలు వారడం మొదలైంది. ఇందిరాగాంధీ, రాజీవ్, మన్మోహన్‌ సింగ్, వాజ్‌పేయి పాలనలు కూడా క్రమంగా తొట్రుబాటుతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. 

చివరికి కాంగ్రెస్‌ ఐక్య సంఘటన ప్రభుత్వంలో ప్రధాన భూమిక వహించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్‌ మద్దతుతో పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, ఇందిర సమకాలికుడు జ్యోతిబసును దేశ ప్రధానమంత్రిగా నిలబెట్టడానికి చేసిన ప్రయత్నాలు – ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకవాక్యత లేక విఫలమయ్యాయి. అనుభవజ్ఞుడైన జ్యోతిబసు ప్రధాన మంత్రిత్వంలో భారత పాలనా శకపు రాజకీయ పటమే అభ్యుదయ మార్గానికి మళ్లి ఉండేది.

ఆ అవకాశాన్ని ఆ పార్టీలే కాదు, దేశమూ, శ్రమ జీవులైన కార్మిక, కర్షక లోకమూ కోల్పోయింది. మితవాద శక్తులు పేట్రేగి పోవడానికి వీలుగా తరువాతి పాలకులు మత దురహంకారం రెచ్చగొట్టారు. తద్వారా కల్లోల భారత సృష్టికి పునాదులు వేశారు. ఇందుకు తోడ్పడుతున్నవి తిరిగి వలస పాలనా చట్టాలేనని మరచిపోరాదు. 

పార్టీల నుంచి తరచుగా ‘కప్పదాటు’ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి రాజ్యాంగంలో అనుబంధపు అధ్యాయాలలో పొందు పరచిన యాంటీ డిఫెక్షన్‌ చట్టానికి కూడా రాజకీయ పక్షాలు అడుగడుగునా తూట్లు పొడుస్తూనే ఉన్నాయి. తరచుగా ‘ఆయారాం– గయారాం’ రాజకీయాలకు స్వస్తి చెప్పించగల సత్తా తరచూ పార్టీలు మార్చే ఫిరాయింపుదారులైన రాజకీయ నాయకులకు లేదు. వారికి ప్రస్తుత ఫిరాయింపుల నిషేధ చట్ట నిబంధనలు ముగుదాడులు కాగల పరిస్థితి లేదు.

ఫిరాయింపుల నిషేధ చట్టంలోని పదవ షెడ్యూల్‌ ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. అందుకే ఈ అస్పష్టతకు అవకాశమిస్తున్న చట్టంలోని నాల్గవ పేరాను పదవ షెడ్యూల్‌ నుంచి తొలగించాలని రాజ్యాంగ నిపుణుల నిశ్చితాభిప్రాయంగా కన్పిస్తోంది. ఈ ప్రతి పాదన కొత్తదేమీ కాదు. 1999లో లా కమిషన్, 2002లో రాజ్యాంగ నిర్వహణ వ్యవహారాల సమీక్షకు ఏర్పడిన జాతీయ స్థాయి కమిషన్‌ ఇలాంటి సిఫారసులే చేశాయని మరచిపోరాదు. 

భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్న ఈ సమయంలోనైనా దేశంలో కనీస ప్రజా స్వామ్య విలువలు వృద్ధి చెందడం అత్యవసరం. లేకపోతే అదు పాజ్ఞలు తప్పే పాలకులకు, ప్రభుత్వాలకు... మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా సమాజంలో అశాంతికి, అరాచకాలకు దోహదం చేసే నూపుర్‌ శర్మ లాంటి వారిని అదుపు చేయడం సాధ్యమేనా? ‘దేశంలో ఉద్రిక్త పరిస్థితికి, అశాంతికి, పెక్కు రాష్ట్రాలలో హింసాకాండకు బీజేపీ మాజీ నాయకురాలు నూపుర్‌ శర్మ బాధ్యు రాలని సుప్రీం బెంచ్‌ గౌరవ న్యాయమూర్తి సూర్యకాంత్‌ శఠించవలసి వచ్చింది. 

ఇంతకూ విచిత్రమైన సంగతేమిటంటే – సర్వమత సామర స్యాన్ని, సర్వుల మనోభావాలను గౌరవించడం ద్వారా సమాజ శాంతిని శాశ్వతం చేయడం సాధ్యమని నమ్మి ప్రచారం చేసినవాడు కబీర్‌ దాసు. హిందూ, ముస్లిం మతాల్లో సంప్రదాయాలు కట్టుబాట్ల పేరిట జరిగే అనేక అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి పోరాడిన సంస్కర్త, విప్లవకర్త కబీర్‌. నీవు నడిచే బాటలో ముళ్లు పరిచే వాళ్ల మార్గంలో సహితం నీవు పూలనే ఉంచు; పూలనూ, ముళ్లనూ బేరీజు వేసి వాటి విలువ నిర్ణయించే వాడు పరమాత్మ అన్నాడు.

కబీర్‌కు ఈ సమగ్ర దృక్పథం, సమన్వయ దృష్టి ఎలా అబ్బింది? ఉత్తర భారత సమాజంలోని హిందూ, ముస్లిం, జైన, బౌద్ధ మతాలలో ఉన్న కఠిన సాధనాలను, మూఢ విశ్వాసాలను తూర్పారబట్టి, ప్రేమతో నిండిన శక్తియుక్తుల భక్తి మార్గాన్ని ప్రజలకు అందించాడు కబీర్‌. మానవ మనుగడకు ఐకమత్యం అత్యవసరమనీ, ప్రేమను మించిన శక్తి లేదనీ బోధించిన కరుణామయుడు కబీర్‌. అందాకా ఎందుకు? ‘మనుషు లందున ఎంచి చూడగ రెండె కులములు – మంచియన్నది మాల అయితే, మాల నేనగుదున్‌’ అని మతాతీతంగా, కులాతీతంగా మహా కవి గురజాడ చాటలేదూ? ఇంతకూ – రాబందుకూ, రాజుకూ తేడా లేదన్న సామెత ఎందుకు పుట్టిందోగానీ, ‘నిండిన కడుపు నీతి వినదు’ సుమా!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు