ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?

28 Jun, 2022 01:00 IST|Sakshi

భారత రాష్ట్రపతి స్థానానికి తమ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్మును నిలబెట్టింది. ఆమె గెలిస్తే తొలిసారిగా రాష్ట్రపతి పదవి చేపట్టిన గిరిజనురాలిగా చరిత్ర సృష్టిస్తారు. ఎన్నిక లాంఛనప్రాయమే అనే అంచనాలున్న నేపథ్యంలో  భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్నవేళ ఇదొక శుభ పరిణామం అనుకోవచ్చు. అయితే, ఒక ఆదివాసీ... దేశ అత్యున్నత స్థానానికి చేరడానికి 75 సంవత్సరాలు పట్టిందనేది కఠిన వాస్తవం. మితవాద పక్షం నుంచి ఈ ముందడుగు పడుతుందనేది మరొక నిజం. ఉదారవాద పార్టీలు ఇప్పటికీ కొన్ని చట్రాల్లోంచి బయటకు రాలేదన్నది ఇంకో నిజం. ఇన్ని నిజాల మధ్యలో ఇంకో నిజం ఏమిటంటే, దేశంలో ముస్లింలకు తమ జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం దక్కడం లేదు. అందర్నీ కలుపుకొని పోయేట్టుగా మన విధానాలు ఉండాలన్నది మరిచిపోరాదు.

‘‘భారత రాష్ట్రపతి పదవికి తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్మును బీజేపీ అభ్యర్థిగా నిలబెడుతున్నందుకు గర్వంగా ఉంది. లక్షలాదిమంది ప్రజలు, ముఖ్యంగా దారిద్య్ర బాధల్ని, కష్టనష్టాలను అనుభవించి వాటిని ఎదుర్కొంటున్న ప్రజలు ముర్ము జీవితం నుంచి గొప్ప ధైర్యాన్ని పొందుతారు. విధాన నిర్ణయాల పట్ల ఆమె అవగాహన, కారుణ్య దృష్టి మన దేశానికి ఎంతగానో తోడ్పడ తాయి. ఎందుకంటే, ద్రౌపది ముర్ము సమాజ సేవకు, పేదలు, అణగారిన, విస్మరించబడిన వర్గాల ఉద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న మహిళ.
– ప్రధాని నరేంద్ర మోదీ

‘‘భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును బరిలోకి దించాలని ఒక వైపున మితవాద పార్టీ అయిన బీజేపీ నిర్ణయించగా, దేశంలోని అభ్యుదయకర అతివాద పార్టీలుగా పేరున్న రాజకీయ పక్షాలు ఇప్పటికీ అగ్రవర్గాలకు చెందిన అభ్యర్థులనే పట్టుకుని వేలాడ వలసి రావడం విచారకరం. ‘అభ్యుదయవాదులం’ అనుకునే సవర్ణులు ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవడం అంత కష్టమైన పనా? కాగా, అదే సమయంలో దేశానికి తొలి ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి 75 సంవత్సరాల కాలం పట్టడం, అందులోనూ మితవాద పక్షమైన బీజేపీ అభ్యర్థిగా నిలబడవలసి రావడం ఆశ్చర్యకరం’’.
– ‘కఠువా’ అత్యాచార కేసులో వాదించిన

సుప్రసిద్ధ న్యాయవాది దీపికా సింగ్‌ రజావత్‌
‘‘తనకు అనుకూలమైన ‘డమ్మీ’ రాష్ట్రపతిగా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల అభ్యర్థిని బీజేపీ నిలబెట్టడం షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ తరగతుల ప్రజలను మోసం చేయడానికే. అయితే రాజకీయ, పరిపాలనా సంబంధమైన శక్తియుక్తులున్న మహిళ ద్రౌపది ముర్ము అని మరచిపోరాదు.’’
– జాతీయ కాంగ్రెస్‌ ప్రకటన

అయితే, వ్యక్తి శక్తియుక్తులకన్నా కీలకమైన అంశం – గత 75 ఏళ్లుగా భారత రాజకీయాల్నీ, అధికార పదవులలో ఉన్న పాలక శక్తుల్నీ  నడిపిస్తున్నది భారత సెక్యులర్‌ రాజ్యాంగమూ కాదు; దేశానికీ, పాలనకూ దిక్సూచిగా ఉండవలసిన అందలి విస్పష్టమైన ఆదేశిక సూత్రాలూ కావు. ‘భారత ప్రజలమైన మేము’ (ఉయ్‌ ది పీపుల్‌) ‘మాకై అంకితమిచ్చుకున్న రాజ్యాంగ పత్రం’ అని పేర్కొన్నా, ‘మీరెవరు మమ్మల్ని శాసించడానికి?’ అని ఎదురు ప్రశ్నలకు దిగిన రాజకీయ పాలకులున్న దేశం మనది. ‘ఆదేశిక సూత్రాల’నే కాదు, ‘పౌర బాధ్యత’ల ప్రత్యేక అధ్యాయం ద్వారా దేశ ప్రజలలో శాస్త్రీయ ధోరణులను ప్రబుద్ధం చేయాలన్న స్పష్టమైన ‘తాఖీదు’ను కూడా కాంగ్రెస్‌–బీజేపీ పాలకులు పక్కకునెట్టి యథేచ్చగా తిరుగుతున్నారు.

ఇక అధికార పార్టీ నేతృత్వంలో హిందూత్వ రాజకీయాల ద్వారా విద్యా వ్యవస్థ స్వరూప స్వభావాన్నే తారుమూరు చేసే ప్రయత్నాలు శరవేగాన జరుగుతున్నాయి. ఇందుకు విద్యా, విశ్వవిద్యాలయ స్థాయిలో స్థిరపడిన అభ్యుదయకర నిబంధనల్నీ, చట్టాలనే మార్చే యత్నాలు వేగంగా సాగుతున్నాయని మరచిపోరాదు. అనేక మతాలు, మత విశ్వాసాలు, ప్రత్యేక సంప్రదాయాలు, అనేక తెగలు, బహుళ జాతులు, బహు భాషలతో కూడిన భారత ప్రజలందరినీ తాను విశ్వసించే ‘మూస’లో బంధించడానికి బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ప్రయత్నిస్తోంది. అవే ఎత్తుగడలతో 2024 ఎన్నికల వైపు కూడా దూసుకుపోతోంది. ఇందుకు అన్ని ఎత్తుగడలకంటే కీలకమైన మాధ్యమం విద్యా రంగం అని భావిం చింది. అందుకే ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది.

ప్రాతినిధ్యం దక్కడం లేదు
బహుళ జాతులతో కూడిన భారతదేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్య కేంద్రంగా వర్ధిల్లాల్సిన పార్లమెంట్‌ను సహితం స్వభా వంలోనూ, ఆచరణలోనూ సంకుచిత స్థాయికి దిగజార్చుతూ వచ్చారు. సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. అవీ రసవిహీనమైన ఉబుసుపోని చర్చలతోనే ముగుస్తున్న సందర్భాలే ఎక్కువ. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి పాత్ర నామమాత్రం. 

ఇక యూరప్‌తో పోల్చితే అక్కడి ఎన్నో దేశాల కంటే భారత ముస్లిం జనాభా ఎక్కువ. అనేక దేశాల స్థాయిలో భారత ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అయినా రాజకీయ స్థాయిలోనూ, సంస్థాగత స్థాయిలోనూ ముస్లింల ప్రతిపత్తికి విలువ లేనట్టుగా పాలక విధాన పోకడలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే, భారతదేశంలో ప్రజా రాజకీయ కార్యాచరణకూ, ప్రజాస్వామ్య మనుగడకూ కీలకం – విస్పష్టమైన విధానాల ఆచరణే నని చరిత్ర రుజువు చేస్తోంది.

కనుకనే, భారతదేశంలో విశిష్ట ‘ఎమెరిటిస్‌’ ప్రొఫెసర్‌ జోయా హాసన్‌ (జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ) ప్రస్తుతం దేశంలో ముస్లిం మైనారిటీల దుఃస్థితిని గురించి ఇలా పేర్కొనక తప్పలేదు: ‘‘గత పదేళ్లలోనే భారతదేశ సెక్యులర్‌ (అన్ని మతాలనూ సమంగా పరిగణించే) వ్యవస్థ రాజ్యాంగ పునాదులు కాస్తా దేశ రాజకీయ పాలనా పద్ధతుల వల్ల బీటలు వారుతున్నాయి.’’

ఎందుకంటే, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ముస్లింల ప్రాతినిధ్యం వారి జనాభాకు తగిన దామాషాలో పెరగనే లేదు. పైగా జనాభాలో 20 కోట్ల మందికిపైగా ఉన్న ముస్లింలను రెచ్చగొట్టేలా  పాలకపక్ష ప్రతినిధి ప్రవక్త మహమ్మద్‌ను తూలనాడుతూ ప్రకటనలు చేయడంతో దేశవ్యాప్తంగా అశాంతిని ప్రజ్వలింపజేసింది. 

అందరూ కలిస్తేనే... హిందూస్థాన్‌
ఒక ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతి స్థానంలో నిలబెట్టడానికి బీజేపీ పడుతున్న తాపత్రయంలో ఒక్క శాతం అభిమానాన్ని కూడా ముస్లిం మైనారిటీల మనోభావాలపట్ల చూపక పోవడం క్షమించరాని వివక్షగా పరిగణించక తప్పదు. అంతేగాదు, ఈ వివక్ష చివరికి ఎక్కడికి దారి తీసి మరింత అలజడికి కారణమవుతోందంటే, ఫలానావాడు ‘హిందువుల’ వ్యతిరేకి అని ఎక్కడ ముద్ర పడుతుందోనన్న జంకు కొద్దీ హిందూ రాజకీయ పక్షీయులూ, పార్టీలూ న్యాయబద్ధంగా ముస్లింలకు ఇచ్చే టికెట్ల సంఖ్యను తగ్గించేయడం జరుగుతోందని ప్రొఫెసర్‌ జోయా హాసన్‌ వెల్లడించారు.

అంతేగాదు, ప్రజాస్వామ్య విలువలకూ, వ్యక్తి ఉనికికీ కూడా గౌరవం పూజ్యం. పైగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పాలకులు ప్రజా కోర్కెలను లేదా ప్రజా ఉద్యమాలను అణచటానికి, కట్టడాలను కూలగొట్టడానికి ఇటీవల ‘బుల్‌డోజర్‌’లను కూడా యథేచ్చగా వాడుతున్నారు. 

ఇప్పటికైనా మనం గుర్తించి తీరవలసిన సత్యం – భారతదేశం ఒకప్పుడు నాగరిక దేశంగా ప్రపంచ ఖ్యాతి గడించడానికి కారణం ఏమిటో భారతీయుడైన రఘుపతిరాయ్‌ ఫిరాక్‌ అనే కవి లిఖించిన ఆర్ద్రమైన ఈ క్రింది కవితలో వెల్లడవుతోంది: ‘‘ప్రపంచంలోని నలు మూలల ఉన్న దేశాల నుంచి వచ్చే పోయే వర్తక సమూహాలతోనే ఈ దేశం కిటకిటలాడే హిందూస్థాన్‌గా రూపు దిద్దుకుంది.’’ దానికి అనుగుణంగానే సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులలో ఒకరైన గణేష్‌ దేవో, భారతదేశంలో ప్రచలితమవుతున్న అనేక భాషలలో ప్రాంతీయ భిన్నత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. 

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు